APPSC | TSPSC Group I and II Mains ప్రణాళిక సంఘం.. నీతి ఆయోగ్
* ఆర్థిక వ్యవస్థకు బలం
* భారత్‌లో విశేష కృషి
- సమర్థ ప్రణాళిక.. తదనుగుణమైన కృషితోనే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది. స్వాతంత్య్రానంతరం భారతదేశం ఇలాంటి ప్రణాళికయుతమైన దిశగా ముందుకెళుతోంది. పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్.. ఇవన్నీ ఇందులో భాగమే. టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులంతా ప్రణాళికల చరిత్ర, లక్ష్యాలు, వ్యూహాలు, విజయాలు.. నీతి ఆయోగ్ వ్యవస్థ తదితర అంశాలపై పట్టు సాధించడం ద్వారా ఈ విభాగంలో అడిగే ప్రశ్నల్లో అధిక మార్కులు సాధించవచ్చు.
- ఒక ఆర్థికవ్యవస్థ తనకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. ఒడిదొడుకులు లేకుండా అత్యధిక ఫలితాలను పొందాలంటే ప్రణాళికబద్ధమైన కృషి అవసరం. 1929-30లో ప్రారంభమైన ఆర్థికమాంద్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైపోయినా.. రష్యా మాత్రం నిలవగలిగింది. ప్రణాళికబద్ధమైన కృషి వల్లే రష్యా ఆర్థికమాంద్యం ప్రభావానికి గురికాకుండా నిలవడంతో ప్రపంచ దేశాల దృష్టి కూడా ప్రణాళికల వైపు మళ్లింది. రష్యా సాధించిన ప్రణాళికాబద్ధ కృషి, ఆచరణ భారతదేశాన్ని కూడా ప్రభావితం చేశాయి.
- భారతదేశంలో 1951 నుంచి ప్రణాళికాబద్ధ కృషి ప్రారంభమైంది. ఇంతవరకూ 11 పంచవర్ష ప్రణాళికలను పూర్తిచేసుకుని 12వ ప్రణాళిక కాలంలో ఉన్నాం. భారతదేశ ప్రణాళికా కృషిని పరిశీలిస్తే.. కొన్ని విజయాలు, మరికొన్ని అపజయాలు ఉన్నాయి. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధమైన కృషిని పటిష్ఠం చేసే ఉద్దేశంతో ఇటీవలే ప్రణాళిక సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
- ప్రణాళిక విధానం లేదా ప్రణాళికబద్ధమైన కృషిలో ముఖ్యంగా మూడు అంశాలు అంతర్లీనంగా ఉంటాయి.
* మొదటిది – ఆర్థికవ్యవస్థలో ప్రస్తుతమున్న వనరులు, అవసరాలను సమగ్రంగా లెక్క వేయడం.
* రెండోది – సమగ్రంగా లెక్క వేసిన సమాచారం ఆధారంగా ఆర్థికవ్యవస్థ సామర్థ్యం, అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో నిర్ణీత కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించడం.
* మూడోది – నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థికవ్యవస్థలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సరైన మార్గాన్ని ఎంపిక చేయడం.
పంచవర్ష ప్రణాళికలు
- భారతదేశంలో ప్రణాళికల కోసం జరిగిన కృషిని రెండు భాగాలుగా విభజించవచ్చు. అవి..
1. స్వాతంత్య్రానికి ముందు ప్రణాళికల కోసం జరిగిన కృషి
2. స్వాతంత్య్రానంతరం ప్రణాళికల కోసం చేసిన కృషి
స్వాతంత్య్రానికి ముందు..
