APPSC | TSPSC Group I and II Mains భారత ఆర్థిక వ్యవస్థ
* ఆర్థిక వ్యవస్థకు పునాదులు
* వివిధ రూపాల్లో రూపకల్పన
* భారత్‌లో అమలు తీరు
* తొలి అయిదింటి ప్రత్యేకతలు
- ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడవాలంటే నిర్ణీత ప్రణాళికల రూపకల్పన తప్పనిసరి. దేశంలో నెలకొన్న పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, అవసరాలు తదితర అంశాల ప్రాతిపదికన రూపొందించే ఈ ప్రణాళికలు ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయి. స్వాతంత్య్రానంతరం భారతదేశం కూడా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి సమర్థ ప్రణాళికలను రూపొందిస్తోంది. సాధారణంగా ఉన్న ప్రణాళికలేమిటి? భారత్‌లో అమలైన ప్రణాళికల్లో తొలి అయిదు పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, అభివృద్ధి వ్యూహాలు, ఫలితాలు తదితర అంశాలపై అధ్యయన సమాచారం పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం..
- మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో భాగంగా భారతదేశంలో ప్రణాళిక ప్రగతి 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రవేశపెట్టడంతో ప్రారంభమైంది. ఇంతవరకు 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళిక అమలవుతోంది. భారతదేశంలో ప్రణాళికల రూపకల్పన, లక్ష్యాలు.. తదితర అంశాలను తెలుసుకునే ముందు.. వివిధ రకాల ప్రణాళికల గురించిన అవగాహన అవసరం. అవి..
1. భౌతిక, విత్త ప్రణాళికలు
- ఆర్థిక ప్రణాళికలు భౌతిక లేదా విత్త ప్రణాళికలుగా ఉండవచ్చు. ప్రణాళిక ముసాయిదాలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి వాస్తవిక భౌతిక వనరులైన ముడి పదార్థాలు, మానవ శక్తి లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించే ప్రణాళిక భౌతిక ప్రణాళిక. ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ద్రవ్య వనరులు ఎంత కావాలో అంచనా వేసి కేటాయించడం విత్త ప్రణాళిక. అయితే ప్రణాళిక వ్యవస్థలో ఈ రెండూ పరస్పరం పూరకాలుగా ఉంటాయి.
2. కాలవ్యవధి ప్రణాళికలు
- ప్రణాళికలకు నిర్దేశించిన కాలవ్యవధిని బట్టి ప్రణాళికలు మూడు రకాలు. అవి..
* ఒక సంవత్సర కాలవ్యవధిలో రూపొందించే ప్రణాళికలు స్వల్పకాలిక ప్రణాళికలు.
* 3-5 సంవత్సరాల వ్యవధిలో రూపొందించే ప్రణాళికలు మధ్యకాలిక ప్రణాళికలు. భారత పంచవర్ష ప్రణాళికలను మధ్యకాలిక ప్రణాళికలుగా చెప్పవచ్చు.
* 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న ప్రణాళికలు దీర్ఘకాలిక ప్రణాళికలు. భారత ప్రణాళికల్లో 3వ, 7వ ప్రణాళికలు దీర్ఘదర్శి దృష్టితో రూపొందించినవి.
3. నిర్దేశాత్మక ప్రణాళికలు
- ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు, నిర్మాణం, వనరుల వినియోగం అన్నీ ప్రభుత్వ దిశానిర్దేశాలకు లోబడి అమలవుతుంటే దాన్ని నిర్దేశాత్మక ప్రణాళిక లేదా ఆదేశాత్మక ప్రణాళిక అంటారు. ఇలాంటి ప్రణాళిక విధానం సాధారణంగా రష్యా లాంటి సోషలిస్టు దేశాల్లో కనిపిస్తుంది.
4. ప్రజాస్వామ్య ప్రణాళికలు
- ప్రజాస్వామ్య ప్రణాళికలో ప్రభుత్వం ఉత్పత్తి సాధానాలన్నింటినీ నియంత్రించదు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అధిక శాతం ప్రజలకు మేలుచేసే విధంగా ప్రణాళిక లక్ష్యాలు నిర్దేశించి ఉంటాయి.
