APPSC | TSPSC Group II Paper I భారతదేశ చరిత్ర – బ్రిటిష్ పాలనలో రైతు ఉద్యమాలు
- బ్రిటిష్ హయాంలో పరిపాలనా విధానం గ్రామీణ భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. వ్యవసాయ రంగంలో కొత్తగా భూమిశిస్తు విధానాలు వచ్చాయి. దాంతో నూతన సామాజిక తరగతులు ఆవిర్భవించాయి. జమీందార్లు, వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి రైతులు వెళ్లిపోయారు. బ్రిటిష్ పాలన ప్రారంభమైన కొన్ని దశాబ్దాల్లోనే రైతులు అణిచివేతకు, దోపిడీకి గురయ్యారు.
- భూమిశిస్తును పెంచడం, వడ్డీ వ్యాపారుల దురాగతాలు, తోటల యజమానుల దోపిడీ లాంటి వాటికి వ్యతిరేకంగా రైతులు నిరసనలు, తిరుగుబాట్లు, ఉద్యమాలు చేపట్టారు. ఇవి ప్రధానంగా భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, విదేశీయులకు వ్యతిరేకంగా జరిగాయి. ఈ ఉద్యమాలు స్థానిక సమస్యల నుంచి ఉద్భవించాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, నాయకత్వ లేమి కారణంగా ఇవి దేశవ్యాప్త ఉద్యమాలుగా అవతరించలేకపోయాయి.
ఫకీర్ సన్యాసి తిరుగుబాట్లు
- బిక్షాటనతో జీవించే ఫకీర్లు, సన్యాసులకు బెంగాల్లో సంభవించిన తీవ్ర కరవు వల్ల ఆహారం దొరకలేదు. దీంతో సన్యాసులు బలవంతంగా ఆహారాన్ని పొందేందుకు ప్రయత్నించారు. 1770లో సంభవించిన గొప్ప కరవు తర్వాత వారు బెంగాల్‌పై దాడులు చేశారు. వీరితో పేద రైతులు, భూములు కోల్పోయిన భూస్వాములు, ఉద్యోగాలు కోల్పోయిన సైనికులు జత కలిశారు. బ్రిటిష్‌వారు ఈ తిరుగుబాట్లను అణిచివేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ తిరుగుబాటుకు మంజు షా ఫకీర్ నాయకత్వం వహించాడు.
సంతాలుల తిరుగుబాటు (1855-56)
- శాంతికాముకులైన సంతాలులు మన్‌భం, బరాభం, హజారీభాగ్, మిడ్నాపూర్, బంకూర ప్రాంతాలకు చెందినవారు. శాశ్వత శిస్తు విధానం వల్ల వీరు తాము సాగుచేస్తున్న భూములను జమీందారులకు అప్పగించాల్సి వచ్చింది. జమీందారులు ఎక్కువ భాటకం డిమాండ్ చేయడంతో వారు తమ పూర్వీకులకు చెందిన ఇళ్లను వదలి రాజ్‌మహల్ కొండల ప్రాంతానికి చేరారు. అక్కడ అడవులను తొలగించి వ్యవసాయ భూమిగా మార్చారు. దీంతో దురాశపరులైన జమీందారులు ఈ భూమిని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నించారు.
- 1855 జూన్‌లో సంతాలులు సిద్ధు, కన్హు సోదరుల నాయకత్వంలో తమ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుని, సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని నిశ్చయించుకున్నారు. 1856 ఫిబ్రవరిలో బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు నాయకులను అరెస్ట్ చేసి, తిరుగుబాటును క్రూరంగా అణిచివేసింది. సంతాలులకు ప్రత్యేకంగా సంతాల్ పరగణాను ఏర్పాటు చేయడం ద్వారా వారిని తమ దారిలోకి తీసుకొచ్చింది.
1857 తిరుగుబాటులో రైతుల పాత్ర
- అవధ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతులు జమీందారుల అణిచివేత విధానాలను పక్కనపెట్టి వారితో కలిసి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ తిరుగుబాటులో క్రియాశీలకంగా పనిచేసిన రైతుల యాజమాన్య హక్కులను రద్దు చేస్తామని అప్పటి గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించడం ద్వారా ఈ తిరుగుబాటులో రైతులు పాల్గొనకుండా చేశారు.