- మన దేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మన ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వపరమైన ప్రణాళికబద్ధ కృషి జరగలేదు. అయితే కొందరు ప్రముఖులు మన దేశ సత్వర అభివృద్ధికి ప్రణాళికల అవసరాన్ని గుర్తించారు. అంతేకాకుండా మన ఆర్థికవ్యవస్థలో అమలు చేయాల్సిన ప్రణాళికల స్వరూప స్వభావాల గురించి తమ ఆలోచనలను వ్యక్తపరిచారు. అలాంటి ప్రయత్నం చేసినవారిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ముందు వరుసలో ఉన్నారు. 1934లో ఆయన రచించిన ‘ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ – భారతదేశం’ (Planned Economy for India) అనే గ్రంథంలో భారతదేశ ఆర్థికాభివృద్ధికి పది సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను రూపొందించారు.
* భారత జాతీయ కాంగ్రెస్ 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీని నియమించింది. అలాగే ప్రణాళికలకు సంబంధించిన అనేక విషయాలను పరిశీలించడానికి కొన్ని ఉపసంఘాలను కూడా నియమించింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం, రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఈ కమిటీ తన నివేదికను తయారు చేయడంలో కొంత జాప్యం జరిగింది. చివరకు 1948లో నివేదికను సమర్పించింది.
* బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు 1943లో ‘భారత ఆర్థికాభివృద్ధికి ప్రణాళిక’ (A Plan for Economic Development of India) పేరుతో ప్రణాళికను తయారుచేసి 1944లో ముద్రించారు. దీన్నే ‘బాంబే ప్రణాళిక’గా వ్యవహరిస్తారు. ఈ ప్రణాళికలో 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో 15 సంవత్సరాల్లో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళికలో మౌలిక పరిశ్రమలకు కూడా అధిక ప్రాధాన్యమిచ్చారు.
* 1944లో మహాత్మాగాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకుని గాంధేయవాది శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ 3,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ‘గాంధీ ప్రణాళిక’ను రూపొందించారు. ఈ ప్రణాళికలో వ్యవసాయానికి, చిన్న తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. వికేంద్రీకరణ, గ్రామీణ స్వయంసమృద్ధి దీని ముఖ్య లక్ష్యాలు.
* 1944 ఆగస్టులో సర్ అదిషర్ దలాల్ ఆధ్వర్యంలో బ్రిటిష్ ప్రభుత్వం రెండో ప్రపంచ యుద్ధానంతర ఆర్థికవ్యవస్థ పునర్నిర్మాణానికి అవసరమైన స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలను తయారు చేయడానికి ‘ప్రణాళిక, అభివృద్ధిశాఖ’ను (Department of Planning & Development) నెలకొల్పింది.
* 1945 ఏప్రిల్‌లో మానవేంద్రనాథ్ రాయ్ ‘ప్రజా ప్రణాళిక’ (Peoples Plan) పేరుతో ఒక ప్రణాళికను రూపొందించారు. పది సంవత్సరాల కాలపరిమితితో దీని ప్రణాళిక వ్యయం అంచనా రూ. 15,000 కోట్లు. దీనిలో వ్యవసాయం, వినియోగ వస్తు పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పారిశ్రామికవేత్తలు రూపొందించిన బాంబే ప్రణాళిక పెట్టుబడిదారీ లక్షణాలను కలిగి ఉండగా, ప్రజా ప్రణాళిక సామ్యవాద లక్షణాలతో ఉంది.
- పైన తెలిపిన ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఏవీ అమలు కాలేదు. అందుకే వీటిని ‘పేపర్ ప్రణాళికలు’గా వ్యవహరిస్తారు.
- 1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ప్రణాళికలు – అభివృద్ధి, సమస్యలను అధ్యయనం చేయడానికి ఒక ‘హై లెవల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు’ను ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ఒక స్థిర ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
స్వాతంత్య్రానంతరం..
- * 1950 జనవరిలో లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ‘సర్వోదయ ప్రణాళిక’ను రూపొందించారు. అయితే ఈ ప్రణాళికలోని కొన్ని అంశాలను మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది.
