APPSC | TSPSC Group I and II Mains భారత రాజ్యాంగ లక్షణాలు
* భారత రాజ్యాంగ నిర్మాణం
* ఎన్నో విశిష్టతల సమాహారం
* భారత పౌరులకు రక్షణ ఛత్రం
- ఒక దేశంలోని రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక పరిస్థితులు.. ఆ దేశ రాజ్యాంగ రచనపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిని ప్రతిబింబించే కొన్ని విశిష్ట లక్షణాలు ఆ రాజ్యాంగానికి ఉంటాయి. భారత రాజ్యాంగ నిర్మాణం కూడా నాటి చారిత్రక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల నేపథ్యంలో రూపొంది కొన్ని విశిష్ట లక్షణాలతో ఉంది. భారత రాజ్యాంగ లక్షణాలు, విశిష్టతలు, ప్రత్యేకతలను తెలిపే అధ్యయన సమాచారం పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం..
- భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాల్లోనే అతి పెద్దదిగా అభివర్ణించవచ్చు. మొదటిసారి రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి ఇందులో 395 అధికరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. కాలానుగుణంగా పాలనా అవసరాల దృష్ట్యా రాజ్యాంగ సవరణ ప్రక్రియ ద్వారా కొత్త అధికరణలు చేర్చారు. కొన్ని తొలగించారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 465 అధికరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. భారత రాజ్యాంగం ఇంత సుదీర్ఘంగా లిఖించడానికి వివిధ కారణాలున్నాయి. అవి:
* కేంద్ర ప్రభుత్వ నిర్మాణ వ్యవస్థ, అధికారాలు, విధులతోపాటు, రాష్ట్రాల నిర్మాణ వ్యవస్థకు సంబంధించిన అంశాలను కూడా వివరించడం.
* ప్రాథమిక హక్కులకు ప్రత్యేక స్థానం కల్పిస్తూ.. వాటిని వివరణాత్మకంగా విశదీకరించి.. పరిమితులను కూడా పేర్కొనడం.
* సంక్షేమ రాజ్యం ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్య ప్రణాళికలకు మార్గదర్శకాలుగా ఆదేశిక సూత్రాలకు రూపకల్పన చేయడం.
* భారత రాజ్యాంగాన్ని లిఖించే నాటికి, ప్రపంచంలో అప్పటికే అమల్లో ఉన్న కొన్ని ప్రముఖ దేశ రాజ్యాంగాల నుంచి, అవి పనిచేసే తీరుతెన్నుల అనుభవాల నుంచి మన దేశానికి ఉపకరించే, అనువుగా ఉండే కొన్ని మంచి అంశాలను సేకరించి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇతర దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి వాటిలోని మంచి, ఉపయుక్తమైన అంశాలను సేకరించేందుకు రాజ్యాంగ పరిషత్తు సలహాదారుగా డాక్టర్ బెనగళ్ నరసింగరావును నియమించారు.
పార్లమెంటరీ ప్రభుత్వ విధానం
- భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని ఏర్పరిచారు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం ముఖ్య లక్షణం- కేంద్రంలో ప్రధానమంత్రి సారథ్యంలోని మంత్రి వర్గం, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి సారథ్యంలోని మంత్రి వర్గం వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉండగా.. కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు నామమాత్ర కార్యనిర్వహణాధికారులుగా ఉంటారు. ఈ విధానపు మరో ముఖ్య లక్షణం ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు అంతా ‘సమష్టి బాధ్యత’ సిద్ధాంతం ప్రాతిపదికన కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇదే విధానం రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులకు వర్తిస్తుంది.
