National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part VII
* అభివృద్ధే మంత్రం
* నవ సంక్షేమ పథకాలు
* కేంద్రం రూపకల్పన
- దేశం అభివృద్ధి చెందాలంటే.. సమాజంలో వివిధ రకాలుగా ఆర్థిక, సామాజిక ప్రతికూలతలను ఎదుర్కొంటున్న ప్రజలను ప్రగతిబాట పట్టించాలి. గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, మహిళలు అభివృద్ధిని సాధించేందుకు అనుగుణంగా విధానాలకు రూపకల్పన చేయాలి. ఈ దిశగా భారత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. బాలికలు, మహిళలు, చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు.. వీరందరి సంక్షేమానికి కృషి చేస్తోంది. ఎవరి కోసం ఎలాంటి పథకాలు అమలవుతున్నాయో తెలుసుకుందామా!
- భారతదేశ జనాభాలో సుమారు 17 శాతంగా ఉన్న దళితులు శతాబ్దాల తరబడి అనేక రకాలుగా వివక్షకు గురై అభివృద్ధికి దూరంగా ఉన్నారు. 8.5 శాతంగా ఉన్న గిరిజనుల్లో చాలామేర సాధారణ జనజీవన స్రవంతికి దూరంగా ఉన్నారు. 40 శాతానికి పైగా ఉన్న వెనకబడిన వర్గాల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు అందక పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వారెందరో.. వివిధ మతాలకు చెందిన 20 శాతం అల్ప సంఖ్యాక వర్గాలు కూడా ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. మహిళలు చాలాచోట్ల అనేక రకాలుగా వివక్ష, దాడులకు గురవుతున్నారు. జనాభాలో ఇంత ఎక్కువ శాతంగా ఉన్న ఈ వర్గాలు అభ్యున్నతిని సాధించకుండా ఏ ప్రభుత్వమూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లలేదు. అందుకే ప్రతి ప్రభుత్వం ఆయా వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలివి.
జన్‌ధన్ యోజన
- సాంకేతికంగా అధునాతన బ్యాంకింగ్ వ్యవస్థ ఉన్న మన దేశంలో 2014 వరకు కనీసం 42 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు కూడా లేవు. ఖాతాలు లేని వారిలో ఎక్కువ శాతం పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలే. వీరిలో చాలామంది తమ ఆర్థిక అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద ఏడాదికి 24 శాతం, అంతకంటే ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారుల వేసే చక్ర వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలు కూడా లేకపోవడం వల్ల ప్రభుత్వం వారి కోసం వెచ్చించే అనేక సంక్షేమ పథకాల నిధులు, సబ్సిడీలు పక్కతోవ పడుతున్నాయి. చేరాల్సిన వాళ్లకు చేరకుండా దళారుల పాలవుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు.. దేశంలోని పేద, దిగువ మధ్య తరగతి వర్గాలు సైతం బ్యాంకింగ్ ఫలాలను అనుభవించేలా, ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి బ్యాంకు ఖాతా ఉండేలా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఎలాంటి ఖర్చు లేకుండా జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరిచేలా ఈ పథకాన్ని రూపొందించారు.
- 2014, ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ఈ పథకం బృహత్తర లక్ష్యాలను వివరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ఆగస్టు 23న ప్రారంభించారు. ప్రారంభించిన నాడే 77,000 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపుల ద్వారా కోటీ యాభై లక్షల బ్యాంకు ఖాతాలను పేద, మధ్య తరగతి వారితో తెరిపించారు. జన్‌ధన్ యోజన ఖాతా తెరిచే ప్రతి ఒక్కరికీ రూపే డెబిట్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా తెరిచిన ఆరు నెలల్లో 5,000 రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించారు. హెచ్డీఎఫ్సీ ఎర్గో ద్వారా లక్ష రూపాయల బీమా, ఎల్ఐసీ ద్వారా 30,000 రూపాయల జీవిత బీమా కూడా కల్పించడం ఈ పథకం బృహత్తర లక్ష్యాలకు అద్దం పడుతుంది.