ప్రణాళిక సంఘం ఏర్పాటు - స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ప్రణాళిక సంఘం ఆవశ్యకతను గుర్తించి 1950, మార్చి 15న కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘానికి ప్రధానమంత్రి అధ్యక్షుడు. దీని వాస్తవ కార్యనిర్వహణ అధికారి ఉపాధ్యక్షుడు. ప్రణాళిక సంఘం తొలి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ కాగా, మొదటి ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా.
- ప్రణాళిక సంఘం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సలహా సంస్థ మాత్రమే.. రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. దేశంలో లభించే వనరులను అంచనా వేసి వాటిని సమర్థంగా, సంతులనంగా ఉపయోగించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించే బాధ్యతను ప్రణాళిక సంఘానికి అప్పగించారు. ప్రణాళిక సంఘం ద్వారా ఇంతవరకు 11 పంచవర్ష, 6 వార్షిక ప్రణాళికలు పూర్తయ్యాయి. అనంతరం 12వ ప్రణాళిక (2012-17) అమల్లోకి రాగా.. 2015, జనవరి 1న ప్రణాళిక సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం (ఎన్డీఏ) ‘నీతి ఆయోగ్’ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది.
జాతీయ అభివృద్ధి మండలి
(నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్-ఎన్డీసీ)
- కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా 1952, ఆగస్టు 6న ‘జాతీయ అభివృద్ధి మండలి’ ఏర్పాటైంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించి ప్రణాళికలను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కూడా ప్రణాళిక సంఘంలాగానే రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ. ప్రణాళికలను రూపొందించడానికి ఈ సంస్థ మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంది. ప్రణాళిక నిర్మాణంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎన్డీసీ ఆమోదంతోనే ప్రణాళికలు అమల్లోకి వస్తాయి. ఎన్డీసీ ప్రారంభంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. 1967లో పరిపాలనా సంఘం చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రణాళిక సంఘ సభ్యులు, కేంద్ర కేబినెట్ మంత్రులు దీనిలో సభ్యులుగా ఉన్నారు. జాతీయ అభివృద్ధి మండలికి ప్రధానమంత్రి ఎక్స్అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
నీతి ఆయోగ్ ఏర్పాటు
- (NITI – National Institution for Transforming India – జాతీయ పరివర్తన సంస్థ)
- 64 ఏళ్లపాటు దేశానికి సేవలందించి కేంద్రంలో ‘సూపర్ కేబినెట్’గా పేరుగాంచిన ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ (జాతీయ పరివర్తన సంస్థ)ను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2015, జనవరి 1న ఏర్పాటు చేసింది. దీంతో ప్రణాళిక సంఘం రద్దయిపోయింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన ఆర్థిక పరిస్థితులు, కొత్త సాంకేతికతలు, మేధోసంపద వినియోగం, పాలనలో పారదర్శకత లాంటి అంశాల ప్రాతిపదికన నీతి ఆయోగ్ ఏర్పడింది.
లక్ష్యాలు:
* రాష్ట్రాలు బలంగా ఉంటేనే బలమైన దేశం ఏర్పడుతుందనే సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించడం.
* విజ్ఞానం, నవకల్పనల కేంద్ర బిందువు.
* కీలకమైన విధాన నిర్ణయాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను అందించడం. ఆ సూచనలందించే మేధోకూటమి(థింక్ ట్యాంక్)గా రూపుదిద్దుకోవడం.
* జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలు, రంగాలు, వ్యూహాలను రాష్ట్రాలతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
* గ్రామస్థాయిలో ప్రణాళికలు రూపొందించే యంత్రాంగాన్ని అభివృద్ధిచేసి దాన్ని ఉన్నత స్థాయులతో అనుసంధానించడం.
* జాతీయ, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ద్వారా ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకోవడం.
* ఆర్థికవ్యూహం, విధానాల్లో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించిన ఏ అంశాన్నైనా సమీక్షించడం.
