International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part II
టీఎస్పీఎస్సీ అభ్యర్థులు అంతర్జాతీయ వర్తమాన అంశాలపై పట్టు సాధించడం ద్వారా జనరల్ స్టడీస్ విభాగంలో మంచి మార్కులు సంపాదించవచ్చు. 2015లో ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్రిటన్ ఎన్నికలు.. గ్రీస్ సంక్షోభం.. ప్రముఖ దేశాల్లో మోదీ పర్యటన-కీలక ఒప్పందాలు.. నల్లధనం నియంత్రణకు ముందడుగు.. బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు.. తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు అందిస్తున్న విశేషాల సమాహారం
ఏఈవోఐ ఒప్పందం
* స్విస్ బ్యాంకుల్లో చాలా ఏళ్లుగా అక్రమ సంపద నిల్వలు పెరిగిపోతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో బ్యాంకింగ్ రహస్యాల రక్షణ విషయమై ప్రపంచ స్థాయిలో స్విట్జర్లాండ్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో 2015 మేలో తొలిసారిగా యూరోపియన్ యూనియన్(ఈయూ)తో స్వయం చాలక సమాచార మార్పిడి ఒప్పందాన్ని (ఏఈవోఐ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో నల్లధనాన్ని నిరోధించే ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది.
* ఈ ఒప్పందం 2017 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం ఈయూ సభ్యదేశాలు.. తమ దేశీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాదారుల పేర్లు, చిరునామాలు, పన్ను గుర్తింపు సంఖ్యలు, పుట్టిన తేదీల లాంటి వివరాలను వార్షిక ప్రాతిపదికన అందుకుంటాయి. భారత్ సహా సుమారు వంద దేశాలు ప్రపంచ ‘ఏఈవోఐ ఫ్రేమ్‌వర్క్’లో ఇప్పటికే భాగస్వాములయ్యాయి. ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేందుకు ద్వైపాక్షిక ఒప్పందాలు అవసరం.
యూకే ఎన్నికలు
* యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో 56వ పార్లమెంటును ఎన్నుకోవడానికి 2015 మే 7న సాధారణ ఎన్నికలు జరిగాయి. మొత్తం 650 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ తిరిగి విజయాన్ని సాధించారు.
* కామెరూన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 331 స్థానాల్లో విజయం సాధించింది. 1992లో జాన్‌మేజర్ గెలుపు తర్వాత ఒక పార్టీకే పూర్తి ఆధిక్యం దక్కడం ఇదే తొలిసారి. ప్రధాన విపక్షం లేబర్‌పార్టీ 232 స్థానాలు పొంది, వరుసగా రెండోసారి పరాజయం పాలైంది.
* బ్రిటన్ నుంచి స్కాట్లాండ్ స్వాతంత్య్రానికి అనుకూలంగా నిలిచిన స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్ఎన్పీ) 56 స్థానాలు సాధించింది. అయిదేళ్ల కిందట డేవిడ్ కామెరూన్ తొలిసారిగా ప్రధాని అయ్యారు. 1812 నుంచి ఆ పదవి చేపట్టినవారిలో అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కారు.
విదేశాల్లో మోదీ
* భారత ప్రధాని నరేంద్ర మోదీ 2015 మేలో చైనా, మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించారు.
చైనా పర్యటన
తొలిరోజు నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వస్థలం షియన్ నగరానికి వెళ్లారు. రాజధాని బీజింగ్‌కు వెలుపల చైనా అధ్యక్షుడు ఒక విదేశీ నేతకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ‘ప్రఖ్యాత గ్రేట్‌హాల్ ఆఫ్ పీపుల్’లో చైనా ప్రధాని లీకెక్వియాంగ్‌తో సమావేశమయ్యారు.
* భారత్, చైనాల మధ్య 24 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో రైల్వేలు, గనులు, అంతరిక్షం, భూకంప శాస్త్రం, ఇంజినీరింగ్, పర్యటకం, విద్యారంగాల్లో పరస్పర సహకారం, సోదర నగరాల నిర్మాణం, చెంగ్డు, చెన్నైలలో రాయబార కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించినవి ఉన్నాయి.
మంగోలియా పర్యటన
మంగోలియా రాజధాని ఉలాన్ బటార్లో మోదీ ఆ దేశ ప్రధాని చిమేద్ సైఖాన్ బిలెగ్‌తో, అధ్యక్షుడు సాఖియాగిన్ ఎల్బెగ్ డోర్జ్తోనూ విడివిడిగా సమావేశమయ్యారు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం మంగోలియాకు వంద కోట్ల డాలర్ల రుణాన్ని నరేంద్ర మోదీ ప్రకటించారు. రక్షణ సంబంధాలను మెరుగుపరచుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. మంగోలియా పార్లమెంటు ‘స్టేట్గ్రేట్ హురల్’ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. భారత ప్రధాని మంగోలియాలో పర్యటించడం ఇదే తొలిసారి.