గిన్నీస్ రికార్డు
- ఈ పథకం అమలైన వారం రోజుల్లోనే ప్రపంచ గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించి రికార్డు సృష్టించింది. ఆర్థిక సమానత్వం కోసం చేపట్టిన ఈ యోజన ద్వారా ఆగస్టు 23 నుంచి 29 వరకు వారం రోజుల వ్యవధిలో అత్యధికంగా 1,80,96,130 మందికి ప్రభుత్వం బ్యాంకు ఖాతాలు తెరిచినట్టు గిన్నీస్‌బుక్ పేర్కొంది. ఇలా రికార్డులకెక్కిన ఈ యోజన ద్వారా అక్టోబరు 15 నాటికి 18 కోట్ల ఖాతాలు తెరిచారు. వీటిలో 49 శాతం ఖాతాలు మహిళలవి కావడం గమనార్హం. జన్‌ధన్ ద్వారా ఖాతా తెరిచిన ప్రజలు తమ ఖాతాల్లో మొత్తం 25 వేల కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ పథకం కింద ఇప్పటికే 95 శాతం పైగా కుటుంబాలను బ్యాంకింగ్‌కు అనుసంధానం చేశారు. పేదల కోసం వెచ్చించే లక్షల కోట్ల వనరులు, సబ్సిడీల్లో అక్రమాలను అరికట్టడానికి.. వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయడానికి జన్‌ధన్ యోజన దోహదపడింది.
సామాజిక భద్రత
- ప్రజల సామాజిక భద్రత దేశ అభివృద్ధికి ఒక సూచికలాంటిది. 125 కోట్ల జనాభా.. అందులోనూ 30 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న మన దేశంలో సామాజిక భద్రత ఎంతో అవసరం. అత్యధిక శాతం ప్రజలకు బీమా లేకపోవడం మన సామాజిక భద్రత లోటుకు అద్దం పడుతుంది. స్వాతంత్య్రానంతరం ఆరున్నర దశాబ్దాల తర్వాత కూడా దేశంలో కేవలం 4 శాతం మంది ప్రజలు ప్రమాద బీమా, 20 శాతం మంది జీవిత బీమా, 11 శాతం మంది మాత్రమే పెన్షన్ సదుపాయం కలిగి ఉండటం సామాజిక భద్రత దిశగా వెనుకబాటుతనాన్ని చాటుతోంది. ఈ పరిస్థితిని గ్రహించిన ప్రధానమంత్రి మోదీ సామాజిక భద్రతను ఒక ముఖ్యమైన పాలనా అంశంగా, ఆర్థిక విధానంగా తీసుకుని.. మూడు రకాల ప్రభుత్వ పథకాల రూపంలో ప్రజలకు అందించారు. దేశ ఆర్థిక సామాజిక భద్రత ముఖచిత్రాన్ని మార్చి వేశారు. దేశ ఆర్థిక ముఖచిత్రంపై చెరగని ముద్రవేశారు.
- ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం మన దేశంలోని 47 శాతం ప్రజలు వ్యవసాయం ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరు గత రెండు దశాబ్దాలుగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే కోలుకోలేని దెబ్బ తినేది వీరే. వీరితోపాటు పేదరికంలో జీవిస్తున్న కోట్ల మంది ప్రజలు అనుకోని ఘటనలు జరిగినప్పుడు పరిస్థితిని ఎదుర్కొనే ఆర్థికశక్తి లేక వీధిన పడుతున్నారు. ఏటా ఏదో ఒక ప్రకృతి విపత్తు ఏర్పడే మన దేశంలో ఇలాంటి వారికి తక్కువ ధరలో బీమా, పెన్షన్లు అందించడాన్ని ప్రభుత్వం తన కర్తవ్యంగా భావిస్తోంది.
- ఈ పథకం కింద నెలకు కేవలం ఒక రూపాయి ఖర్చుతో (సంవత్సరానికి 12 రూపాయలతో) ప్రధానమంత్రి జీవన సురక్ష యోజన ద్వారా 2 లక్షల రూపాయల ప్రమాద బీమా ప్రభుత్వం కల్పిస్తోంది. రోజుకి 95 పైసల ఖర్చుతో (సంవత్సరానికి 330 రూపాయలతో) ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ద్వారా 2 లక్షల రూపాయల జీవిత బీమాను కల్పిస్తుంది. లబ్దిదారులు జమచేసే మొత్తానికి ఏటా 1000 రూపాయలు వరకు ప్రభుత్వం తన వంతుగా కలిపి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు ఒక వెయ్యి నుంచి 5 వేల రూపాయల వరకు పెన్షన్ లభించేలా ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకాలు అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇంతవరకు 13 కోట్ల మందికి సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం.