* సమర్థ పరిపాలనలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
* వ్యూహాత్మక, దీర్ఘకాలిక విధానాలు, కార్యక్రమాలకు సంబంధించిన ప్రోత్సాహకాలను రూపొందించడం.. వాటి పురోగతి, సామర్థ్యాన్ని పర్యవేక్షించడం.
* వివిధ మంత్రిత్వ శాఖల మధ్య, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంచి విధాన నిర్ణయాల అమలును వేగవంతం చేయడం.
* జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, భాగస్వాములతో చర్చలు, సంప్రదింపుల ద్వారా వైజ్ఞానిక, ఆవిష్కరణ, వాణిజ్య రంగాలకు మద్దతిచ్చే వ్యవస్థగా రూపొందడం.
* అంతర్జాతీయంగా భారత్ చురుకైన పాత్ర పోషించేలా దేశంలోని వివిధ రంగాల్లో మానవ వనరుల్ని పూర్తిగా వినియోగించుకునేలా విధానాలను రూపొందించడం.
* సత్వర ఆర్థికాభివృద్ధి కోసం సమగ్ర, సంపూర్ణ పద్ధతులను ప్రవేశపెట్టడం.
ప్రాంతీయ మండళ్లు (రీజినల్ కౌన్సిల్స్)
- ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక సమస్యలను చర్చించడానికి ప్రాంతీయ మండళ్లను ఒక నిర్ణీత కాలానికి ఏర్పాటు చేస్తారు. ఆ ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు వీటిలో సభ్యులు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు లేదా అతడు నామినేట్ చేసిన వ్యక్తులు ఈ మండళ్లకు అధ్యక్షత వహిస్తారు.
నీతి ఆయోగ్ – ప్రణాళిక సంఘం
* నీతి ఆయోగ్ కీలక విధాన నిర్ణయాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను అందించే ‘మేధోకూటమి’గా వ్యవహరిస్తుంది. నిధులను కేటాయించే అధికారం ఆర్థికశాఖకు ఉంటుంది.
- – ప్రణాళిక సంఘం వివిధ మంత్రిత్వ శాఖలకు, వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో సూపర్ కేబినెట్‌గా వ్యవహరించిందనే అభిప్రాయం ఉంది.
* ప్రణాళిక సంఘం తరహాలో కాకుండా జాతీయ పరివర్తన సంస్థ (నీతి ఆయోగ్)లో నాలుగు డివిజన్లు ఉంటాయి. అవి 1. ప్లాన్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ 2. అంతర్రాష్ట్ర మండలి 3. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 4. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్
* నీతి ఆయోగ్‌కు సంబంధించిన పాలక మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటూ అభివృద్ధి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. జాతీయ అభివృద్ధి మండలిలో మాత్రం వీరి పాత్ర పరిమితం.
* వివిధ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ప్రణాళికలు లక్ష్యసాధనలో ఆశించిన ఫలితాలు అందిస్తాయి. కానీ ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వానికే ప్రణాళిక రచనలో అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దేశం అభివృద్ధి వైపు పయనించాలంటే రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందడం ముఖ్యమనే అంశం నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం. భారతదేశానికి అధికారాలు, ప్రణాళిక వికేంద్రీకరణ అవసరమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు.
* ‘సహకార సమాఖ్య తత్వం’ నీతి ఆయోగ్‌లో ముఖ్యమైన అంశం. విధాన, ప్రణాళిక ప్రక్రియ పైస్థాయి నుంచి కింది స్థాయికి (టాప్ టూ బాటం) కాకుండా, కింది స్థాయి నుంచి పై స్థాయికి (బాటం టూ టాప్) మారాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి దృక్పథం ప్రణాళిక సంఘంలో పూర్తిగా లోపించింది. పాత వ్యవస్థలో కేంద్ర నిర్ణయాలను రాష్ట్రాలు పాటించాలనే విధానం కనిపిస్తుంది.
