National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part II
టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు జాతీయ వర్తమాన అంశాలపై మంచి పట్టు సాధించాలి. జనరల్ స్టడీస్‌లో వారంతా మెరుగైన విజ్ఞానం సాధించేందుకు – 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు.. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రముఖులు పొందిన అవార్డులు.. తదితర ప్రధాన అంశాల సమాహారం.
ఉక్కు ఉత్పత్తిలో నాలుగో స్థానం
ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో 2014లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం 2014లో మొదటి 4 స్థానాల్లో నిలిచిన దేశాల వివరాలివి..
ఆడపిల్లలకు అండగా..
బాలికల సంక్షేమం, లింగ వివక్షను అరికట్టడమే లక్ష్యాలుగా ‘బేటీ బచావో బేటి పఢావో’ (కుమార్తెను కాపాడండి, కుమార్తెను చదివించండి) అనే పథకానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ 2015 జనవరి 22న.. స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన హరియాణాలోని పానిపట్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు చేయనున్నారు.
* ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమం కింద ‘సుకన్య సమృద్ధి యోజన’ను బాలికల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికింద పదేళ్లలోపు బాలికల పేరిట కనిష్ఠంగా రూ. 1000 మొత్తాన్ని బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఖాతాను తెరవొచ్చు. ఈ ఖాతాలో జమచేసే సొమ్ముపై ఏటా 9.1 శాతం వడ్డీ, ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులు, వివాహ వ్యయం కోసం ఖాతాలోని సగం మొత్తాన్ని తీసుకోవచ్చు. అమ్మాయికి 21 ఏళ్ల వయసు వచ్చే వరకూ లేదా వివాహం జరిగే వరకూ (18 ఏళ్ల తర్వాతే) ఈ ఖాతా కొనసాగుతుంది.
పద్మ పురస్కారాలు
* విభిన్న రంగాలకు చెందిన మొత్తం 104 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ ప్రకటించింది. ఎల్కే అడ్వాణీ, అమితాబ్ బచ్చన్, ప్రకాశ్‌సింగ్ బాదల్, డాక్టర్ వీరేంద్ర హెగ్డే, జగద్గురు రామభద్రాచార్య, ప్రొఫెసర్ మాలూరు రామస్వామి శ్రీనివాసన్, కొట్టాయన్ కె.వేణుగోపాల్, కరీం అల్ హుస్సేనీ ఆగాఖాన్, మహ్మద్ యూసఫ్ ఖాన్ (బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్)లు పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.
2 కోట్ల మరుగుదొడ్లు
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో రెండు కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) దీన్ని అనుసంధానిస్తారు. 2019 నాటికి దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా చూడటం లక్ష్యం. ఈ పథకం అమలుకు ఉపాధి హామీ పథకంలో చురుగ్గా పనిచేస్తున్న అక్షరాస్యులైన మహిళలను ప్రభుత్వం ఎంపికచేసి పారిశుద్ధ్యానికి సంబంధించి వివిధ అంశాల్లో వారికి శిక్షణ ఇస్తుంది. వారు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు మరుగుదొడ్ల ఆవశ్యకతను వివరించడంతోపాటు వినియోగంపై అవగాహన కల్పిస్తారు.
వృద్ధిరేటు 6.9 శాతం
2013-14లో భారత వృద్ధిరేటును 6.9 శాతంగా కేంద్ర ప్రభుత్వం సవరించింది. అంతకు ముందు 4.7 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలను లెక్కకట్టేందుకు ప్రాతిపదిక సంవత్సరాన్ని 2011-12 ఏడాదికి సవరించడంతో వృద్ధిరేటులో మార్పు వచ్చింది. ప్రస్తుత ప్రాతిపదిక సంవత్సరమైన 2004-05 స్థానంలో 2011-12ను ఎంచుకోవడంతో 2013-14 వృద్ధిలో 4.7 శాతం నుంచి 6.9 శాతానికి చేరింది. ప్రతి అయిదేళ్లకు ఒకసారి ప్రాతిపదికలో మార్పు చేస్తుంటారు. 2012-13కి కూడా ఆర్థిక వృద్ధిరేటును అంతక్రితం అంచనా వేసిన 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించారు.
