APPSC | TSPSC Group II Paper I భారతదేశ చరిత్ర – కడపటి మొగలుల పాలన
భారతదేశ చరిత్రలో మొగల్ సామ్రాజ్యానికి విశిష్ట స్థానం ఉంది. 300 సంవత్సరాల ఢిల్లీ సుల్తానుల పాలనను అంతమొందించడమే కాకుండా భారత ఉపఖండంలో నూతన శకం ఆరంభానికి మొగలులు నాంది పలికారు. సువిశాల సామ్రాజ్యం, పటిష్టమైన సైన్యం, ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక ప్రగతిని సాధించడం ద్వారా వీరు భారతీయ సంస్కృతి ఔన్నత్యానికి దోహదపడ్డారు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్నప్పటికీ కడపటి మొగలుల అధికార దాహం, విలాస జీవనం, అసమర్థ పాలనతో సామ్రాజ్యం పతనమైంది.
ఔరంగజేబు మరణించే నాటికి(క్రీ.శ.1707) మొగల్ సామ్రాజ్య విస్తీర్ణం ఉచ్ఛ స్థితికి చేరుకుంది. 21 రాష్ట్రాలు ఉండేవి. ఔరంగజేబు మరణానంతరం మొగల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. అక్బర్ నుంచి ఔరంగజేబు వరకు నలుగురు గొప్ప మొగలులు 151 సంవత్సరాలు పరిపాలించారు. అయితే మొదటి బహదూర్షా నుంచి రెండో షా ఆలం వరకు 11 మంది కడపటి మొగలులు 100 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. అంటే కడపటి మొగలులు ఒక్కొక్కరూ సగటున 10 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలించలేకపోయారు. వ్యక్తిత్వం, సామ్రాజ్య విస్తీర్ణం తదితర అంశాల్లో ముందుతరం మొగలులకు, కడపటి మొగలులకు పోలికే లేదు.
మొదటి బహదూర్షా (1707- 1712)
ఔరంగజేబు మరణానంతరం అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. చివరికి కాబూల్ గవర్నర్‌గా ఉన్న మువజ్జం వారసత్వ యుద్ధంలో నెగ్గి బహదూర్ షా పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడు సిక్కుల గురువు గోవింద్‌సింగ్‌ను మొగలుల సర్వీసులోకి తీసుకోవడం ద్వారా సిక్కులు, మొగలులకు మధ్య ఉన్న వైరానికి తెరదించాడు. అయితే తర్వాతి సిక్కు గురువు బందా బహదూర్ మొగలులపై తిరుగుబాటు చేశాడు. బహదూర్షా స్వయంగా యుద్ధం చేసినప్పటికీ సిక్కులను అణిచివేయలేక పోయాడు. అదే సమయంలో మొగలుల చెరలో ఉన్న శంభాజీ కొడుకు సాహును చెర నుంచి విడిపించాడు. ఔరంగజేబు విధించిన జిజియా పన్నును రద్దు చేశాడు. మేవార్, మార్వార్ రాజ్యాల స్వాతంత్య్రాన్ని గుర్తించాడు. బుందేలు నాయకుడు ఛత్రసాల్, జాట్ల నాయకుడు చూరమాన్‌లను మొగల్ పరిధిలోకి తీసుకోవడం ద్వారా వారితో వైరం తొలగిపోయింది. క్రీ.శ. 1712లో బహదూర్షా మరణాంతరం అతడి ముగ్గురు కుమారుల మధ్య వారసత్వ యుద్ధం ప్రారంభమైంది. వారు తండ్రి శవానికి దహన క్రియలు చేయడం కూడా మరచి వారసత్వ యుద్ధంలో మునిగిపోయారు. చివరికి పెద్ద కుమారుడు జహందర్‌షా వారసత్వ యుద్ధంలో గెలిచాడు. 10 వారాల తర్వాత బహదూర్షాకు వారు అంత్యక్రియలు నిర్వహించారు.
