National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part IV
కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ల గణాంకాలు.. ఆర్థిక సర్వే అంచనాలు.. రాష్ట్రాలకు కేంద్ర వాటాలో పెంపు – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేటాయింపులు.. రక్షణ రంగంలో స్పెయిన్‌తో ఒప్పందం.. క్లోనింగ్‌లో భారత పరిశోధకులు సాధించిన ఘనత.. అవార్డులు, రైతు కార్డులు, ప్రవాస భారతీయులకు చేయూత.. పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఇలాంటి ఎన్నో జాతీయ విషయ విశేషాలు తెలుసుకుందాం
14 కోట్ల మంది రైతుల కోసం
రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో ‘భూసార కార్డు పథకం’ను ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఫిబ్రవరి 19న ప్రారంభించారు. ఎరువులను సమతౌల్యంగా ఉపయోగించే విధానాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో వచ్చే మూడేళ్లలో 14 కోట్ల మంది రైతులకు భూసార కార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏ పంటకు ఏ ఎరువు అవసరమో కార్డులో వివరంగా సిఫార్సు చేస్తారు.
ఆన్లైన్ చేయూత
విదేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు దౌత్య కార్యాలయాల పరంగా ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ‘మదత్’ (చేయూత) పేరుతో ప్రత్యేక ఈ-పోర్టల్‌ను ప్రారంభించింది. దౌత్య కార్యాలయాల పరంగా ఎదుర్కొనే సమస్యలను ఇకపై ఆన్లైన్లోనే నమోదు చేయవచ్చు. అత్యధిక జవాబుదారీతనంతో ఆయా ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు ‘మదత్’ పోర్టల్ సాయపడుతుంది.
పన్నుల్లో వాటా పెంపు
కేంద్రం నుంచి రాష్ట్రాలకొచ్చే పన్నుల వాటా గణనీయంగా పెరిగింది. మునుపెన్నడూ లేని స్థాయిలో ఆ వాటాను 10 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా గతంలో 32 శాతం ఉండగా 42 శాతానికి పెంచాలని ఆర్బీఐ మాజీ గవర్నరు వై.వి.రెడ్డి నేతృత్వంలోని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును కేంద్రం ఆమోదించింది. తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం 2015-16లో అదనంగా రూ. 1.78 లక్షల కోట్లు ఇవ్వనుంది. అయితే రాష్ట్రాలకు గ్రాంట్లు సిఫార్సు చేసే విషయంలో 14వ ఆర్థిక సంఘం ప్రణాళిక, ప్రణాళికేతర అనే వర్గీకరణను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్రాల మొత్తం ఆదాయ, వ్యయ అవసరాలను పరిగణనలోకి తీసుకుంది.
* 1971 నాటి జనాభాను, అప్పటి నుంచి జనాభాలో వచ్చిన మార్పులు, ఆదాయ వ్యత్యాసాలు, అటవీ విస్తీర్ణం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. ఈ 42 శాతం వాటాలో 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయింపులు జరిపింది. రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో తెలంగాణకు 2.437 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం వాటాగా ఆర్థిక సంఘం నిర్ణయించింది. అలాగే సేవాపన్ను (సర్వీస్ ట్యాక్స్)లో తెలంగాణ వాటా 2.499 శాతంగా, ఏపీ వాటా 4.398 శాతంగా నిర్ధారించింది. వీటికి అదనంగా స్థానిక సంస్థలకు గ్రాంట్లను కూడా సిఫార్సు చేసింది.
* విభజన కారణంగా ఆదాయలోటు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు గ్రాంటు మంజూరు చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 2015 నుంచి 2020 వరకు దక్కే మొత్తం రూ.22,113 కోట్లు. ఆదాయలోటు ఏర్పడిన మరో 10 రాష్ట్రాలకు (జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, పశ్చిమ్‌బంగ, మణిపూర్, కేరళ, త్రిపుర, అసోం, మేఘాలయ) 2015 నుంచి 2020 వరకు రూ.1.94 లక్షల కోట్ల మంజూరుకు సిఫార్సు చేసింది.