దక్షిణ కొరియా పర్యటన
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో దేశాధ్యక్షురాలు పార్క్ గుయెన్హైతో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టుల్లో పాలుపంచుకునే తమ దేశ కంపెనీలకు 1000 కోట్ల డాలర్ల రుణం ఇవ్వాలని దక్షిణ కొరియా ప్రభుత్వం నిర్ణయించింది.
* భారత్, దక్షిణ కొరియాల మధ్య 7 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో ద్వంద్వ పన్నుల నిరోధక సవరణ ఒప్పందం ముఖ్యమైంది. దృశ్య శ్రవణ సంయుక్త నిర్మాణ ఒప్పందం, విమాన రాకపోకల విస్తరణ ఒప్పందం, విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా; రోడ్డు రవాణా, నౌకాయానం, నౌకాశ్రయాల నిర్వహణ ఒప్పందాలు ఉన్నాయి.
‘అనారోగ్య’ ప్రపంచం
* ‘ప్రపంచ వ్యాధుల పీడిత అధ్యయనం – 2013’ నివేదిక ప్రకారం ప్రపంచంలో 95 శాతం కంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 33 శాతం కంటే ఎక్కువ మందిని 5 కంటే ఎక్కువ రుగ్మతలు బాధిస్తున్నట్లు తేలింది. 2013లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 20 మందిలో ఒకరు (4.3 శాతం) మాత్రమే ఏ అనారోగ్యం లేకుండా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
* వెన్నునొప్పి, కుంగుబాటు, ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, మెడనొప్పి, వయసు పైబడటంతో వచ్చే వినికిడి లోపాలు తదితర సమస్యలు ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి.
* 188 దేశాల ప్రజల సమాచారాన్ని ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
భారత్-బంగ్లా చారిత్రక ఒప్పందం
* 2015 జూన్ 6, 7 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో పర్యటించారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో చర్చలు జరిపారు. చారిత్రక భూ సరిహద్దు ఒప్పందం పత్రాలను వీరి సమక్షంలో అధికారులు మార్చుకున్నారు.
* భారత్, బంగ్లాదేశ్‌లు 22 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. తీర ప్రాంత రక్షణ, మనుషుల అక్రమ రవాణాను అరికట్టడం, నకిలీ భారత కరెన్సీని అడ్డుకోవడం, భారత ఆర్థికమండలి ఏర్పాటు.. తదితర అంశాలపై ఈ ఒప్పందాలు కుదిరాయి.
* బంగ్లాకు గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5,128 కోట్ల రుణాన్ని, రూ.1,282 కోట్ల గ్రాంటును వీలైనంత త్వరగా అందేలా చూస్తామని మోదీ ప్రకటించారు. కొత్తగా రూ.12,823 కోట్ల రుణ సాయాన్ని ప్రకటించారు.
ఇరాన్ అణు ఒప్పందం
* 2015 జులై 14న ఇరాన్, ఆరు ప్రధాన దేశాల మధ్య వియన్నాలో అణు ఒప్పందం కుదిరింది. ఇరాన్ అణుశక్తిని, కార్యక్రమాన్ని పరిమితం చేస్తూ, అణుబాంబు పొందకుండా నిరోధించాలనే లక్ష్యంతో కుదిరిన ఈ ఒప్పందంతో దశాబ్దాల కాలంగా పాశ్చాత్య దేశాలతో కొనసాగుతున్న ఇరాన్ వైరానికి తెరపడనుంది.
* అమెరికా సారథ్యంలో ‘పీ5+1’ గా పిలిచే అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా (ఐరాస భద్రతమండలిలోని 5 శాశ్వత సభ్యదేశాలు); జర్మనీ దేశాలు.. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో ఇరాన్ అణు కార్యక్రమాలపై కనీసం దశాబ్దం పాటు కఠిన పరిమితులుంటాయి. ప్రపంచ దేశాలతో పాటు ఐరాస పరిశీలన కొనసాగుతుంది. ఐరాస అణు సంస్థను తన సైనిక స్థావరాల్లో తనిఖీకి ఇరాన్ అంగీకారం తెలిపింది. ఇరాన్ తన ‘సెంట్రిఫ్యూజ్’ యంత్రాలను 19 వేల నుంచి 6,104కు తగ్గించాల్సి ఉంటుంది. ఇరాన్ చమురు ఎగుమతులను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేస్తారు.
ఉఫాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు
* 2015 జులై 9న రష్యాలోని ఉఫాలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో ప్రసంగించారు. ఉగ్రవాదంపై ఎలాంటి వివక్షలేని పోరాటం జరగాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల ఆర్థికరంగం బలంగా లేదనీ, ఐరోపా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సంక్షోభం తలెత్తిందని ఆయన పేర్కొన్నారు.
* బ్రిక్స్ దేశాల మధ్య బలమైన బంధాల కోసం మోదీ పది చర్యలను ‘దస్ కదమ్ (భవిత కోసం పది అడుగులు)’ పేరుతో ప్రతిపాదించారు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీతో పాటు బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాలు పాల్గొన్నారు.
గ్రీస్ ప్రధాని రాజీనామా
* గ్రీస్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రధానమంత్రి అలెక్సిస్ సిప్రాస్ 2015 ఆగస్టు 20న తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి వర్గాన్ని రద్దు చేశారు. త్వరలోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. యూరోజోన్‌తో బెయిల్ అవుట్ ప్యాకేజీపై సొంతపార్టీలోనే వ్యతిరేకత రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
* గ్రీస్ అధ్యక్షుడు ప్రొకోపిస్ పావ్లోపాలస్.
గ్రీస్ ఆర్థిక సంక్షోభం
* ఆర్థిక సహకార (బెయిలవుట్) ప్యాకేజీలను కొనసాగించాలంటే కఠినమైన సంస్కరణలు, పెన్షన్లలో కోత, పన్నుల పెంపు, ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలకు అంగీకరించాలంటూ యూరోపియన్ యూనియన్ (ఈయూ), అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) విధించిన షరతులను గ్రీస్ ప్రజలు తిరస్కరించారు. ఈ అంశానికి సంబంధించి దేశంలో జులై 6న జరిగిన రెఫరెండమ్‌లో ఉద్దీపన షరతులకు 61.31 శాతం మంది వ్యతిరేకంగా, 38.69 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.
* అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్ జూన్ 30న ఐఎంఎఫ్‌కు కట్టాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయి విషయంలో చేతులెత్తేసి డిఫాల్ట్ అయ్యింది. దీంతో ఐఎంఎఫ్ గ్రీస్‌ను ‘ఎగవేతదారు’గా ప్రకటించింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాల్లో గ్రీస్ తొలి ఎగవేతదారుగా నిలిచింది.
* ఆర్థిక సహకార ఒప్పందం కోసం ఐరోపా రుణ దాతలు కఠిన షరతులను పెడుతున్నారని, వాటిని తిరస్కరించాలని దేశ ప్రజలను కోరి రెఫరెండమ్‌కు వెళ్లిన దేశ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ తిరిగి వాటికే మొగ్గు చూపారు. షరతులను తిరస్కరిస్తే దేశం మరింత సంక్షోభంలోకి వెళుతుందని, మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, యూరోజోన్ నుంచి బయటకు వెళ్లే ప్రమాదం ఉందని తెలిసి కూడా మెజార్టీ ప్రజలు ప్రధాని సిప్రాస్ మాటకే విలువిచ్చి, రెఫరెండమ్ ద్వారా ఐరోపా దేశాలకూ ‘నో’ అంటూ సమాధానమిచ్చారు. తీరా ఇది జరిగి వారం రోజులు కూడా కాకముందే ఎలాంటి సంస్కరణలనైతే గ్రీస్ వాసులు వద్దన్నారో సరిగ్గా అలాంటి సంస్కరణలకే సిప్రాస్ తలొగ్గి వార్తల్లో నిలిచారు.
* యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజమ్ నుంచి షరతులతో కూడిన 5,350 కోట్ల యూరోల రుణాన్ని పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ప్రకటించారు.
* యూరో ప్రాంతం నుంచి వైదొలగకుండా ఉండేందుకు గ్రీసు మొగ్గు చూపిన నేపథ్యంలో రుణదాతల కఠిన షరతులకు అంగీకరిస్తూ మూడేళ్ల పాటు 8,600 కోట్ల యూరోల ఉద్దీపన పొందింది. దీనికి సంబంధించి జులై 13న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి. 2010 నుంచి ఇప్పటి వరకు గ్రీసు పొందిన ఉద్దీపనల్లో ఇది మూడోది. చారిత్రక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జులై 15 నుంచి గ్రీసు కఠిన షరతులను అమలు చేయాల్సి వచ్చింది.
Leave a Reply