APPSC | TSPSC Group II Paper I సామాజిక మినహాయింపు – కుటుంబ వ్యవస్థ
* సామాజిక జీవన సాఫల్యం
* విశిష్టతలు.. వైవిధ్యాలు
* వివాహ వ్యవస్థతో అనుబంధం
ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. ఇది ఎప్పుడు ఆరంభమైందనే విషయంలో స్పష్టత లేకున్నా.. సమాజం ఆరంభమైనప్పుడు మానవులు సమూహంగా జీవించి, వివాహ వ్యవస్థ ఆవిర్భవించాక కుటుంబ వ్యవస్థ మొదలైందనే అభిప్రాయం ఉంది. అందుకే కుటుంబం, వివాహం సమాంతర వ్యవస్థలని అంటారు. అనాగరిక యుగంలో తప్ప మానవ చరిత్రను అవగాహన చేసుకున్న ప్రతిదశలోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది.
భారతీయ జీవన విధానం
- భారతీయ సమాజంలోని వివిధ సమూహాల్లో, సామాజిక వ్యవస్థల్లో కుటుంబం, వివాహం, బంధుత్వం ప్రధానమైనవి. వ్యక్తిని సామాజిక, సాంస్కృతిక జీవిగా మలిచే ప్రక్రియలో కుటుంబ, వివాహ వ్యవస్థలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. వ్యక్తి జీవన విధానాన్ని క్రమబద్ధీకరించడంలోనూ, ప్రవర్తనను నియంత్రించడంలోనూ కూడా కుటుంబం, వివాహం కీలకమైనవే. కుటుంబానికి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలుంటాయి. అవి..
* కుటుంబానికి వివాహం పునాది. వివాహం ద్వారా స్త్రీ పురుషులిద్దరూ కుటుంబాన్ని ఏర్పరచుకొని.. సామాజిక ఆమోదయోగ్యమైన వైవాహిక సంబంధం ద్వారా సంతానోత్పత్తి చేసి.. సమాజం నిరంతరం కొనసాగేలా చేయడం. కుటుంబం, వివాహం అవినాభావ సంబంధమున్న భావనలు.
* కుటుంబానికున్న మరో లక్షణం జైవిక సంబంధం. అంటే కుటుంబ పరిమితిలోనే వివాహం ద్వారా స్త్రీ పురుషులిద్దరూ వైవాహిక, శారీరక సంబంధాలను కలిగి ఉండొచ్చని వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చెబుతాయి. కుటుంబ సభ్యులపై ఉమ్మడి బాధ్యతలు, విధులుంటాయి. ఆర్థిక, సామాజిక పరమైన హక్కులు.. విధులు, బాధ్యతలుంటాయి.
* కుటుంబాన్ని సాధారణమైన సామాజిక సమూహంగా పరిగణించలేం. కుటుంబానికి ప్రతి సమాజంలో ఓ విశిష్ఠత, ప్రత్యేకత ఉంటాయి.
వైవిధ్యభరితం
- కుటుంబ వ్యవస్థ అన్ని సమాజాల్లో ఒకేలా ఉంటుందా? అంటే ఉండదనే సమాధానమే వస్తుంది. ఒక్కో సమాజంలో ఒక్కో రకంగా కుటుంబం కనిపిస్తుంది. సమాజ శాస్త్రవేత్తలు కొన్ని ప్రాతిపదికల ఆధారంగా కుటుంబాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు.
యాజమాన్యానుగుణం..
- కుటుంబంపై ఉండే యాజమాన్యం, అధికారాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు. అవి..
1. పితృస్వామిక కుటుంబం: కుటుంబంపై అధికారం పురుషుడి చేతుల్లో ఉంటే దాన్ని పితృస్వామిక కుటుంబం అంటారు. మన దేశంలో చాలామేర కనిపించేవి పితృస్వామిక కుటుంబాలే.
2. మాతృస్వామిక కుటుంబం: కొన్ని సమాజాల్లో యాజమాన్యం స్త్రీల చేతుల్లోనూ ఉంటుంది. అలాంటి కుటుంబాన్ని మాతృస్వామిక కుటుంబం అని అంటారు. ఇందులో ఆస్తి తల్లి నుంచి కూతురుకు సంక్రమిస్తుంది. కేరళలోని నాయిర్ కుటుంబాల్లో ఈ మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది.
