APPSC | TSPSC Group II Paper I భారతదేశ చరిత్ర – మరాఠా యుద్ధాలు
Contents
మొగలు సామ్రాజ్య పతన దశలో మరాఠాల రాజ్యం వచ్చింది. తదనంతరం మరాఠాలను అణచివేసి ఆంగ్లేయులు పాలనకు వచ్చారు. శివాజీ, ఆయన వారసుల తర్వాత కూడా మరాఠాల ప్రాబల్యం పీష్వాల పరిపాలనలో కొనసాగింది. అందుకే పీష్వా వంశస్థాపకుడైన బాలాజీ విశ్వనాథ్‌ను ‘మహారాష్ట్ర సామ్రాజ్య ద్వితీయ స్థాపకుడు’ అని పిలిచారు. ఆధునిక భారతదేశ చరిత్రలో మరాఠాల అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు పీష్వాల గురించి తెలుసుకోవాలి. వారు తమ పాలన కాలంలో అనేక యుద్ధాలు చేశారు. ఈ పోరాటాలు, ఇతర పరిణామాల ఫలితంగా మరాఠా రాజ్యం ఏవిధంగా అంతరించి ఆంగ్లేయుల సామ్రాజ్యంలో విలీనమైందో అర్ధం చేసుకోవాలి.బాలాజీ విశ్వనాథ్ (1713-20)
- బాలాజీ విశ్వనాథ్ కొంకణస్థ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతడి పూర్వికులు జంజీర రాష్ట్రంలోని శ్రీవర్థన్ ప్రాంతానికి వారసత్వంగా దేశ్ముఖ్లుగా వ్యవహరించేవారు. బాలాజీ విశ్వనాథ్ చిన్న రెవెన్యూ అధికారిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. 1708లో సాహు ఇతడిని సేనాకార్తె పదవిలో, ఆ తర్వాత 1713లో పీష్వాగా నియమించాడు. ఇతడి కాలం నుంచి పీష్వా పదవి వారసత్వంగా మారింది. ఇతడు సాహు, తారాబాయికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో మరాఠా సర్దార్లను సాహు వైపు తిప్పుకోవడం ద్వారా… సాహు విజయంలో ప్రముఖ పాత్ర వహించాడు. బాలాజీ విశ్వనాథ్ 1719లో సయ్యద్ సోదరులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫలితంగా అప్పటి మొగల్ చక్రవర్తి ఫరూక్ సియార్.. సాహును స్వరాజ్యానికి రాజుగా గుర్తించడమే కాకుండా, అతడి కుటుంబ సభ్యులందరినీ మొగలుల చెర నుంచి విడిపించాడు. అలాగే దక్కనులోని 6 మొగల్ రాష్ట్రాల నుంచి చౌత్, సర్దేశ్ముఖ్ పన్నులను వసూలు చేసుకునే అధికారం సాహుకు దక్కింది.
మొదటి బాజీరావు (1720-40)
- బాలాజీ విశ్వనాథ్ పెద్ద కుమారుడైన బాజీరావును 20 సంవత్సరాల వయసులోనే పీష్వాగా నియమించారు. శివాజీ తర్వాత గెరిల్లా యుద్ధ నైపుణ్యాలను పెంపొందించిన వ్యక్తిగా బాజీరావు ప్రసిద్ధి చెందాడు. ఇతడి కాలంలో మరాఠాల అధికారం తారస్థాయికి చేరుకుంది. ఇతడి కాలంలోనే మరాఠా కూటమికి బీజాలు పడ్డాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని అనేక మరాఠా కుటుంబాలు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాయి. వారిలో గైక్వాడ్‌లు (బరోడా), భోంస్లేలు (నాగ్‌పూర్), హోల్కార్లు (ఇండోర్) సింధియాలు (గ్వాలియర్), పీష్వాలు (పుణే) ముఖ్యులు.
