International Current Affairs వర్తమానాంశాలు – అంతర్జాతీయం Part IX
- సెకను కాలాన్ని ఎందుకు పెంచారు? భారత్-స్వీడన్ల వ్యూహాత్మక చర్చలు ఎప్పటి నుంచి నిలిచిపోయాయి? అమెరికాకు అనుకూలంగా డబ్ల్యూటీవో తీర్పు ఏమిటి? ప్రపంచ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న భారతీయ నగరం ఏది? కుబేరుల సంఖ్య ఏ దేశాల్లో బాగా పెరుగుతోంది? ఏఐఐబీ అంటే ఏమిటి? చైనాగోడ శిథిలమవుతోందా? ప్రపంచంలో ఎయిర్టెల్ స్థానమెంత? హాలీవుడ్ నటుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న బాలీవుడ్ నటులెవరు? తీవ్రవాదుల దాడికి దీటుగా భారత సైన్యం ఎలాంటి చర్య చేపట్టింది? జీ-7 సదస్సు విశేషాలేమిటి? – పూర్తి వివరాలకు చదవండి మరి!సెకను అదనం
- గడియారాలకు ఒక లీపు సెకనును అదనంగా 2015, జూన్ 30న చేర్చారు. ఇలా ఓ సెకనును చేర్చడం వల్ల జూన్ 30న గడియారాలు 11 : 59 : 60 గా సూచించినట్లు, ఆ రోజు కాలవ్యవధి అందరికీ ఓ క్షణం ఎక్కువైనట్లు అమెరికా నావికా అబ్జర్వేటరీ సంస్థ వెల్లడించింది.
- 1972లో తొలిసారిగా ఇలా లీపు సెకనును అదనంగా చేర్చారు. భూభ్రమణం అణు గడియరాన్ని అందుకోవడం కోసం ఇలా అదనపు సెకనును చేరుస్తున్నారు. జూన్ 30న 86,400 సెకన్లకు 86,401 సెకన్లు ఉన్నాయి.
రాష్ట్రపతి పర్యటన
- భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2015, మే 31 నుంచి 5 రోజుల పాటు స్వీడన్, బెలారస్లలో పర్యటించారు. ఈ రెండు దేశాల్లో పర్యటించిన తొలి భారత రాష్ట్రపతిగా ప్రణబ్ వార్తల్లో నిలిచారు.
- స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లోని రాయల్ ప్యాలెస్‌లో స్వీడన్ రాజు కార్ల్ XVI గుస్తాఫ్, రాణి సిల్వియాలతో ప్రణబ్ ముఖర్జీ సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితి భద్రతమండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ స్వీడన్ మద్దతు పలికింది.
- స్వీడన్ ప్రధానమంత్రి స్టీఫెన్ లోఫ్వెన్తో కూడా ప్రణబ్‌ముఖర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత, స్వీడన్ల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. 2011 నుంచి నిలిచిపోయిన వ్యూహాత్మక చర్చలను పునఃప్రారంభించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి.
* ‘భారత్‌లో తయారు చేయండి’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో స్వీడన్ పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం కుదిరింది. సుస్థిర పట్టణాభివృద్ధి, సూక్ష్మ / చిన్నతరహా / మధ్యతరహా పరిశ్రమల సహకారం, సముద్ర పరిశోధనలు తదితర ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇరు దేశాలకు చెందిన 15 విశ్వవిద్యాలయాలు కూడా వివిధ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
* స్వీడన్ పార్లమెంటు ‘రిక్స్డ్యాగ్’ను, నోబెల్ బహుమతులు ప్రదానం చేసే మందిరాన్ని ప్రణబ్ సందర్శించారు. స్వీడన్ పర్యటన అనంతరం బెలారస్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ఆ దేశ రాజధాని మిన్క్స్లోని ‘ప్యాలెస్ ఆఫ్ ఇండిపెండెన్స్’ లో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో సమావేశమయ్యారు. వాణిజ్యం, గనుల తవ్వకాలు, విద్య, భారీ యంత్రాలు తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై చర్చలు జరిపారు.
* భారత్‌కు చెందిన బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్), బెలారస్‌కు చెందిన ఎస్సీఎస్ (స్టేట్ కమిటీ ఫర్ స్టాండర్త్డెజేషన్)ల మధ్య.. భారత్‌కు చెందిన ప్రసారభారతి, బెలారస్‌కు చెందిన నేషనల్ స్టేట్ టెలివిజన్ అండ్ రేడియో కంపెనీల మధ్య ఒప్పందాలు కుదిరాయి.
