APPSC | TSPSC Group II Paper I భారతదేశ చరిత్ర – ఐరోపావారి రాక
చరిత్ర చదువుతున్న కొద్దీ ఆసక్తికరంగా ఉంటుంది. చారిత్రక పరిణామాలన్నీ ఒక క్రమపద్ధతిలో అధ్యయనం చేయడం ద్వారా సులువుగా అర్థం చేసుకోవడంతోపాటు, పరీక్షల్లో మంచి స్కోరింగ్ కూడా సాధించవచ్చు. ఆధునిక భారత దేశ చరిత్రలో అత్యంత ప్రధాన ఘట్టాల్లో ఐరోపావారి రాక ఒకటి. పోర్చుగీసువారు, డచ్చివారు, ఆంగ్లేయులు, ఫ్రెంచివారు… ఈ నలుగురి రాకతో భారతదేశంలో ఎన్నో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తురుష్కులు క్రీ.శ. 1453లో కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించడంతో పాశ్చాత్యులు తూర్పు దేశాలకు సముద్ర మార్గాన్ని అన్వేషించాల్సి వచ్చింది. పోర్చుగల్‌కు చెందిన ప్రిన్స్ హెన్రీ నూతన సముద్ర మార్గాలను అన్వేషించడం ప్రారంభించాడు. అదే దేశానికి చెందిన బార్తులో మ్యుడియాజ్ 1487లో అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించి ఆఫ్రికాలోని గుడ్‌హోప్ ఆగ్రం చేరుకున్నాడు.
వాస్కోడిగామా 1498, మే 21న మలబార్ తీరంలోని కాలికట్ నగరాన్ని చేరుకున్నాడు. ఈ సంఘటన భారతదేశంలో ఐరోపావారికి వర్తక కార్యకలాపాలు విస్తరించడానికి మాత్రమే కాకుండా ఇంగ్లండ్ అధిపత్యానికి కూడా దారితీసింది.
కాలికట్కు చెందిన హిందూ రాజు జమోరిన్ వాస్కోడిగామాను సాదరంగా ఆహ్వానించాడు. కాలికట్ ఆ రోజుల్లో సుసంపన్న రాజ్యంగా ఉండేది. జమోరిన్ అన్ని తరగతుల వర్తకుల పట్ల దయ కలిగి ఉండేవాడు. అందరిపట్ల సహనం చూపిస్తూ వ్యాపార విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. మలబార్ తీరంలోని ఓడరేవులు అన్నింటిలో కొచ్చిన్ ఉత్తమమైంది. ఈ ఓడరేవు మిరియాలను ఉత్పత్తి చేసే జిల్లాలతో అనుసంధానమై ఉండేది. కాలికట్ పాలకుడు జమోరిన్‌కు సామంతుడిగా ఉండేవాడు. వాస్కోడిగామా తూర్పు ఆఫ్రికాకు చెందిన అరబ్బు వర్తకుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. వాస్కోడిగామా 1499లో పోర్చుగల్‌కు తిరిగి వెళ్లాడు. వాస్కోడిగామా తర్వాత క్రీ.శ.1500లో అల్యరెజ్ కాబ్రల్ భారతదేశానికి వచ్చాడు. ఇతడు అరబ్బులకు చెందిన నౌకను స్వాధీనం చేసుకుని జమోరిన్‌కు బహుమతిగా ఇచ్చాడు.
కాబ్రల్ కాలంలో అరబ్బులు పోర్చుగీసు వర్తక స్థావరాన్ని ధ్వంసం చేశారు. ఇతడికి కన్ననూరు, కొచ్చిన్ పాలకుల మద్దతు లభించింది. 1502లో వాస్కోడిగామా రెండోసారి భారతదేశానికి వచ్చాడు. వాస్కోడిగామా ముస్లింలందరినీ కాలికట్ నుంచి తరిమేయాలని జమోరిన్ను డిమాండు చేశాడు. కొచ్చిన్ పోర్చుగీసు వారి మొదటి రాజధాని.
1505లో ఫ్రాన్సిస్కో డి అల్మైడాను భారతదేశంలో మొదటి పోర్చుగీసు గవర్నరుగా నియమించారు. పోర్చుగీసు వారు దక్షిణభారత దేశంలోని ఓడరేవులపై తమ ఆధిపత్యాన్ని ఉత్తర భారతదేశ ఓడరేవులపైకి విస్తరిస్తారని బీజాపూర్, గోల్కొండ సుల్తానులు భయపడ్డారు. దీంతో ఈజిప్టు, టర్కీ, గుజరాత్ పోర్చుగీసువారికి వ్యతిరేకంగా ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అల్మైడా 1508లో జరిగిన చౌల్ యుద్ధంలో ఈజిప్టు, టర్కీ, గుజరాత్ పాలకుల కూటమి చేతిలో ఓడిపోయాడు. ఈ యుద్ధంలో అల్మైడా కుమారుడు కూడా మరణించాడు. అల్మైడా 1509 లో ఈ కూటమిని డయ్యూ యుద్ధంలో ఓడించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు.