- జంజీరాకు చెందిన సిద్ధీలను ఓడించిన తర్వాత, ఇతడు పోర్చుగీసు వారి నుంచి బస్సైన్, సాల్సెట్టి ప్రాంతాలను ఆక్రమించాడు. ఇతడు నిజాం ఉల్‌ముల్క్‌ను భోపాల్ వద్ద ఓడించి, అతడితో ‘దురాయ్ సరాయ్ సంధి’ చేసుకున్నాడు. దీని ద్వారా నిజాం నుంచి మాళ్వా, బుందేల్‌ఖండ్‌లను పొందాడు. ఉత్తర భారతదేశంపై అనేక దండయాత్రలు చేయడం ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచి, భారతదేశంలో మరాఠాల అధికారాన్ని స్థాపించాడు.
* మొగలుల గురించి ప్రస్తావిస్తూ బాజీరావు ఇలా వ్యాఖ్యానించాడు ‘ఎండిన చెట్టును కాండం దగ్గర నరికితే, కొమ్మలు వాటంతట అవే పడిపోతాయి’. - బాజీరావు గొప్ప సైనికుడే కాకుండా దౌత్యవేత్త, సామ్రాజ్య స్థాపకుడు. పీష్వాగా ఉన్న 20 సంవత్సరాల్లో నిరంతరం యుద్ధాలు చేస్తూ విజయాలు సాధించాడు. మొగలులతో యుద్ధంలో హిందువులైన రాజపుత్రులు, బుందేలులు, జాట్లను తన సహజ మిత్రులుగా గుర్తించి వారి సహకారాన్ని పొందాడు. సవాయ్ జైసింగ్, ఛత్రసాల్‌లతో మైత్రి వల్ల లబ్ది పొందాడు.
బాలాజీ బాజీరావు (1740-61)
- ఇతడు నానాసాహెబ్గా ప్రసిద్ధిగాంచాడు. 20 సంవత్సరాల వయసులోనే పీష్వా అయ్యాడు. 1749లో సాహు మరణం తర్వాత రాజ్య వ్యవహారాలన్నీ ఇతడి ఆధీనంలోకి వచ్చాయి. సాహుకు వారసులు లేకపోవడంతో రాజారాం మనవడైన రామరాజను తన వారసుడిగా ప్రకటించాడు. అయితే బాలాజీ బాజీరావు సతారాలో రామరాజను బంధించాడు. 1752లో మొగల్ చక్రవర్తి అహ్మద్ షా, పీష్వా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం పీష్వా.. మొగల్ సామ్రాజ్యాన్ని అంతర్గత, బాహ్య విరోధుల (అహ్మద్ షా అబ్దాలీ) నుంచి కాపాడాలి. దీనికి ప్రతిగా పీష్వా వాయవ్య రాష్ట్రం నుంచి చౌత్‌ను వసూలు చేసుకోవడంతో పాటు ఆగ్రా, అజ్మీర్ రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఈ ఒప్పందం వల్ల మరాఠాలు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అహ్మద్ షా అబ్దాలీతో ప్రత్యక్షంగా యుద్ధం చేయాల్సి వచ్చింది. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ చేతిలో మరాఠాలు ఓడిపోయారు. ఈ వార్త వినడంతో బాలాజీ బాజీరావు 1761, జూన్ 23న మరణించాడు. ఇతడి తర్వాత మాధవరావు, నారాయణరావు, సవాయ్ మాధవరావు, రెండో బాజీరావు పీష్వాలుగా వ్యవహరించారు.
- బాలాజీ బాజీరావు కాలంలో మరాఠా రాజ్యం అత్యున్నత దశకు చేరుకుంది. ఇతడి కాలంలో న్యాయ పరిపాలన మెరుగుపడింది. రెవెన్యూ పరిపాలన పటిష్టమైంది. కలెక్టర్లు ఖాతాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాడు. వర్తకాభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాడు. దేవాలయాల నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చాడు. హోల్కార్లు, సింధియాలు రాజపుత్ర రాజ్యాలపై దాడి చేయడం, రఘునాథరావు జాట్లకు చెందిన కోటను ఆక్రమించడంతో హిందూ రాజులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలన్న ఆశయానికి విఘాతం ఏర్పడింది. పీష్వా ఢిల్లీలో రాజకీయ పరిణామాలకు అనవసర ప్రాధాన్యం ఇవ్వడం, పంజాబులో తీసుకున్న నిర్ణయాలతో అహ్మద్‌షా అబ్దాలీతో విరోధం ఏర్పడింది. ఆంగ్లేయుల సైనిక బలాన్ని, రాజకీయ ఉద్దేశాన్ని పీష్వా సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.