5. సూచనాత్మక ప్రణాళికలు
- ఈ రకమైన ప్రణాళికా విధానంలో ప్రభుత్వం స్థూల అంశాలను నిర్ణయించి వాటిని సాధించడానికి ప్రైవేటు రంగానికి అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. కానీ దిశానిర్దేశం చేయదు. అంటే ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని నిర్దేశించకుండా సూచనలు మాత్రమే చేస్తుంది. ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థలకు సరిపోతుంది.
* దీన్ని తొలిసారిగా 1947-50 కాలంలో ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేసింది.
* 8వ ప్రణాళిక కాలం నుంచి భారతదేశం కేంద్రీకృత ప్రణాళికల స్థానంలో సూచనాత్మక ప్రణాళికా (మార్కెట్ ప్రణాళిక) విధానాన్ని అవలంబిస్తోంది.
6. కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళికలు
- కేంద్రీకృత ప్రణాళిక సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో అమలు చేసే ప్రణాళిక. ఈ పద్ధతిలో ఒక కేంద్ర అధికార సంస్థ ప్రణాళిక రచన, అమలును చేపడుతుంది.
* మిశ్రమ ఆర్థిక వ్యవస్థల్లో వికేంద్రీకృత ప్రణాళిక అమల్లో ఉంటుంది. ఈ రకమైన విధానంలో ప్రధాన నిర్ణయాలు ప్రణాళిక వ్యవస్థ తీసుకుని వివిధ యూనిట్లకు అమలు చేయడంలో స్వేచ్ఛను కల్పిస్తుంది. 6వ ప్రణాళిక కాలం నుంచి మన దేశంలో వికేంద్రీకృత ప్రణాళికల అమలుకు ప్రయత్నం జరుగుతోంది.
7. నిరంతర ప్రణాళిక (రోలింగ్ ప్లాన్)
- దీనికి ఒక నిర్ణీత కాలవ్యవధి ఉండదు. లక్ష్యాన్ని చేరుకునే వరకూ అమలవుతూనే ఉంటుంది. ఈ రకమైన ప్రణాళికలో గతించిన సంవత్సరాన్ని వదిలేసి నూతన సంవత్సరాన్ని కలుపుతూ ఉంటారు. నిరంతర ప్రణాళిక అనే భావనను రూపొందించింది గున్నార్ మిర్దాల్. భారతదేశంలో జనతా ప్రభుత్వం 1978-80 మధ్య కాలంలో నిరంతర ప్రణాళికను అమలు పరిచింది.
8. వార్షిక ప్రణాళికలు
- ఒక సంవత్సర కాలవ్యవధిలో స్వల్పకాలిక లక్ష్యాలతో రూపొందించిన ప్రణాళిక వార్షిక ప్రణాళిక. మన దేశంలో 1966-69, 1990-92 కాలాన్ని వార్షిక ప్రణాళికల కాలంగా చెప్పవచ్చు.
9. ప్రాంతీయ ప్రణాళికలు,
- వెనుకబడిన ప్రాంతాల అభివృధ్ధి కోసం అమలు పరిచే వికేంద్రీకృత ప్రణాళికను ప్రాంతీయ ప్రణాళిక అంటారు. ఇది జాతీయ ప్రణాళికలో అంతర్భాగంగా అమలవుతుంది.
* మన దేశంలో 1970లో తెలంగాణ, రాయలసీమల్లోని వెనుకబడిన ప్రాంతాల కోసం ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించారు.
ద్రవ్య వనరులు
- ఒక ప్రణాళిక విజయవంతం కావాలంటే ఆ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు, ప్రణాళిక అమలు పరచడానికి కావలసిన ద్రవ్య వనరుల లభ్యతకు మధ్య అధికస్థాయి సంబంధం ఉంటుంది. ప్రభుత్వానికి అందుబాటులో ఉండే ప్రణాళికా వనరులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. దేశీయ బడ్జెట్ వనరులు
2. విదేశీ సహాయం
3. లోటు ద్రవ్య విధానం
దేశీయ బడ్జెట్ వనరులు
- ప్రభుత్వం దేశంలో సమీకరించిన నిధులు దేశీయ బడ్జెట్ వనరులు. వీటిలో కింది అంశాలుంటాయి.