సార్వభౌమ, సర్వసత్తాక, ప్రజాస్వామ్య…
- రాజ్యాంగ ప్రవేశికలో ప్రకటించినట్లుగా భారతదేశం సార్వభౌమ, సర్వసత్తాక, ప్రజాస్వామ్య, సామ్యవాద గణతంత్ర రాజ్యం. సార్వభౌమత్వం అంటే దేశం బాహ్యంగా ఎవరి ఆదేశాలకూ లోనుకాకుండా, అంతర్గతంగా తిరుగులేని అధికారంతో ఉండటం. భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సామ్యవాదం’ అనే పదాన్ని ప్రవేశికలో చేర్చారు. సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన నిర్మించే ప్రక్రియ. సామ్యవాద విధానంలో ఉత్పత్తి శక్తులను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.
లౌకిక రాజ్యం
- భారతదేశాన్ని మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యంగా రాజ్యాంగంలో పేర్కొన్నారు. లౌకిక రాజ్యంలో ప్రభుత్వం ఏ ఒక్క మతం పట్ల అనుకూల లేదా ప్రతికూల వైఖరి కలిగి ఉండదు. పరిపాలన వ్యక్తుల, మతాలకు అతీతంగా జరుగుతుంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘లౌకిక’ అనే పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు.
దృఢ, అదృఢ లక్షణాల సమ్మిళితం
- సమాఖ్య వ్యవస్థ ఉన్న రాజ్యం సాధారణంగా దృఢ రాజ్యాంగాన్ని కలిగి ఉంటుంది. అంటే రాజ్యాంగ సవరణ ప్రక్రియ కఠినంగా ఉంటుంది. అయితే భారత రాజ్యాంగాన్ని దృఢ, అదృఢ సమ్మిళిత రాజ్యాంగంగా అభివర్ణించవచ్చు. రాజ్యాంగంలోని 368 అధికరణ పార్లమెంటుకు రాజ్యాంగ సవరణాధికారాలను కల్పించింది. దీని ప్రకారం రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతోనూ, మరికొన్ని అంశాలను 2/3వ వంతు మెజారిటీతో సవరించవచ్చు. అలాగే మరికొన్ని అంశాలను 2/3వ వంతు మెజారిటీతోపాటు సగానికి పైగా రాష్ట్రాల ఆమోదంతో సవరించవచ్చు.
ప్రాథమిక హక్కులు
- భారత రాజ్యాంగంలో అత్యంత విశిష్టమైన అంశం ప్రాథమిక హక్కులు. రాజ్యాంగంలోని మూడో భాగంలోని 12-35 వరకు ఉన్న అధికరణాల్లో పౌరులకు / వ్యక్తులకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించారు. ఈ ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్య విధానానికి, రాజ్యాంగ ఔన్నత్యానికి ప్రతీకలు. మౌలికంగా రాజ్యాంగంలో మొత్తం 7 ప్రాథమిక హక్కులుండేవి. వీటిలో ఒకటైన ఆస్తిహక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగంలోనే వేరొక భాగంలో సాధారణ హక్కుగా పేర్కొన్నారు.
స్వతంత్ర న్యాయవ్యవస్థ
- పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు.. అలాగే కేంద్ర, రాష్ట్రాలు; శాసన వ్యవస్థలు తమ రాజ్యాంగ పరిధిని అతిక్రమించకుండా పర్యవేక్షించేందుకు రాజ్యాంగం ఒక స్వతంత్ర న్యాయవ్యవస్థను రూపొందించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయసమీక్ష అధికారాన్ని కూడా కలిగి ఉంది.
ఆదేశిక సూత్రాలు
- భారత రాజ్యాంగం మరో విశిష్ట లక్షణం సమీకృత రాజ్యాంగ ప్రవేశికలో ప్రకటించిన సమసమాజ స్థాపన. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే లక్ష్యాలను సాధించేందుకు రాజ్యాంగంలోని నాలుగో భాగంలో అధికరణాలు 36 నుంచి 51 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శక సూత్రాలు పొందుపరిచారు. అయితే ఇవి కేవలం మార్గదర్శకాలు మాత్రమే కావడంతో న్యాయ సంరక్షణ పరిధిలోకి రావు. అంటే వీటిని తప్పనిసరిగా పాటించాలని న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేదు.