అగ్ని-V క్షిపణి ప్రయోగం
దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేస్తూ భారత్ అణ్వస్త్ర సామర్థ్య అగ్ని-V క్షిపణిని 2015 జనవరి 31న ఒడిశాలోని వీలర్స్ ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 5 వేల కి.మీ.ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ ఖండాంతర క్షిపణిని తొలిసారిగా గొట్టపు కవచం (క్యానిస్టర్) నుంచి ప్రయోగించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో రూపొందించిన అగ్ని-V క్షిపణి టన్నుకు పైగా ‘అణు వార్‌హెడ్’ను మోసుకెళ్లగలదు. ‘అగ్ని-V ‘ను పరీక్షించడం ఇది మూడోసారి. ఈ క్షిపణి పొడవు 17 మీటర్లు, బరువు 50 టన్నులు. మూడు దశల్లో ఘన ఇంధనాన్ని వినియోగించుకుని మ్యాక్-24 వేగంతో (ధ్వని వేగానికి 24 రెట్లు – అంటే దాదాపు గంటకు 30 వేల కి.మీ.ల వేగం) దూసుకెళుతుంది.
దిల్లీ పీఠంపై అరవింద్ కేజ్రీవాల్
2015 ఫిబ్రవరి 7న జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాలను ఈ పార్టీ గెల్చుకుంది. మిగిలిన 3 స్థానాలను భాజపా దక్కించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ న్యూదిల్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
* 2015 ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ దిల్లీ 8వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు 2013 డిసెంబరు 28 నుంచి 2014 ఫిబ్రవరి 14 వరకు 49 రోజుల పాటు దిల్లీ సీఎంగా వ్యవహరించిన కేజ్రీవాల్ జన్ లోక్‌పాల్ బిల్లును దిల్లీ శాసనసభలో భాజపా, కాంగ్రెస్‌లు అడ్డుకోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. తిరిగి ఎన్నికల్లో గెలుపొంది సీఎం పదవి చేపట్టారు.
మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనం
వాహన కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు వాహనాలకు వినియోగించే పెట్రోలు, డీజిల్‌ను మరింత శుద్ధి చేసి సరఫరా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 2005 ఏప్రిల్ నుంచి భారత్-3 ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 2010 ఏప్రిల్ నుంచి కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న హైదరాబాద్ సహా 13 మెట్రోనగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేస్తోంది. తాజాగా మరో 24 నగరాల్లో భారత్-4 ఇంధనాన్ని సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది.
అనిల్ బజ్జాల్ కమిటీ
కంపెనీల చట్టం కింద కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిబంధనలను కంపెనీలు సరిగ్గా అమలు చేస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని పర్యవేక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. 2015 ఫిబ్రవరిలో హోంశాఖ మాజీ కార్యదర్శి అనిల్ బజ్జాల్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది.
బాలచంద్ర నెమడేకు జ్ఞాన్‌పీఠ్
ప్రముఖ మరాఠీ సాహిత్యవేత్త బాలచంద్ర నెమడే 2014 సంవత్సరానికి జ్ఞాన్‌పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇది 50వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు. ఈ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, సన్మానపత్రంతో గౌరవిస్తారు. నెమడే 1991లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
15వ దిల్లీ సుస్థిర అభివృద్ధి సదస్సు
2015 ఫిబ్రవరిలో 15వ దిల్లీ సుస్థిర అభివృద్ధి సదస్సును దిల్లీలో నిర్వహించారు. ఫ్రాన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి లారెంట్ ఫేబియస్ ప్రారంభ సమావేశంలో ప్రసంగించారు. 21వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీవోపీ-21) అధ్యక్షుడిగా లారెంట్ ఫేబియస్ వ్యవహరిస్తున్నారు. హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గెర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.
మైనర్ ఖనిజాలు 55
మైనర్ ఖనిజాల జాబితాలో మరో 31 ఖనిజాలను చేర్చాలని 2015 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో క్యాల్సైట్, చాక్, చైనా క్లే, కోరండం, డోలమైట్, ఫెల్సైట్, జిప్సం, మైకా, క్వార్ట్జ్, క్వార్త్ట్జెట్ తదితర ఖనిజాలున్నాయి. ఇవి ఫిబ్రవరి నాటికి మేజర్ ఖనిజాల జాబితాలో ఉన్నాయి. ఈ 31 ఖనిజాల లీజులు.. మొత్తం లీజుల్లో 55 శాతం వరకు ఉన్నాయి. మొత్తం లీజు ప్రాంతంలో వీటి వాటా 60 శాతం వరకు ఉంది.
* రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వడం, దేశంలో ఖనిజాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 31 ఖనిజాలను చేర్చడంతో మైనర్ ఖనిజాల జాబితాలోని ఖనిజాల సంఖ్య 55కి చేరింది.
నీతి ఆయోగ్ తొలి సమావేశం
2015 ఫిబ్రవరి 8న నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశాన్ని దిల్లీలో నిర్వహించారు. నీతి ఆయోగ్ ఛైర్మన్ హోదాలో ప్రధాని నరేంద్రమోదీ దీనికి అధ్యక్షత వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తరపున ముఖ్యమంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. ‘సబ్ కా సాథ్.. సబ్కా వికాస్’ (అందరితో కలిసి.. అందరి వికాసం కోసం) అనే నినాదంతో కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచాలని మోదీ పిలుపునిచ్చారు.
* నీతి ఆయోగ్ కింద ముఖ్యమంత్రులతో మూడు ఉప బృందాలను మోదీ నియమించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత నిధులతో అమల్లో ఉన్న 66 పథకాల్లో ఏవి కొనసాగించాలి? ఏ పథకాలను రాష్ట్రాలకు అప్పగించాలి? వేటిని పూర్తిగా రద్దు చేయవచ్చు? అనే అంశాలను ‘ఉపబృందం-1’ అధ్యయనం చేస్తుంది.
* రాష్ట్రాల పరిధిలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై ‘ఉపబృందం-2’ అధ్యయనం చేస్తుంది.
* స్వచ్ఛభారత్ కార్యక్రమం నిరంతరం కొనసాగేలా వ్యవస్థాగతమైన కార్యాచరణ రూపొందించడమే లక్ష్యంగా ‘ఉపబృందం-3’ పనిచేస్తుంది.
అమర్త్యసేన్‌కు జాన్ మైనార్డ్ కేన్స్ అవార్డు
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు మొదటి చార్లెస్టన్ ఈఎఫ్‌జీ ‘జాన్ మైనార్డ్ కేన్స్’ అవార్డు లభించింది. ప్రముఖ బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మైనార్డ్ కేన్స్ జ్ఞాపకార్థం ఈ అవార్డును 2015లో ఏర్పాటు చేశారు.
40 శాతం జనాభాకు ‘ఆహార భద్రత’
జాతీయ ఆహార భద్రత చట్టాన్ని (ఎన్ఎఫ్ఎస్ఏ) 67 శాతం జనాభాకు కాకుండా 40 శాతం జనాభాకు మాత్రమే వర్తింపజేయాలని జాతీయ ఉన్నతస్థాయి కమిటీ 2015 ఫిబ్రవరిలో సిఫార్సు చేసింది. కేవలం 40 శాతం జనాభాకు వర్తింపజేయడంతోనే దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలన్నింటికీ ఈ పథకం అందుతుందని కమిటీ ప్రకటించింది. 67 శాతం జనాభాకు కాకుండా 40 శాతానికే ఎన్ఎఫ్ఎస్ఏను వర్తింపజేయడం వల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 30,000 కోట్లు ఆదా అవుతుందని కమిటీ వెల్లడించింది. కేంద్ర మాజీ ఆహార శాఖ మంత్రి శాంతకుమార్ ఈ కమిటీకి నేతృత్వం వహించారు.
గుర్తుంచుకోండి
* దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో పాటు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రభుత్వం 1954 నుంచి ప్రదానం చేస్తోంది.
* ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో భారత్ గత అయిదేళ్లుగా వరుసగా నాలుగో స్థానంలోనే నిలుస్తోంది.
* మరాఠీ సాహిత్యరంగంలో జ్ఞాన్‌పీఠ్ అవార్డు గెలుచుకున్న నాలుగో రచయిత బాలచంద్ర నెమడే.
* ‘బేటీ బచావో బేటి పఢావో’ కార్యక్రమానికి ప్రచారకర్తగా ప్రముఖ సినీనటి మాధురీ దీక్షిత్ నియమితులయ్యారు.
Leave a Reply