కొత్తరైలు లేని బడ్జెట్
2015-16 ఆర్థిక సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి సురేష్ ప్రభు 2015, ఫిబ్రవరి 26న పార్లమెంటుకు సమర్పించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ బడ్జెట్లో ఒక్క కొత్తరైలు, రైలుమార్గాన్ని ప్రకటించలేదు. ఉన్న రైళ్ల సామర్థ్యాన్ని పెంచుతామని, ప్రసుత్త రైలుమార్గాలను పొడిగించి బలోపేతం చేస్తామని ప్రకటించారు. ప్రణాళికా వ్యయం కింద రూ.1,00,011 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ మొత్తం కంటే ఇది 52 శాతం ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలకు స్థూల బడ్జెటరీ మద్దతు కింద రూ.40,000 కోట్లను కేటాయించారు. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.10,000 కోట్లు అధికం. రైల్వేశాఖను లాభాల బాట పట్టించేందుకు నిర్వహణ నిష్పత్తి (రాబడిలో మొత్తం ఖర్చు)ని ఈ ఆర్థిక సంవత్సరంలో 88.5 శాతానికి తీసుకురావాలన్నది తమ లక్ష్యమని సురేష్ ప్రభు ప్రకటించారు. రాబడిని రూ.25 వేల కోట్లు పెంచేందుకు చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
పౌరసత్వ (సవరణ) చట్టం-2015
భారత సంతతి వ్యక్తులకు శాశ్వత వీసా సదుపాయం కల్పించగల ‘పౌరసత్వ (సవరణ) చట్టం-2015’ బిల్లును కేంద్ర ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీంతో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ (పీఐవో), ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (వోసీఐ) కార్డు పథకాలు విలీనమయ్యేందుకు మార్గం సుగమమైంది. ఈ రెండింటినీ కలుపుతామంటూ ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా న్యూయార్క్‌లో భారతీయులకు ఇచ్చిన హామీని ఈ బిల్లు నెరవేరుస్తుంది.
ఆర్థిక సర్వే 2014-15
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ. దీన్ని కొనసాగిస్తూ 2015, ఫిబ్రవరి 27న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆర్థిక సర్వేను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాబోయే సంవత్సరాల్లో ద్రవ్యలోటును స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 2015-16లో 1 శాతానికి పడిపోతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ఆహారధాన్యాల ఉత్పత్తి 2014-15 ఏడాదికి 257.07 మిలియన్ టన్నులు ఉంటుందన్నది ప్రభుత్వ అంచనా. గత అయిదేళ్ల సగటు కంటే ఇది 8.5 మిలియన్ టన్నులు ఎక్కువ. దేశంలో నిలిచిపోయిన ప్రాజెక్టుల్లోని పెట్టుబడులు జీడీపీలో 7 శాతానికి సమానమని ప్రభుత్వ ఆర్థిక సర్వేలో వెల్లడైంది. బ్యాంకులు, బీమా రంగంలో భారీ సంస్కరణలతో 2013లో బీమా వ్యాప్తి 3.9 శాతానికి చేరిందని, 2000లో ఇది 2.3 శాతంగా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిల్లో మౌలిక, ఇనుము-ఉక్కు, జౌళి, గనులు, విమానయాన రంగాలు మొత్తం 54 శాతం వాటాను కలిగి ఉన్నాయని సర్వే పేర్కొంది. గత కొన్నేళ్లుగా పెట్టుబడుల్లో ఆలస్యం కారణంగా 2014 డిసెంబరు చివరి నాటికి రూ. 8.8 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని సర్వే స్పష్టం చేసింది. మొత్తం ఆగిపోయిన ప్రాజెక్టుల్లో మౌలిక రంగాల కంటే తయారీ రంగానివే ఎక్కువ ఉండటం గమనార్హం. దేశంలో ఆహార, ఇంధన, రైల్వే, ఎరువుల రూపేణా ఏటా రూ. 3.77 లక్షల కోట్ల మేర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇందులో అర్హులకు చేరేది కొంతేనని సర్వే తేల్చింది. 2012-13లో దేశ వాణిజ్య లోటు 190.3 బిలియన్ డాలర్లు (రూ.11,41,800 కోట్లు) కాగా 2013-14లో 135.8 బిలియన్ డాలర్ల (రూ.8,14,800 కోట్లు)కు దిగి వచ్చింది.