బలమైన కేంద్రం ఉన్న సమాఖ్య రాజ్యాంగం
- భారత రాజ్యాంగం ఒక సమాఖ్య రాజ్యానికి ఉండే లక్షణాలైన లిఖిత రాజ్యాంగం, కేంద్ర-రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ, దృఢ రాజ్యం, స్వతంత్ర న్యాయవ్యవస్థ లాంటి లక్షణాలు కలిగి ఉన్నా.. సమాఖ్య రాజ్యంగా ఎక్కడా పేర్కొనలేదు. భారతదేశ చారిత్రక నేపథ్యం దృష్ట్యా, రాజ్యాంగాన్ని సంపూర్ణ సమాఖ్య రాజ్యాంగంగా వ్యవహరించకుండా ఒక రాష్ట్రాల యూనియన్‌గా ప్రకటించారు. అందుకే కె.సి.వియరే భారత రాజ్యాంగాన్ని ‘అర్థ సమాఖ్య’గా, గ్రాన్విల్ ఆస్టిన్ ‘సహకార సమాఖ్య’ గాను అభివర్ణించారు.
సార్వజనీన వయోజన ఓటు హక్కు
- ప్రజాస్వామ్యానికి ఆయువైన సార్వజనీన వయోజన ఓటు హక్కును రాజ్యాంగంలోని 326వ అధికరణ ద్వారా పౌరులకు కల్పించారు. భారత పౌరులందరికీ కుల, మత, వర్ణ, ప్రాంత, భాష, ఆస్తి, లింగ వివక్షతలు లేకుండా ఓటు హక్కు కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కుకు అర్హులుగా నిర్ణయించారు.
ప్రాథమిక విధులు
- మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధుల ప్రస్తావన లేదు. ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగంలోని 4ఎ భాగంలో అధికరణం 51-ఎ రూపంలో పొందుపరిచారు. ఈ అధికరణంలో పౌరులు పాటించవలసిన 11 ప్రాథమిక విధులను పేర్కొన్నారు.
ఏక పౌరసత్వం
- భారత రాజ్యాంగం ఏక పౌరసత్వ విధానాన్ని మాత్రమే గుర్తించింది. అంటే అమెరికా, స్విట్జర్లాండ్ దేశాల్లో లాగా ద్వంద్వ పౌరసత్వ విధానం కాకుండా, భారతదేశంలోని ప్రజలు ఏక పౌరసత్వం కలిగి ఉంటారు. రాష్ట్రాల వారీ పౌరసత్వం ఉండదు.
అత్యవసర పరిస్థితి
- భారత రాజ్యాంగం మరో ప్రత్యేక లక్షణం ఇది.. దేశ ఐక్యతకు, సమగ్రతకు, రక్షణకు, సార్వభౌమత్వానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, రాజ్యాంగంలోని 18వ భాగంలోని అధికరణల (352 నుంచి 360)లో పైన పేర్కొన్న పరిస్థితులు తలెత్తినప్పుడు రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితిని విధించే ప్రత్యేక అధికారాలు ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం అత్యవసర పరిస్థితిని 3 రకాలుగా చెప్పవచ్చు. అవి.. జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణం 352), రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (అధికరణం 356), ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణం 360).
కేంద్ర-రాష్ట్రాల అధికార విభజన
- భారత రాజ్యాంగం దేశాన్ని ‘రాష్ట్రాల యూనియన్’గా ప్రకటించినప్పటికీ సమాఖ్య రాజ్యంలోలాగా కేంద్ర- రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ రాజ్యాంగపరంగా జరిగింది. అధికారాల పంపిణీకి సంబంధించి వివిధ అంశాలను మూడు జాబితాల్లో పేర్కొన్నారు. అవి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ మూడు జాబితాల వివరాలు రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో పేర్కొన్నారు.
Leave a Reply