National Current Affairs వర్తమానాంశాలు – జాతీయం Part VIII
- నసీం జైదీ, జి. సతీష్‌రెడ్డి, సి.ఎన్.ఆర్. రావు, కె.వి. థామస్.. ఈ ప్రముఖులంతా 2015లో వార్తల్లో నిలిచారు.. ఎందుకు? పశ్చిమ్ బంగా రాష్ట్రంలో 6 పట్టణాలకు పేర్లు మార్చారు.. ఆ పట్టణాలేవి? ప్రాధాన్య రంగ రుణాలను ఆర్బీఐ సవరించింది.. ఏమిటా సవరణలు? వరుసగా పదోసారి మారుతీ సుజుకీ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది.. ఆ సంస్థ ఘనత ఏమిటి? ప్రయోగశాలలో సౌరశక్తి లాంటి శక్తిని శాస్త్రవేత్తలు సృష్టించారు.. ఈ ప్రయోగం విశేషాలేంటి? లోక్‌సభలో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందింది.. మరి రాజ్యసభలో? మన దేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం రూ. 7,05,200 కోట్లు.. ఆ శాఖ లక్ష్యాన్ని చేరుకుందా? 36 ఏళ్ల తర్వాత రాజ్యసభలో ఓ ప్రైవేటు బిల్లు ఆమోదం పొందింది.. ఏమిటా బిల్లు? – పోటీ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం జాతీయ వర్తమానాంశాల సమాహారం.
సీఈసీగా నసీంజైదీ
* కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా నసీం జైదీ 2015 ఏప్రిల్ 19న బాధ్యతలు స్వీకరించారు.
* 2012 ఆగస్టులో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.
* హెచ్.ఎస్.బ్రహ్మ స్థానంలో ఈయన సీఈసీగా బాధ్యతలు చేపట్టారు.
* 1976 బ్యాచ్ ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ 2017 జులై 12 వరకు సీఈసీగా ఉంటారు.
* గతంలో ఈయన పౌర విమానయాన శాఖలో పని చేశారు.
* జైదీ 20వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్.
* మొదటి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సుకుమార్ సేన్ రికార్డు సృష్టించారు. ఆయన 1950 మార్చి 21 నుంచి 1958 డిసెంబరు 19 వరకు ఈ పదవిలో ఉన్నారు.
* సీఈసీ పదవి చేపట్టిన తొలి మహిళగా వి.ఎస్. రమాదేవి రికార్డుల్లో నిలిచారు. ఆమె 1990 నవంబరు 26 నుంచి డిసెంబరు 11 వరకు 9 వ సీఈసీగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. 2013 ఏప్రిల్‌లో బెంగళూరులో మరణించారు.
అగ్రగామిగా మారుతీ సుజుకీ
* 2014-15 ఆర్థిక సంవత్సరానికి భారత వాహనాల తయారీ సంఘం (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మానుఫాక్చరర్స్-ఎస్ఐఏఎం) ఇటీవల దిల్లీలో వెల్లడించిన గణాంకాల ప్రకారం స్వదేశీ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరోసారి వాహన మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది.
* ఈ సంస్థకు చెందిన ఆల్టో కారు వరుసగా పదోసారి విక్రయాల్లో దేశంలోనే అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
* మారుతీ సుజుకీకి చెందిన ఆల్టో, స్విఫ్ట్ డిజైర్, వ్యాగనార్లు దేశంలో కార్ల అమ్మకాల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.
* తర్వాతి స్థానాల్లో వరుసగా హ్యుందయ్ సంస్థకు చెందిన గ్రాండ్ ఐ10, ఇయాన్, ఎలైట్ ఐ20; వాటి తర్వాత హోండాకు చెందిన సిటీ; మారుతీకి చెందిన సెలేరియా; హోండాకు చెందిన అమేజ్లు వరుసగా నిలిచాయి.
* 2013-14తో పోలిస్తే 2014-15లో దేశంలో కార్ల అమ్మకాల్లో 4.99 శాతం వృద్ధి నమోదైంది.
ప్రయోగశాలలో సౌరశక్తి
* గుజరాత్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రిసెర్చ్ (ఐపీఆర్) శాస్త్రవేత్తలు సౌరశక్తి లాంటి శక్తిని ప్రయోగశాలలో సృష్టించి, విద్యుదుత్పత్తిలో ఉపయోగించుకునే దిశగా ముందడుగు వేశారు.
