International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part IV
- విశ్వవ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగింది? ఏం జరుగుతోంది? తెలుసుకుంటే ఎంతో విజ్ఞానం మన సొంతమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత పురస్కారాలు.. అద్భుత ఆవిష్కరణలు.. ప్రపంచ సంస్థలు వెల్లడిస్తున్న జాబితాలు.. భూమండల వాతావరణ రికార్డులు.. ఒకటేమిటి? ఎన్నో సంగతుల సమాహారం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం
రూ. 6 లక్షల కోట్లు మరి!
* 2015 ఫిబ్రవరిలో నల్లకుబేరులకు సంబంధించిన ఓ జాబితా వెలుగు చూసింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఖాతాదారుల వివరాలు ఇందులో ఉండటం సంచలనం సృష్టించింది. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉన్న ఈ ఖాతాల వివరాలను అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల వేదిక (ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ – ఐసీఐజే) బయటపెట్టింది. దీని ప్రకారం.. లక్షమంది దాచుకున్న మొత్తం సంపద 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6 లక్షల కోట్లు).
* ఈ జాబితాలో భారత్‌కు చెందిన 1,195 మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మాజీ అధికారుల పేర్లున్నాయి. ప్రస్తుత విదేశీ మారక విలువల ఆధారంగా లెక్కించినప్పుడు ఆ ఖాతాల్లోని నిల్వలు 400 కోట్ల డాలర్ల (రూ. 25,420 కోట్లు)కు పైగా ఉన్నాయి.
గ్రామీ అవార్డులు – 2015
* సంగీత రంగంలో అంతర్జాతీయ స్థాయి పురస్కారంగా పేరొందిన గ్రామీ అవార్డులను (57వ) 2015 ఫిబ్రవరిలో అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ప్రదానం చేశారు. మన దేశానికి చెందిన రికీకేజ్, నీలావిశ్వానీలు పురస్కార గ్రహీతల్లో ఉన్నారు. బెంగళూరుకు చెందిన 33 ఏళ్ల రికీకేజ్కు ‘న్యూఏజ్ ఆల్బమ్’ విభాగంలో గ్రామీ అవార్డు లభించింది. దక్షిణాఫ్రికా కళాకారుడు వౌటర్ కెల్లెర్మాన్‌తో కలిసి రికీకేజ్ మహాత్మాగాంధీ స్ఫూర్తితో ‘విండ్స్ ఆఫ్ సంసారా’ అనే ఆల్బమ్‌ను రూపొందించారు.
* మరో గ్రామీ అవార్డు పురస్కారాన్ని భారత్‌కు అందించిన నీలా విశ్వానీ వాస్తవానికి రచయిత్రి. ఆమె చిన్నకథల సంపుటాలను వెలువరించారు. పాకిస్థాన్‌లో బాలికల విద్య కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ జీవిత కథ (ఐ యాం మలాలా)కు నీలావిశ్వానీ ధ్వని రూపం (ఆడియో) కల్పించారు. ఐయాం మలాలా! పేరుతోనే తెచ్చిన ఈ ఆల్బమ్‌లో మలాలా స్వీయచరిత్రను విశ్వానీ వివరించారు. ‘ఉత్తమ పిల్లల ఆల్బమ్’ విభాగంలో ఇది అవార్డుకు ఎంపికైంది.
ఈ ఏడాది గ్రామీ విజేతలు: ఉత్తమ ఆల్బమ్ – మార్నింగ్ ఫేజ్ (గాయకుడు బెక్), ఉత్తమ రికార్డ్ – స్టే విత్‌మీ (గాయకుడు శాంస్మిత్), ఉత్తమ పాట – స్టే విత్‌మీ (శాంస్మిత్, జిమ్మీ నేప్స్, విలియం ఫిలిప్స్), ఉత్తమ కొత్త కళాకారుడు – శాంస్మిత్, ప్రజాదరణ పొందిన ఓకల్ ఆల్బమ్ – ఇన్ ది లోన్లీ అవర్ (శాంస్మిత్).
