APPSC | TSPSC Group II Paper I భారతదేశ చరిత్ర – బ్రిటిష్ హయాంలో శిస్తు విధానాలు
* అన్నదాతకు దక్కని వ్యవ’సాయం’
బ్రిటిష్ హయాంలో అమలు చేసిన భూమిశిస్తు విధానాలు భారత రైతుల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేశాయి. వ్యవసాయమే ప్రజల ప్రధాన జీవనాధారమైన రోజుల్లో.. ఆంగ్లేయుల శిస్తు విధానాలు గ్రామీణ వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్నే చూపాయి. భారత్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో 3 రకాల శిస్తు విధానాలు అమలు చేయగా.. కొద్దో గొప్పో రైతులకు భూ యాజమాన్య హక్కులను కల్పించడం మినహా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఏ విధానమూ దోహదపడలేదు. జమీందార్లకు, బ్రిటిషర్లకు మాత్రం సంపద వనరులుగా ఆ విధానాలు మారాయి. బ్రిటిష్ కాలంలోని భూమిశిస్తు విధానాలు, వాటి ప్రభావ ఫలితాలపై అధ్యయన సమాచారం టీఎస్పీఎస్సీ అభ్యర్థుల కోసం..
- బ్రిటిష్‌వారు రాక ముందు భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయాధారితం. నాటి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే. వస్త్రాలు, పంచదార, నూనె పరిశ్రమలు వ్యవసాయంపై ఆధారపడి ఉండేవి. బ్రిటిష్ పాలన ప్రారంభమైన 50 సంవత్సరాలకే భూయాజమాన్యం, భూమిశిస్తు మదింపు – వసూలు పద్ధతులు స్వయం సమృద్ధిగా ఉన్న భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి.జమీందారీ / శాశ్వత శిస్తు విధానం
- ఈ విధానాన్ని బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి డివిజన్, ఉత్తర కర్ణాటకల్లో అమలు చేశారు. బ్రిటిష్ ఇండియా మొత్తం భూభాగంలో ఈ విధానం 19 శాతం అమలైంది. ఈ పద్ధతిలో బ్రిటిష్ ప్రభుత్వం జమీందారులనే ఒక కొత్త తరగతిని సృష్టించి వారిని భూయజమానులుగా ప్రకటించింది. వారు భూమి శిస్తును వసూలు చేసి, అందులో 1/10 నుంచి 1/11వ వంతు తమ వాటాగా తీసుకుని, మిగిలిన మొత్తాన్ని కంపెనీ ప్రభుత్వానికి అందజేయాలి. ఈ విధానంలో జమీందారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన భూమిశిస్తును నిర్ణయించారు. అయితే జమీందారులు కౌలు రైతుల నుంచి వసూలు చేసే భాటక రేటును మాత్రం నిర్ణయించలేదు. దీన్ని జమీందారుల ఇష్టానికే వదలిపెట్టారు. ఈ నిర్ణయం జమీందారులు రైతులను వీలైనంత ఎక్కువగా దోచుకోవడానికి అవకాశం కల్పించింది. జనాభా, వ్యవసాయ భూమి, ధరలు పెరగడంతో జమీందారుల పరిస్థితి మెరుగుపడింది. కొత్త జమీందారుల్లో ఎక్కువమంది పాత భూయాజమాన్య తరగతికి చెందినవారు కారు. పాత జమీందారులను మోసగించిన సేవకులు, కంపెనీ ప్రభుత్వంతో సంబంధమున్న ఏజెంట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లోని గుమస్తాలు, వ్యాపారులు, న్యాయవాదులు లాంటివారంతా జమీందారులుగా మారారు.