1509లో అల్బూకర్క్ను గవర్నర్‌గా నియమించారు. పర్షియన్ సింధుశాఖ ఎర్రసముద్రంపై నియంత్రణ కలిగి ఉండటం, పోర్చుగీసు వారి ప్రధాన స్థావరాన్ని పశ్చిమ తీరం మధ్య భాగంలో ఏర్పాటు చేయడం, మలయ ద్వీపకల్పంలో అరబ్బుల వర్తకాన్ని ధ్వంసం చేయడం అల్బూకర్క్ తన లక్ష్యంగా చేసుకున్నాడు. అల్బూకర్క్ బీజపూర్ సుల్తాన్ అదిల్ షా నుంచి 1510లో గోవాను ఆక్రమించాడు. గోవా మలబార్ తీరంలోని ఓడరేవులకు, గుజరాత్‌కు మధ్యలో ఉంది. కాంబే సింధుశాఖ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఓడరేవుల్లో గోవా ప్రముఖ ఓడరేవుగా ఉంది. అల్బూకర్క్ అల్మైడా లక్ష్యాలను సాధించడంలో కృతకృత్యుడయ్యాడు. ఇతడు భారతదేశంలో స్థిరపడిన పోర్చుగీసువారు భారతీయ స్త్రీలను వివాహమాడేలా ప్రోత్సహించాడు. తన కాలంలో విజయనగర రాజులతో స్నేహ సంబంధాలు కొనసాగించాడు.
1529లో గవర్నర్‌గా నియమితుడైన నునోడ కన్హాగుజరాత్ సుల్తాన్ బహదూర్షా నుంచి డయ్యూను ఆక్రమించాడు. ఇతడి కాలంలో చెన్నై దగ్గర శాన్థోమ్, బెంగాల్‌లోని హుగ్లీ వద్ద వర్తక స్థావరాలను ఏర్పాటుచేశారు.
భారతదేశంలో చివరి గొప్ప పోర్చుగీసు గవర్నరు డికాస్ట్రో. ఇతడి కాలంలో పోర్చుగీసువారి రాజధాని కొచ్చిన్ నుంచి గోవాకు మారింది. ప్రసిద్ధి చెందిన క్రైస్తవమత ప్రచారకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ 1542లో గోవాకు వచ్చాడు.
పోర్చుగీసు వారి పతనం: క్రీ.శ.16వ శతాబ్దం చివరి నాటికి పోర్చుగీసు వారి పతనం ప్రారంభమైంది. వారు భారతదేశంలో వర్తక స్థావరాలను క్రమంగా కోల్పోయారు. క్రీ.శ.1631లో హుగ్లీ మొగలుల వశమైంది. క్రీ.శ.1661లో పోర్చుగల్ రాజు తన సోదరిని వివాహం చేసుకున్న ఇంగ్లండ్ రాజు రెండో చార్లెస్‌కు కట్నం కింద బొంబాయిని ఇచ్చాడు. 1739లో మరాఠాలు సాల్శెట్టి, బుస్సైన్లను ఆక్రమించారు. చివరికి పోర్చుగీసు వారికి భారతదేశంలో గోవా, డయ్యూ, డామన్ మాత్రమే మిగిలాయి.
పోర్చుగీసువారి పతనానికి కారణాలు:
* 1580లో పోర్చుగల్ స్పెయిన్ వశమైంది. స్పెయిన్ రాజు రెండో ఫిలిప్ భారతదేశంలో పోర్చుగీసు భూభాగాలపై శ్రద్ధ వహించలేదు.
* స్పెయిన్ రాజు పోర్చుగల్‌ను ఖరీదైన ఐరోపా యుద్ధాల్లో భాగస్వామిని చేశాడు.
* పోర్చుగల్ చిన్న దేశం కాబట్టి సుదూర వలసలను నిర్వహించడానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చలేకపోయింది. పోర్చుగీసువారు పటిష్టమైన పరిపాలన విధానాన్ని రూపొందించడంలో విఫలమయ్యారు.
* హుగ్లీలోని పోర్చుగీసు వారి స్థావరాన్ని మొగలులు ధ్వంసం చేశారు.
* చిట్టగాంగ్‌ను మొగలులు ఆక్రమించడంతో బెంగాలులో పోర్చుగీసు వారి ప్రాబల్యం అంతమైంది.