జహందర్‌షా (1712 – 1713)
వారసత్వ యుద్ధంలో జుల్ఫికర్‌ఖాన్ మద్దతుతో జహందర్‌షా విజయం సాధించాడు. ఇతడి కాలంలో జహందర్‌షా భార్య లాల్‌కున్వర్ పారిపాలనా విషయాల్లో ఆధిపత్యం చెలాయించింది. ఆమె రక్త సంబంధీకులు రాజ్యాన్ని భ్రష్టు పట్టించారు. మొగలుల పరువు, ప్రతిష్ఠలు దిగజారాయి. ఇతడి కాలంలో తురానీలు, ఇరానీలు, హిందుస్థానీలు అనే మూడు వర్గాలు ఉండేవి. తురానీలు సున్నీ శాఖకు చెందిన వారు కాగా, ఇరానీలు షియా శాఖకు చెందినవారు.
ఫరూక్సియార్ (1713 – 1719)
ఇతడు జహందర్ షా సోదరుడి కుమారుడు. సయ్యద్ సోదరుల సహకారంతో సింహాసనాన్ని అధిష్టించాడు. దీనికి ప్రతిఫలంగా చక్రవర్తి సయ్యద్ అబ్దుల్లాఖాన్‌ను వజీర్‌గా, అతడి తమ్ముడు హుస్సేన్ అలీఖాన్‌ను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. ఫరూక్ సియార్ ఉత్తర్వుల మేరకు జుల్ఫికర్ ఖాన్‌ను వధించారు. సయ్యద్ సోదరులు తమ స్థానంలో వేరేవారిని చక్రవర్తి నియమించకుండా ఉండటం కోసం బంధీలుగా ఉన్న రాకుమారులందరి కళ్లు తీయించారు. తర్వాత చక్రవర్తి, సయ్యద్ సోదరుల మధ్య తగాదా ప్రారంభమైంది. చివరికి ఫరూక్‌సియార్‌ను సయ్యద్ సోదరులు చంపేసి, రఫీ ఉద్దరజత్‌ను చక్రవర్తిగా నియమించారు. అయితే అతడు నాలుగు నెలల్లోనే మరణించాడు. తర్వాత అతడి అన్న రఫీ ఉద్దౌలాను రెండో షాజహాన్ పేరుతో సింహాసనంపై కూర్చోబెట్టారు.
మహమ్మద్‌షా (1719 – 1748)
రెండో షాజహాన్ 1719 సెప్టెంబరులో మరణించాడు. అతడి స్థానంలో రౌషాన్ అక్తర్‌ను మహమ్మద్ షా అనే బిరుదుతో సయ్యద్ సోదరులు సింహాసనంపై కూర్చోబెట్టారు. నిజాం ఉల్ ముల్క్, ఇతిమద్ ఉద్దౌలా, సాదత్‌ఖాన్, మహమ్మద్‌షా తల్లి కూటమిగా ఏర్పడి సయ్యద్ సోదరులను చంపడానికి కుట్ర పన్నారు. 1720లో సయ్యద్ హుస్సేన్ అలీఖాన్, అతడి కుమారుడిని దక్కనులో చంపించారు. నెల తర్వాత అతడి సోదరుడు అబ్దుల్లా ఖాన్‌ను బంధించి విష ప్రయోగంతో హతమార్చారు. సయ్యద్ సోదరుల మరణం తర్వాత మొగల్ సామ్రాజ్య పతనం మరింత వేగవంతమైంది. మహమ్మద్‌షా వయసు సింహాసనాన్ని అధిష్టించేనాటికి 18 సంవత్సరాలు మాత్రమే. ఇతడు నిరంతరం రాజప్రసాదం నాలుగు గోడల మధ్య అంతఃపుర స్త్రీల సాంగత్యంలో గడిపాడు. విలాసాలకు బానిస కావడంతో ‘రంగీలాగా పేరుగాంచాడు. ఇతడు మహమ్మద్ అమీన్‌ఖాన్‌ను వజీర్‌గా నియమించాడు. 1721లో అమీన్‌ఖాన్ మరణం తర్వాత నిజాం ఉల్‌ముల్క్‌ను ఆ స్థానంలో నియమించాడు. ఇతడు సంస్కరణల ద్వారా మొగల్ సామ్రాజ్యాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని ప్రయత్నించాడు. అయితే చక్రవర్తి ఇతడికి పరోక్షంగా ఇబ్బందులు కల్పించాడు. దీంతో విసిగిపోయిన నిజాం ఉల్‌ముల్క్ వజీర్ పదవిని వదలిపెట్టి స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని 1724లో స్థాపించాడు. ముర్షీద్ కులీఖాన్ బెంగాల్లో, సాదత్‌ఖాన్ అవధ్‌లో స్వతంత్ర రాజ్యాలు స్థాపించారు. మాల్వా, గుజరాత్‌లు మొగల్ సామ్రాజ్యం నుంచి విడిపోయాయి.