కేంద్ర బడ్జెట్ 2015-16
ఉపాధి కల్పన, సామాజిక భద్రత, వృద్ధిరేటు పెంపు ప్రధానాంశాలుగా 2015-16 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015, ఫిబ్రవరి 28న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ మొత్తం విలువ రూ.17,77,477 కోట్లు. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.4,65,277 కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు.
రక్షణ రంగంలో భారత్-స్పెయిన్
రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా భారత్, స్పెయిన్ 2015 మార్చిలో ‘పరస్పర రహస్య సమాచార రక్షణ ఒప్పందం’పై సంతకాలు చేశాయి. రక్షణ, పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంలో సహకార విధి విధానాల రూపకల్పనకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. స్పెయిన్ రక్షణ మంత్రి పెడ్రో మోరెనెస్ భారత పర్యటనలో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది.
డిజిటల్ జెండర్ అట్లాస్
లింగ వివక్ష నేపథ్యంలో ఏయే పథకాలు ఎలా అమలవుతున్నాయో సులభంగా గుర్తించగలిగేలా డిజిటల్ రూపంలో పటాన్ని (డిజిటల్ జెండర్ అట్లాస్) కేంద్ర ప్రభుత్వం 2015 మార్చిలో రూపొందించింది. ముఖ్యంగా బాలికల విద్యాపథకాలు, కార్యక్రమాల సమర్థ అమలు కోసం దీన్ని రూపొందించారు. అంతర్జాలం ఆధారంగా ఇది పనిచేస్తుంది. యునిసెఫ్ సహకారంతో ఈ అట్లాస్‌ను రూపొందించారు.
క్లోన్డ్ గేదె దూడ ‘అపూర్వ’
గేదె మూత్రంలోని సొమాటిక్ కణాలను ఉపయోగించి భారత పరిశోధకులు ప్రపంచంలోనే తొలిసారిగా క్లోనింగ్ నిర్వహించారు. హరియాణాలోని కర్నాల్‌లో ఉన్న జాతీయ పాడి పరిశోధన సంస్థ (ఎన్డీఆర్ఐ) శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ విధానంలో పుట్టిన దూడకు ‘అపూర్వ’ అని పేరు పెట్టారు. ప్రఖ్యాతిగాంచిన ముర్రా జాతి గేదెకు ఇది క్లోన్డ్ రూపం. ముర్రా జాతి గేదెలు ఎక్కువ పరిమాణంలో పాలు ఇస్తాయి. గేదె మూత్రంలోని ఒక విసర్జిత పదార్థం నుంచి దాత కణాలను వేరుచేశారు. అనంతరం హ్యాండ్ గైడెడ్ క్లోనింగ్ పరిజ్ఞానాన్ని ప్రయోగించారు. ఈ విధానం జీవకణాలు వేగంగా వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.
హర్విందర్ రూపొందించిన వీడియో
నిర్భయ ఉదంతం నేపథ్యంలో బ్రిటన్ వనిత లెస్లీ ఉడ్విన్ చిత్రీకరించిన వివాదాస్పద ‘ఇండియాస్ డాటర్’ డాక్యుమెంటరీకి ప్రతిస్పందనగా ‘యునైటెడ్ కింగ్డమ్స్ డాటర్’ అనే డాక్యుమెంటరీని భారత్‌కు చెందిన హర్విందర్ సింగ్ రూపొందించారు. బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లైంగిక వేధింపులనేవి భారత్‌కు సంబంధించినవి మాత్రమే కావని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని చాటిచెప్పేందుకే హర్విందర్ ఈ వీడియోను రూపొందించారు.
తొలిసారిగా ఇద్దరికి
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారాన్ని 2014 సంవత్సరానికి మహిళా శాస్త్రవేత్తలు టెస్సీ థామస్, గీతావరదన్‌లకు ప్రదానం చేశారు. తొలిసారిగా ఈ అవార్డును ఇద్దరికి ప్రకటించారు. అగ్ని క్షిపణి ప్రయోగంలో సేవలందించి ‘అగ్ని పుత్రిక’గా, ‘క్షిపణి మహిళ’గా టెస్సీ థామస్ పేరుగాంచారు. అగ్రశ్రేణి ఉపగ్రహ సమాచార శాస్త్రవేత్తగా గీతావరదన్ ఖ్యాతి పొందారు.
Leave a Reply