వరల్డ్ ప్రెస్‌ఫొటో పురస్కారాలు
* ప్రతిష్ఠాత్మక వరల్డ్ ప్రెస్ ఫొటో పురస్కారం-2015ను డెన్మార్క్ ఫొటోగ్రాఫర్ మాడ్స్ నిస్సేన్ గెలుచుకున్నారు. ఈయన తీసిన రష్యా స్వలింగ సంపర్క జంట ఫొటోకు ఈ అవార్డు దక్కింది. రష్యాలో స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్న వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ ఫొటోను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అతడికి సమకాలిన సమస్య విభాగంలో కూడా పురస్కారం దక్కింది.
వేడెక్కిన జనవరి
* ప్రపంచ వ్యాప్తంగా భూమి, సముద్ర ఉపరితలాలపై సగటు ఉష్ణోగ్రత 2015 జనవరిలో రికార్డుస్థాయిలో నమోదైనట్లు అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ సంస్థ (నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్- ఎన్వోఏఏ) పేర్కొంది. ఉష్ణోగ్రతల రికార్డుల్ని 1880 నుంచి నమోదు చేస్తుండగా.. ఆ ఏడాది నుంచి చూస్తే ఇది రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జనవరిలో భూమి, సముద్ర ఉపరితల సగటు ఉష్ణోగ్రత 0.77 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది 20వ శతాబ్దం సగటుకన్నా ఎక్కువే. అంతకుముందు 2007లో 0.86 డిగ్రీల సెల్సియస్‌తో అత్యధిక స్థాయి సగటు నమోదైంది.
* 2015 జనవరిలో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 1.43 డిగ్రీల సెల్సియస్‌తో 20వ శతాబ్దపు సగటుకన్నా ఎక్కువగా నమోదైంది. ఇది కూడా రెండో స్థానంలో ఉండగా, అత్యధికంగా 2007లో 1.84 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2015 జనవరిలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 0.53 డిగ్రీల సెల్సియస్ సగటుతో 20వ శతాబ్దం సగటుకన్నా అధికంగా నమోదైంది. ఇది మూడోస్థానంలో నిలిచింది.
ఆస్కార్ అవార్డులు-2015
* 2015 ఫిబ్రవరిలో అమెరికాలోని లాస్ఏంజిల్స్లో 87వ ఆస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. బర్డ్‌మ్యాన్, ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్ – చిత్రాలు నాలుగేసి పురస్కారాలు దక్కించుకున్నాయి.
పురస్కార గ్రహీతలు
ఉత్తమ చిత్రం – బర్డ్‌మ్యాన్
ఉత్తమ నటుడు – ఎడ్డి రెడ్మేన్ (ది థిµయరీ ఆఫ్ ఎవ్రీథింగ్)
ఉత్తమ నటి – జూలియన్ మూర్ (స్టిల్ అలైస్)
ఉత్తమ దర్శకుడు – అలెజాండ్రో గోంజాలెజ్ ఇనారిట్టు (బర్డ్‌మ్యాన్)
ఉత్తమ విదేశీ భాషా చిత్రం – ఇడా (పోలెండ్ చిత్రం)
* చలనచిత్ర రంగంలో ప్రపంచ అత్యుత్తమ పురస్కారాలుగా భావించే ఆస్కార్ అవార్డులను 1929 నుంచి ఏటా అమెరికాలో ప్రదానం చేస్తున్నారు. వీటినే ‘ది అకాడమీ అవార్డ్స్’గా కూడా పిలుస్తారు. ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ – ఏఎంపీఏఎస్’ ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది.
* ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని తొలిసారిగా 1953లో టీవీలో ప్రసారం చేశారు. ఆస్కార్ తొలి ఉత్తమ నటుడిగా ఎమిల్ జెన్నింగ్స్, తొలి ఉత్తమ నటిగా జానెట్ గేనర్లు పురస్కారాలు పొందారు.
