National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part X
- ఉక్కుముక్క వార్తలకెక్కింది.. టాటాస్టీల్ ‘వందేళ్ల’ రికార్డు సాధించింది.. అమెరికా-భారత్‌ల మధ్య పదేళ్లకు ఒప్పందం కుదిరింది.. ప్రతిష్ఠాత్మక అవార్డు అచ్యుత సమంత సొంతమైంది.. సంప్రదాయానికి భిన్నంగా సీవీసీ పదవిలో ఒక ఐఆర్ఎస్ అధికారిని కేంద్రం నియమించింది.. రూ. 1500 కోట్లతో ‘నిధి’ ఏర్పాటైంది.. కేంద్రం ‘అందరికీ ఇళ్లు’ లక్ష్యం పెట్టుకుంది.. సౌరశక్తి ఉత్పత్తి పెరగనుంది.. ఏమిటి? ఎప్పుడు? ఎందుకు? ఎలా? – జాతీయ వర్తమానాంశాలను చదవండి మరి!
వారసత్వ ఉక్కుముక్క
- తాము తొలిసారిగా తయారు చేసిన రైలు పట్టాలోని ఉక్కుముక్కను లండన్‌లో జరిగిన వేలంలో టాటా స్టీల్ తిరిగి దక్కించుకుంది.
* 1912, ఫిబ్రవరి 16న మొదటిసారిగా జంషెడ్పూర్ ప్లాంటులో రైలు పట్టాలను టాటాస్టీల్ తయారు చేసింది. అదే ఏడాది మార్చి 18న ఈ పట్టాలో ఒక ముక్కను కత్తిరించి దానిపై ‘First Rail rolled from Tata Steel by the Tata Iron & Steel company limited, India / March 18th 1912’ (టాటా స్టీల్ ఉత్పత్తి చేసిన మొదటి రైలు పట్టా) అనే అక్షరాలను చెక్కించారు. దీన్ని టాటా ఐరన్ అండ్ స్టీల్ సంస్థ డెస్క్ వెయిట్‌గా ఉపయోగించింది.
* 1912లో దీన్ని బ్రిటన్ అధికారి రాబర్ట్ క్రూ మిల్నెస్ (1858 – 1945)కు టాటాస్టీల్ బహుమతిగా ఇచ్చింది. తాజాగా దీన్ని లండన్‌లో సోతేబీ సంస్థ వేలం వేయగా టాటాస్టీల్ దక్కించుకుంది. ఈ వారసత్వ ఉక్కుముక్కను జంషెడ్‌పూర్‌లోని టాటాస్టీల్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ కేంద్రంలో ఉంచారు.
ఆసియాలో ప్రథమం
- 1907, ఆగస్టు 25న ఆసియాలోనే మొదటి సమీకృత ప్రైవేటు రంగ స్టీల్ కంపెనీగా టాటా స్టీల్ ఏర్పాటు అయ్యింది. ఇది 1912, ఫిబ్రవరి 16న భారతదేశంలో తొలిసారిగా ఉక్కు ఉత్పత్తి చేసిన రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘటనకు 2012, ఫిబ్రవరి 16 నాటికి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి.
* అయిదు ఖండాల్లో 80,000 మందికి పైగా ఉద్యోగులతో ప్రపంచంలోనే మొదటి పది అగ్రగామి స్టీల్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన టాటా స్టీల్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,39,504 కోట్ల టర్నోవరును సాధించింది. టాటాస్టీల్ ప్రస్తుతం 26 దేశాల్లో నిర్వహణ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
ఖోయా-పాయా
- తప్పిపోయిన పిల్లల గురించి సమాచారాన్ని సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలు పంచుకోవడానికి వీలుగా కేంద్రప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది.
* ‘ఖోయా-పాయా'(KhoyaPaya.gov.in) పేరుతో రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను 2015, జూన్ 2న దిల్లీలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖామంత్రి మేనకాగాంధీ, ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంయుక్తంగా ప్రారంభించారు.