వంశానుక్రమం
- వంశానుక్రమాన్ని బట్టి కూడా కుటుంబాన్ని 3 రకాలుగా వర్గీకరించారు. అవి..
1. మాతృవంశీయ కుటుంబం: తల్లి ద్వారా గుర్తించిన వంశాలు మాతృవంశీయ కుటుంబాలు. అంటే తల్లిని మూలజననిగా భావించినట్లయితే అలాంటి కుటుంబాన్ని మాతృవంశీయ కుటుంబం అంటారు.
2. పితృవంశీయ కుటుంబం: తండ్రి ద్వారా గుర్తించినవైతే పితృవంశీయ కుటుంబాలు.
3. పితృమాతృవంశీయ కుటుంబం: పై రెండూ కాకుండా ఇద్దరి నుంచీ వంశానుక్రమాన్ని గుర్తిస్తే దాన్ని పితృమాతృ వంశీయ కుటుంబం అంటారు. ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. కొన్ని గిరిజన సమాజాల్లో మాత్రమే ఇలాంటివి ఉన్నట్లు సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నివాస ప్రాధాన్యం
- మరో వర్గీకరణలో వివాహానంతరం దంపతుల నివాసాన్ని బట్టి కుటుంబాలను 5 రకాలుగా పేర్కొన్నారు. అవి..
1. పితృస్థానిక కుటుంబం: వివాహం తర్వాత భార్యాభర్తలు భర్త తల్లిదండ్రులతో కలసి జీవించడం.
2. మాతృస్థానిక కుటుంబం: వివాహానంతరం భార్యాభర్తలు భార్య తల్లిదండ్రులతో కలసి జీవించడం.
3. ద్విస్థానిక కుటుంబం: వివాహానంతరం భార్యభార్తలు వారిరువురి తల్లిదండ్రులతో కలసి జీవించడం.
4. మాతుల స్థానిక కుటుంబం: వివాహానంతరం భర్త తన భార్యతో కలసి తల్లిసోదరుడి అంటే మేనమామ ఇంట్లో నివసించడం. ఇది కొన్ని గిరిజన తెగల్లో కనిపిస్తుంది.
5. నూతన స్థానిక కుటుంబం: వివాహానంతరం భార్యభర్తలు కొత్తగా తమదైన కాపురాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇలాంటివి నగర సమాజాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. స్వతంత్రంగా జీవించాలనే భావన నేటితరం యువతీయువకుల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి నూతన స్థానిక కుటుంబాలు ఏర్పడుతున్నాయి.
పరిమాణ క్రమం
- కుటుంబ పరిమాణాన్ని బట్టి కుటుంబాలను 2 రకాలుగా చెప్పారు. అవి..
1. ప్రాథమిక కుటుంబం లేదా వ్యష్టి కుటుంబం: భార్యాభర్తలు లేదా వారితోపాటు వారి అవివాహిత సంతానం కుటుంబ సభ్యులైతే దాన్ని ప్రాథమిక లేదా వ్యష్టి కుటుంబం అంటారు.
2. ఉమ్మడి కుటుంబం లేదా సమష్టి కుటుంబ వ్యవస్థ: రెండు లేదా మూడు తరాలకు చెందిన వ్యక్తులు ఒకేచోట నివసిస్తుంటారు. ఒకే వంటగది ఉండి.. ఒకే సంస్కృతి, సంప్రదాయాలతో ఉమ్మడి ఆస్తిని కలిగి, కుటుంబ పెద్ద ఆధిపత్యంలో ఆ ఆస్తి ఉంటే దాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. ఆస్తివిభజన లేకపోవడం ఇందులో ప్రధానమైంది. ఇందులో పితృస్వామిక, మాతృస్వామిక కుటుంబాలుంటాయి. కేరళలోని నాయిర్ సమూహంలో, మేఘాలయలోని ఖాసీ తెగల్లో కూడా మాతృస్వామిక సమష్టి కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది.