* భారత్‌కు చెందిన సెబీ, బెలారస్ ఆర్థిక శాఖల మధ్య.. భారత్-బెలారస్‌ల టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖల మధ్య ఒప్పందాలు కుదిరాయి.
* బెలారస్ వర్సిటీలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ఆవిష్కరించారు.
అమెరికాకు అనుకూలం
- ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో కోళ్ల పరిశ్రమకు సంబంధించిన ఒక కేసులో భారత్ ఓడిపోయింది. అమెరికా వాదననే డబ్ల్యూటీవో అప్పిల్లేట్ సమర్థించింది.
* అమెరికా కోళ్ల ఉత్పత్తుల దిగుమతులపై భారత్ విధించిన నిషేధం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా లేదని తెలిపింది. ఈ రూలింగ్‌ను అమలు చేయడానికి భారత్‌కు 12-18 నెలల సమయం ఉంటుంది. ఆ తర్వాత అమెరికా తన పౌల్ట్రీ ఉత్పత్తులను భారత్‌కి ఎగుమతి చేయొచ్చు.
* ఏఐ (ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా)పై ప్రతిస్పందన చర్యల్లో భాగంగా అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. దీనిపై అమెరికా డబ్ల్యూటీవో కమిటీని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో అమెరికాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
ముంబయి ముచ్చట
- ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న తొలి 10 నగరాల జాబితాను మాస్టర్ కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ రూపొందించింది.
* భారత్ ఆర్థిక రాజధాని ముంబయి ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచింది.
* బ్యాంకాక్, సింగపూర్, కౌలాలంపూర్, సియోల్, హాంకాంగ్, టోక్యో, తైపీ, షాంఘై, ముంబయి, ఒసాకాలు ఈ జాబితాలో తొలి 10 స్థానాల్లో నిలిచాయి.
* ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న తొలి 10 ప్రపంచ నగరాల జాబితాను కూడా మాస్టర్ కార్డ్ విడుదల చేసింది. ఈ జాబితాలో కూడా 5 ఆసియా నగరాలు చోటు సంపాదించాయి.
* ఇందులో లండన్ ప్రథమ స్థానంలోనూ, ఆసియా నగరమైన బ్యాంకాక్ (థాయ్‌లాండ్ రాజధాని) రెండో స్థానంలోనూ నిలిచాయి. తర్వాతి స్థానాల్లో ప్యారిస్, దుబాయ్, ఇస్తాంబుల్, న్యూయార్క్, సింగపూర్, కౌలాలంపూర్, సియోల్, హాంకాంగ్‌లు నిలిచాయి.
కుబేరుల భారతం
- బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ‘గ్లోబల్ వెల్త్-2015’ నివేదికను ఇటీవల విడుదల చేసింది. 2013లో భారత్‌లోని అత్యంత సంపన్నుల సంఖ్య 284 కాగా, 2014 నాటికి ఇది 928కి చేరినట్లు నివేదిక వెల్లడించింది. అంటే ఏడాది కాలంలోనే మన కుబేరుల సంఖ్య మూడింతలైంది.
* 2014 ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబాల సంఖ్య అత్యధికంగా అమెరికాలో (5,210) ఉంది. తర్వాతి స్థానాల్లో చైనా (1037), బ్రిటన్ (1019), భారత్ (928), జర్మనీ (679) నిలిచాయి.
* 2014 నాటికి ప్రపంచంలో వ్యక్తిగత సంపద మొత్తం 164 ట్రిలియన్ డాలర్లు ఉండగా.. 2019 నాటికి ఇది 222 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని బీసీజీ అంచనా వేసింది.
* 2014లో స్విట్జర్లాండ్‌లోని ప్రతి వెయ్యిమందిలో 135 మంది కోటీశ్వరులుండగా, ఈ సంఖ్య బహ్రెయిన్‌లో 123, ఖతార్‌లో 116, సింగపూర్‌లో 107, కువైట్‌లో 99, హాంకాంగ్‌లో 94గా ఉంది.
* కనీసం రూ.6 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న కుటుంబాలు 2013 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 15 మిలియన్లు ఉండగా.. 2014 నాటికి ఈ సంఖ్య 17 మిలియన్లకు చేరింది.