నీలిమందు తిరుగుబాటు (1859-60)
- ఐరోపాకు చెందిన నీలిమందు తోటల యజమానులు అంతగా ఆదాయం లేని నీలిమందును కొంత భూమిలో సాగుచేయాలని తూర్పు భారతదేశంలోని రైతులను బలవంతపెట్టారు. ఎదురించిన రైతులను అపహరించడం, అక్రమంగా నిర్బంధించడం, మహిళలు.. పిల్లలపై దాడి చేయడం, పశువులను ఎత్తుకెళ్లడం, పంటలను నాశనం చేయడం లాంటి అకృత్యాలకు పాల్పడ్డారు. చివరగా 1860లో నీలిమందు పండించకూడదని రైతులు నిర్ణయించి, ఉద్యమం చేపట్టారు. నాడియా జిల్లాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అచిర కాలంలోనే బెంగాల్ మొత్తానికి వ్యాపించింది. రైతులు నీలిమందు పరిశ్రమలపై, పోలీసులపై దాడులు చేశారు. రైతులు సమ్మె చేయడమే కాకుండా న్యాయస్థానంలో కేసులు వేయడానికి కావాల్సిన సొమ్మును విరాళాల ద్వారా సేకరించారు. నీలిమందు తోటల యజమానుల ఇళ్లలో పనిచేసేవారిని బలవంతంగా వారికి సేవలందించకుండా చేశారు. నీలిమందు రైతుల ఉద్యమానికి హరీశ్చంద్ర ముఖర్జీ (హిందూ పేట్రియాట్ పత్రిక సంపాదకులు) మద్దతు తెలిపారు. దీన్‌బంధు మిత్ర రచించిన ‘నీల్‌దర్బణ్’లో తోటల యజమానుల అకృత్యాలను చక్కగా వివరించారు. భారతదేశంలో ఇది మొదటి రైతుల సమ్మె. 1867-68లో బిహార్‌లోని చంపారన్‌లో ఇలాంటి పరిస్థితే పునరావృతమైంది.
దక్కను తిరుగుబాట్లు (1874-75)
- మహారాష్ట్రలోని పుణె, అహ్మద్‌నగర్ జిల్లాల్లో రైత్వారీ విధానం అమల్లో ఉండేది. ఇక్కడ భూమి శిస్తు ఎక్కువగా ఉండేది. వరుసగా కరవులు సంభవించినా రైతులు భూమిశిస్తును తప్పనిసరిగా చెల్లించాలి. అమెరికాలో అంతర్యుద్ధం కారణంగా 1860-64 మధ్యలో పత్తి రైతులు తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా లాభాలు ఆర్జించారు. అయితే 1864లో అంతర్యుద్ధం ముగియడం, ఐరోపా ఖండం నుంచి పత్తి ఎగుమతులు పునఃప్రారంభమవడంతో భారతదేశంలో పత్తి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఫలితంగా ఇక్కడి రైతులు అప్పు కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సి వచ్చింది. వడ్డీ వ్యాపారులు రుణం కోసం భూములను తాకట్టు పెట్టమని రైతులను బలవంతపెట్టారు. రుణ విముక్తి కోసం వారి మహిళల మానాన్ని ఫణంగా పెట్టాల్సి వచ్చింది.
- 1874లో మరాఠా రైతులు ఆరు తాలుకాల్లోని 33 ప్రదేశాల్లో తిరుగుబాట్లు చేశారు. ఈ సందర్భంగా రుణానికి సంబంధించిన పత్రాల (బాండ్ల)ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వడానికి వడ్డీ వ్యాపారులు నిరాకరించినప్పుడు మాత్రమే హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అయితే ఈ తిరుగుబాట్లను పోలీసులు, సైన్యం సహకారంతో అణిచివేశారు. ప్రభుత్వం ఈ తిరుగుబాట్ల స్వభావం, కారణాలను అధ్యయనం చేయడానికి ఒక కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగా 1879లో ఒక చట్టం చేసింది. దీని ప్రకారం రైతుల భూముల అన్యాక్రాంతంపై పరిమితులు విధించడమే కాకుండా సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను సవరించింది. రైతులు రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే నిర్బంధించడానికి, జైలుకు పంపడానికి వీల్లేకుండా చట్టం చేసింది.