బేటీ బచావో.. బేటీ పడావో
- 2001 జనాభా లెక్కల ప్రకారం 0-6 ఏళ్ల మధ్య వయసున్న బాల బాలికల నిష్పత్తి 1000 : 927 (ప్రతి 1000 మంది బాలురకు 927 బాలికలు). ఇది మరింతగా క్షీణించి 2011 జనాభా లెక్కల్లో 1000 : 918 (ప్రతి 1000 మంది బాలురకు 918 బాలికలు)కు తగ్గింది. జనాభా లెక్కల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో 1000కి 893, 908, 916గా నమోదవుతున్న లింగ నిష్పత్తి తీవ్ర ఆందోళన కలిగించే విధంగా ఉంది. మూఢ నమ్మకాలు, అవగాహనారాహిత్యం, పేదరికం తదితర కారణాల వల్ల ఆడ పిల్లలను గర్భంలోనే చంపే సంస్కృతి దేశంలో ఇప్పటికీ ఉండటంతో లింగ నిష్పత్తి దారుణంగా ఉంది. ఫలితంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వివాహాలు కావడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితి తీవ్ర సామాజిక అశాంతికి గురి చేస్తుంది.
- ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 2015, జనవరి 22న హరియాణాలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్లల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం, భ్రూణ హత్యలను నిరోధించడం, మహిళా సంక్షేమ పథకాలు మహిళలకు సక్రమంగా చేరేలా చూడటం లాంటి లక్ష్యాలతో ప్రారంభమైన ఈ పథకానికి ప్రభుత్వం మొదటిదశలో రూ.100 కోట్లు కేటాయిచింది. మహిళల భద్రతకోసం మరిన్ని పటిష్ట చర్యల కోసం గృహ మంత్రిత్వ శాఖ ద్వారా మరో రూ.150 కోట్లు కేటాయించింది.
గ్రామీణ కౌశల్ యోజన
- 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే సత్తా ఉన్న 15-35 సంవత్సరాల వయసున్న వారు సుమారు 5.5 కోట్ల మంది దాకా ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఈ యువత మన దేశానికున్న గొప్ప వనరు. అదే సమయంలో ప్రపంచంలో 5.5 కోట్ల మంది వృత్తి నిపుణుల కొరత ఉండటం భారతదేశానికి ఒక చక్కటి అవకాశంగా కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈమేరకు యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2014, సెప్టెంబరు 25న పండిట్ దీనదయాళ్ గ్రామీణ కౌశల్ యోజనను ప్రారంభించింది.
- పారిశ్రామికంగా, ఆర్థికంగా అగ్ర దేశాలైన దక్షిణ కొరియాలో 96 శాతం, జపాన్‌లో 80 శాతం, జర్మనీలో 75 శాతం, యూకేలో 70 శాతం ఉద్యోగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన వారున్నారు. మన దేశంలో కనీసం 10 శాతం కూడా వృత్తి నైపుణ్య శిక్షణ పొందినవారు లేరు. పనికి సంసిద్ధంగా ఉండటంలో మనదేశం ప్రపంచంలో అట్టడుగున ఉంది. దీన్ని గమనించి 2015-16 బడ్జెట్లో గ్రామీణ కౌశల్ యోజనకు రూ.1500 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం 2017 నాటికి 10 లక్షల గ్రామీణ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణను ఇచ్చి ఉపాధి కల్పించడానికి లక్ష్యం పెట్టుకుంది. దీనికి తోడు ‘స్కిల్ ఇండియా’ కార్యక్రమం ద్వారా అనేక వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది.
చిన్నవ్యాపారులకు పెద్దసాయం
- మన దేశంలో చిన్న వ్యాపార, పారిశ్రామిక రంగం దాదాపు 5.78 కోట్ల చిన్న వ్యాపార సంస్థల ద్వారా 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ సంస్థల్లో మూడింట రెండొంతులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన వారివే. అంతేకాదు వీటిలో సగం సంస్థలు వ్యాపారానికి అంతగా అనుకూలించని గ్రామీణ ప్రాంతాల్లోనివే. అంటే ఆర్థిక పరంగానే కాకుండా సామాజికంగా కూడా ఈ సంస్థలు ఎంతో కీలకం. రూ.11.4 లక్షల కోట్ల ఆస్తులున్న ఈ చిన్న వ్యాపార సంస్థలు ఏటా దాదాపు రూ.6 లక్షల కోట్ల అదనపు విలువను జోడిస్తున్నాయి. అంటే ఈ సంస్థలు 55 శాతం విలువను జోడిస్తున్నాయన్న మాట. కార్పొరేట్ రంగంలోని పెద్ద పారిశ్రామిక సంస్థలు మాత్రం వాటి ఆస్తుల్లో కేవలం 34 శాతం విలువను మాత్రమే జోడిస్తున్నాయి. ఇంత పెద్దమొత్తంలో ఉపాధిని, ఆర్థిక ఫలాలను అందిస్తున్న చిన్న వ్యాపార సంస్థలు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా పొందుతున్న రుణ సదుపాయం కేవలం 4 శాతం మాత్రమే. బ్యాంకుల ద్వారా రుణం పొందలేని చిన్న వ్యాపార సంస్థలు తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వడ్డీ వ్యాపారుల వద్ద 24 శాతం, అంతకంటే ఎక్కువ వడ్డికి రుణం తీసుకోవాల్సి వస్తోంది. దీంతో వ్యాపారాలను మరింతగా విస్తరించలేక పోతున్నాయి. రుణ సదుపాయం లేక వ్యాపారంపై మక్కువ ఉన్నప్పటికీ కొందరు ఔత్సాహికులు, వృత్తి నిపుణులు కొత్త వ్యాపారాలను ప్రారంభించ లేకపోతున్నారు.