- ఈ విధానంలో జమీందారులు ప్రభుత్వానికి నిర్ణీత భూమిశిస్తును క్రమం తప్పకుండా చెల్లించాలి. జమీందారులు చెల్లించాల్సిన శిస్తును పెంచే అధికారం ప్రభుత్వానికి లేదు. అలాగే ఈ శిస్తు చెల్లింపులో ఎలాంటి మినహాయింపు లేదా వాయిదా వేయడానికి అవకాశం లేదు. ఈ చర్యలు.. భూస్వాములు బీడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చి ఉత్పత్తిని పెంచడానికి, ప్రభుత్వానికి శాశ్వత ఆదాయాన్ని సమకూర్చడానికి దోహదపడతాయని కారన్ వాలీస్ వాదించాడు. అయితే జమీందారుల వారసత్వ హోదాను అంగీకరించడం ద్వారా వ్యవసాయదారుల ప్రయోజనాలను పూర్తిగా పక్కకు నెట్టేశారు. భూస్వాముల దయాదాక్షిణ్యాలపై రైతులు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- కారన్ వాలీస్ అభిప్రాయాలను అతడి సలహాదారులైన జాన్ షోర్, చార్లెస్ గ్రాంట్ లాంటివారు వ్యతిరేకించారు. భూమిశిస్తు మదింపునకు ముందు సమగ్ర సర్వే చేపట్టాలని షోర్ భావించాడు. కారన్ వాలీస్ తర్వాత గవర్నర్ జనరల్ అయిన షోర్ శాశ్వత శిస్తు విధాన మొదటి దశ ఫలితాలకు సాక్షిగా నిలిచాడు. జమీందారులు భూమి నుంచి వచ్చే ఆదాయంలో అధిక భాగం అనుభవించడంతో.. కౌలుదారుల ఆర్థిక పరిస్థితి దిగజారింది. వారు పేదరికంతో సతమతమయ్యారు. సరైన ఎరువులు, విత్తనాలు వాడకపోవడంతో వ్యవసాయం దెబ్బతింది. జాతీయవాదులతోపాటు, బ్రిటిష్ విద్యావేత్తలు జమీందారీ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ దుస్థితిని, కౌలు రైతుల పేదరికాన్ని గుర్తించారు.
రైత్వారీ విధానం
- బ్రిటిష్‌వారు ప్రవేశపెట్టిన మరో భూమిశిస్తు విధానం రైత్వారీ విధానం. ఈ పద్ధతిని థామస్ మన్రో, కెప్టెన్ రీగ్ మొదట తమిళనాడులో ప్రవేశపెట్టారు. నెమ్మదిగా ఈ విధానం మహారాష్ట్ర, తూర్పు బెంగాల్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కూర్గ్‌లకు విస్తరించింది. ఈ విధానంలో రైతులకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించారు. వారు నేరుగా ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లించాలి. ఈ విధంగా రైతులకు యాజమాన్య హక్కులు లభించాయి. భూమిని కొలిచి ఉత్పత్తిని అంచనా వేయడం, ఉత్పత్తిలో 55 శాతాన్ని ప్రభుత్వ డిమాండ్‌గా నిర్ణయించడం ఈ విధానంలో ప్రధాన లక్షణాలు. ఈ విధానం కూడా క్షేత్రస్థాయిలో రైతులను అనేక ఇబ్బందులకు గురిచేసింది. రైత్వారీ విధానంలో జమీందారులకు బదులు రైతే భూమి యజమాని అయినప్పటికీ.. రైతు పరిస్థితిని మెరుగుపరచడంలో ఈ విధానం విఫలమైంది. ప్రభుత్వం రైతుల నుంచి శిస్తు రూపంలో అధికంగా వసూలు చేయడంతో భూమి విలువ పడిపోయింది. కఠిన భూమిశిస్తు విధానం వల్ల రైతులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు. వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేయడంతో రైతులు అప్పుపై వడ్డీ మాత్రం అతి కష్టం మీద చెల్లించేవారు.