* కరెంట్ రెవెన్యూలో మిగిలిన బ్యాలెన్స్
* ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఆర్జించే లాభాలు
* దేశ ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించే వివిధ రకాల రుణాలు
* అదనపు పన్నులు, ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే అదనపు ఆదాయం
* దేశీయ బడ్జెట్ వనరుల ద్వారా ప్రభుత్వం ప్రణాళికలకు అవసరమయ్యే ద్రవ్యాన్ని ఎంత ఎక్కువ పొందగలిగితే అంత మంచిది. ప్రస్తుతం భారత పంచవర్ష ప్రణాళికలకు అవసరమయ్యే వనరులను అధిక శాతం దేశీయ బడ్జెట్ వనరుల ద్వారానే సమకూరుస్తున్నారు.
విదేశీ సహాయం
- ప్రణాళికా వనరులను సమకూర్చుకోవడానికి రెండో మార్గం విదేశీ సహాయం. ఇందులో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఐడీఏ తదితర అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకునే రుణాలు.. విదేశాల నుంచి లభించే రుణాలు, గ్రాంట్లు ఉంటాయి. విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడితే కొత్తగా తీసుకునే రుణాలు, పాత రుణాలపై వడ్డీ చెల్లించడానికే సరిపోయి దేశం విదేశీ రుణాల ఊబిలో కూరుకుపోతుంది. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లవచ్చు.
లోటు ద్రవ్య విధానం
- పైన చెప్పిన రెండు మార్గాలైన దేశీయ బడ్జెట్ వనరులు, విదేశీ సహాయం ద్వారా ప్రణాళిక వ్యయానికి సరిపడిన మొత్తాన్ని సమకూర్చుకోలేనప్పుడు ఆ తేడాను లోటు ద్రవ్య విధానం ద్వారా పూరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆదనపు వ్యయానికి అవసరమైన ద్రవ్యాన్ని రిజర్వు బ్యాంకు సమకూరుస్తుంది. అయితే ఈ విధానం అనుసరించడం వల్ల సాధారణంగా ద్రవ్య సప్లయి పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడవచ్చు.
భారత పంచవర్ష ప్రణాళికలు
(తొలి 5 ప్రణాళికల వివరాలు)
మొదటి పంచవర్ష ప్రణాళిక
- మన దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం – 1951, ఏప్రిల్ 1 నుంచి 1956, మార్చి 31 వరకు. దీని తుది ముసాయిదాను 1952 డిసెంబరులో పార్లమెంటుకు సమర్పించారు. అంటే ప్రణాళిక ఆరంభమైన 20 నెలలకు ప్రణాళిక ముసాయిదాను ఆమోదించారు. ఈ ప్రణాళిక హెరడ్-డోమర్ నమూనా ఆధారంగా రూపొందించారు.
లక్ష్యాలు: రెండో ప్రపంచ యుద్ధం, దేశ విభజన వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం.. జాతీయ ఆదాయాన్ని, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం.. ఆహార పదార్థాల కొరతను తీర్చడం.. ఉద్యోగిత స్థాయిని పెంచడం.. ఆర్థిక అసమానతలను తగ్గించడం..
* ఈ ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగంలో రూ.2,069 కోట్లు ఖర్చు చేయాలని మొదట నిర్ణయించారు. చివరికి రూ.1,960 కోట్లు మాత్రమే ఖర్చయింది.
* మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తం ప్రణాళిక వ్యయంలో వ్యవసాయం, నీటి పారుదలపై చేసిన వ్యయం 31 శాతం. అందుకే దీన్ని ‘వ్యవసాయ ప్రణాళిక’ అంటారు.
ప్రగతి: మొదటి ప్రణాళిక లక్ష్యాలను అధిగమించి వృద్ధిని సాధించింది. వార్షిక వృద్ధిరేటు లక్ష్యాన్ని స్థూల దేశీయోత్పత్తిలో 2.1 శాతంగా నిర్ణయిస్తే వాస్తవంగా సాధించిన వృద్ధిరేటు 3.6 శాతం కావడం విశేషం. అలాగే తలసరి ఆదాయ వృద్ధిరేటు 1.8 శాతంగా ఉంది. ఈ కాలంలో ధరలు 13 శాతం తగ్గాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1950-51లో 50 మిలియన్ టన్నులుండగా 1955-56 నాటికి 65 మిలియన్ టన్నులకు పెరిగింది. దామోదర్, హీరాకుడ్ లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం ఈ కాలంలోనే చేపట్టారు.