* పోర్చుగీసు వారి పరమత ద్వేషం, వారి పరిపాలనలో అవినీతి.
* ఇంగ్లిష్, ఫ్రెంచి, డచ్చి వర్తక కంపెనీల విజృంభణ.
డచ్చివారు
క్రీ.శ.1602లో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ నెదర్లాండ్స్ ఏర్పాటైంది. ఈ కంపెనీకి భారత్‌లో వ్యాపారం చేయడానికి, యుద్ధాలు చేయడానికి, భూభాగాలు ఆక్రమించడానికి, సంధి కుదుర్చుకోవడానికి, కోటలు నిర్మించడానికి అనుమతి లభించింది.
డచ్చివారు మొదటి శాశ్వత వర్తక స్థావరాన్ని 1605లో మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. చంద్రగిరి రాజు నుంచి అనుమతి పొంది 1610లో పులికాట్లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. 1617 నుంచి పులికాట్ డచ్చివారి ప్రధాన కేంద్రమైంది. తర్వాత బొంబాయి, అహ్మదాబాద్, బుర్హాన్పూర్, బ్రోచ్లలో స్థావరాలను ఏర్పాటు చేశారు. బెంగాల్లో మొదటి డచ్చి స్థావరాన్ని పిప్లిలో స్థాపించారు.
పోర్చుగీసువారిని భారతదేశ సముద్ర వ్యాపారం నుంచి తప్పించిన ఘనత డచ్చివారికే దక్కింది. భారతీయ వస్త్రాల ఎగుమతిని పెంపొందించడంలో డచ్చివారు ప్రముఖ పాత్ర వహించారు. దేవానాంపట్నంలోని డచ్చివారి స్థావరం ఆంగ్లేయుల కాలంలో సెయింట్ డేవిడ్ కోటగా ప్రసిద్ధి చెందింది.
పతనానికి కారణాలు
* డచ్చివారికి వ్యతిరేకంగా ఆంగ్లేయుల నౌకాబలం అభివృద్ధి.
* డచ్చివారి కేంద్రీకృత అధికార విధానం.
* డచ్చివారికి భారతదేశంలో ప్రధాన కేంద్రం లేకపోవడం.
* కంపెనీ అధికారుల్లో అవినీతి పెరగడం.
* 1623లో అంబోయినా వద్ద ఆంగ్లేయులపై దురాగతం.
స్వాతంత్య్రోద్యమం ప్రత్యేకాంశంగా ఆధునిక భారతదేశ చరిత్ర!
ఆంగ్లేయులు
మొదటి ఎలిజబెత్ పాలన చివరి నాటికి భారతదేశంలో వర్తకం చేసుకునేందుకు కంపెనీకి ఎలిజబెత్ 15 ఏళ్లపాటు అనుమతిచ్చింది. దీనికి సంబంధించిన చార్టరును 1600 సంవత్సరం డిసెంబరు 31న జారీ చేశారు. ప్రారంభంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సుగంధద్రవ్యాలు, మిరియాల వ్యాపారంపై దృష్టిపెట్టింది. మొదటి జేమ్స్ కాలంలో విలియం హాకిన్స్ జహంగీర్ ఆస్థానానికి వచ్చి 1608 నుంచి 1611 వరకు అక్కడే ఉన్నాడు. మిడిల్టన్ సూరత్‌లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడానికి 1611లో మొదటిసారిగా అనుమతి పొందాడు. సర్ జేమ్స్ థామస్ రో గుజరాత్లో కంపెనీ వ్యాపారం చేసుకోవడానికి 1611లో జహంగీర్ నుంచి అనుమతి పొందడంలో సఫలీకృతుడయ్యాడు.
మొగలులతో విరోధం: 1688లో ఎర్రసముద్రంలో మొగలులకు చెందిన కొన్ని నౌకలను సముద్రపు దొంగలు ఆక్రమించారు. దీంతో సూరత్‌లోని మొగల్ గవర్నరు కంపెనీ అధికారి సర్ జాన్ చైల్డ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఆంగ్లేయులను విరోధులుగా గుర్తించాలని ప్రకటన జారీ చేశాడు. అనేకమంది ఆంగ్లేయులను నిర్బంధించి అవమానించాడు. దీంతో సర్ జాన్ చైల్డ్ మొగలులతో సంధికి అంగీకరించాడు. ఈ సంధి ప్రకారం ఆంగ్లేయులు మొగలులకు చెల్లించాల్సిన బకాయిలను, మొగలులకు జరిగిన నష్టానికి పరిహారాన్ని చెల్లించాలి. సంధి షరతుల్లో భాగంగా జాన్ చైల్డ్ భారతదేశం వదలి వెళ్లాలి.
