TSPSC Group II Paper I పర్యావరణ అంశాలు – పర్యావరణ ఉద్యమాలు
- పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలుగా తెలంగాణలో పలు సామాజిక ఉద్యమాలు జరిగాయి. వీటిలో నల్గొండ జిల్లాలో యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా.. రాజధాని నగరంలో మూసీ నది ప్రక్షాళన దిశగా నిర్వహించిన ఉద్యమాలు ప్రధానమైనవి. స్థానికుల నుంచి వ్యక్తమైన నిరసనలు ఉద్యమాలుగా మారాయి. వీటికి పలు సంస్థలు,
ప్రముఖుల నుంచి మద్దతు లభించడంతో కొంతమేర విజయవంతమయ్యాయి. ఈ ఉద్యమాల వివరాలు తెలుసుకుందాం.. - మన దేశంలో పర్యావరణ ఉద్యమాలు గ్రామస్థాయి నుంచి 1970లలోనే ప్రారంభమయ్యాయి. 1980వ దశకం నుంచి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు మొదలయ్యాయి. 1990వ దశకం నుంచి ఉద్యమాలు తీవ్రమయ్యాయి. ప్రపంచీకరణ, నయా ఉదారవాదం పేర్లతో చోటు చేసుకున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పర్యావరణ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ప్రాంతీయంగా కూడా పర్యావరణం, మానవ హక్కుల పరిరక్షణ దిశగా సాగిన సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా.. ఒక ఆశయం కోసం పనిచేస్తాయి. ప్రజాస్వామిక విధానాల్లోనే కార్యక్రమాలను రూపొందిస్తాయి.
యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం
- భారత యురేనియం సంస్థ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – యూసీఐఎల్) తెలంగాణలో నల్గొండ జిల్లా నాగార్జున జలాశయం సమీపంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించింది. దీని సమీప గ్రామాల్లో సుమారు 1303 ఎకరాల్లో యురేనియం నిక్షేపాలున్నట్లు యూసీఐఎల్ నిర్ధారించింది. 2001 ఫిబ్రవరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం మైనింగ్, శుద్ధి కర్మాగారాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకగ్రీవంగా ఆమోదించింది.
* 2002 సెప్టెంబరులో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంభాపురం గ్రామాల్లో యురేనియం గనుల తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద 795 ఎకరాల్లో సుమారు రూ.315 కోట్లతో దాదాపు 20 ఏళ్ల వరకు తవ్వకాలు చేయడానికి నిర్దేశించింది. అనుమతుల అనంతరం నమూనాల కోసం తవ్వకాలను ప్రారంభించడంతో అప్పట్లో స్థానికులు దీన్ని వ్యతిరేకించారు.
* 2005లో దేవరకొండ పరిధిలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నించగా అక్కడి స్థానికుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2006లో ‘యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున స్థానికులు ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమానికి గిరిజన సమాఖ్య అధ్యక్షుడు రవీంద్రనాయక్ మద్దతు తెలిపారు. పర్యావరణవేత్తలు, జన విజ్ఞాన వేదిక, పౌరహక్కుల సంఘం నాయకులు కూడా మద్దతిచ్చారు.
* 2007లో లంభాపురం, పెద్దగట్టు, శేరుపల్లి, చిట్రియాల, పెద్దమూల, కాచరాజుపల్లి గుట్టల్లోని అటవీ ప్రాంతంలో దేశ రక్షణ, అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యురేనియం నిక్షేపాలున్నట్లు యురేనియం సంస్థ పరిశోధనలో తేలింది. దీంతో 2007లో మళ్లీ యురేనియం శుద్ధి కర్మాగార నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులను అక్కడి స్థానికులు పెద్దఎత్తున అడ్డుకున్నారు. ప్రజలకు మద్దతుగా 20 స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ఇది చివరికి ప్రజా ఉద్యమంగా మారి నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనుకంజ వేసి పనులను వాయిదా వేసింది.
మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమం
- 1980వ దశకం నుంచి హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. దీంతో పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలన్నీ మూసీ నదిలో కలవడం వల్ల అది ఒక మురికి కాలువగా మారింది. వాస్తవంగా.. మూసీ నది హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తుండటం వల్ల నగర ప్రజల తాగునీటి అవసరాలకు ఉద్దేశించి దీని ఉపనదిపై హుస్సేన్‌సాగర్ సరస్సును పూర్వకాలంలో నిర్మించారు. అయితే కాలక్రమేణా ఈ నీరు కలుషితమైంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రతిరోజూ జంట నగరాల నుంచి 350 మిలియన్ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలు కలుస్తున్నట్లు గత పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 1986లో డాక్టర్ కిషన్‌రావు, కె.పురుషోత్తమ్‌రెడ్డిల ఆధ్వర్యంలో ‘సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్’ అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థగా ఏర్పడి స్థానిక ప్రజలను కూడగట్టారు. ఇతర పర్యావరణ సంఘాలతో కలిసి మూసీ కాలుష్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. నదీ పరీవాహక ప్రాంత ప్రజల జీవించేహక్కును కాపాడాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1988లో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఫలితంగా కొన్ని పరిష్కారాలను కనుక్కున్నారు. 1989లో హానికరమైన వ్యర్థపదార్ధాల నిర్వహణ, నిల్వ, పరిష్కారాల కోసం ‘హానికరమైన వ్యర్థపదార్థాల’ నియమావళిని ప్రభుత్వం రూపొందించింది. ఈమేరకు ఉద్యమం కొంత విజయం సాధించింది.
* 2000లో మూసీ నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీట్ కాలువ ద్వారా ప్రవహింపజేసి.. నదీ జలాల ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి తెలుగుదేశం ప్రభుత్వం ‘నందనవనం’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది సమీపంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించింది. దీంతో ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ‘మూసీ బచావో ఆందోళన్’ అనే నినాదంతో స్థానిక సామాజిక సంస్థలు ఉద్యమం చేపట్టాయి. దీనికి పర్యావరణవేత్త మేధా పాట్కర్ మద్దతు ఇవ్వడంతో ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది.
* 2000, జూన్ 24న ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ అనే సంస్థను ప్రారంభించారు. ఈ ఫోరమ్ కన్వీనర్ ఎం.వేదకుమార్ ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ బచావో’ అనే పర్యావరణ ఉద్యమం మొదలైంది. 2006, నవంబరు 21న కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు పురానా పూల్ వంతెన నుంచి అంబర్‌పేట వరకు పాదయాత్ర చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఛత్రీ, గమన అనే రెండు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి.
* 2007లో మూసీనదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ జలమండలి మూసీ నది పొడవునా దశలవారీగా మురుగు శుద్ధి, ప్రక్షాళన పనులను చేపట్టడానికి 10 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సిద్ధం చేసింది. అయితే వీటివల్ల అక్కడి జనావాసాలకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయని ‘సేవ్ మూసీ రివర్ క్యాంపైన్’ పేరుతో స్థానిక పర్యావరణ సెల్ 2009, జూన్ 2న ఉద్యమం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి మద్దతుగా సేవ్ లేక్స్ సొసైటీ, సేవ్ రాక్స్ సొసైటీ, అక్షర, ప్రజా చైతన్య వేదిక, పుకార్, చెలిమి ఫౌండేషన్, హెరిటేజ్ వాచ్ లాంటి పర్యావరణ సంఘాలు పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యపరిచాయి.
* 2009 నుంచి నగరం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మూసీ నది పరివాహక ప్రాంతాలు రియాల్టర్లు, కబ్జాదారుల ఆక్రమణలకు గురవుతూ వస్తున్నాయి. మలక్‌పేట, హిమాయత్‌నగర్, అజ్గంపురా, కాచీగూడ ప్రాంతాల్లో మూసీ నది ఆక్రమణలకు గురైంది. ముఖ్యంగా ఒక సంస్థ నదీ పరివాహ ప్రాంతాన్ని కబ్జాచేసి వేసిన వెంచర్ చుట్టూ ప్రహరీగోడను నిర్మించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు ‘మూసీ బచావో’ పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు తెలిపాయి. ఈ ఉద్యమకారుల డిమాండ్‌కు స్పందించి జీహెచ్ఎంసీ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
- తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించడానికి పర్యావరణ నిర్వహణ ద్వారా ఆర్ధిక వృద్ధి సాధించడమే లక్ష్యం.– టీఎస్ పీసీబీ విజన్
మాదిరి ప్రశ్నలు
1. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ఎవరు?
ఎ) జోగు రామన్న బి) అజ్మీరా చందూలాల్ సి) జూపల్లి కృష్ణారావు డి) కొప్పుల ఈశ్వర్
జ: (ఎ)
2. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఎవరు?