- ఈ పరిస్థితిని గమనించిన నరేంద్రమోదీ ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. చిన్న వ్యాపారులు వారికున్న వ్యాపారాలను విస్తరించేందుకు, వృత్తి నిపుణులు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేందుకు వీలుగా రూ.20,000 కోట్లతో ప్రభుత్వం ముద్రా బ్యాంకును ఏర్పాటు చేసింది. దీనికి తోడుగా రూ.3,500 కోట్లతో రుణ హామీ నిధిని ఏర్పాటు చేసింది. వ్యాపార స్థాయి, ప్రారంభం, వృద్ధి, ఎన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు కేటగిరీల్లో రుణం అందజేస్తారు. శిశు కేటగిరీలో రూ.50 వేల వరకు, కిశోర్ కేటగిరీలో రూ.50 వేల నుంచి 5 లక్షల వరకు, తరుణ్ కేటగిరీలో రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణం అందజేస్తారు. 2015 సెప్టెంబరు నాటికే రూ.20 వేల కోట్ల ముద్రాబ్యాంకు రుణాలను చిన్న వ్యాపారులకు అందజేసిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1.22 లక్షల కోట్లను ముద్రా రుణాలుగా అందజేయాలని బ్యాంకులకు నిర్దేశించింది.
శ్రమయేవ జయతే
- కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్రమోదీ 2014, అక్టోబరు 16న పండిట్ దీనదయాళ్ శ్రమయేవ జయతే యోజనను ప్రారంభించారు. ఈ యోజన ద్వారా కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం దిశగా అనేక కార్యక్రమాలను రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులోని ప్రధాన అంశాల్లో దేశంలోని 4 కోట్ల మంది ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికైనా మార్చుకోవడం, ఎక్కడి నుంచి అయినా అకౌంటులో లావాదేవీలను నిర్వహంచుకునే వెసలుబాటు కల్పించే వ్యవస్థ నిర్మాణం చెయ్యడం ఒకటి. రెండోది.. దేశంలోని 6 లక్షల యూనిట్లకు గుర్తింపు సంఖ్య కల్పించి 44 కార్మిక చట్టాలకు గాను 14 చట్టాలకు సంబంధించిన ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా సమర్పించే సౌకర్యం కల్పించడం. మూడోది.. తనిఖీల విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధికారుల విచక్షణను తగ్గించడం, తనిఖీల నివేదికలను 72 గంటల్లో ఆన్లైన్ ద్వారా అందించడం. నాలుగోది.. అప్రెంటీస్ ప్రోత్సాహక కార్యక్రమం కింద మొదటి రెండు సంవత్సరాల్లో అప్రెంటీస్‌ల కోసం అందించే స్టయిపండ్లో సగం మొత్తాన్ని కేంద్రం భరించడం. అయిదోది.. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద అసంఘటిత కార్మికులకు స్మార్ట్ కార్డులను మంజూరు చేయడం.
ఉపాధి హామీ పథకం
- గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, శాశ్వత వనరుల అభివృద్ధి లాంటి లక్ష్యాలతో 2005 సెప్టెంబరులో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2009లో గాంధీ జయంతి నాడు ఈ చట్టానికి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా నామకరణం చేశారు. ఈ పథకం ఎలాంటి నైపుణ్యం అవసరంలేని రోడ్లు, కాలువలు, చెరువుల నిర్మాణం లాంటి పనుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు సంవత్సరంలో కనీసం 100 రోజుల పనిని హక్కుగా కల్పిస్తుంది. దరఖాస్తు చేసుకున్న వారికి 5 కిలోమీటర్ల పరిధిలో కనీస వేతనంతో పని కల్పించాలి. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో పని కల్పించకపోతే ప్రభుత్వం దరఖాస్తుదారుడికి నిరుద్యోగ భృతిని చెల్లించాల్సి ఉంటుంది.