జీవనక్రమం
- మరో రకమైన వర్గీకరణ కూడా ఉంది.
1. వైవాహిక కుటుంబం: సంతతి కాకుండా కేవలం భార్యాభర్తలుండేది.
2. రక్తసంబంధ కుటుంబం: కేవలం రక్త సంబంధమైన బంధుత్వం గల వ్యక్తులుండేది. ఉదాహరణకు కుటుంబంలో భార్యాభర్తలు విడాకులు తీసుకున్నా, వారిలో ఎవరైనా ఒకరు చనిపోయినా మిగిలినవారు, వారి పిల్లలు. ఇలాంటి వారినే సింగిల్ పేరెంట్ కుటుంబాలని కూడా అంటారు.
వివాహ ప్రాతిపదిక..
కుటుంబ వర్గీకరణల్లో మరో రకం కూడా ఉంది..
ఏక వివాహ కుటుంబం: ఒక వ్యక్తి కేవలం ఒకరిని మాత్రమే భాగస్వామిగా కలిగి ఉండటం.
బహు వివాహ కుటుంబం: ఒక పురుషుడు లేదా ఒక స్త్రీకి ఒకరిని మించిన భాగస్వాములు ఉండటం.. ఇందులో రెండు రకాలు. మొదటిది.. బహు భర్తృత్వ కుటుంబం. రెండోది.. బహుభార్యత్వ కుటుంబం. ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువమందిని భర్తలుగా కలిగి ఉంటే అది బహుభర్తృత్వ కుటుంబం. నీలగిరి పర్వతాల్లోని తోడా అనే తెగల్లో ఈ వ్యవస్థ ఈనాటికీ కనిపిస్తుంది. అలాగే ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువమందిని భార్యలుగా కలిగి ఉంటే అది బహుభార్యత్వ కుటుంబం. చట్టం ఆమోదించకపోయినా బహుభార్యత్వ కుటుంబ వ్యవస్థలు మన సమాజంలో కనిపిస్తుంటాయి.
కుటుంబం వర్గీకరణలన్నింటినీ మొత్తం సూక్ష్మంగా పరిశీలిస్తే.. భారతీయ కుటుంబ వ్యవస్థను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. ప్రాథమిక లేదా వ్యష్టి కుటుంబాలు
2. సమష్టి కుటుంబాలు
3. పితృస్వామిక కుటుంబాలు
4. మాతృస్వామిక కుటుంబాలు
పరిణామ క్రమం
- సాంప్రదాయిక కుటుంబ వ్యవస్థ యథావిధిగా కొనసాగుతోందా? మార్పులేమైనా చోటు చేసుకుంటున్నాయా? అనే విషయానికొస్తే.. సామాజిక శాస్త్రవేత్తల అభిభాషణ ప్రకారం నేటి కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా భారత్‌లో పారిశ్రామికీకరణ, విద్యావ్యాప్తి, నగరీకరణ, వివిధ చట్టాలు, ఆర్థిక, ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల భారతీయ కుటుంబ వ్యవస్థలో చాలా మార్పులొస్తున్నాయి.
* సమష్టి కుటుంబ వ్యవస్థ విఘటితమై వ్యష్టి కుటుంబ వ్యవస్థ (ప్రాథమిక కుటుంబం) పెరుగుతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బలహీనపడుతోంది.
* కుటుంబం ఒకప్పుడు ఉత్పత్తి యూనిట్‌గా ఉండేది. అంతా ఒకేరకమైన వృత్తిలో పాలుపంచుకునేవారు. ఉదాహరణకు వ్యవసాయాన్ని తీసుకుంటే కుటుంబంలోని సభ్యులంతా వ్యవసాయానికి సంబంధించిన పనుల్లో సాయపడేవారు. ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబం ఉత్పత్తి యూనిట్‌గా లేదు. ఎందుకంటే కుటుంబంలోని వ్యక్తులు వారివారి నైపుణ్యాలు, అభిరుచులను బట్టి వృత్తులను, పనులను ఎంచుకుంటున్నారు. ఉత్పత్తి పరంగా చూస్తే కుటుంబం విఘటితమవుతోంది.