* ‘ట్రాక్ ఛైల్డ్’ పేరుతో ఇప్పటికే ఒక వెబ్సైట్ ఉన్నా అది ప్రధానంగా పోలీసులకు ఉద్దేశించింది కావడంతోపాటు కొన్ని పరిమితులున్న నేపథ్యంలో కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
* తప్పిపోయిన పిల్లల గురించి తల్లిదండ్రులు; ఆచూకీ లభ్యమైన పిల్లల గురించి పౌరులు ఈ వెబ్సైట్ ద్వారా ఫొటోలతో సహా సమాచారాన్ని అందించవచ్చు.
* జాతీయ నేర రికార్డుల బ్యూరో(NCRB) లెక్కల ప్రకారం ఏటా దేశంలో దాదాపు 70 వేల మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు. 2012 జనవరి నుంచి 2015 ఏప్రిల్ మధ్యకాలంలో తప్పిపోయిన పిల్లల్లో కేవలం 73,597 మంది మాత్రమే తిరిగి దొరికినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అమెరికాతో ‘రక్షణ’ ఒప్పందం
- రక్షణ రంగంలో పదేళ్లు పరస్పర సహకారం అందించుకునే దిశగా ‘రక్షణ’ విధాన ఒప్పందంపై భారత్, అమెరికాలు 2015 జూన్‌లో సంతకాలు చేశాయి. తద్వారా రక్షణ పరికరాల తయారీ, అభివృద్ధికి సంబంధించిన పరిజ్ఞానాన్ని రెండు దేశాలు పంచుకోనున్నాయి.
* 2015 జనవరిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా రక్షణ విధాన ఒప్పందానికి సంబంధించి ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.
* సముద్ర భద్రత, సంయుక్త శిక్షణ అంశాలపై దృష్టి సారించే ఈ ఒప్పందంపై భారత రక్షణమంత్రి మనోహర్ పారికర్, భారత పర్యటనకు వచ్చిన అమెరికా రక్షణమంత్రి ఆస్టన్ కార్టర్ సంతకాలు చేశారు.
* కార్టర్ తన భారత పర్యటనలో భాగంగా దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో కూడా సమావేశమయ్యారు.
‘అచ్యుత’కు అవార్డు
- ప్రముఖ సామాజిక సేవకుడు, ఒడిశాకు చెందిన ఆచార్య అచ్యుత సమంతకు బహ్రెయిన్ దేశ ప్రతిష్ఠాత్మక ‘ఇసా అవార్డ్ ఫర్ సర్వీస్ టు హ్యుమానిటీ’ పురస్కారం లభించింది.
* భారత్‌లో పేదరికం, ఆకలి, నిరక్షరాస్యతల నిర్మూలనకు ఆయన చేస్తున్న కృషిని గుర్తించి బహ్రెయిన్ రాజు షేక్ మహ్మద్ బిన్ ముబారక్ అల్ ఖలీఫా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సుమారు రూ.6 కోట్ల నగదుతో కూడిన పురస్కారంతోపాటు బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు.
* తూర్పు భారతదేశంలో నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన చిన్నారులు, యువతకు ఆధునిక విద్య, ఉచిత వసతి అందివ్వడానికి అచ్యుత సమంత కృషి చేస్తున్నారు.
* KISS (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్), KIIT (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ) అనే రెండు సంస్థలను భువనేశ్వర్‌లో నెలకొల్పిన అచ్యుత సమంత అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు.
సీవీసీగా కేవీ
- ప్రధాన నిఘా కమిషనర్ (సీవీసీ)గా 2015, జూన్ 10న కొసరాజు వీరయ్య చౌదరి (కేవీ చౌదరి) బాధ్యతలు స్వీకరించారు.
* సంప్రదాయానికి భిన్నంగా ఐఏఎస్‌లను కాకుండా ఓ ఐఆర్ఎస్ అధికారిని తొలిసారిగా ప్రభుత్వం సీవీసీగా నియమించింది. కేవీ చౌదరి 1978 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను క్యాడర్) అధికారి.
* కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఛైర్మన్‌గా పనిచేసిన కేవీచౌదరి 2014 అక్టోబరులో పదవీ విరమణ చేశారు. నల్లధనానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి సలహాదారు కూడా వ్యవహరించారు.