నాదిర్షా దండయాత్ర (1738 – 1739)
ఇరాన్ నెపోలియన్‌గా పేరు పొందిన నాదిర్షా భారతదేశంపై 1738-39లో దండయాత్ర చేశాడు. 1738లో కాబూల్, జలాలాబాద్, పెషావర్‌లను ఆక్రమించాడు. 1739లో లాహోర్ ఇతడి ఆధీనమైంది. నిజాం ఉల్‌ముల్క్, కమీరుద్దీన్, ఖాన్-ఇ-దౌరాన్, సాదత్‌ఖాన్‌లు నాదిర్షాను అడ్డుకున్నారు. ఫిబ్రవరి 1739లో కర్నాల్ వద్ద మొగల్ సైన్యం ఓడిపోయింది. ఈ యుద్ధంలో ఖాన్-ఇ-దౌరాన్ మరణించాడు. సాదత్‌ఖాన్ సలహాతో నాదిర్షా 1739, మార్చి 20న ఢిల్లీపై దండెత్తాడు. రెండు రోజుల తర్వాత నాదిర్షా మరణించాడనే వదంతులు వచ్చాయి. మొగల్ సైనికులు 700 మంది నాదిర్షా సైనికులను చంపారు. దీంతో నాదిర్షా ఆదేశం మేరకు 20,000 మంది భారతీయులను చంపారు. నాదిర్షా ఢిల్లీలో 47 రోజులపాటు ఉండి ప్రతి ఇంటినీ దోచుకున్నాడు. ప్రసిద్ధిగాంచిన నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం నాదిర్షా వశమయ్యాయి.
అహమ్మద్ షా అబ్దాలీ తొలి దండయాత్రలు
1747లో నాదిర్షా మరణానంతరం అతడి సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. అతడి ముఖ్య సైన్యాధ్యక్షుల్లో అబ్దాలీ తెగకు చెందిన అహ్మద్ అఫ్గనిస్థాన్‌కు పాలకుడిగా ప్రకటించుకున్నాడు. కాబూల్, కాందహార్లను ఆక్రమించి పెషావర్ చేరుకున్నాడు. తర్వాత సింధు నదిని దాటి లాహోర్, సర్‌హింద్‌లను 1748లో ఆక్రమించాడు. ఇతడి రెండో దండయాత్ర సమయంలో మహమ్మద్‌షా మరణించాడు.
అహమ్మద్ షా (1748 – 1754)
మహమ్మద్ షా తర్వాత అతడి కుమారుడు అహమ్మద్ షా చక్రవర్తి అయ్యాడు. ఇతడు మహమ్మద్ షా, ఒక నర్తకికి జన్మించాడు. అహమ్మద్షా మద్యపానం, స్త్రీలకు బానిసై పరిపాలననంతా తన తల్లి ఉద్ధంబాయికి అప్పగించాడు. ఈ కాలంలో అవధ్ నవాబు సఫ్దర్‌జంగ్ మొగల్ సామ్రాజ్యానికి వజీరుగా వ్యవహరించేవాడు. అహమ్మద్షా తల్లి ఇతడిని 1753లో ఆ పదవి నుంచి తొలగించి ఇతిజం ఉద్దౌలాను వజీర్‌గా నియమించింది. ఇతడు అహమ్మద్ షాను పదవీచ్యుతుడిని చేశాడు. తర్వాత అహ్మద్‌షాను, అతడి తల్లిని బంధించాడు.
అహమ్మద్ షా కాలంలో అహమ్మద్ షా అబ్దాలీ 1749, 1752లో భారతదేశంపై రెండు సార్లు దండెత్తాడు. ఢిల్లీ పతనం కాకుండా ఉండటం కోసం మొగల్ సుల్తాన్ అహ్మద్‌షా పంజాబ్, ముల్తాన్‌లను అహ్మద్‌షా అబ్దాలీకి అప్పగించాడు. ఇతడి కాలంలో మొగలుల కోశాగారం ఖాళీ అయ్యింది.