ప్రధాన లక్ష్యాలు: క్రమం తప్పకుండా భూమిశిస్తు వసూలు చేయడం, రైతుల పరిస్థితిని మెరుగుపరచడం అనేవి ప్రధాన లక్ష్యాలు. అయితే రైతుల ఆర్థిక పరిస్థితి మారలేదు. రైతు భూమిశిస్తు చెల్లించినంత కాలం అతడిని తొలగించడానికి వీల్లేదన్నది ఈ విధానంలోని ఒక నిబంధన. అయితే అధిక భూమిశిస్తును చెల్లించడం రైతుకు ఇబ్బందికరంగా మారింది. థామస్ మన్రో భూమిశిస్తుగా నిర్ణీత మొత్తాన్ని వసూలు చేసి.. అదనంగా వచ్చే ఆదాయం రైతుకే చెందాలని భావించాడు. 1855 తర్వాత రెవెన్యూ అధికారులు భూమిశిస్తును తమ ఇష్టానుసారం నిర్ణయించారు. దీంతో వ్యవసాయ దిగుబడి తగ్గింది. వ్యవసాయదారులు అప్పుల పాలయ్యారు.
మహల్వారీ విధానం
- జమీందారీ, రైత్వారీ విధానాలు పాలకుల అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో.. వాటి స్థానంలో మహల్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ విధానంలో భూమిశిస్తు మదింపునకు ఆధారం మహల్ లేదా ఎస్టేట్ నుంచి వచ్చే ఉత్పత్తి. ఈ మహల్‌లోని యజమానులంతా సంయుక్తంగా ప్రభుత్వానికి భూమిశిస్తు చెల్లించడానికి బాధ్యత వహించాలి. యజమానుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఎంపిక చేసిన వారి ప్రతినిధులు మహల్ నిర్వహణ, శిస్తు చెల్లింపునకు బాధ్యులుగా ఉంటారు. ఇందులో యాజమాన్య హక్కులు రైతులకు వ్యక్తిగతంగా ఉంటాయి. కానీ ప్రభుత్వానికి శిస్తు చెల్లించే బాధ్యత మాత్రం రైతులందరికీ సంయుక్తంగా ఉంటుంది. గ్రామం మొత్తం ఆ గ్రామపెద్ద ద్వారా భూమి శిస్తును చెల్లిస్తారు. ఈ విధానాన్ని మొదట ఆగ్రా, అవధ్‌లో ప్రవేశపెట్టారు. తర్వాత యునైటెడ్ ప్రావిన్స్‌లోని మిగతా ప్రాంతాలకు విస్తరించారు.
- ఈ పద్ధతిలో.. జమీందారీ విధానంలో మాదిరిగా ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం సమకూరుతుంది. అలాగే రైత్వారీ విధానంలో మాదిరిగా రైతుకు, ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి, రైతుకు మధ్య లంబార్దార్ల(మధ్యవర్తులు)ను సృష్టించినా వీరికి బెంగాల్ జమీందారుల్లా పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వలేదు. అయితే అమల్లో ఈ విధానం కూడా పెద్ద రైతులకే మేలు చేసింది. దీంతో భూస్వాములు, రైతుల మధ్య సాంఘిక, ఆర్థిక అసమానతలు పెరిగాయి. రైతుల పరిస్థితి ఆర్థికంగా బాగా దిగజారింది. రైతుల నుంచి శిస్తు ఎక్కువగా వసూలు చేశారు. దీనివల్ల వ్యవసాయం అభివృద్ధి చెందలేదు. ఇది తాత్కాలిక విధానం కావడం వల్ల స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. చివరకు ఈ విధానం గ్రామీణ సమూహాలు విచ్ఛిన్నం కావడానికి కారణమైంది.