* ఒకప్పుడు కుటుంబం నిర్వర్తించే పనులను, విధులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు కుటుంబం చేయాల్సిన పనుల్లో సాంఘికీకరణ అత్యంత కీలకమైంది. గతంలో పిల్లలు కుటుంబ వ్యవస్థ ద్వారానే సాంఘికీకరణం చెందేవారు. సమాజానికి సంబంధించిన అనేక విషయాలు, సామాజిక విలువలు, ప్రమాణాలు, ఆచారాలు, సంప్రదాయాలు.. అన్నీ కుటుంబ వ్యవస్థ ద్వారా నేర్చుకునే వారు. కానీ వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాక తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యధిక సమయాన్ని కేటాయించే పరిస్థితుల్లో లేరు. చాలామంది తమ పిల్లల్ని చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాల్లో (బేబీ కేర్ సెంటర్లు), ప్రభుత్వం ఏర్పరచే సంస్థల్లో (హాస్టళ్లలో) ఉంచుతున్నారు. అక్కడే ఎక్కువగా సాంఘికీకరణ జరుగుతోంది. పిల్లలతోపాటు వృద్ధులకు గతంలో కుటుంబమే రక్షణగా నిలిచేది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ వారికి రక్షణ కల్పించే పరిస్థితి లేదు. అందుకే నగర ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలు ఎక్కువగా వెలుస్తున్నాయి. ఆధునిక సమాజంలో ఒకప్పుడు కుటుంబం సమష్టి విలువలపై ఆధారపడి ఉండేది. ఇప్పుడా విలువలు అంతగా కొనసాగడం లేదు. ప్రజాస్వామిక విలువలు కూడా కుటుంబ వ్యవస్థపై ప్రభావితం చూపుతున్నాయి. కుటుంబంలోని ప్రతి వ్యక్తికి చాలామేర స్వేచ్ఛ ఏర్పడింది. ప్రతి వ్యక్తి తనకనుగుణమైన జీవనవిధానాన్ని ఏర్పరచుకుంటున్నాడు.
* గతంలో కుటుంబ వ్యవస్థలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉండేది కాదు. సాంప్రదాయిక పితృస్వామ్య వ్యవస్థలో మహిళ పురుషుడికి అణిగిమణిగి ఉండే ధోరణి కనిపించేది. ఇప్పుడు సమాజంలో ముఖ్యంగా, పారిశ్రామికీకరణ, నగరీకరణ వల్ల మహిళలు రకరకాల వృత్తుల్లో ప్రవేశిస్తున్నారు. ఆర్థికంగా స్వేచ్ఛ లభించింది. సామాజికంగా, ఆర్థికంగా మహిళా సాధికారికత కారణంగా మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో చాలా మార్పులొచ్చాయి.
* ఒకవైపు ఈ మార్పు వచ్చినా, కుటుంబ సంఘర్షణలు చాలా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఆధునిక కుటుంబంలో సంఘర్షణలు ఎక్కువయ్యాయి. తద్వారా విడాకుల సంఖ్య పెరుగుతోంది. విడాకుల రేటు పెరగడం భారతీయ కుటుంబ వ్యవస్థలో కొత్త ధోరణి.
* తల్లిదండ్రులు, యువతరం మధ్య కూడా సంఘర్షణ పెరుగుతోంది. తల్లిదండ్రులు, యువతరం ఆలోచనా రీతుల్లో అంతరం ఉంది. విలువలు, వృత్తి, విద్య సంబంధమైన సంఘర్షణ చోటు చేసుకుంటోంది.
* కుటుంబ జీవన విధానంలో వైయక్తిక వాదన పెరుగుతోంది. ప్రతి వ్యక్తి తన గురించి, తన ఆలోచన ప్రకారమే జీవితాన్ని గడపాలనే భావన పెరుగుతోంది.