రెండో అలంఘీర్ (1754 – 1759)
అహమ్మద్ షా పదవీచ్యుతుడైన తర్వాత జహందర్ షా మనవడైన అజీజుద్దీన్ రెండో ఆలంఘీర్ బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతడి కాలంలో మొగలుల సైనిక, ఆర్థిక వ్యవస్థలు బాగా దిగజారిపోయాయి. సైనికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో వారి తిరుగుబాట్లు సర్వసాధారణమయ్యాయి. ఈ సమయంలో అహమ్మద్షా అబ్దాలీ భారతదేశంపై 1755లో నాలుగోసారి దండెత్తాడు. ఆలంఘీర్‌ను తన వజీర్ 1759 నవంబరులో హత్య చేశాడు.
రెండో షా ఆలం (1759 – 1806)
ఇతడు రెండో ఆలంఘీర్ కుమారుడు. ఇతడి అసలు పేరు అలీగౌహర్. రెండో షా ఆలం 1759లో సింహాసనాన్ని అధిష్ఠించినా, తన వజీరుకు భయపడి రాజధానిలో నివసించ లేదు. ఇదే సమయంలో అహమ్మద్ షా అబ్దాలీ భారతదేశంపై అయిదోసారి దండెత్తాడు. చివరికి ఇది మూడో పానిపట్ యుద్ధానికి (1761, జనవరి 15) దారితీసింది. ఈ యుద్ధంలో అబ్దాలీ మరాఠాలతో పాటు మొగలులను కూడా ఓడించాడు. రెండో షా ఆలం బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, అవధ్ నవాబు షుజా ఉద్దౌలాతో కలసి 1764లో ‘బక్సార్ యుద్ధంలో బ్రిటిషర్లతో పోరాడి ఓడిపోయాడు. అయితే 1772లో మరాఠాలు రెండో షా ఆలంను ఢిల్లీ సుల్తానుగా ప్రకటించుకున్నారు. అనంతరం నజీబుద్దౌలా 1788లో షాఆలం కళ్లు తీయించాడు. 1803లో బ్రిటిషర్లు ఢిల్లీని ఆక్రమించుకున్నారు. తర్వాత షాఆలం, అతడి వారసులు రెండో అక్బర్, రెండో బహదూర్‌షాలు బ్రిటిషర్ల పెన్షనర్లుగా జీవించారు. షాఆలం 1806లో మరణించాడు.
రెండో అక్బర్ (1806 – 1837)
ఇతడు సంఘ సంస్కర్త అయిన రామమోహన్‌రాయ్‌కి ‘రాజా అనే బిరుదునిచ్చాడు. రామమోహన్‌రాయ్ బ్రిటిషర్లు మొగలు చక్రవర్తికి ఇచ్చే పెన్షన్‌ను పెంచే విధంగా వారితో మాట్లాడటానికి ఇంగ్లండ్ వెళ్లాడు.
రెండో బహదూర్ షా (1837 – 1857)
ఇతడు కడపటి మొగల్ చక్రవర్తుల్లో చివరివాడు. 1857 సిపాయిల తిరుగుబాటులో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఓడిపోయాడు. దీంతో అదే ఏడాది మొగలు చక్రవర్తి పదవిని బ్రిటిషర్లు నిషేధించి బహదూర్ షాను బంధించి, రంగూన్‌కు పంపారు. అతడు అక్కడే 1862లో మరణించాడు.
మొగలు సామ్రాజ్య పతనానికి కారణాలు
* ఔరంగజేబు కాలం నాటికి మొగల్ సామ్రాజ్యం నియంత్రించ లేనంతగా విస్తరించింది. ఈ సామ్రాజ్య విస్తరణ కోసం ఎక్కువ డబ్బులు వెచ్చించి యుద్ధాలు చేయడంతో ఖజానా ఖాళీ అయ్యింది.