ఏఐఐబీపై ముందడుగు
- చైనా నేతృత్వంలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.38 లక్షల కోట్లు) అధీకృత మూలధన పెట్టుబడితో ఏర్పాటవుతున్న ‘ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్’ (ఏఐఐబీ – ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్)పై కీలక ముందడుగు పడింది.
* 2015, జూన్ 29న బ్యాంకు న్యాయబద్ధ విధివిధానాలపై భారత్‌తో సహా 50 వ్యవస్థాపక సభ్య దేశాలు బీజింగ్‌లో సంతకాలు చేశాయి.
* ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాలకు ఆర్థిక చేయూత అందించనున్న ఈ బ్యాంకులో సభ్యదేశాల వాటా, పాలనావ్యవస్థ తీరుతెన్నులు, విధాన నిర్ణయ ప్రక్రియలకు సంబంధించి 60 అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.
* ఏఐఐబీలో ఆసియా దేశాలే 75 శాతం వరకు పెట్టుబడిని సమకూర్చనున్నాయి. పెట్టుబడిని సమకూర్చడంలో చైనా (30.34%), భారత్ (8.52%), రష్యా (6.66%) మొదటి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి.
శిథిల గోడ
- మింగ్ శకంలో నిర్మించిన చైనా గోడ దాదాపు 30 శాతం మేర శిథిలమైందని గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా సొసైటీ ఇటీవల నివేదికలో వెల్లడించింది. వాతావరణ పరిస్థితులు, మానవ కార్యకలాపాల కారణంగా చైనా గోడ శిథిలమైనట్లు తెలిపింది.
* చైనా గోడ నిర్మాణం క్రీ.పూ. మూడో శతాబ్దంలో చైనా చక్రవర్తి క్విన్ షి హువాంగ్ హయాంలో ప్రారంభమైనప్పటికీ ఇందులో సుమారు 6,300 కి.మీ.ల మేర మింగ్ రాజవంశీయులు క్రీ.శ.1368-1644 మధ్య కాలంలోనే నిర్మించారు. దీనిలో సుమారు 1,962 కిలోమీటర్ల మేర గోడ శిథిలమైందని నివేదిక పేర్కొంది.
* లులోంగ్ గ్రామంలోని ప్రజలు ఈ వారసత్వ సంపద నుంచి ఇటుకలు తొలగించి ఇళ్లు కట్టుకుంటున్నారని, వాటిని అంతర్జాతీయ పర్యాటకులకు అమ్ముకుంటున్నారని నివేదిక వెల్లడించింది.
* చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ 2012లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం చైనాను పాలించిన వివిధ రాజ వంశస్థుల కాలంలో నిర్మించిన మొత్తం చైనా గోడ పొడవు సుమారు 13,170 మైళ్లు (21,196 కి.మీ.).
* ప్రపంచంలో అతిపెద్ద మానవ నిర్మిత కట్టడంగా, ప్రపంచ వింతల్లో ఒకటిగా.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా చైనా గోడ గుర్తింపు పొందింది.
ఎయిర్టెల్ తృతీయం
- ప్రపంచ సెల్యులర్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (డబ్ల్యూసీఐఎస్) 2015 జూన్‌లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్టెల్ నిలిచింది. 30.3 కోట్ల మంది చందాదారులతో అంతర్జాతీయంగా ఒక స్థానం మెరుగుపరుచుకొని మూడో స్థానానికి చేరింది.
* భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్రికాలతో సహా 20 దేశాల్లో ఎయిర్టెల్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1995 నవంబరులో దిల్లీలో తన కార్యకలాపాలను ప్రారంభించింది.
* 62.62 కోట్ల వినియోగదారులతో చైనా మొబైల్ అగ్రస్థానంలో నిలిచింది. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్ గ్రూప్ 40.30 కోట్ల చందాదారులతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 29.9 కోట్ల మంది సబ్స్క్రైబర్లతో చైనా యునికామ్ నాలుగో స్థానంలో, 27.41 కోట్ల మంది వినియోగదారులతో అమెరికా మోవిల్ 5వ స్థానంలో నిలిచాయి.
చోటు ‘సంపాదించారు’
- ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న 100 మంది ప్రముఖుల జాబితా (వినోదం)-2014ను ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసింది. ఈ సంస్థ 1999 నుంచి ఏటా ఈ జాబితాను రూపొందిస్తోంది.