* పదార్థంలో నాలుగో స్థితి అయిన ప్లాస్మాను బంధించడంలో విజయం సాధించినట్లు ఐపీఆర్ ప్రకటించింది. ‘స్టడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ టోకామాక్ (ఎస్ఎస్టీ-1)’ అనే యంత్రం ద్వారా ప్లాస్మాను బంధించగలిగినట్లు తెలిపింది.
* ఈ పరిశోధన విద్యుదుత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుందని ఐపీఆర్ తెలిపింది. టోకామాక్ యంత్రంలోని సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలతో హైడ్రోజన్ ద్వారా అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్లాస్మాను ఉత్పత్తి చేసి, బంధించగలిగినట్లు ఈ సంస్థ పేర్కొంది.
* ఇది ప్రయోగశాలలో సూర్యుడి లాంటి శక్తిని సృష్టించడం వంటిదని, ఈ తరహా ప్రక్రియలో 50 మెగావాట్ల థర్మల్ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని ఐపీఆర్ పేర్కొంది.
రుణాల్లో ప్రాధాన్యం
* ప్రాధాన్య రంగ రుణాలకు సంబంధించిన నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సవరించింది.
* ఇప్పటివరకూ వ్యవసాయం, సూక్ష్మ-చిన్న సంస్థలు, ఎగుమతి రుణాలు, విద్య, గృహ రుణాలను ప్రాధాన్య రంగాలుగా ఆర్బీఐ గుర్తించింది.
* కొత్తగా మధ్యస్థాయి సంస్థలు, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగాలకు కూడా ‘ప్రాధాన్య హోదా’ కల్పించింది.
* మొత్తం రుణాల్లో ప్రాధాన్య వాటాను మాత్రం 40 శాతం వద్దే ఉంచింది. ప్రాధాన్య రంగ రుణాల్లో కొన్ని ఉపవిభాగాలకు ఎంత మొత్తం కేటాయించాలో నిర్ణయించింది.
* ప్రత్యక్ష, పరోక్ష వ్యవసాయ రంగాలకు ఆర్బీఐ రుణాలను కేటాయించింది. ఆహార తయారీ, వ్యవసాయ ప్రాసెసింగ్ రంగాలకు కూడా వ్యవసాయంలో భాగంగా రుణాలిస్తారు.
* బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాల్లో 8 శాతాన్ని చిన్న, చిరు రైతులకు మంజూరు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. అయితే ఒకేసారి కాకుండా 2016 మార్చి నాటికి 7 శాతం, 2017 మార్చికల్లా 8 శాతానికి చేరాలని సూచించింది. మొత్తం మీద వ్యవసాయ రంగానికి మంజూరుచేసే రుణాల వాటా 18 శాతం వద్దే ఉంచింది.
* సూక్ష్మసంస్థలకు 2016 మార్చికి 7 శాతం, 2017 మార్చికి 7.5 శాతం రుణాలివ్వాలి.
* మొత్తం రుణాల్లో 10 శాతం బలహీన వర్గాలకు మంజూరు చేయాలన్న లక్ష్యంలో మార్పు చేయలేదు.
* వృత్తివిద్యలతోపాటు ఇతర కోర్సులను అభ్యసించే విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు ఇచ్చే విద్యా రుణాలను కూడా ప్రాధాన్య విభాగంగా గుర్తించారు.
* 10 లక్షలు అంతకు మించి జనాభా ఉన్న నగరాల్లో రూ. 35 లక్షలకు మించని గృహాల కొనుగోలుకు రూ. 28 లక్షల వరకు ఇచ్చే రుణాలకు, మిగిలిన ప్రాంతాల్లో రూ. 25 లక్షల విలువైన నివాసాలకు ఇచ్చే రూ. 20 లక్షల వరకు రుణాలకు ప్రాధాన్య వర్తిస్తుంది.
* ఇళ్ల మరమ్మతుల కోసం మెట్రో నగరాల్లో రూ. 5 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ. 2 లక్షల వరకు ఇచ్చే రుణాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి.
* ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాదార్లకు ఇచ్చే ఓవర్ డ్రాఫ్ట్(రుణాలను) రూ. 5 వేలను కూడా ప్రాధాన్య రంగంగా గుర్తిస్తారు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ. లక్ష, పట్టణాల్లో రూ. 1.60 లక్షలు దాటకపోతేనే ఇది వర్తిస్తుంది.
* పాఠశాల భవనం, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, తాగునీటి పథకాలతోపాటు రెండు, మూడు, నాలుగో అంచె నగరాల్లో పారిశుద్ధ్య పథకాలకు ఇచ్చే రూ. 5 కోట్ల వరకు రుణాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి.
* సౌరశక్తి, బయోమాస్ ఆధారిత విద్యుత్తు జనరేటర్లు, పవన మిల్లులు, సంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించే వీధి దీపాలు, మారుమూల ప్రాంతాల విద్యుత్తు సదుపాయాల కోసం రూ. 15 కోట్ల వరకు ఇచ్చే రుణాలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి.
* బ్యాంకులు నేరుగా ఇచ్చే రూ. 50,000 వరకు రుణాలు, స్వయం సహాయక బృందాలకు ఇచ్చేవి కూడా ఈ పరిధిలోకి వస్తాయి.
* బ్యాంకుల్లో ఖాతాల ప్రారంభం, ఇతర విధుల కోసం దరఖాస్తుల్లో పురుషులు, మహిళల విభాగంతోపాటు మూడో తరహా వ్యక్తుల కోసం ప్రత్యేక చోటు కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది.
36 ఏళ్ల తర్వాత
* రాజ్యసభలో 36 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక ప్రైవేటు బిల్లు ఆమోదం పొందింది. లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తుల(ట్రాన్స్ జెండర్స్) హక్కుల పరిరక్షణకు ప్రైవేటు సభ్యుడొకరు ప్రవేశపెట్టిన బిల్లును 2015 ఏప్రిల్ 24న సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
* డీఎంకే ఎంపీ తిరూచి శివ ఈ బిల్లు (లింగమార్పిడి వ్యక్తుల హక్కుల బిల్లు 2014)ను ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం లభించింది.
* ఈ బిల్లు మనోభావాలకు సంబంధించింది కాబట్టి చట్టంగా మారదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు.
* రాజ్యసభ 1979లో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం చట్టం-1977కు చెందిన ప్రైవేటు సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
సతీష్‌రెడ్డికి ఆర్ఐఎన్ ఫెలోషిప్
* రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) సీనియర్ శాస్త్రవేత్త, హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ) డైరెక్టర్ జి.సతీష్ రెడ్డి 2015 ఏప్రిల్‌లో లండన్‌లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేవిగేషన్ (ఆర్ఐఎన్) ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు.
* ఇనర్షియల్, శాటిలైట్ ఆధారిత నేవిగేషన్, ఏవియానిక్స్ సాంకేతిక అభివృద్ధిలో మూడు దశాబ్దాలుగా చేసిన విశేష కృషికి గానూ ఈయన ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు.
* 1947లో ప్రారంభమైన రాయల్ ఇన్స్టిట్యూట్ ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 450 మందికి ఫెలోషిప్ ఇచ్చింది. మన దేశం నుంచి తొలిసారిగా సతీష్‌రెడ్డి ఎంపికయ్యారు.
* 2015 జూన్ 4న సతీష్‌రెడ్డి రక్షణమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ఈయన రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
* నెల్లూరు జిల్లాలో జన్మించిన సతీష్‌రెడ్డి అనంతపురం జేఎన్టీయూ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఎంఎస్ పట్టా అందుకున్నారు.
సీఎన్ఆర్ రావుకు జపాన్ పురస్కారం
* శాస్త్రీయ రంగంలో చేసిన విశిష్ట కృషికిగాను ప్రఖ్యాత శాస్త్రవేత్త, భారతరత్న గ్రహీత సీఎన్ఆర్ రావుకు జపాన్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్, గోల్డ్ అండ్ సిల్వర్ స్టార్’ పురస్కారాన్ని 2015 జూన్ 19న ప్రదానం చేసింది.
* దిల్లీలో ఈ పురస్కారాన్ని భారత్‌లో జపాన్ రాయబారి తకేషి యగి ప్రదానం చేశారు.