రెండో పంచవర్ష ప్రణాళిక
- మొదటి ప్రణాళిక విజయవంతం కావడంతో ఆశాజనక పరిస్థితుల్లో ప్రారంభమైన రెండో పంచవర్ష ప్రణాళిక కాలం – 1956, ఏప్రిల్ 1 నుంచి 1961, మార్చి 31 వరకు. ఆచార్య పి.సి.మహలనోబిస్ నాలుగు రంగాల నమూనా ఆధారంగా ఈ ప్రణాళికను రూపొం దించారు. ఈ ప్రణాళిక సత్వ ర పారిశ్రామికాభివృద్దితోపాటు, భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చింది.
లక్ష్యాలు: ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి జాతీయ ఆదాయాన్ని వార్షికంగా 4.5 శాతం చొప్పున పెంచడం.. మౌలిక, భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రాధాన్యం.. ఉపాధి అవకాశాలను పెంచడం.. ఆదాయ, సంపదల్లో ఉన్న అసమానతలు తగ్గించడం.. ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించడం..
* ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగంలో రూ.4,800 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినా చివరికి రూ.4,600 కోట్లు ఖర్చయింది. మొత్తం ప్రణాళికా వ్యయంలో అత్యధికంగా 28 శాతం రవాణా, కమ్యూనికేషన్లపై ఖర్చు చేశారు. అందుకే దీనిని ‘పరిశ్రమలు, రవాణా ప్రణాళిక’గా పిలుస్తారు. ఈ ప్రణాళికలో దీర్ఘ ఫలన కాలం ఉన్న భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల దీన్ని ‘ధైర్యంతో కూడిన ప్రణాళిక’ (Bold Plan) అని కూడా అంటారు.
ప్రగతి: ఈ ప్రణాళిక కాలంలో వార్షిక వృద్ధిరేటు లక్ష్యం 4.5 శాతం కాగా, సాధించింది 4.3 శాతం. తలసరి ఆదాయ వృద్ధిరేటు సంవత్సరానికి 1.9 శాతంగా ఉంది. ఒక్కొక్కొటి 10 లక్షల టన్నుల సామర్థ్యం ఉన్న 3 ఇనుము, ఉక్కు కర్మాగారాలు రూర్కెలా, దుర్గాపూర్, భిలాయ్‌లలో నెలకొల్పారు. ఈ ప్రణాళికా కాలంలో 10 మిలియన్ల, ఉద్యోగావకాశాలను కల్పించడం విశేషం.
* ఈ ప్రణాళిక కాలం మధ్య (1957-58, 1959-60)లో రెండు సంవత్సరాలు అనావృష్టి పరిస్థితులు ఏర్పడటం వల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గింది. ఎక్కువ మొత్తంలో ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి రావడంతో విదేశీ చెల్లింపుల లోటు ఏర్పడింది. వస్తువుల కొరత వల్ల ధరలు ఈ కాలంలో 30 శాతం పెరిగాయి.
మూడో పంచవర్ష ప్రణాళిక
- ఈ ప్రణాళిక కాలం – 1961, ఏప్రిల్ 1 నుంచి 1966, మార్చి 31 వరకు.. ఈ ప్రణాళికను 15 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని దూరదృష్టితో రూపొందించారు. అశోక్ మెహతా నమూనా దీనికి ఆధారం. వ్యవసాయ, పరిశ్రమల అవశ్యకతను దృష్టిలో ఉంచుకుని దీన్ని సంతులిత ప్రణాళికగా రూపొందించారు.
లక్ష్యాలు: స్వయంసమృద్ధితో కూడిన వృద్ధిని సాధించడాన్ని మూడో ప్రణాళికలో ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు.
* ఈ ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగంలో రూ.7,500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించగా చివరకు రూ.8,580 కోట్లు ఖర్చయ్యాయి. మొత్తం ప్రణాళిక వ్యయంలో అత్యధికంగా రవాణా, సమాచార రంగంపైనే 25 శాతం ఖర్చు చేశారు.