రామోసీల తిరుగుబాటు
- మహారాష్ట్రలోని రామోసీలు మరాఠాల పాలనలో చిన్న స్థాయి పోలీసు ఉద్యోగాలు చేసేవారు. మరాఠా రాజ్య పతనం తర్వాత వారు తిరిగి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అయితే అధిక భూమిశిస్తు వల్ల వారు ఇబ్బందుల పాలయ్యారు. 1822లో చిట్టూర్‌సింగ్ నాయకత్వంలో రామోసీలు తిరుగుబాటు చేసి మరాఠా ప్రాంతాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అనేక కోటలను నాశనం చేశారు. 1825లో వచ్చిన కరవు వల్ల 1826లో డోమాజి నాయకత్వంలో మరోసారి తిరుగుబాటు చేశారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం వారికి భూములు ఇవ్వడమే కాకుండా పోలీసు ఉద్యోగాలను ఇచ్చింది.
- 1876-78లో సంభవించిన గొప్ప కరవు వల్ల పశ్చిమ భారతదేశం అతలాకుతలమైంది. దీంతో ఈ ఇబ్బందులన్నింటికీ విదేశీ పాలనే కారణమని భావించిన వాసుదేవ్ బల్వంత్ ఫాడ్కే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ప్రభుత్వం ఫాడ్కేను 1880లో అరెస్ట్ చేసింది. అతడు 1883లో జైలులోనే మరణించాడు.
పబ్నా తిరుగుబాటు
- 1859 చట్టం రైతులకు తాము సాగుచేసే భూమిపై స్వాధీన హక్కులను ఇచ్చింది. తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లోని శాశ్వత శిస్తు విధానం అమల్లో ఉన్న భూభాగాల్లోని జమీందారులు.. రైతులకు స్వాధీన హక్కులు లేకుండా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నించారు. దీంతో తూర్పు బెంగాల్‌లోని అనేక జిల్లాలో రైతులు జమీందారులకు వ్యతిరేకంగా 1870-1885 మధ్యకాలంలో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లకు కేంద్ర బిందువు పబ్నా జిల్లా. ఇక్కడి రైతులు జనపనార పండించి అధిక లాభాలు సంపాదించారు. వారు 1873 మేలో ఒక లీగ్‌గా ఏర్పడి జమీందారుల అన్యాయమైన డిమాండ్లను వ్యతిరేకించారు. కోర్టు ఖర్చుల నిమిత్తం విరాళాలు సేకరించడమే కాకుండా గ్రామాల్లో సమావేశాలను నిర్వహించి పన్నులు చెల్లించవద్దని రైతులను కోరారు. వీరు ప్రధానంగా న్యాయపోరాటాన్ని శాంతియుతంగా చేశారు. ఈ ఉద్యమంలో రెండు ప్రధాన లక్షణాలు..1.కిసాన్ సభ లేదా రాజకీయ పార్టీలు రైతు ఉద్యమాలు చేపట్టక ముందే వీరు ఒక గ్రూపుగా ఏర్పడి జమీందారులకు వ్యతి రేకంగా ఉద్యమించడం. 2.మెజారిటీ జమీందారులు హిందువులైనా, ముస్లిం రైతులతోపాటు హిందూ రైతులు కలిసి జమీందారులకు వ్యతిరేకంగా పోరాడటం. దీనికి ముఖ్య నాయకులు షా చంద్రరాయ్, శంభు పాల్, ఖాది మొల్లా. ఈ ఉద్యమ ఫలితంగా 1885లో ప్రభుత్వం బెంగాల్ కౌలుదారుల చట్టాన్ని చేసింది.
పాగల్ పంతి తిరుగుబాటు
- వీరు తూర్పు బెంగాల్‌లోని మైమెన్సింగ్ జిల్లాకు చెందిన హజోంగ్, గరో తెగలకు చెందినవారు. పాగల్ పంతి తిరుగుబాటును ప్రారంభించినవాడు కరమ్ షా. ఇతడి కుమారుడైన టిపు రాజకీయ, మతపరమైన లక్ష్యాలతో ప్రభావితుడై ఉద్యమాన్ని తీవ్రతరం చేశాడు. ఇతడు జమీందారులకు వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పాటుచేసి, దాడులు చేయడం ద్వారా ధనం సేకరించాడు. 1825 జనవరిలో తన సైన్యంతో జమీందారుల ఇళ్లపై దాడి చేయడంతో, వారు బ్రిటిష్ అధికారుల వద్ద ఆశ్రయం పొందారు. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దడానికి టిపు డిమాండ్లను అంగీకరించింది. పాగల్ పంతి తిరుగుబాటు 1825-35 మధ్య కొనసాగింది. చివరికి సైన్యం సాయంతో ప్రభుత్వం దీన్ని అణిచివేసింది.
పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టం (1900)
- గ్రామీణ రుణగ్రస్థత, వ్యవసాయ భూమి వ్యసాయేతర తరగతులకు అన్యాక్రాంతం కావడం 19వ శతాబ్దం చివరి భాగంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో జరిగిన పరిణామం. బెంగాల్, మహారాష్ట్రలలో రైతుల ఉద్యమాలను ఎదుర్కొన్న ప్రభుత్వం పంజాబ్‌లో అలాంటి పరిస్థితి రాకముందే రైతుల సమస్యలను పరిష్కరించాలని భావించింది. వివిధ మతాలకు చెందినవారు పంజాబ్‌లో ఉండటం, సిక్కుల వీరత్వం.. ప్రభుత్వాన్ని ఇలాంటి చర్యలు చేపట్టేలా ప్రేరేపించాయి. 1895లో భారత ప్రభుత్వం వ్యవసాయ భూమి అన్యాక్రాంతం కాకుండా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్‌ను జారీ చేసింది. 1896-97, 1899-1900లలో సంభవించిన తీవ్ర కరవుతో సమస్య మరింత జఠిలమైంది. దీంతో 1900లో పంజాబ్ భూ అన్యాక్రాంత చట్టాన్ని ప్రయోగాత్మక చర్యగా చేసింది. పంజాబ్‌లో ఈ చట్టం విజయవంతంగా పనిచేస్తే.. దీన్ని దేశంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఈ చట్టం ద్వారా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర తరగతి వారికి అమ్మడం లేదా తాకట్టు పెట్టడాన్ని నిషేధించింది.
- కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో వెనుకంజ వేసింది. గాంధీజీ రాకతో రైతుల డిమాండ్లకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు రైతులను ఉద్యమంలో భాగస్వాములుగా చేసింది. గాంధీజీ నాయకత్వం వహించిన మొదటి రెండు ఉద్యమాలు రైతుల సమస్యలకు సంబంధించినవే కావడం విశేషం. ఈ రెండూ విజయవంతం కావడంతో అనంతరం గాంధీజీ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక నేతగా ఎదిగారు.
చంపారన్ సత్యాగ్రహం
- 19వ శతాబ్దంలో బీహార్‌లోని చంపారన్‌లో రైతులు తమ భూమిలో 3/20 భాగం నీలిమందు పండించాలని ఐరోపా తోటల యజమానులు బలవంతపెట్టేవారు. దీన్నే ‘తీన్ కథియా విధానం’ అని పిలిచేవారు. రాజ్‌కుమార్ శుక్లా అనే రైతు కోరిక మేరకు గాంధీజీ సత్యాగ్రహం చేపట్టారు. జిల్లాను వదిలి వెళ్లాలని ప్రభుత్వం గాంధీజీని ఆదేశించినా ఆయన భయపడలేదు. గాంధీజీ విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా ప్రభుత్వం అంగీకరించింది. విచారణలో భాగంగా రాజేంద్రప్రసాద్, జె.బి.కృపలానీ వేలాది మంది రైతుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. దీంతో తీన్ కథియా విధానాన్ని రద్దు చేశారు.
ఖేదా సత్యాగ్రహం
- గుజరాత్‌లోని ఖేదా జిల్లాలో పంటలు పండకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. దీంతో భూమిశిస్తు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. గాంధీజీ ఇందులాల్ యాజ్ఞిక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకుల సహకారంతో ఖేదా జిల్లాలో పర్యటించి రైతులను భూమిశిస్తు చెల్లించవద్దని కోరారు. గాంధీజీ పోరాటం తర్వాత ప్రభుత్వం ఒక రహస్య ఉత్తర్వు ద్వారా పన్ను చెల్లించే స్తోమత ఉన్నవారి నుంచి మాత్రమే వసూలు చేయమని పేర్కొంది. దీంతో గాంధీజీ 1918లో ఉద్యమాన్ని నిలిపేశారు.