* ఇటీవల కాలంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కారణంగా కుటుంబ వ్యవస్థలో కొన్ని కొత్త ధోరణులు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైంది సహజీవనం. వాస్తవానికి భారతీయ సమాజంలో వివాహం ద్వారా మాత్రమే స్త్రీ పురుషులు కలిసి జీవించడానికి అవకాశం ఉండేది. కానీ అలాంటి నియమనిబంధనలను అతిక్రమించి సహజీవనం చేసే పద్ధతి భారతీయ జీవనంలో ముఖ్యంగా నగరజీవనంలో ప్రారంభమైంది.
* భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం వల్ల సింగిల్ పేరెంట్ కుటుంబాలు పెరుగుతున్నాయి. పిల్లలు తల్లితోనో లేదా తండ్రితోనో మాత్రమే జీవించే పరిస్థితి.. కుటుంబ వ్యవస్థ విఘటితమైన సందర్భాల్లో పిల్లల్లో విచలిత మనస్తత్వాలకు అవకాశం ఎక్కువ.
* సంతానం కోసం అద్దెగర్భం అనేది మరో కొత్త భావన. మాతృత్వ భావనను పొందకుండానే పిల్లల్ని కనే పరివర్తన ధోరణులు కుటుంబ వ్యవస్థలో కనిపిస్తున్నాయి.
తోడూ.. నీడా..
- సమాజ శాస్త్రవేత్తల అభిభాషణ ప్రకారం కుటుంబం ప్రధానంగా 6 రకాల ప్రకార్యాల్ని(విధుల్ని) నిర్వర్తిస్తుంది.
1. జైవిక ప్రకార్యం
- స్త్రీ పురుషుల మధ్య ఉండే శారీరక వాంఛలను ఓ క్రమపద్ధతిలో, సమాజ ఆమోదయోగ్యమైన పద్ధతిలో తీర్చుకునే వ్యవస్థను కుటుంబం కల్పిస్తుంది. సమాజంలో ఓ క్రమబద్ధత, ఓ నిర్దిష్టమైన క్రమశిక్షణతో కూడిన జీవనవిధానం ఉండేలా.. ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు క్రమబద్ధంగా ఉండేలా కుటుంబ వ్యవస్థ నియంత్రిస్తుంది. ఈ విధి చాలా ప్రధానమైంది. ఎందుకంటే సమాజం శాశ్వతంగా కొనసాగాలంటే కుటుంబ, వివాహ వ్యవస్థల ద్వారా స్త్రీ పురుషులు పిల్లలకు జన్మనిచ్చి, సమాజం నిరంతరం కొనసాగడానికి దోహదం చేస్తారు.
2. ఆర్థిక ప్రకార్యం
- కుటుంబ సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చాల్సిన బాధ్యత కుటుంబ పెద్దలపై ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు కావాల్సిన ఆర్థిక అవసరాలను, ఇతర సభ్యుల అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. ఈ బాధ్యత కుటుంబ వ్యవస్థపైనే ఉంటుంది. అందుకే సామాజిక శాస్త్రవేత్తలు కుటుంబాన్ని ఉత్పత్తి యూనిట్‌గా పరిగణిస్తారు. కుటుంబంలోని సభ్యులంతా ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఇలాంటి కార్యకలాపాలు నిర్వర్తించడం కుటుంబం ప్రధాన విధి.
3. మత ప్రకార్యం
- కుటుంబ సభ్యులు సమష్టిగా ఆయా మత విలువలు, ఆచారాలను పాటిస్తారు. కుటుంబ వ్యవస్థ ద్వారానే మతపరమైన సంప్రదాయాలను పిల్లలు అర్థం చేసుకొని, పాటిస్తుంటారు.
4. సామాజిక ప్రకార్యం
- కుటుంబం వ్యక్తికి సామాజిక అంతస్తు, హోదాలను సంక్రమింపజేస్తుంది. ఇప్పటికీ మనం గ్రామీణ సమాజాన్ని చూస్తే.. వ్యక్తి గుర్తింపు కుటుంబం ద్వారానే ఉంటుంది. కుటుంబ వ్యవస్థ వ్యక్తికి గుర్తింపును ఇవ్వడమే కాకుండా, సామాజికీకరణ, సాంఘికీకరణ ప్రక్రియల ద్వారా సమాజానికి సంబంధించిన సంస్కృతి, విలువలు, ప్రమాణాల గురించి కూడా నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. పిల్లలు కుటుంబం ద్వారానే ఈ సమాజానికి సంబంధించిన సంపూర్ణ సంస్కృతిని అవగాహన చేసుకొని ఆచరిస్తారు.