నీతి ఆయోగ్ స్వరూపం
అధ్యక్షుడు: ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ)
ఉపాధ్యక్షుడు: ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ పనగరియ (తొలి ఉపాధ్యక్షుడు)
ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో): కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తిని ప్రధానమంత్రి సీఈవోగా నియమిస్తారు. ప్రణాళిక సంఘ మాజీ కార్యదర్శి సింధుశ్రీ ఖుల్లర్ తొలి సీఈవో.
పూర్తికాల సభ్యులు: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్, మాజీ రక్షణ కార్యదర్శి (ఆర్ అండ్ డీ) వి.కె.సారస్వత్, వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రమేష్‌చంద్ పూర్తికాల సభ్యులుగా నియమితులయ్యారు.
పాక్షికస్థాయి సభ్యులు: ప్రముఖ విశ్వవిద్యాలయ పరిశోధన సంస్థలు, ఇతర సంబంధిత సంస్థల నుంచి ఇద్దరు పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరు రొటేషన్ పద్ధతిలో నియమితులవుతారు. వీరిని ఎంపిక చేయాల్సి ఉంది.
ఎక్స్అఫీషియో సభ్యులు: నలుగురు కేంద్ర మంత్రులు ఎక్స్అఫీషియో సభ్యులుగా నామినేట్ అయ్యారు. వారు.. హోంశాఖామంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికశాఖామంత్రి అరుణ్ జైట్లీ, రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు, వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్ సింగ్.
ప్రత్యేక ఆహ్వానితులు: ముగ్గురు కేంద్ర మంత్రులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. వారి పేర్లను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వారు.. రవాణాశాఖామంత్రి నితిన్ గడ్కరీ, సామాజిక న్యాయం- సాధికారతలశాఖా మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్, మానవ వనరుల అభివృద్ధిశాఖా మంత్రి స్మృతి ఇరానీ.
పాలకమండలి సభ్యులు: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు.
మాదిరి ప్రశ్నలు
1. ‘ప్రణాళికబద్ధమైన ఆర్థికవ్యవస్థ – భారతదేశం’ (Planned Economy for India) గ్రంథాన్ని ఎవరు రచించారు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ బి) మోక్షగుండం విశ్వేశ్వరయ్య సి) సుభాష్ చంద్రబోస్ డి) శ్రీమన్ నారాయణ అగర్వాల్
జ: (బి)
2. కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) ప్రజా ప్రణాళిక – ఎం.ఎన్.రాయ్
బి) గాంధీ ప్రణాళిక – వినోభాబావే
సి) బాంబే ప్రణాళిక – సర్ అదిషర్దలాల్
డి) జాతీయ ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు – జవహర్లాల్ నెహ్రూ
జ: (బి)
3. భారత పంచవర్ష ప్రణాళికలకు ఏ దేశం మార్గదర్శి?
ఎ) రష్యా బి) బ్రిటన్ సి) అమెరికా డి) ఫ్రాన్స్
జ: (ఎ)
4. భారత ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1948 బి) 1949 సి) 1950 డి) 1951
జ: (సి)
5. జాతీయ అభివృద్ధి మండలి సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు?
ఎ) కేంద్ర ప్రణాళికశాఖా మంత్రి బి) కేంద్ర ఆర్థికశాఖా మంత్రి సి) ప్రధానమంత్రి డి) భారత రాష్ట్రపతి
జ: (సి)
6. నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం?
ఎ) సమాఖ్య స్ఫూర్తి బి) పాలనలో పారదర్శకత సి) వివిధ ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించడం డి) పైవన్నీ
జ: (డి)
7. నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు ఎవరు?
ఎ) సింధూశ్రీ ఖుల్లర్ బి) అరవింద్ పనగరియ సి) బిబేక్ దెబ్రాయ్ డి) వి.కె.సారస్వత్
జ: (బి)
Leave a Reply