బార్డోలి సత్యాగ్రహం (1928)
- గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో బార్డోలి గ్రామం ఉంది. ఇక్కడ గాంధీజీ అనుచరులైన మెహతా సోదరులు కున్‌బిపాటి దార్ కులస్థులతోపాటు అంటరానివారు, కాలివరాజ్ తెగకు చెందినవారి సహాయంతో రైతు ఉద్యమాన్ని కొనసాగించారు. బాంబే ప్రభుత్వం భూమిశిస్తును 22 శాతం పెంచడంతో.. మెహతా సోదరులు భూమిశిస్తు నిలుపుదల ఉద్యమాన్ని చేపట్టాలని వల్లభాయి పటేల్‌ను కోరారు. ఉద్యమంలో భాగంగా కుల సంఘాలు, ఐక్యత, సామాజిక బహిష్కరణ, భజనలులాంటి కార్యక్రమాలను చేపట్టారు. ఉద్యమం ఉద్ధృతం కావడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను రైతులకు ఇవ్వడానికి అంగీకరించింది. మాక్స్వెల్-బ్రూమ్‌ఫీల్డ్ విచారణ ఫలితంగా బార్డోలిలో 22 శాతానికి పెంచిన భూమిశిస్తును 6.03 శాతానికి తగ్గించారు.
మోప్లా తిరుగుబాటు
- కేరళలోని మలబార్ ప్రాంతంలో మోప్లా ముస్లిం రైతులు హిందూ అగ్రకులాలకు చెందిన నంబూద్రి, నాయర్ భూస్వాములకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. ఖిలాఫత్ ఉద్యమం మోప్లాలకు అండగా నిలిచింది. కాంగ్రెస్, ఖిలాఫత్ ఉద్యమ నాయకులైన మహాదేవన్ నాయర్, గోపాల మీనన్, యాకూబ్ హసన్‌లను అరెస్ట్ చేయడంతో ఉద్యమం హింసాత్మకమైంది. 1921, ఆగస్టు 20న పోలీసులు తిరురైంగాడి మసీదుపై దాడిచేయడంతో మోప్లాలు పోలీస్ స్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలు, భూస్వాముల ఇళ్లను ధ్వంసం చేశారు. వీరు హింసాత్మక చర్యలకు పాల్పడటంతో కాంగ్రెస్ ఉద్యమానికి దూరమైంది. 1921 డిసెంబరు నాటికి అనధికారికంగా 10,000 మంది మోప్లాలు హత్యకు గురయ్యారు.
పేదరికంలోకి రైతులు..
- ఆ రోజుల్లో దేశ జనాభాలో 3/4వ వంతు మంది వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడేవారు. వలస పాలన కింద వ్యవసాయంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 1765లో బెంగాల్లో ‘దివాని’ (భూమి శిస్తు) అధికారాన్ని బ్రిటిషర్లు చేజిక్కించు కోవడంతో వ్యవసాయ విధానంలో సమూల మార్పులు చేశారు. ఇవి వ్యవసాయదారుల అభివృద్ధికి అనుకూలంగా లేకపోవడంతో వారంతా పేదరికానికి గురయ్యారు.
- 19వ శతాబ్దపు ద్వితీయార్ధంలో భారతదేశంలో అనేక కరవులు సంభవించడంతో చాలామంది కార్మికులు, రైతులు ఆకలిచావులకు గురయ్యారు. ఈ కాలంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో 24 చిన్న, పెద్ద కరవులు సంభవించాయి. ఇవి 28.5 మిలియన్ల మంది మరణానికి కారణమయ్యాయి. వీటిలో 1876-78, 1896-97, 1899-1900 ప్రాంతాల్లో సంభవించిన కరవులు ఎక్కువ నష్టానికి కలగజేశాయి.
కిసాన్ సభలు
- 20వ శతాబ్దంలో రైతు సంస్థలైన కిసాన్ సభలను ఏర్పాటు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రభుత్వం జమీందార్లకు ప్రోత్సాహకాలను ఇవ్వడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హోమ్‌రూల్ లీగ్‌లో క్రియాశీల సభ్యులైన గౌరి శంకర్ మిశ్రా, ఇంద్ర నారాయణ ద్వివేది.. మదన్మోహన్ మాలవ్య సహకారంతో 1918లో కిసాన్ సభలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణుడైన బాబా రామచంద్ర అవధ్‌లో జమీందారులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని ప్రారంభించాడు. 1920లో రైతు ఉద్యమాలు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగమయ్యాయి. మాలవ్య అవధ్ కిసాన్ సభను ప్రతాప్‌గఢ్‌లో 1920 అక్టోబరులో స్థాపించారు.
Leave a Reply