శిస్తు విధాన ఫలితాలు
- ఈ శిస్తు విధానాలు బ్రిటిష్‌వారు సృష్టించిన భూస్వాములకు శిస్తు వసూలు అధికారాన్ని కట్టబెట్టడానికి ఎక్కువ శ్రద్ధ చూపాయి. ఈ భూస్వాములు వ్యవసాయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వీరు విదేశీ పాలకుల ఏజెంట్లుగా వ్యవహరించారు. ప్రభుత్వానికి నిర్ణీత భూమిశిస్తును చెల్లించి రాజకీయంగా రక్షణ లేని, ఆర్థికంగా బలహీనులైన రైతులను దోచుకునే హక్కును పొందారు. నూతన సామాజిక తరగతులకు చెందిన భూస్వాములు, వర్తకులు, వడ్డీ వ్యాపారులకు ప్రాధాన్యం పెరిగింది. బ్రిటిష్ రెవెన్యూ విధానం 19వ శతాబ్దంలో వాణిజ్య పరమైన వ్యవసాయాన్ని పెంపొందించింది. దేశంలో జనాభా క్రమంగా పెరిగింది. దీనివల్ల భూమి మీద ఒత్తిడి పెరిగింది. కుటీర పరిశ్రమలు నాశనం కావడం కూడా దీనికి తోడైంది. బలమైన చట్టాలను ప్రవేశపెట్టడం, న్యాయస్థానాల ఏర్పాటు, కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడటం, బ్రిటిష్ వస్తువుల దిగుమతులు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో బయటి వ్యక్తుల జోక్యం బాగా పెరిగింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వయం సమృద్ధి క్రమంగా కనుమరుగైంది. గ్రామాల్లో అధికారం క్రమంగా గ్రామపెద్దల నుంచి ప్రభుత్వ ఏజెంట్ల చేతిలోకి మారింది. బ్రిటిష్‌వారి నూతన భూమిశిస్తు విధానాలు రైతులు పండించే పంట రకాలపై ప్రభావం చూపాయి. బ్రిటిష్‌వారు రాకముందు రైతులు పండించిన పంటను తమ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత భూమిశిస్తును నగదు రూపంలో చెల్లించాల్సి వచ్చింది. దీంతో రైతులు పంటను మార్కెట్లో విక్రయించి, వచ్చిన డబ్బుతో శిస్తు చెల్లించడం ప్రారంభించారు. గ్రామాల్లో రైతులు తమ భూమిలో పండించడానికి అనువైన ఏదో ఒక పంటను ఎన్నుకునేవారు. వీటిలో పత్తి, జనుము, గోధుమ, చెరకు, నూనెగింజలు, నీలిమందు, నల్లమందు మొదలైనవి ప్రధానంగా ఉండేవి. దీంతో భారతీయ రైతు అంతర్జాతీయ పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి దళారులపై ఆధారపడాల్సి వచ్చింది.
జమీందారీ విధానం
- రాబర్ట్ క్లైవ్ 1765లో బెంగాల్లో దివానీ (రెవెన్యూ వసూలు) హక్కును పొందిన తర్వాత.. సంవత్సరానికి ఒకసారి భూమిశిస్తు నిర్ణయించే పద్ధతి అమల్లో ఉండేది. వారన్ హేస్టింగ్స్ దీన్ని 5 సంవత్సరాలకు మార్చాడు. అయితే మళ్లీ సంవత్సరానికి ఒకసారి నిర్ణయించే పద్ధతినే అనుసరించాడు. కారన్ వాలీస్ కాలంలో 1790, ఫిబ్రవరి 10న పది సంవత్సరాలకు ఒకసారి భూమిశిస్తును నిర్ణయించే విధానాన్ని ప్రకటించాడు. మూడేళ్ల తర్వాత ఈ విధానాన్ని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించారు. తర్వాత దీన్నే 1793, మార్చి 22న ‘శాశ్వత శిస్తు నిర్ణయ విధానం’గా ప్రకటించారు. ఈ పద్ధతిని మొదట బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో ప్రవేశపెట్టారు. శాశ్వత శిస్తు నిర్ణయాన్ని జమీందారులతో చేసుకోవడం వల్ల దీనికి ‘జమీందారీ విధానం’ అనే పేరు వచ్చింది. ఈ విధానంలో ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందారులను భూయజమానులుగా గుర్తించి, భూమిశిస్తు వసూలు చేసే అధికారాన్ని వారికి శాశ్వతంగా కట్టబెట్టింది.
Leave a Reply