మూడో పానిపట్టు యుద్ధం
- నాదిర్ షా తర్వాత అహ్మద్ షా అబ్దాలీ ఆప్ఘనిస్థాన్ పాలకుడయ్యాడు. మొగలు సామ్రాజ్యం బలహీనమవడంతో అబ్దాలీ కూడా భారతదేశంపై దాడి చేయాలని భావించాడు. 1758లో రఘునాథరావు అహ్మద్ షా అబ్దాలీ కుమారుడు, ఏజెంట్ అయిన తైమూరును పంజాబ్ నుంచి తరిమేశాడు. మరాఠాలు అదీనా బేగ్‌ఖాన్‌ను పంజాబ్ గవర్నరుగా నియమించారు. ఆప్ఘన్ల నుంచి పంజాబ్‌ను మరాఠాలు ఆక్రమించడం ద్వారా అహ్మద్ షా అబ్దాలీకి సవాలు విసిరారు. 1759 చివరి నాటికి అహ్మద్ షా అబ్దాలీ పెద్ద సైన్యంతో సింధు నదిని దాటి పంజాబ్‌ను ఆక్రమించాడు. అబ్దాలీని ఎదుర్కోలేక మరాఠాలు ఢిల్లీకి పారిపోయారు. ఢిల్లీకి పది మైళ్ల దూరంలోని బరారి ఘాట్ వద్ద 1760లో జరిగిన యుద్ధంలో దత్తాజి సింధియా మరణించాడు. జంకోజి సింధియా, మల్హర్ రావ్ హోల్కార్లు కూడా అబ్దాలీని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. దీంతో అబ్దాలీ ఢిల్లీని ఆక్రమించాడు.
- ఉత్తర భారతదేశంలో మరాఠాల అధికారాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశంతో సదాశివరావు భావేను పీష్వా పంపాడు. భావే 1760, ఆగస్టు 22న ఢిల్లీని ఆక్రమించాడు. అబ్దాలీని ఢిల్లీ నుంచి తరిమేయాలని భావే భావించాడు. దీంతో రెండు సేనల మధ్య 1760 నవంబరులో పానిపట్టు వద్ద యుద్ధం జరిగింది. ఇరు సేనలకు ఆహార సరఫరా నిలిచిపోవడంతో శాంతి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇవి ఫలించకపోవడంతో 1761, జనవరి 14న భీకర యుద్ధం జరిగింది. ఇందులో మరాఠాలు ఓడిపోయారు. 75,000 మంది మరాఠాలు మరణించారు. ఈ యుద్ధంలో పీష్వా కుమారుడు విశ్వాస్ రావు, సదాశివరావు భావే కూడా మరణించారు.
* ప్రముఖ చరిత్రకారుడు జె.ఎన్.సర్కార్ ఈ యుద్ధం గురించి ఇలా చెప్పాడు ‘మహారాష్ట్రలో కుటుంబ సభ్యులను కోల్పోని కుటుంబం లేదు. చాలా ఇళ్లు కుటుంబ పెద్దను కోల్పోయాయి. ఒక్క దెబ్బతో మొత్తం నాయకుల తరమంతా నాశనమైంది.’
మరాఠాల ఓటమికి కారణాలు
* అబ్దాలీ సైన్యం 60,000 కాగా మరాఠాల సైన్యం 45,000 మాత్రమే.
* పానిపట్టులోని మరాఠా శిబిరంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. సైన్యానికి ఆహారం, గుర్రాలకు గడ్డి దొరకలేదు.
* ఉత్తర భారతదేశంలోని ముస్లిం రాజ్యాలన్నీ అబ్దాలీకి సహాయం చేయగా మరాఠాలు ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. జాట్లు, రాజపుత్రులు, సిక్కులు మరాఠాలకు దూరమయ్యారు.
* మరాఠా సైన్యాధికారుల్లో అసూయ వారి ఓటమికి కారణమైంది.