ఫలితాలు: 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాలు, సకాలంలో అందని విదేశీ సహాయం, ప్రణాళిక చివరి సంవత్సరంలో దేశంలో నెలకొన్న తీవ్ర అనావృష్టి పరిస్థితులు ఈ ప్రణాళికను దెబ్బతీశాయి.
* స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధిరేటు లక్ష్యం 5.6 శాతంగా నిర్ణయించినప్పటికీ వాస్తవంగా సాధించింది 2.84 శాతం మాత్రమే. తలసరి ఆదాయంలో వృద్ధిరేటు 0.2 శాతమే. ధరలు 36.4 శాతం పెరిగాయి.
మూడు వార్షిక ప్రణాళికలు (1966-69)
- 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం.. రెండు సంవత్సరాల వరుస కరవులు, ధరల పెరుగుదల.. తదితర కారణాల వల్ల నాలుగో పంచవర్ష ప్రణాళికను కొంత కాలం వాయిదా వేశారు. 1966-67, 1967-68, 1968-69 సంవత్సరాలకు సంబంధించి మూడు వార్షిక ప్రణాళికలు అమలు చేశారు. సాధారణ ప్రణాళికలు అమలు కాకపోవడం వల్ల కొందరు ఆర్థికవేత్తలు ఈ కాలాన్ని ‘ప్రణాళిక విరామం’ లేదా ‘ప్రణాళిక సెలవు’గా పిలిచారు.
* మూడు వార్షిక ప్రణాళికల్లో ఆర్థికాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలపై ప్రభుత్వ రంగంలో రూ.6,625 కోట్లు ఖర్చు చేశారు.
* ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అసమతౌల్య పరిస్థితులను సరిచేసి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించడమే ఈ ప్రణాళికల లక్ష్యం.
నాలుగో పంచవర్ష ప్రణాళిక
- నాలుగో పంచవర్ష ప్రణాళికా కాలం – 1969 నుంచి 1974 వరకు.. ఈ ప్రణాళికా ముసాయిదాను రూపొందించింది డి.ఆర్.గాడ్గిల్. ఈ ప్రణాళిక కాలంలోనే ఇందిరాగాంధీ ‘గరీభీ హఠావో’ నినాదం ఇచ్చారు.
లక్ష్యాలు: స్థిరత్వంతో కూడిన వృద్ధి, స్వావలంబన దిశగా పురోగతి సాధించడం ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యం. ఆర్థిక అనిశ్చితిని తొలగించడం.. ఆహార ధాన్యాల దిగుమతిని తగ్గించడం.. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.. ఇతర లక్ష్యాలు.
* ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగంలో రూ.15,900 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
ఫలితాలు: 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ కాందిశీకుల సమస్య, ప్రణాళిక చివరి మూడు సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, విద్యుత్తు కొరత, పారిశ్రామిక అశాంతి తదితర కారణాల వల్ల ఈ ప్రణాళికలో జాతీయ ఆదాయంలో 3.3 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. (నిర్దేశించిన వృద్ధిరేటు 5.7 శాతం). ధరల పెరుగుదల ఈ కాలంలో 61 శాతానికి చేరింది. ఈ ప్రణాళిక కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం (1969 జులై) చేశారు.
అయిదో పంచవర్ష ప్రణాళిక
- ఈ ప్రణాళిక కాలం – 1974 నుంచి 1979/78 వరకు.. అయిదో ప్రణాళికను తీవ్ర ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల మధ్య రూపొం దించారు. 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఈ ప్రణాళికను ఒక సంవత్సరం ముందుగానే నిలిపివేసి (1978) నిరంతర ప్రణాళిక ప్రవేశపెట్టింది. ఈ ప్రణాళిక ముసాయిదాను రూపొందించినది డి.పి.ధర్.
లక్ష్యాలు: పేదరికానికి దిగువన ఉన్న ప్రజల వినియోగస్థాయిని పెంచడం.. స్వయం సమృద్ధి, ఆర్థిక స్వావలంబన అనేవి ప్రధాన లక్ష్యాలు. జాతీయాదాయంలో సాలుసరి 4.4 శాతం వృద్ధిరేటు సాధిచడం.. ప్రజల కనీస అవసరాలు మెరుగుపరచడం..ఉద్యోగావకాశాలు పెంచడం.. ప్రభుత్వ పంపిణీ విధానాన్ని అభివృద్ధి పరచడం.. ఎగుమతులను పెంచడం లాంటివి ఈ ప్రణాళిక ఇతర లక్ష్యాలు.