* అమెరికా బాక్సర్ ఫ్లోయిడ్ మేవెదర్ 30 కోట్ల డాలర్లతో జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్ నుంచి ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఎం.ఎస్.ధోనీ చోటు సంపాదించారు.
* చెరో 3.35 కోట్ల డాలర్లతో అమితాబ్, సల్మాన్ ఇద్దరూ కలిసి 71వ స్థానాన్ని పంచుకున్నారు. 3.25 కోట్ల డాలర్లతో అక్షయ్ 76వ స్థానం, 3.1 కోట్ల డాలర్లతో ధోనీ 82వ స్థానాల్లో ఉన్నారు.
* 21వ శతాబ్దానికి చెందిన బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్‌లు హాలీవుడ్ నటులు లియోనార్డో డీకాప్రియో, చాన్నింగ్ టాటమ్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని ఫోర్బ్స్ ప్రశంసించింది.
* గాయకుడు టేలర్ స్విఫ్ట్ (8వ స్థానం), టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (16), గాయని బియాన్స్ (29), బుల్లితెర నటుడు కిమ్ కర్దాషి యాన్ (33), నటులు టామ్ క్రూయిజ్ (52), జానీ డెప్ (87), లియోనార్డో డీకాప్రియో (89), చాన్నింగ్ టాటమ్ (89) జాబితాలో నిలిచారు.
క్రికెట్లో మార్పులు
- వన్డే క్రికెట్లో బ్యాట్స్‌మన్ ఆధిపత్యం పెరిగిపోతోందని, నిబంధనలు బౌలర్లకు అనుకూలించేలా మార్చాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ దిశగా కీలక ముందడుగు వేసింది.
* ఇందులో భాగంగా బ్యాటింగ్ పవర్‌ప్లేను రద్దు చేయడమే కాకుండా కొన్ని కీలక మార్పులు చేసింది. చివరి 10 ఓవర్లలో ఒకప్పటిలాగే 30 గజాల వలయం అవతల అయిదుగురు ఫీల్డర్లను అనుమతించేలా నిబంధనలను సవరించింది. ప్రస్తుతం వలయం అవతల నలుగురు ఫీల్డర్లనే అనుమతిస్తోంది.
* తొలి 10 ఓవర్లలో ఇద్దరు ఫీల్డర్లు క్యాచింగ్ స్థానాల్లో ఉండాలన్న నిబంధనలను కూడా ఐసీసీ రద్దు చేసింది. అయితే తొలి పవర్‌ప్లే విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ 10 ఓవర్లలో వలయం అవతల ఇద్దరు ఫీల్డర్లే ఉండాలన్న నిబంధన కొనసాగుతుంది.
* 11-40 ఓవర్ల మధ్య మాత్రం వలయం అవతల నలుగురు ఫీల్డర్లుంటారు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఓ కీలక మార్పు కూడా ఐసీసీ చేసింది. ప్రస్తుతం పాపింగ్ క్రీజు నో బాల్‌కు మాత్రమే ఫ్రీ హిట్ ఇస్తుండగా, ఇకపై దాంతోపాటు బ్యాట్స్‌మన్‌కు వేసే నో బాల్‌కు ఫ్రీ హిట్ అవకాశం కల్పించింది. ఈ నిబంధన టీ20లకు కూడా వర్తిస్తుంది. ఈ కొత్త నిబంధనలు 2015, జులై 5 నుంచి అమల్లోకి వచ్చాయి.
భారత్‌లో మార్క్రూట్
- నెదర్లాండ్స్ ప్రధానమంత్రి మార్క్రూట్ భారత పర్యటనలో భాగంగా 2015, జూన్ 5న దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమాయ్యారు.
* ప్రాథమిక సదుపాయాలు, పెట్టుబడులు, వ్యవసాయం, సముద్రయాన సహకారం, పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ తదితర 18 రంగాల్లో సహకరించుకునేందుకు ఇరుదేశాధినేతలు అంగీకరించారు.
* తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఇరు దేశాలు కలిసి ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
తీవ్రవాదులపై ప్రతిదాడి
- 2015, జూన్ 4న మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో ఎన్ఎస్సీఎన్-కే (నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ – ఖపాంగ్) తీవ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో 18 మంది భారత సైనికులు మరణించిన ఘటనకు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది.
