APPSC | TSPSC Group II Paper I సామాజిక మినహాయింపు – విలక్షణ భారతం
* శతాబ్దాల చరితం
* భిన్న అంశాల సమ్మిళితం
భిన్నత్వంలో ఏకత్వం.. భారత్ గురించి మాట్లాడినప్పుడల్లా వినిపించే మాట ఇది! ఇంతకీ ఏమిటీ భిన్నత్వం? ఎలాంటి భిన్నత్వం ఉందిక్కడ? ఎందుకుంది? ప్రపంచానికీ భారత సమాజానికీ మధ్య ఉన్న భిన్నత్వమేంటి? ప్రపంచంలోని ఏ జాతితోనైనా మనం సరిపోతామా? లేకుంటే ఎందుకు?
తెలంగాణ విద్యార్థులకు తొలిసారిగా గ్రూప్స్ పోటీపరీక్షల్లో ప్రవేశపెట్టిన సామాజిక శాస్త్రంలో అత్యంత కీలకమైన ఈ అంశాలపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సిలబస్ కమిటీ సభ్యుడు ఆచార్య గణేశ్ విశ్లేషణ ‘ఈనాడు ప్రతిభ’కు ప్రత్యేకం..
భారతీయ సమాజానికి దాదాపు 5 వేల సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న రెండో దేశం. భౌగోళికంగా చూసినా భారత్ సువిశాల దేశం. భిన్నత్వంలో ఏకత్వం దీని విశిష్టత. వివిధ మతాలు, వివిధ జాతులు, సంస్కృతులు, కులాలున్న సమాజమిది. చాలా ఇతర సమాజాల మాదిరిగా భారతీయ సమాజం సజాతీయ లక్షణాలున్నది కాదు. ఇది వైవిధ్యంతో కూడుకొని ఉన్నది. ప్రధాన వైవిధ్య లక్షణాలేమిటో చూద్దాం..
1. భౌగోళిక వైవిధ్యం
భారతదేశంలో వివిధ రకాల భౌగోళిక పరిస్థితులున్నాయి. హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా.. ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్ దాకా.. తీసుకుంటే భూమి లక్షణాలు, వాతావరణ పరిస్థితులు, అడవుల పంపిణీల్లో బోలెడంత వ్యత్యాసం.
2. వ్యవసాయాధారితం
గ్రామీణ జీవన విధానాన్ని, వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థను కలిగిన సమాజమిది. ఇవాళ్టికి కూడా 67.5 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంతేకాదు.. గ్రామీణంలోని ప్రజల్లో చాలామంది ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ వ్యవసాయంపై ఆధారపడినవారు లేదా వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్నవారు. సాంప్రదాయక కులవృత్తులపై ఆధారపడి జీవించేవారింకా చాలామంది ఉన్నారు. వృత్తికి, కులానికి అవినాభావ సంబంధం ఇంకా కొనసాగుతోంది.
3. కుల వ్యవస్థ
భారతీయ సమాజానికున్న విలక్షణమైన ప్రత్యేకత ఇది. భారతీయ సమాజంలో ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు, జీవనవిధానం కులవ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. ఈ కులవ్యవస్థకు కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. కులవ్యవస్థ భారతీయ సమాజంలోని ప్రజలను సామాజికంగా వేరు (సోషల్ సెగ్రిగేషన్) చేసింది. అంటే ప్రజలంతా కలసి జీవిస్తున్నా వారిని కుల క్రమానుగతంగా అమర్చి, వృత్తి, ఆచారాలు, సంస్కృతి పరంగా సామాజికంగా వేరు చేశారు. అయితే గతంతో పోల్చిచూస్తే ఈ సాంప్రదాయిక కులవ్యవస్థలో చాలా మార్పులొస్తున్నాయి.
4. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
భారత సమాజానికున్న మరో విలక్షణ అంశమిది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉమ్మడి కుటంబ వ్యవస్థ ఎక్కువగా కనిపిస్తుండేది. ఒక కుటుంబంలో రెండు మూడు తరాలకు సంబంధించిన వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటూ, ఆస్తిని సమష్టిగా కలిగివుండి, అంతా కలసి ఒకచోట జీవించడాన్ని సమష్ఠి కుటుంబ వ్యవస్థ అంటారు. అయితే కాలక్రమంలో నగరీకరణ, పారిశ్రామికీకరణ, విద్యావ్యాప్తి, జీవనోపాధి కోసం ప్రజలు వలస వెళ్లడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతూ వస్తోంది.
5. జాతిపరమైన విభాగాలు
ఒకే విధమైన శారీరక లక్షణాలున్న సామాజిక సమూహాలను జాతి అంటాం. భారతీయ సమాజంలోని ప్రజలందరికీ ఒకే రకమైన శారీరక లక్షణాల్లేవు. ఉదాహరణకు జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌ల్లోని ప్రజల శారీరక లక్షణాలకు, ఈశాన్య రాష్ట్రాల్లోని ఖాసా, ఖాసి, నాగా, మిజోలాంటి జాతి సమూహాలకు; దక్షిణ భారతదేశంలోని ప్రజల శారీరక లక్షణాలకు చాలా తేడా కనిపిస్తుంది. అంటే వివిధ జాతులకు సంబంధించిన లక్షణాలున్న ప్రజలు భారతీయ సమాజంలో ఉన్నారు.
6. భాషాపరమైన విభాగాలు
భారత రాజ్యాంగం ప్రకారం దాదాపు 22 భాషలు.. వివిధ సమాజ, మానవ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 1,652 భాషలు మాట్లాడే ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. సమాజ శాస్త్రవేత్తలు ఈ భాషలను ప్రధానంగా ఐదు రకాలుగా వర్గీకరించారు. అవి..
1. ఆస్ట్రిక్ భాషా సమూహం
2. ఇండో ఆర్యన్ భాషా సమూహం
3. ద్రవిడియన్ భాషా సమూహం
4. సైనో టిబెటన్ భాషా సమూహం
5. ఇండో యూరోపియన్ భాషా సమూహం
”భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ. వరుసక్రమంలో తెలుగు, బెంగాలీ, మరాఠీ, తమిళం, ఉర్దూ, గుజరాతీ, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్‌పురి, పంజాబీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.”
7. మతపరమైన విభాగాలు
భారతీయ సమాజంలో వివిధ మతాలవారు జీవిస్తున్నారు. ఇందులో ప్రధానమైనవి హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం, జైనం, జొరాస్ట్రియన్. ఈ మతాల ప్రజలంతా భారతీయ సమాజంలో సమ్మిళితమై, వినూత్నమైన భారతీయ సంస్కృతి ఆవిర్భావానికి దోహదం చేశారు. ఈ మతాల్లో చాలావాటికి మతగ్రంథాలున్నాయి. తాత్విక సిద్ధాంతాలు, ఆచారాలున్నాయి. వాటికి సంబంధించిన ఆచార వ్యవహారాలున్నాయి. ఇవన్నీఉన్నా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వ లక్షణాన్ని అడుగడుగునా, అనుక్షణం కనబరుస్తూ ఉంటుంది.
8. సాంస్కృతిక విభాగాలు
విశాలంగా భారతీయ సంస్కృతి అని చెప్పినా ఇది బహు సంస్కృతులతో కూడుకున్న సమాజం. ఉత్తర, దక్షిణ, మధ్య భారతం, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులు వేర్వేరుగా ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన సంస్కృతులు కనిపిస్తాయి.