* పై లక్ష్యాల సాధనకు ఈ ప్రణాళికలో రూ.39,430 కోట్లు ఖర్చు చేశారు. ప్రణాళికా మొత్తం వ్యయంలో 26 శాతం పరిశ్రమలపైనా, 22 శాతం వ్యవసాయం, నీటిపారుదలపైనా, 19 శాతం ఇంధనం కోసం ఖర్చు చేశారు.
ప్రగతి: 5వ ప్రణాళిక కాలంలో సాలుసరి 4.4 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే 4.8 శాతం సాధించడం విశేషం. ఇదే కాలంలో తలసరి ఆదాయ వృద్ధిరేటు 2.7 శాతంగా ఉంది. ఈ ప్రణాళికలో జాతీయ కనీస అవసరాల కార్యక్రమం (1974-75), 20 సూత్రాల కార్యక్రమం (1975), పనికి ఆహార పథకం (1977-78) లాంటి పథకాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రయత్నాలు జరిగాయి. మొత్తం మీద ఈ ప్రణాళికలో సాధించిన కొన్ని లక్ష్యాలు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ పేదరికం, నిరుద్యోగ నిర్మూలన విషయాల్లో ఈ ప్రణాళిక విజయవంతం కాలేదని చెప్పవచ్చు.
భారత ప్రణాళికలు – లక్ష్యాలు
- భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోని 39వ అధికరణలోని స్ఫూర్తికి అనుగుణంగా ప్రణాళిక సంఘం పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి కింది దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక లక్ష్యాలను ఏర్పరిచింది. అవి..
1. జాతీయ, తలసరి ఆదాయాలను పెంచడం ద్వారా జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం
2. పారిశ్రామికీకరణ వేగవంతం చేయడం
3. ముడి సరుకులు, ఆహార పదార్థాలు, పారిశ్రామిక ఉత్పత్తుల్లో స్వయంసమృద్ధిని సాధించడం
4. పేదరిక నిర్మూలన
5. ఉపాధి అవకాశాలను పెంపొందించడం
6. ఆదాయ, సంపదల్లో అసమానతలను తగ్గించడం ద్వారా ఆర్థికశక్తి కేంద్రీకరణను తగ్గించడం
7. ప్రాంతీయ అసమానతలను తొలగించడం
8. సమానత్వం, సాంఘిక న్యాయాన్ని సాధించడం
9. ఆధునికీకరణ సాధించడం
10. సమ్మిళిత, సుస్థిర వృద్ధిని సాధించడం - భారత పంచవర్ష ప్రణాళికల ముఖ్య లక్ష్యం సామాజిక న్యాయంతో కూడిన శీఘ్రవృద్ధిని సాధించడం
ప్రణాళికా రచన – స్వభావం
* భారతదేశ ప్రణాళికా రచన సమగ్రమైంది. అంటే ఆర్థిక వ్యవస్థ అంతటికీ ప్రణాళికలు రూపొందించడం.
* భారత ప్రణాళికలు ప్రజాస్వామ్య వికేంద్రీకృత ప్రణాళికలు. అంతిమ నిర్ణయం మాత్రం కేంద్రానిదే.
* భారత పంచవర్ష ప్రణాళికలు భౌతిక, విత్త స్వభావాన్ని కలిగి ఉన్నాయి.
* ప్రణాళికల్లో కొన్ని దీర్ఘకాలిక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
* భారత ప్రణాళికా రచన ఆదేశిక సూత్రాల్లోని స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.
* 8వ ప్రణాళిక నుంచి సూచనాత్మక స్వభావాన్ని కలిగి ఉన్నాయి.
* సంస్కరణలకు ముందు ప్రభుత్వరంగం పాత్ర అధికంగా ఉండేది. సంస్కరణల తర్వాత ప్రైవేటు రంగం ప్రాధాన్యం పెరిగింది.
Leave a Reply