వర్తక స్థావరాల ఏర్పాటు
పశ్చిమ తీరం: ఆంగ్లేయులు 1619 నాటికి ఆగ్రా, అహ్మదాబాద్, బరోడా, బొంబాయిల్లో వర్తక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఇవి సూరత్ నియంత్రణలో ఉండేవి. 1668లో రెండో చార్లెస్ నుంచి బొంబాయిని కంపెనీ లీజుకు తీసుకుంది. గెరాల్డ్ ఆంగియర్ 1669 నుంచి 1677 వరకు మొదటి గవర్నర్‌గా పనిచేశాడు. 1687లో పశ్చిమ తీర ప్రధాన కేంద్రాన్ని సూరత్ నుంచి బొంబాయికి మార్చారు.
ఆగ్నేయ తీరం: మచిలీపట్నంలో పులికాట్ దగ్గర ఆర్మగాంవ్లో స్థావరాలను నెలకొల్పారు. 1639లో ఫ్రాన్సిస్ డే చంద్రగిరి రాజు నుంచి మద్రాసును కొనుగోలు చేశాక అక్కడ సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. దీని తర్వాత తూర్పు తీర ప్రధాన కేంద్రాన్ని మచిలీపట్నం నుంచి మద్రాసుకు మార్చారు. 1658లో తూర్పు తీరంలోని అన్ని స్థావరాలను (బెంగాల్, బీహార్, ఒరిస్సా) సెయింట్ జార్జ్ కోట ఆధీనంలో ఉంచారు.
తూర్పు ఇండియా: బెంగాల్, ఒరిస్సాలోని హరిహరపూర్, బాలాసోర్, హుగ్లీ, పాట్నా, ఢాకా, ఖాసింబజార్లలో స్థావరాలను స్థాపించారు. 1690లో జాబ్ చార్నాక్ సుతనుతి వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. 1689లో సుతనుతి, కాలికట, గోవిందపూర్ గ్రామాల జమిందారీ హక్కులను ఈస్ట్ ఇండియా కంపెనీ పొందింది. తర్వాత ఈ మూడు గ్రామాలను కలిపి కలకత్తా నగరంగా అభివృద్ధి చేశారు. సుతనుతి వద్ద విలియం కోటను నిర్మించారు. 1700లో బెంగాల్, బీహార్, ఒరిస్సాలలోని స్థావరాలను విలియం కోట ఆధీనంలోకి తీసుకువచ్చారు.
ఫ్రెంచివారు
ఫ్రెంచి చక్రవర్తి పద్నాలుగో లూయీ తన మంత్రి కోల్బర్ట్ ప్రోత్సాహంతో 1664లో ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించాడు. ఇంగ్లిష్ కంపెనీ ప్రైవేటుది కాగా ఫ్రెంచి కంపెనీ ప్రభుత్వానికి చెందింది. 1667లో సూరత్‌లోని ఫ్రాంకోయిస్ కారన్ మొదటి ఫ్రెంచి వర్తక స్థావరాన్ని స్థాపించాడు. వలికొండాపురం గవర్నరైన షేర్‌ఖాన్ లోడి నుంచి ఫ్రాంకోయిస్ మార్టిన్ పాండిచ్చేరిని పొందాడు. 1690లో బెంగాల్‌లోని చంద్రనగర్‌ను మొగల్ గవర్నరు నుంచి పొందాడు.
ఫ్రాంకోయిస్ మార్టిన్ భారతదేశంలో మొదటి ఫ్రెంచి డైరెక్టర్ జనరల్‌గా నియమితుడయ్యాడు. పాండిచ్చేరిలో లూయిస్ కోటను నిర్మించాడు. క్రీ.శ.1706-1720 మధ్య భారత్‌లో ఫ్రెంచివారి అధికారం క్షీణించింది. దీంతో 1720లో ఫ్రెంచి కంపెనీని పునర్వ్యవస్థీకరించారు. లెనాయిడ్, డ్యూమాస్ క్రీ.శ.1720-1742 మధ్య తిరిగి ఫ్రెంచివారి అధికారాన్ని పునరుద్ధరించారు. వీరు మలబారు తీరంలోని మహే, కోరమాండల్ తీరంలోని యానాం, తమిళనాడులో కరైకాల్ను ఆక్రమించారు.
1742లో ఫ్రెంచి గవర్నర్‌గా డూప్లేను నియమించడంతో ప్రారంభమైన ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధాలు ఫ్రెంచివారి ఓటమితో ముగిశాయి.
Leave a Reply