- ఉపాధి హామీ పథకం ప్రధానంగా గ్రామ పంచాయతీల ద్వారా అమలవుతుంది. గుత్తేదారులకు ఈ పథకం అమలులో ఎలాంటి పాత్ర ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని రూపుమాపడం, ప్రజలకు ఉపయోగపడే వనరులను సృష్టించడమే కాకుండా మహిళా సాధికారతకు, నగరాలకు వలసలను తగ్గించడానికి, సామాజిక సామరస్యతకు ఈ పథకం తోడ్పడుతుంది. ఉపాధి హామీ కూలీల్లో 54 శాతం మంది మహిళలే. 40 శాతం మంది షెడ్యూల్డ్ కులాలు, గిరిజన జాతులకు సంబంధించిన వాళ్లు ఉన్నారు. దీన్ని బట్టి ఈ పథకం మహిళాభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి ఎంత అవసరమో అర్థమవుతుంది. ఈ పథకం ద్వారా గత పదేళ్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా వేతనాలను ఉపాధి హామీ కూలీలకు చెల్లించారు.
పహల్
- వంటగ్యాస్‌పై ప్రభుత్వం అందించే సబ్సిడీలో ప్రతి పైసా నేరుగా లబ్దిదారులకు అందించాలనే యోచనతో ప్రభుత్వం పహల్ (ప్రత్యక్ష హస్తాంతరిత్ లాభ్) అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వంటగ్యాస్‌పై ప్రభుత్వం అందించే సబ్సిడీని నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. గ్యాస్ సబ్సిడీల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఆలోచనతో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ మొదటగా 2013లో ఈ పథకాన్ని ప్రారంభించింది. క్రమంగా దేశంలోని 291 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలైంది. ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా తప్పనిసరి చేయడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి ఆధార్‌ను తప్పనిసరి చేయకుండా 2014 నవంబరులో పహల్ అనే పేరు మీద ఈ ప్రత్యక్ష సబ్సిడీ బదిలీ కార్యక్రమాన్ని దేశంలోని 54 జిల్లాల్లో మళ్లీ ప్రారంభించారు. 2015 జనవరి నాటికి దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేశారు. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం ఇంతవరకు 14.4 కోట్ల లబ్దిదారులకు రూ.26,812 కోట్ల సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదలాయించింది. ప్రపంచంలోనే అతి పెద్ద నగదు బదిలీ కార్యక్రమంగా గిన్నీస్ బుక్ ఆగస్టు 13న ఈ కార్యక్రమాన్ని రికార్డులకెక్కించింది.
- ఈ పథకం ద్వారా దాదాపు 10 శాతం మేర అక్రమాలను నిరోధించి వేల కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేయగలిగినట్లు ప్రధానమంత్రే స్వయంగా ప్రకటించారు. దీనికి తోడుగా పేదల కోసం సంపన్నులు వంటగ్యాస్ సబ్సిడీలను వదులుకోవాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభించింది. ఇంతవరకు 35 లక్షల మంది ప్రధాని పిలుపు మేరకు స్పందించి సబ్సిడీని వదులుకున్నారు. ఫలితంగా రూ.560 కోట్ల ప్రభుత్వ సబ్సిడీ ఆదా అయ్యింది.
సుకన్య సమృద్ధి యోజన
- బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల పట్ల వివక్షను, లింగ అసమానతలను రూపుమాపాలనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనను ప్రారభించింది. ఈ పథకం ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులు పోస్టాఫీసులు లేదా బ్యాంకుల్లో 10 ఏళ్ల లోపు వయసు ఉన్న తమ కుమార్తెల పేరు మీద ఖాతా తెరిచి నెలకు కనీసం రూ.1000 జమ చేయవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా లక్షన్నర వరకు డిపాజిట్ చేయవచ్చు. జమ చేసిన మొత్తంపై 9.1 శాతం చక్రవడ్డీతో పాటు ఆదాయపు పన్ను రాయితీ కూడా లభిస్తుంది. బాలికకు అయిదేళ్ల వయసు నుంచి నెలకు రూ.1000 జమచేస్తే 21 ఏళ్లకు 6 లక్షల రూపాయలు లభిస్తుంది. ఈ పథకం కింద బాలికకు 21 ఏళ్ల వయసు వచ్చేవరకు లేదా పెళ్లి అయ్యేంత వరకు ఖాతా క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఈ ఖాతా నుంచి పాక్షికంగా సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. బాల్య వివాహాలను అడ్డుకొనే లక్ష్యంతో 18 ఏళ్ల లోపు ఎలాంటి విత్‌డ్రాలను అనుమతించరు. ఆర్థిక స్వావలంబన, సాధికారత కల్పించే సుకన్య సమృద్ధి యోజనకు దేశ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.
Leave a Reply