* బెంగళూరులోని ‘జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్’ అధ్యక్షుడిగా, జపాన్ అకాడమీకి విదేశీ సభ్యుడిగా ఎన్నికైన భారతీయుడిగా రావు ప్రత్యేకత సాధించారు.
ఏక్యూఐని ప్రారంభించిన మోదీ
* ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఏప్రిల్ 6న దిల్లీలో జాతీయ వాయు నాణ్యత సూచి (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ – ఏక్యూఐ)ని ప్రారంభించారు.
* తొలిదశలో దిల్లీ, హైదరాబాద్, ఆగ్రా, కాన్పూర్, లఖ్‌నవూ, వారణాసి, ఫరీదాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరుల్లో వాయునాణ్యతను ఈ సూచి ద్వారా పరిశీలిస్తారు.
* తర్వాతి దశలో 20 రాష్ట్రాల రాజధానులతో సహా 45 నగరాల్లో ఈ సూచీని ప్రారంభిస్తారు.
* ఏక్యూఐలో 6 రంగులుంటాయి. వాయునాణ్యత ఎరుపు రంగును సూచిస్తే కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందనీ, ఆకుపచ్చ రంగును సూచిస్తే ఆరోగ్యకరమైన గాలి ఉందనీ అర్థం.
* అమెరికా, చైనా, కెనడా, మలేషియా, మెక్సికో, ఫ్రాన్స్, హాంకాంగ్, సింగపూర్‌లాంటి మరికొన్ని దేశాల్లో మాత్రమే ఈ సూచీ ఉంది. దీనిద్వారా ఆయా దేశాలు కాలుష్యంపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడమే కాకుండా, కాలుష్యస్థాయిని తగ్గించడానికి అత్యవసర చర్యలు తీసుకుంటాయి.
పీఏసీ ఛైర్మన్‌గా థామస్
* పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ-పీఏసీ) ఛైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కె.వి.థామస్ రెండోసారి నియమితులయ్యారు. ఏప్రిల్ 2016 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
* కమిటీలోని 22 మంది సభ్యులను ప్రతి సంవత్సరం మే నెలలో నియమిస్తుంటారు.
* లోక్‌సభ నుంచి 15 మందిని, రాజ్యసభ నుంచి ఏడుగురిని నియమిస్తారు. ఇందులో మంత్రులకు సభ్యులుగా ఉండే అవకాశం లేదు.
* పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికను పీఏసీ పరిశీలిస్తుంది.
* 1967 నుంచి పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుడికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది.
లక్ష్యం కంటే తక్కువ
* 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖ ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ. 6,96,200 కోట్లకు పైగా వసూలు చేసింది.
* నిర్దేశిత లక్ష్యమైన రూ. 7,05,000 కోట్లతో పోలిస్తే ఇది 14 శాతం(సుమారు రూ. 9000 కోట్లు) తక్కువ.
* తొలుత రూ. 7,36,000 కోట్లను వసూలు చేయాలని ఐటీ విభాగం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా దాన్ని రూ. 7,05,000 కోట్లకు సవరించింది.
* 2013-14లో వసూలు చేసిన రూ. 5,83,000 కోట్లతో పోలిస్తే 2014-15లో వసూళ్లు 19 శాతం పెరిగాయి.
జీఎస్టీ బిల్లుకు ఆమోదం
* దేశవ్యాప్తంగా ఒకే తరహా పన్ను విధానాన్ని అమలు చేసే లక్ష్యంతో తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును 2015 మే 6న లోక్‌సభ ఆమోదించింది.
* ప్రతిపాదిత పన్నురేటు 27 శాతంగా ఉండటం వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న ఆందోళనతో ప్రభుత్వం ఏకీభవించింది. పన్నురేటును తగ్గిస్తామని హామీ ఇచ్చింది.
* జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండొంతుల ఆధిక్యం తప్పనిసరి. ప్రభుత్వం సులువుగానే ఈ ఆధిక్యాన్ని సాధించింది. బిల్లుకు అనుకూలంగా 352 ఓట్లు, వ్యతిరేకంగా 37 ఓట్లు వచ్చాయి.
* పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత మొత్తం 29 రాష్ట్రాల్లో సగానికి పైగా రాష్ట్రాలు ఈ బిల్లుకు సమ్మతి తెలపాల్సి ఉంటుంది.