* పానిపట్టు యుద్ధానికి ప్రత్యక్ష సాక్షి.. ఆప్ఘనులతో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న వ్యక్తి కాశి రాజ పండిట్. సదాశివరావు భావే వ్యక్తిత్వంలోని లోపాలను పండిట్ దుయ్యబట్టడమే కాకుండా ఓటమికి భావేనే ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
ఆంగ్లో-మరాఠా యుద్ధాలు
- మరాఠాలు మొగల్ సామ్రాజ్య శిథిలాలపై తమ సామ్రాజ్యాన్ని నిర్మించగా.. ఆంగ్లేయులు మరాఠా సామ్రాజ్య శిథిలాలపై తమ సామ్రాజ్యాన్ని నిర్మించాలని భావించారు. మరాఠాలు ఇతర భారత రాజ్యాల కంటే బలమైన రాజ్యంగా ఏర్పడగా, ఆంగ్లేయులు భారతదేశంలోని ఇతర ఐరోపా వర్తక కంపెనీలపై ఆధిపత్యం సంపాదించడంలో విజయం సాధించారు. 18వ శతాబ్దం చివరి నాటికి మరాఠాలు, ఆంగ్లేయులు ప్రత్యక్ష యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆంగ్లేయ కంపెనీ అధికార బలం ముందు మరాఠా అధికారం కనుమరుగైంది.
మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం (1775-82)
- మరాఠా నాయకులైన మాధవరావు, రఘునాథరావు మధ్య అధికారం కోసం జరిగిన పోరును బ్రిటిషర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. రఘునాథరావుకు వారి మద్దతు తెలిపారు. ఈ యుద్ధంలో మొదట బ్రిటిషర్లు మరాఠాల చేతిలో ఓడిపోయారు. గొడ్డార్డ్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం కలకత్తా నుంచి అహ్మదాబాద్ చేరుకునే క్రమంలో మరాఠాలపై అనేక విజయాలు సాధించింది. ఈ యుద్ధం 1782లో జరిగిన ‘సాల్బాయ్ సంధి’తో ముగిసింది. ఈ సంధి ద్వారా యథాతథ స్థితిని కొనసాగించారు. ఫలితంగా బ్రిటిషర్లు మరాఠాలతో 20 సంవత్సరాల పాటు శాంతిని నెలకొల్పారు. మరాఠాల సహాయంతో బ్రిటిషర్లు హైదర్ అలీ నుంచి తమ భూభాగాలను ఆక్రమించుకోగలిగారు.
రెండో ఆంగ్లో-మరాఠా యుద్ధం (1803-05)
- మరాఠాల అంతర్గత వ్యవహారంలో వెల్లస్లీ జోక్యం చేసుకోవడం, సైన్య సహకార విధానాన్ని మరాఠాలపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించడం ఈ యుద్ధానికి కారణాలు. 18వ శతాబ్దం చివరి నాటికి అనుభవజ్ఞులైన మరాఠా నాయకులు మరణించడం, బ్రిటిషర్ల విజయావకాశాలు మెరుగుపడటం, పీష్వా రెండో బాజీరావు 1802లో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేయడం లాంటి పరిణామాలు యుద్ధాన్ని ప్రోత్సహించాయి. సింధియా, భోంస్లేల ఉమ్మడి సైన్యం ఆర్థర్ వెల్లస్లీ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం చేతిలో ఓడిపోయింది. అయితే హోల్కర్లను ఓడించడంలో బ్రిటిషర్లు విఫలమయ్యారు. ఈ యుద్ధంతో కంపెనీ భారతదేశంలో తన అధికారాన్ని పూర్తిస్థాయిలో స్థాపించగలిగింది. ఈ యుద్ధం 1802, డిసెంబరు 31న జరిగిన బస్సైన్ సంధితో ముగిసింది. ఈ సంధి ద్వారా పీష్వా రూ.26 లక్షల ఆదాయాన్నిచ్చే భూభాగాలను కంపెనీకి ఇవ్వడానికి అంగీకరించాడు. అలాగే సూరత్ నగరాన్ని కంపెనీకి అప్పగించాడు. నిజాం భూభాగంలో చౌత్ హక్కును వదులుకున్నాడు.