* అవినీతి నిరోధానికి 1962లో అప్పటి కేంద్ర హోంమంత్రి లాల్‌బహదూర్‌శాస్త్రి ఏర్పాటు చేసిన కె.సంతానం కమిటీ సూచనల మేరకు 1964 ఫిబ్రవరిలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
* నిట్టూర్ శ్రీనివాసరావు మొదటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా సేవలందించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో – ప్రధాన నిఘా కమిషనర్ తోపాటు ఇద్దరు నిఘా కమిషనర్లు ఉంటారు. ప్రస్తుతం కేవీ చౌదరితోపాటు రాజీవ్, టీఎమ్ భాసిన్‌లు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో ఉన్నారు.
* సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను (1964- 2014) 2014 ఫిబ్రవరి 11, 12 తేదీల్లో దిల్లీలో నిర్వహించారు.
* ప్రధానమంత్రి, హోంమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌ను, ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లను నియమిస్తారు. వీరి పదవీకాలం నాలుగు సంవత్సరాలు. లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు.
బీమా నిధి.. ఏర్పడింది
- పౌర అణు నష్ట పరిహార బాధ్యత చట్టం (సీఎల్‌ఎన్‌డీ యాక్ట్ – సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డామేజ్ యాక్ట్) కింద తప్పనిసరిగా అవసరమైన బీమా నిధిని రూ.1500 కోట్లతో ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసింది. విదేశాలకు చెందిన అణు ఇంధన సరఫరాదారులపై ఆర్థిక భారం తొలిగించే రీతిలో ఈ నిర్ణయం తీసుకుంది.
* రాబోయే అయిదేళ్లలో అణు విద్యుత్తును మూడు రెట్లు పెంచాలన్న ప్రధాని నరేంద్రమోదీ దార్శనికతను చేరుకోవడానికి ఈ నిధి దోహదపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
* ఏదైనా ప్రమాదం సంభవిస్తే సరఫరాదారుడిని న్యాయస్థానంలో నిలబెట్టే నిబంధన అణు పరిశ్రమకు ఓ ప్రధాన అడ్డంకిగా ఉంది. దీన్ని తొలగించడానికే అణు బీమా నిధిని ఏర్పాటు చేశారు.
* భారత సాధారణ బీమా సంస్థ (జీఐసీ – జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నిధిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లాంటి 11 ఇతర జీవిత బీమాయేతర సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.
2022 నాటికి ‘అందరికీ ఇళ్లు’
- ‘2022 నాటికి అందరికీ గృహ సదుపాయం’ పథకానికి 2015, జూన్ 17న కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పట్టణ పేదలకు గృహ రుణాల భారాన్ని తగ్గిస్తూ వడ్డీరేటుపై ఇచ్చే సబ్సిడీని గణనీయంగా పెంచింది.
* గృహ రుణాల వడ్డీరేటు సబ్సిడీని 6.5 శాతానికి పెంచాలన్న అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ సబ్సిడీని మురికివాడల్లో ఉండే ప్రజలకు, అల్పాదాయ కుటుంబాలకు వర్తింపజేస్తారు. దీనివల్ల పట్టణ పేద కుటుంబాలకు రూ. 2.3 లక్షల చొప్పున లబ్ది చేకూరుతుంది.
* 2022 నాటికి అందరికీ గృహ సదుపాయం పథకం పట్టణాల్లో ‘జాతీయ పట్టణ నివాస మిషన్’గా అమలు కానుంది. దీని కింద వచ్చే ఏడేళ్లలో రెండు కోట్ల కొత్త ఇళ్లను పట్టణ పేదలకు నిర్మించి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
* ‘జాతీయ పట్టణ నివాస మిషన్’ను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 4,041 పట్టణాలు, నగరాల్లో అమలు చేయనుంది. తొలుత లక్ష లేదా అంతకు మించి జనాభా ఉన్న 500 నగరాలు, పట్టణాలను (మొత్తం పట్టణా జనాభాలో 75 శాతం మంది వీటిల్లోనే ఉంటున్నారు) ఎంచుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. మూడు దశల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
* తొలి దశలో 100 నగరాల్లో (2015 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు), రెండో దశలో 200 నగరాల్లో (2017 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు), మూడో దశలో మిగిలిన 200 నగరాల్లో (2019 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు) ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
లక్ష ‘మెగా’ సౌర లక్ష్యం
- దేశంలో సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యాన్ని 2022 నాటికి లక్ష మెగావాట్లకు పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఇప్పుడున్న లక్ష్యం (20,000 మెగావాట్లు) కంటే 5 రెట్లు అధికం.