* ఈ చర్యలో పాల్గొని మయన్మార్‌లోని పొన్యు, ఔంగ్ జెయాల్లో తలదాచుకున్న 100 మందికిపైగా తీవ్రవాదులను భారతసైన్యం జూన్ 9న హతమార్చి, రెండు తీవ్రవాద క్యాంపులను నాశనం చేసింది.
* భారత సైన్యం ఈ విధంగా ఒక దేశంలోకి ప్రవేశించి, తీవ్రవాదులను మట్టుపెట్టడం ఇదే ప్రథమం.
బవేరియాలో సదస్సు
- 41వ జీ-7 (గ్రూప్ ఆఫ్ 7) సదస్సును 2015 జూన్ 7, 8 తేదీల్లో జర్మనీలోని బవేరియాలో నిర్వహించారు.
* 2050 నాటికి 40-50 శాతం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించాలని, 2100 నాటికి కర్బన ఇంధనాల వాడకాన్ని నిలిపేయాలని, పారిశ్రామికీకరణకు ముందున్న స్థాయితో పోలిస్తే సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గించాలని జీ-7 సదస్సు తీర్మానించింది.
* అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, విదేశీ, భద్రత, అభివృద్ధి అంశాలపై జీ-7 సదస్సు దృష్టి పెట్టింది. పేదరికం, వ్యాధులు ముఖ్యంగా ఎబోలా గురించి సదస్సులో చర్చించారు.
* జీ-7 లో సభ్యదేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్ఏలతోపాటు యూరోపియన్ యూనియన్, ఇథియోపియా, ఇరాక్, లైబీరియా, నైజీరియా, సెనెగల్, ట్యూనీషియా దేశాధినేతలు సదస్సుకు హాజరయ్యారు. ఆఫ్రికన్ యూనియన్, ఐఎంఎఫ్, వోఈసీడీ, ఐరాస, ప్రపంచబ్యాంకు అధిపతులు కూడా సదస్సులో పాల్గొన్నారు.
మాదిరి ప్రశ్నలు
1. 2015, జూన్ 2న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏ దేశ పర్యటనలో భాగంగా యూరప్‌లోని అతి ప్రాచీనమైన ఉప్సల విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు?
ఎ) బెలారస్ బి) స్వీడన్ సి) ఆస్ట్రియా డి) ఫ్రాన్స్
జ: (బి)
2. ఏ దేశ జాతీయపక్షిగా రాబిన్ అనే పక్షి ఆన్లైన్ పోల్‌లో ఇటీవల ఎంపికైంది?
ఎ) బ్రిటన్ బి) అమెరికా సి) రష్యా డి) న్యూజిలాండ్
జ: (ఎ)
3. డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులను కలిగి ఉన్న టాప్ టెన్ సంస్థల జాబితాలో చోటుపొందిన భారత సంస్థ ఏది?
ఎ) భారతీయ రైల్వేలు బి) భారత సైన్యం సి) టాటాస్టీల్ డి) ఎ, బి
జ: (డి)
4. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) భారత్‌లోని ఏ రాష్ట్ర అభివృద్ధి కోసం విజన్-2030 పేరిట ఇటీవల ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
ఎ) నాగాలాండ్ బి) ఉత్తర్ ప్రదేశ్ సి) అరుణాచల్‌ప్రదేశ్ డి) గుజరాత్
జ: (సి)
5. 2015 జూన్‌లో పర్యాటకులతో వెళుతున్న ‘ఈస్టర్న్ స్టార్’ అనే భారీ విహార నౌక బోల్తాపడి సుమారు 400 మంది మరణించిన ఘటన ఏ దేశంలో చోటు చేసుకుంది?
ఎ) జపాన్ బి) చైనా సి) రష్యా డి) ఫ్రాన్స్
జ: (బి)
6. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పెట్టెరి టాలస్ ఏ సంస్థకు సెక్రెటరీ జన రల్‌గా ఇటీవల ఎన్నికయ్యారు?
ఎ) ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)
బి) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)
సి) ప్రపంచ మేధోహక్కుల పరిరక్షణ సంస్థ (డబ్ల్యూఐపీవో)
డి) ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో)
జ: (ఎ)
7. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఢాకేశ్వరి ఆలయం ఏ దేశంలో ఉంది?
ఎ) నేపాల్ బి) బంగ్లాదేశ్ సి) చైనా డి) మయన్మార్
జ: (బి)
Leave a Reply