* వచ్చే ఏడాది ఏప్రిల్‌లోగా జీఎస్టీ విధానాన్ని అమల్లోకి తీసుకు రావాలని గడువు విధించుకున్నారు.
* జీఎస్టీ అమలుతో రాష్ట్రాల రాబడికి ఏమైనా నష్టం వస్తే పూర్తిగా పరిహారం చెల్లిస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు. మొదటి మూడేళ్లు వందశాతం పరిహారం, నాలుగో ఏడాది 75 శాతం, అయిదో ఏడాది 50 శాతం పరిహారంగా అందుతుంది.
* 1947 నుంచి పరిశీలిస్తే.. జీఎస్టీ అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణ. ఈ పన్ను అమలుతో ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను తదితర కేంద్ర పన్నులు, అమ్మకం పన్ను, విలువ ఆధారిత పన్ను లాంటి రాష్ట్రాల పన్నులు రద్దవుతాయి.
* ఆక్ట్రాయ్ లాంటి ప్రవేశ పన్నులన్నీ జీఎస్టీ పరిధిలోకి వచ్చేస్తాయి.
* ఆల్కహాల్ తప్ప అన్ని వస్తువులు, సేవలు దీని పరిధిలోకే వస్తాయి.
* జీఎస్టీ రేటు (ఆదాయ తటస్థీకరణ రేటు)ను సంబంధిత నిపుణుల కమిటీ 27 శాతంగా నిర్ణయించింది. ప్రపంచ సగటు 16.4 శాతం కంటే ఇది చాలా ఎక్కువ.
రాజ్యసభలో జీఎస్టీ
* 2015 ఆగస్టు 11న జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. దీనిపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పలు విధానపర అభ్యంతరాలు లేవనెత్తుతూ చర్చను అడ్డుకుంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ అడ్డుకుంది.
6 పట్టణాలకు కొత్తపేర్లు
* పశ్చిమ్ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలోని 6 పట్టణాలకు పేర్లను మార్చారు.
మాదిరి ప్రశ్నలు
1. ఇటీవల ఏ నగరంలోని రైల్వేస్టేషన్ పేరును ‘క్రాంతివీర సంగోలి రాయన్న’గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది?
ఎ) బెంగళూరు బి) చెన్నై సి) తిరువనంతపురం డి) పనాజీ
జ: (ఎ)
2. ‘ప్రధాన మంత్రి ముద్రా యోజన’లో భాగంగా ఎంత మూలధనంతో (మైక్రో) యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ – MUDRA) బ్యాంకును 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ దిల్లీలో ప్రారంభించారు?
ఎ) రూ.5 వేల కోట్లు బి) రూ.10 వేల కోట్లు సి) రూ.15 వేల కోట్లు డి) రూ.20 వేల కోట్లు
జ: (డి)
3. ఆసియాలో అత్యంత ప్రతిభ కనబర్చిన పాత్రికేయులకు ఇచ్చే ‘ఓస్బర్న్ ఎల్లియట్’ అవార్డును 2015కుగానూ ఎవరికి ఇచ్చారు?
ఎ) రక్తీమ్ కటాకే బి) రాజేష్‌కుమార్ సింగ్ సి) టామ్ లస్సెటర్ డి) పై ముగ్గురూ
జ: (డి)
4. కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టులో ప్రారంభించిన ‘సమన్వయ్’ వెబ్ పోర్టల్ దేనికి సంబంధించింది?
ఎ) డిజిటల్ అక్షరాస్యత బి) గ్రామ పంచాయతీలు సి) పర్యాటక రంగం డి) బ్యాంకింగ్ వ్యవస్థ
జ: (బి)
5. జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు కార్పొరేషన్ (ఎస్బీ) ప్రెసిడెంట్‌గా ఇటీవల నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు?
ఎ) వరుణ్‌ధావన్ బి) ధనుష్ గంగూలీ సి) నికేష్ అరోరా డి) కృష్ణమల్హోత్రా
జ: (సి)
6. ‘హాఫ్ ఏ బిలియన్ రైజింగ్’ పుస్తక రచయిత్రి ఎవరు?
ఎ) అనిరుద్దాదత్తా బి) అనితాదేశాయ్ సి) సునీతా నారాయణ్ డి) గీతామోహన్
జ: (ఎ)
Leave a Reply