ఎ) బహుగుణ బి) రాజీవ్‌శర్మ సి) అనురాగ్‌శర్మ డి) ఎ.కె.చాందా
జ: (బి)
3. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2014, జులై 6 బి) 2015, జులై 6 సి) 2014, ఆగస్టు 6 డి) 2015, ఆగస్టు 6
జ: (ఎ)
4. ప్రాంతీయ సామాజిక ఉద్యమాలు ఏ దశకం నుంచి ప్రారంభమయ్యాయి?
ఎ) 1980 బి) 1990 సి) 2000 డి) 1970
జ: (ఎ)
5. తెలంగాణలో యురేనియం నిక్షేపాలున్న జిల్లా ఏది?
ఎ) రంగారెడ్డి బి) మహబూబ్‌నగర్ సి) నల్గొండ డి) మెదక్
జ: (సి)
6. ‘సిటిజన్స్ ఆగైనిస్ట్ పొల్యూషన్’ అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 1986 బి) 1987 సి) 1988 డి) 1989
జ: (ఎ)
7. ‘ఛత్రీ, గమన, పుకార్, చెలిమి’ అనేవి ఏమిటి?
ఎ) వ్యాపార సంస్థలు బి) ప్రకటన సంస్థలు సి) స్వచ్ఛంద సంస్థలు డి) ప్రభుత్వ సంస్థలు
జ: (సి)
8. మూసీనది కాలుష్య వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన పర్యావరణవేత్త ఎవరు?
ఎ) బాబా ఆమ్టే బి) మేధా పాట్కర్ సి) రాజేంద్ర సింగ్ డి) బహుగుణ
జ: (బి)
9. 2000, జూన్ 24న ఏర్పడిన ‘ఫోరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ కన్వీనర్ ఎవరు?
ఎ) ఎం.వేదకుమార్ బి) డాక్టర్ కిషన్‌రావు సి) కె.పురుషోత్తంరెడ్డి డి) రామారావు
జ: (ఎ)
10. నల్గొండలో యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమానికి మద్దతునిచ్చిన గిరిజన సమాఖ్య నాయకుడు ఎవరు?
ఎ) రవీంద్రనాయక్ బి) నాగేశ్వర్రావు సి) వీరేంద్రనాయక్ డి) ధరేంద్రసింగ్
జ: (ఎ)
11. నల్గొండ జిల్లాలో ‘యురేనియం ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం’ అనే స్వచ్ఛంద సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
ఎ) 2005 బి) 2006 సి) 2007 డి) 2008
జ: (బి)
12. మూసీ నది వెంబడి ఉద్యానవనం అభివృద్ధి చేసేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు ఏది?
ఎ) హరితపత్రం బి) నందనవనం సి) మిత్రవనం డి) జలవనమండలి
జ: (బి)
13. 2006 నవంబరు 21న హైదరాబాద్‌లో కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ‘హైదరాబాద్ బచావో’ అనే నినాదంతో పాదయాత్ర ఎక్కడ నిర్వహించారు?
ఎ) మియాపూర్ నుంచి ఎల్బీనగర్ బి) జూబ్లీహిల్స్ నుంచి ఫలక్‌నుమా సి) పురానా పూల్ నుంచి అంబర్‌పేట డి) అంబర్‌పేట నుంచి మలక్‌పేట
జ: (సి)
14. ‘వాటర్ మెన్ ఆఫ్ ఇండియా, జోహడ్ వాలా బాబా’ అనే బిరుదులు ఎవరివి?
ఎ) వందనా శివా బి) సునీతా నారాయణ్ సి) అన్నాహజారే డి) రాజేంద్రసింగ్
జ: (డి)
15. టైమ్ మ్యాగజైన్ ‘పర్యావరణ హీరో’గా ఎవరిని అభివర్ణించింది?
ఎ) సునీతా బి) అన్నాహజారే సి) వందనాశివ డి) మాధవ్ ప్రియదాస్
జ: (సి)
16. ‘జలమందిర్ యాత్ర’ పేరుతో గుజరాత్లో ప్రజలను చైతన్యపరిచిన జానపద గాయకుడు ఎవరు?
ఎ) రామ్‌బియా బి) మాధూరిప్రియ సి) రామ్‌లీలావాలా డి) మనోహర్‌బియా
జ: (ఎ)