* భారత దేశానికి తొలి ఆస్కార్ సాధించిన ఘనత భాను అథయాకు దక్కింది. ఆమె 1983లో హాలీవుడ్ సినిమా ‘గాంధీ’కి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ పురస్కారాన్ని పొందారు. 1992లో సత్యజిత్‌రే ఆస్కార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని పొందారు. 2009లో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికిగాను ఏఆర్ రెహ్మాన్ (ఉత్తమ సంగీతం), రసూల్ పూకుట్టి (ఉత్తమ సౌండ్ మిక్సింగ్), ఏఆర్ రెహ్మాన్, గుల్జార్ (ఉత్తమ ఒరిజినల్ పాట)లు ఆస్కార్ అందుకున్నారు.
* రెండు ఆస్కార్ పురస్కారాలు పొందిన తొలి భారతీయుడిగా ఏఆర్ రెహ్మాన్ వార్తల్లో నిలిచారు. మూడు భారతీయ చిత్రాలు మదర్ ఇండియా (1958), సలాం బాంబే (1989), లగాన్ (2002)లు ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో నామినేషన్లు పొందాయి.
‘ఎబోలా’కు మందు!
* ఆసియాకు చెందిన టెట్రాండ్రిన్ అనే మూలిక నుంచి సేకరించిన అణువు ఎబోలా నుంచి రక్షణ కల్పిస్తుందని టెక్సాస్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. వైరస్ ప్రవేశించడానికి, కణాల్ని ఇన్ఫెక్షన్కు గురిచేయడానికి ఉపయోగించే మార్గాల్ని ఇది మూసివేస్తుందని పరిశోధకులు గుర్తించారు. టెట్రాండ్రిన్ సూక్ష్మ అణువుకు మానవ తెల్ల రక్తకణాల ఇన్ఫెక్షన్ను అణచిపెట్టే శక్తి ఉన్నట్లు ఎలుకల్లో చేపట్టిన ప్రయోగాల్లో తేలింది.
‘కీ స్టోన్ ఎక్స్ఎల్’ను తిరస్కరించిన ఒబామా
* కెనడా నుంచి అమెరికాలోని గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వరకు 1900 కి.మీ.ల మేర నిర్మించతలపెట్టిన వివాదాస్పద ‘కీ స్టోన్ ఎక్స్ఎల్’ ముడిచమురు పైప్‌లైన్ నిర్మాణాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన వీటో అధికారం ఉపయోగించి తిరస్కరించారు. అధ్యక్షుడిగా ఆరేళ్లకు పైగా పాలనలో ఉన్న బరాక్ ఒబామా వీటో అధికారాన్ని ఉపయోగించడం ఇది మూడోసారి.
రికార్డు స్థాయిలో తృణ ధాన్యాలు
* 2014లో ప్రపంచ తృణ ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 2,534 మిలియన్ టన్నులుగా నమోదైనట్లు ఎఫ్ఏవో (ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్) ఇటీవల వెల్లడించింది. 2013తో పోలిస్తే ఇది 13 మిలియన్ టన్నులు ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా 1,104 మిలియన్ టన్నుల తృణ ధాన్యాలు ఆహార పదార్థాలుగా, 876 మిలియన్ టన్నులు జంతువుల ఆహారం కోసం వినియోగిస్తున్నట్లు ఎఫ్ఏఓ వెల్లడించింది.
* ఎఫ్ఏవో గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్నవారి సంఖ్య గత దశాబ్దకాలంలో 100 మిలియన్లు తగ్గింది. ఇదే కాలంలో తృణ ధాన్యాల ఉత్పత్తి దాదాపుగా 500 మిలియన్ టన్నులు పెరిగింది.
* 2013-14లో భారత్‌లో 245.5 మిలియన్ టన్నుల తృణ ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయి.
Leave a Reply