9. ఏకత్వ భావన
విభిన్న జాతులు, మతాలు, భాషలు, కులాలు, సంస్కృతులకు చెందిన ప్రజలున్నా, వివిధ రకాల భౌగోళిక పరిస్థితులున్నా ప్రజలంతా భారతీయులే అనే ఏకత్వభావన ఇక్కడి విశిష్టత. అందుకే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమున్న బలీయమైన శక్తి అనే భావన అన్నివర్గాల్లో ఉంది. ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వం అనుకుంటుంటాం. ఏమిటీ భిన్నత్వమంటే ఇవన్నీ చెప్పాలి.
ఇవన్నీ భారతీయ సమాజానికున్న ప్రధాన లక్షణాలు. వీటిలో కీలకమైన జాతి పరమైన విభాగాల్ని పరిశీలిస్తే..
ఒకేరకమైన శారీరక లక్షణాలున్న ప్రజలున్న సమాజం కాదు భారత్‌ది. కశ్మీర్, ఈశాన్య, దక్షిణ భారత ప్రజలను చూపిస్తే ముగ్గురూ మూడు దేశాలకు చెందిన వారిలా కనిపిస్తారు. సాంకేతికంగా భారత జనాభా గురించి రెండు రకాల శాస్త్రీయ వర్గీకరణలున్నాయి.
1. హెర్బర్ట్ రిస్లే వర్గీకరణ
2. బి.ఎస్.గుహ వర్గీకరణ
రిస్లే వర్గీకరణ
1931 జనాభా లెక్కల కోసం చేసిన సర్వేలో భాగంగా జాతి లెక్కలను సేకరించారు. 1931 తర్వాత మళ్లీ 2011లోనే ఈ జాతి, కులాలకు సంబంధించిన లెక్కలు సేకరించారు. 1931 జనాభా లెక్కల ఆధారంగానే దేశంలో రిజర్వేషన్లు కల్పించారు. బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త రిస్లే 1931 జనాభా లెక్కల ఆధారంగా భారత్‌లో 7 రకాల జాతి సమూహాలున్నాయని వర్గీకరించారు.
1. టర్కో-ఇరానియన్: వాస్తవికంగా ఈ జాతి లక్షణాలు కచ్చితంగా లేవు. జమ్మూకశ్మీర్.. పైనున్న బెలూచిస్థాన్, ప్రస్తుత పాకిస్థాన్ సరిహద్దుల్లోని జనాభాలో ఈ టర్కో-ఇరానియన్ లక్షణాలు కనిపిస్తాయి.
2. ఇండో ఆర్యన్: ఉత్తర భారతదేశంలోని పంజాబీలు, రాజ్‌పుత్‌లు, కాశ్మీరీల్లాంటి వారు.
3. సైతో ద్రవిడియన్: ఇది మధ్య భారతదేశంలోని ప్రజల్లో.. ముఖ్యంగా మరాఠా బ్రాహ్మణులు, కూర్గ్ ప్రాంతాల్లోని కూర్గీల్లో కనిపిస్తుంది. జనరల్ మానిక్‌షా, జనరల్ కరియప్పలు ఈ కూర్గీలే. ఈ సైతో ద్రవిడియన్లు ఆర్యులు కారు.. ద్రవిడియన్లూ కారు.
4. ఆర్యో ద్రవిడియన్: ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్ ప్రాంతాల్లోని ప్రజలు.
5. మంగోలో ద్రవిడియన్: పసుపుపచ్చ రంగులో ఉంటారు. బెంగాలీలు.. ఖాయస్థాలు.
6. మంగోలాయిడ్: అసోం, ఈశాన్యంలోని గిరిజన తెగలు, నేపాల్, బర్మా సరిహద్దుల్లో అసోం, మేఘాలయ, నాగాలాండ్ల్లోని ప్రజలు.
7. ద్రవిడులు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు.. దక్షిణ భారతదేశంలోని ప్రజలు.
బీఎస్ గుహ వర్గీకరణ
రిస్లేకు కాస్త భిన్నంగా ఉంటుంది. భారత్‌కు సంబంధించి చాల కీలకమైన, శాస్త్రీయమైన వర్గీకరణ. గుహ ప్రకారం 6 రకాలైన జాతి సమూహాలున్నాయన్నారు.