మూడో ఆంగ్లో-మరాఠా యుద్ధం (1817-18)
- బ్రిటిషర్లు తమ స్వాతంత్య్రాన్ని హరించడాన్ని మరాఠాలు వ్యతిరేకించడం, మరాఠా సర్దార్ల పట్ల బ్రిటిష్ రెసిడెంట్లు కఠినంగా వ్యవహరించడం ఈ యుద్ధానికి ప్రధాన కారణాలు. ఈ యుద్ధం తర్వాత పీష్వా పదవీచ్యుతుడయ్యాడు. బ్రిటిషర్లు మరాఠా భూభాగాలన్నింటినీ తమ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నారు. మరాఠా సర్దార్లు బ్రిటిషర్ల దయాదాక్షిణ్యాలపై జీవించాల్సి వచ్చింది.
మాదిరి ప్రశ్నలు
1. సాహు, తారాబాయికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో సాహు విజయానికి తోడ్పడిన వ్యక్తి ఎవరు?
ఎ) బాజీరావు బి) బాలాజీ విశ్వనాథ్ సి) రఘునాథరావు డి) మల్హర్ రావ్ హోల్కర్
జ: (బి)
2. గైక్వాడ్‌లు ఏ ప్రాంతం కేంద్రంగా పరిపాలించారు?
ఎ) బరోడా బి) నాగపూర్ సి) ఇండోర్ డి) గ్వాలియర్
జ: (ఎ)
3. మొదటి బాజీరావు బస్సైన్, సాల్‌సెట్టిలను ఎవరి నుంచి ఆక్రమించాడు?
ఎ) ఆంగ్లేయులు బి) పోర్చుగీసువారు సి) ఫ్రెంచివారు డి) డచ్చివారు
జ: (బి)
4. మొదటి బాజీరావు, నిజాం ఉల్ ముల్క్‌ను ఏ యుద్ధంలో ఓడించాడు?
ఎ) హైదరాబాద్ బి) భోపాల్ సి) నాగపూర్ డి) విజయవాడ
జ: (బి)
5. నానాసాహెబ్గా ప్రసిద్ధి చెందిన పీష్వా ఎవరు?
ఎ) బాలాజీ బాజీరావు బి) బాలాజీ విశ్వనాథ్ సి) మొదటి బాజీరావు డి) రెండో బాజీరావు
జ: (ఎ)
6. 1752లో పీష్వాతో ఒప్పందం కుదుర్చుకున్న మొగలు చక్రవర్తి ఎవరు?
ఎ) మహమ్మద్ షా బి) అహ్మద్ షా సి) బహుదూర్ షా డి) ఔరంగజేబు
జ: (బి)
7. చివరి పీష్వా ఎవరు?
ఎ) మాధవరావు బి) నారాయణరావు సి) బాలాజీ బాజీరావు డి) రెండో బాజీరావు
జ: (డి)
8. బాలాజీ బాజీరావు ఎప్పుడు మరణించాడు?
ఎ) 1759 బి) 1760 సి) 1761 డి) 1762
జ: (సి)
9. నాదిర్ షా తర్వాత ఆఫ్ఘనిస్థాన్ పాలకుడు ఎవరు?
ఎ) తైమూరు బి) అహ్మద్ షా అబ్దాలీ సి) షేర్‌ఖాన్ డి) అదీనా బేగ్ ఖాన్
జ: (బి)
10. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాలకు సహకరించింది ఎవరు?
ఎ) జాట్లు బి) రాజపుత్రులు సి) సిక్కులు డి) ఎవరూ కాదు
జ: (డి)
11. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాల ఓటమికి ప్రధాన కారకుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఎ) కాశీ రాజ పండిట్ బి) సదాశివరావు భావే సి) విశ్వాసరావు డి) మల్హర్ రావు హోల్కర్
జ: (బి)
12. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఏ సంధితో ముగిసింది?
ఎ) సల్బాయ్ బి) దురాయ్ సరాయ్ ) పాల్కేడ్ డి) బస్సైన్
జ: (ఎ)
13. పీష్వా రెండో బాజీరావు సైన్య సహకార ఒప్పందంపై ఎప్పుడు సంతకం చేశాడు?
ఎ) 1800 బి) 1801 సి) 1802 డి) 1803
జ: (సి)
Leave a Reply