* ఇతడు పరమత ద్వేషం పాటించడంతో అసంఖ్యాకులైన హిందువులతో వైరాన్ని పెంచుకున్నాడు. దీంతో జాట్లు, సిక్కులు, రాజపుత్రులు, మరాఠాలు తిరుగుబాట్లు చేశారు.
* ఇతడి దక్కను విధానం మొగలు సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణమైంది.
* ఔరంగజేబు తర్వాత సింహాసనాన్ని అదిష్ఠించిన పాలకులంతా బలహీనులు కావడంతో సమస్యలను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేశారు.
* నాదిర్షా, అహమ్మద్ షా అబ్దాలి దండయాత్రలు మొగల్ సామ్రాజ్య పతనాన్ని వేగవంతం చేశాయి.
* వ్యవసాయం, వ్యాపారం కుంటుపడటంతో రైతుల పరిస్థితి దిగజారి వారంతా తిరుగుబాటు చేశారు.
* మొగల్ సైన్యం బలహీన పడటానికి మరో ప్రధాన కారణం మున్సబ్‌దారీ విధానం సక్రమంగా అమలు కాకపోవడం. ఈ విధానంలో అనేక లోపాలుండటంతో సైన్యంలో క్రమశిక్షణ కొరవడింది. సైనికులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి రావడంతో వారు కూడా తిరుగుబాటు చేశారు.
* బ్రిటిషర్ల అధికారం పుంజుకోవడంతో మొగల్ సామ్రాజ్యం పతనమైంది. వీరు సుమారు 100 ఏళ్ల పాటు మొగలులతో పోరాడారు. చివరకు 1857లో సిపాయిల తిరుగుబాటులో మొగలులను పూర్తిగా ఓడించి చక్రవర్తి పదవిని నిషేధించారు.
మాదిరి ప్రశ్నలు
1. మొదటి బహదూర్‌షాపై తిరుగుబాటు చేసిన సిక్కుల గురువు ఎవరు?
జ: బందాబహదూర్
2. కిందివారిలో ఛత్రసాల్ ఎవరి నాయకుడు?
ఎ) జాట్లు బి) రాజపుత్రులు సి) బుందేలులు డి) సిక్కులు
జ: సి(బుందేలులు)
3. మొదటి బహదూర్షా అసలు పేరు?
జ: మువజ్జం
4. జహందర్ షా ఎవరి మద్దతుతో మొగలు చక్రవర్తి అయ్యాడు?
జ: జుల్ఫికర్ ఖాన్
5. ఏ మొగల్ చక్రవర్తిని సయ్యద్ సోదరులు హతమార్చారు?
జ: ఫరూక్సియార్
6. సయ్యద్ సోదరులను ఏ మొగల్ చక్రవర్తి కాలంలో చంపేశారు?
జ: మహమ్మద్ షా
7. ‘రంగీలా’గా పేరు పొందిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: మహమ్మద్ షా
8. ఏ ప్రాంతంలో నిజాం ఉల్ ముల్క్ స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించాడు?
జ: హైదరాబాద్
9. కింది వారిలో ‘ఇరాన్ నెపోలియన్’గా పేరుగాంచింది ఎవరు?
ఎ) అహమ్మద్ షా అబ్దాలీ బి) మొదటి డేరియస్ సి) నాదిర్షా డి) ఇతిమద్ ఉద్దౌలా
జ: సి(నాదిర్షా)
10. నాదిర్షాకు, మొగల్ సైన్యానికి మధ్య 1739 ఫిబ్రవరిలో యుద్ధం ఎక్కడ జరిగింది?
జ: కర్నాల్
11. అహమ్మద్షా అబ్దాలీ ఏ తెగకు చెందినవాడు?
జ: అబ్దాలి
12. రెండో అలంఘీర్ అసలు పేరు?
జ: అజీజుద్దీన్
13. మూడో పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది?
జ: 1761
14. బ్రిటిషర్లు ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించారు?
జ: 1803
15. చివరి మొగల్ చక్రవర్తి ఎవరు?
జ: రెండో బహదూర్షా
16. రామమోహన్‌రాయ్‌కు ‘రాజా’ అనే బిరుదు ఇచ్చిన మొగలు చక్రవర్తి ఎవరు?
జ: రెండో అక్బర్
Leave a Reply