1. నీగ్రిటో: భారత్‌లోని జనాభాలో నీగ్రిటో లక్షణాలున్నాయా? లేవా? అనే చర్చ జరిగింది. భారత్‌లోని కొన్ని తెగల్లో ముఖ్యంగా కొచ్చిన్ ప్రాంతంలోని కడారులు తెగ; నాగాలాండ్‌లో అంగానీ నాగా తెగ; తూర్పు బిహార్‌లోని రాజ్‌మహల్ కొండ జాతుల ప్రజలు; అండమాన్‌లోని కొన్ని తెగల్లో.. నీగ్రిటో జాతి లక్షణాలున్నాయని గుహ వాదించారు. రిస్లే వర్గీకరణ ప్రకారమైతే భారత్‌లో నీగ్రిటో జాతి లేదు. గుహ ఉన్నాయన్నారు. తర్వాతి కాలంలో ఇది నిజమని నిరూపితమైంది.
2. ప్రోటో ఆస్ట్రాలాయిడ్: ఈ జాతికి సంబంధించినవారు తూర్పు, మధ్య భారతదేశంలో చాలామంది విస్తరించి ఉన్నారు. వండా (జార్ఖండ్), కోల్లాంటి తెగల్లో ఈ ఆస్ట్రాలాయిడ్ జాతికి సమాంతరంగా ఉండే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వీరిని ప్రోటో ఆస్ట్రాలాయిడ్ అంటారు.
3. మంగోలాయిడ్స్: ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు.
4. మెడిటెర్రేనియన్స్: పంజాబ్, గంగానది లోయ ప్రాంతాల్లో ఉండేవారు. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ జాతి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ మేర మాత్రం పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఉంటారు.
5. బ్రాకీ సెఫాల్స్: గుండ్రని తల ఉండేవారిని బ్రాకీ సెఫాల్స్ అంటారు. వీరు మధ్య ఆసియా పర్వత ప్రాంతాల నుంచి వచ్చిన జాతి అని సమాజ శాస్త్రవేత్తలంటారు. ఈ జాతిలో శరీర ఛాయ తెలుపుగా ఉంటుంది. ముఖం, శరీరంపై రోమాలు దట్టంగా ఉంటాయి. ముఖం గుండ్రంగా ఉంటుంది. ఇలాంటివారు గుజరాత్, బెంగాల్ ప్రాంతాల్లో.. కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటారు. ముంబై, గుజరాత్‌ల్లోని పార్సీల్లో కూడా ఇలాంటి లక్షణాలుంటాయి.
6. నార్డిక్: వీళ్లను ఆర్యుల నుంచి జాతిగా పరిగణించారు. భారత్‌లో ఉన్న చాలా ప్రాంతాల్లో వీరుంటారు. ఎక్కువగా మాత్రం పశ్చిమ, ఉత్తర భారతదేశంలో కనిపిస్తారు. భారత్‌లో జాతి లక్షణాలను అర్థం చేసుకోవటానికి ఈ రెండు వర్గీకరణలూ ప్రధానమైనవి. మెడిటెర్రేనియన్ బృందంలోనే దక్షిణ భారత్‌లోని ద్రవిడియన్లను గుహ చేర్చారు.
భాషాపరమైన వర్గీకరణలు
సమాజ శాస్త్రవేత్తల ప్రకారం దాదాపు 1,652 భాషలు భారతదేశంలో వాడుకలో ఉన్నట్లు అంచనా. వివిధ భాషలు మాట్లాడే ప్రజలను 5 సమూహాలుగా విభజించారు. జాతి సమూహాల్లాగానే భాషా సమూహాలివి.
1. ఆస్ట్రిక్ భాషా కుటుంబం: మధ్య భారత్‌లోని గిరిజన తెగలు మాట్లాడే భాషలు. ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లోని సంతాల్, జార్ఖండ్‌లోని ముండా, బిహార్‌లోని హో.