* ఈ లక్ష్య సాధనకు రూ.6 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సోలార్ మిషన్ (జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం) కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
* పైకప్పు సౌరశక్తి ప్రాజెక్టుల ద్వారా 40,000 మెగావాట్లను; భారీ, మధ్య స్థాయి ప్రాజెక్టుల ద్వారా 60,000 మెగావాట్లను ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది.
* జేఎన్ఎన్ఎస్ఎంను 2010, జనవరి 11న అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. 2022 నాటికి 20,000 మెగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని అప్పుడు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
మాదిరి ప్రశ్నలు
1. 2011 భారతదేశ జనాభా లెక్కల నినాదం ఏమిటి?
ఎ) అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ బి) సెన్సస్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ సి) అవర్ సెన్సస్ అవర్ డెవలప్మెంట్ డి) సెన్సస్ ఫర్ అవర్ డెవలప్మెంట్
జ: (ఎ)
2. వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం 2015 సెప్టెంబరులో ఎంత మొత్తంలో నిధులు విడుదల చేసింది?
ఎ) రూ. 210 కోట్లు బి) రూ. 310 కోట్లు సి) రూ. 410 కోట్లు డి) రూ. 510 కోట్లు
జ: (సి)
3. 2015 సెప్టెంబరులో ఏ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 3 వివాదాస్పద బిల్లుల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అక్కడి గిరిజనులు చేపట్టిన ఆందోళన హింసాత్మకమైంది?
ఎ) ఝార్ఖండ్ బి) మణిపూర్ సి) అసోం డి) మేఘాలయ
జ: (బి)
4. ఇటీవల దేశంలో వార్తల్లోకి వచ్చిన ‘ఓఆర్ఓపీ’ ఎవరికి సంబంధించింది?
ఎ) క్రీడాకారులు బి) సైన్యం సి) పార్లమెంటు సభ్యులు డి) రైల్వే ఉద్యోగులు
జ: (బి)
5. 2015 ఆగస్టులో ఆచార్య దేవ్వ్రత్ ఏ రాష్ట్ర గవర్నరుగా నియమితులయ్యారు?
ఎ) మధ్యప్రదేశ్ బి) ఉత్తర్‌ప్రదేశ్ సి) మహారాష్ట్ర డి) హిమాచల్‌ప్రదేశ్
జ: (డి)
6. 2015 సెప్టెంబరులో అమెరికా కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరం మొదటి మహిళా పోస్ట్‌మాస్టర్‌గా బాధ్యతలు చేపట్టిన భారతీయ అమెరికన్ మహిళను గుర్తించండి.
ఎ) జగ్దీప్ గ్రెవాల్ బి) స్వాతి దండేకర్ సి) లోహితా పిరమాల్ డి) రూపా బజ్వాల్
జ: (ఎ)
7. కరవు పీడిత ప్రాంతాల్లోని రైతులను ఆదుకునేందుకు ఇటీవల ‘నామ్ ఫౌండేషన్’ పేరిట సహాయక నిధిని ఏర్పాటు చేసిన బాలీవుడ్ నటుడు ఎవరు?
ఎ) అమితాబ్ బచ్చన్ బి) షారుక్ ఖాన్ సి) ఆమీర్ ఖాన్ డి) నానా పాటేకర్
జ: (డి)
8. దేశవ్యాప్తంగా ఎన్ని దీప స్తంభాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని 2015 అక్టోబరులో కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది?
ఎ) 58 బి) 68 సి) 78 డి) 88
జ: (సి)
Leave a Reply