5. విద్యా ప్రకార్యం
- కుటుంబమే మొదటి పాఠశాల. సమాజానికి సంబంధించిన చాలా విషయాలు కుటుంబం ద్వారానే నేర్చుకుంటాం. ముఖ్యంగా సమష్టి కుటుంబ వ్యవస్థలో రెండు మూడు తరాలకు సంబంధించిన వ్యక్తులుంటారు. కాబట్టి సమాజానికి సంబంధించిన, నైతిక విలువలు, ఆచార వ్యవహారాలు, నేర్చుకునే అవకాశం కుటుంబం ద్వారా వీలవుతుంది.
6. మానసిక ప్రకార్యం
- కుటుంబ వ్యవస్థ నిర్వర్తించే అతి ముఖ్యమైన ప్రకార్యాల్లో ఇదొకటి. ప్రేమ, అనురాగం, ఉద్వేగ భావనలు కుటుంబ వ్యవస్థ నుంచి లభ్యమవుతాయి. కుటుంబ వ్యవస్థ విఘటితమైతే ఆ పిల్లల్లో నేరప్రవృత్తి ఎక్కువగా ఉండే అవకాశముంది. కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉన్నచోట నేరప్రవృత్తి తక్కువగా ఉండే అవకాశముంది.
భారతీయ – పాశ్చాత్య వైవిధ్యాలు
- భారతీయ కుటుంబం సమష్టి విలువపై ఆధార పడింది. ఇప్పటికీ కూడా.. కుటుంబమే సాంఘికీకరణకు ప్రాతిపదిక. భారతీయ కుటుంబంలోని ఆచార సంప్రదాయాలు వ్యక్తుల హక్కులను, బాధ్యతలను, విధులను సూచిస్తాయి. భారతీయ కుటుంబ వ్యవస్థలోని సంబంధాలు నిరంతర సంబంధాలు. ఒక తరం తర్వాత మరో తరానికి కూడా ఈ బంధాలు, విధులు కొనసాగుతూనే ఉంటాయి.
- పాశ్చాత్య కుటుంబాల్లో వైయక్తిక వాదం ఎక్కువ. ఒక వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచించే వ్యవస్థ పాశ్చాత్య కుటుంబ వ్యవస్థలో కనిపిస్తుంది. అందుకే పాశ్చాత్య కుటుంబాలు విఘటితమైనంత వేగంగా భారతీయ కుటుంబాలు విఘటితం కావు. సంఘర్షణలున్నా భారతీయ కుటుంబాలు కొనసాగుతున్నాయి. కానీ విదేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే అక్కడ దాదాపు 40 శాతం మంది పిల్లలు ‘సింగిల్ పేరెంట్’తో జీవిస్తున్నారు. విడాకుల రేటు కూడా పెరిగింది. సహజీవన సంబంధాలు అక్కడ పూర్తిగా సామాజిక ఆమోదం పొందాయి. స్త్రీ పురుషులు కలసి ఉండటానికి వివాహం అవసరమా అనే ప్రశ్న అక్కడ ఉత్పన్నం అవుతోంది.
- భారతదేశంలో ఇప్పటికీ వివాహాన్ని కుటుంబానికి మూలంగా భావిస్తున్నారు. అంటే కుటుంబ వ్యవస్థ బలంగానే ఉంది. పాశ్చాత్యంలో మాత్రం విఘటితం వేగంగా జరుగుతోంది. అక్కడ వృద్ధులకు రక్షణ తక్కువ. కానీ అక్కడ ప్రభుత్వాలు ఆ బాధ్యతను తీసుకుంటున్నాయి. కుటుంబ ప్రకార్యాలు ఆధునిక వ్యవస్థలకు బదలాయింపు జరుగుతున్నా భారత్‌లో కుటుంబ బాధ్యత ఏమీ తగ్గలేదు.