2. ఇండో ఆర్యన్ భాషా కుటుంబం: భారత్‌లో అత్యధిక ప్రజానీకం మాట్లాడే భాషలు ఈ సమూహం కిందికి వస్తాయి. ఉదాహరణకు హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, పంజాబీ, బీహారీ, రాజస్థానీ, అస్సామీ, సంస్కృతం, సింధీ, ఉర్దూ, కాశ్మీరీ. దాదాపు మూడింట రెండొంతుల మంది ఈ ఇండో ఆర్యన్ భాషా కుటుంబం కిందికే వస్తారు.
3. ద్రవిడియన్ భాషా కుటుంబం: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.
4. సైనో టిబెటన్ భాషా కుటుంబం: ఈశాన్య రాష్ట్రాల్లో ఖాసా, ఖాసి, నాగా, మిజో తదితర తెగలు మాట్లాడే భాషలు (భాషల పేర్లు కూడా ఇవే) దీనికిందికి వస్తాయి.
5. ఇండో యూరోపియన్ భాషా కుటుంబం: బ్రిటిష్, పోర్చుగీసు, ఫ్రెంచి దేశాల భాషలను చాలామంది మన దేశంలో కూడా మాట్లాడుతారు.
సమ్మిళిత సమాజం
భారత సమాజమంత వైవిధ్య సమాజం గతంలోనే కాదు ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. చారిత్రకంగా కూడా భారతీయ సమాజ సంస్కృతి అన్ని రకాల ప్రజలను, మతాలను ఆహ్వానించింది. వ్యాపారం, మతం, జ్ఞానం.. ఇలా రకరకాల వాటికోసం ఇక్కడికి వచ్చారు. వారందరినీ ఎంతో సహనంతో తనలో ఇముడ్చుకుందీ సమాజం. అందుకే ఆయా మతాలు, భాషలు ఇక్కడ స్థిరపడ్డాయి. పురాతన సమాజాలు చాలా అంతరించి పోయాయి. అయినా ఈ భారతీయ సమాజం ఇంకా నిలబడి ఉందంటే సహనంతో వాటన్నింటినీ తనలో సమ్మిళితం చేసుకోవడమే.
ఎందులోనూ చేరని విశిష్టత
ప్రపంచ జనాభాను మానవ శాస్త్రవేత్తలు నాలుగు సమూహాలుగా వర్గీకరించారు.
1. ఆస్ట్రాలాయిడ్ (ఉత్తర అమెరికా, కెనడా ప్రాంతాల వారు)
2. కాకసాయిడ్ (ఐరోపా ప్రజలు)
3. మంగోలాయిడ్ (జపనీస్, చైనీస్)
4. నీగ్రిటో-నీగ్రాయిడ్ (ఆఫ్రికా)
భారత ప్రజలు మాత్రం ఈ నాలుగింటిలో దేనికీ కచ్చితంగా చెందకపోవడం విశిష్టాంశం. ఇందుకు చారిత్రక, భౌగోళిక కారణాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలోని చాలా జాతి సమూహాలు భారత సంస్కృతి, జీవన విధానంలో సమ్మిళితమై పోయాయి. మధ్య ఆసియా నుంచి వచ్చి దాడులు చేసి ఇక్కడ స్థిరపడిపోయారు. యూరోప్‌తో పాటు ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడ్డట్లు ఆధారాలున్నాయి. మొదటి నుంచీ కూడా భారతీయ సంస్కృతి ఎవ్వరితోనూ ఘర్షణ పడలేదు. అందరినీ తనలో మిళితం చేసుకుంది. అందుకే వివిధ జాతి లక్షణాలు వివిధ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ఇండో ఆర్యన్‌లో కొంతమేరకు ఆస్ట్రాలాయిడ్, కాకసాయిడ్ లక్షణాలు కనిపిస్తాయి.
Leave a Reply