APPSC | TSPSC Group II Paper I భారతదేశ చరిత్ర – భారత్‌లో సంస్కరణోద్యమాలు
భారత్‌లో 19వ శతాబ్దంలో సమాజోద్ధరణ దిశగా రూపుదాల్చిన అనేక సంస్కరణోద్యమాలు భారతీయుల జీవన విధానంపై విశేష ప్రభావాన్ని చూపాయి. రాజా రామ్మోహన్ రాయ్, వివేకానందుడు, స్వామి దయానంద సరస్వతి, సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ లాంటి ప్రముఖులెందరో ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మూఢ సంప్రదాయాలు, అంధ విశ్వాసాలను రూపుమాపేందుకు వీరంతా కృషి చేశారు. ఫలితంగా భారతీయుల జీవన విధానంలో వచ్చిన మార్పులు తర్వాతి తరాలకు ఎంతో మేలు చేశాయి. నాటి సామాజిక, మత సంస్కరణ ఉద్యమాల చారిత్రక అధ్యయన సమాచారాన్ని చదవండి మరి!
- 19వ శతాబ్దంలో ఆధునిక ఆంగ్ల విద్యావ్యాప్తి.. క్రైస్తవ మిషనరీల మత ప్రచారం.. ఐరోపాలో ప్రారంభమైన ఉదార, హేతువాద, మానవతావాద ఉద్యమాలు భారతీయులపై ప్రభావం చూపాయి. ఇవన్నీ తమ సామాజిక, మత వ్యవస్థల గురించి భారతీయులు పునరాలోచించేలా చేశాయి. ఈ ప్రభావంతో తలెత్తిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు భారతీయుల జీవన విధానాన్ని మార్చాయి. వారిలో ఐకమత్యం, దేశభక్తిని పెంపొందించాయి. భారతదేశంలో మత సంస్కరణ ఉద్యమాలు మొదట బెంగాల్, తర్వాత పశ్చిమ భారతదేశంలో ప్రారంభమయ్యాయి. భారత్‌లో పునరుజ్జీవన ఉద్యమపితగా రాజా రామ్మోహన్ రాయ్‌ని పేర్కొంటారు.బ్రహ్మ సమాజం
- బ్రహ్మ సమాజ స్థాపకుడైన రాజా రామ్మోహన్ రాయ్ 1772లో బెంగాల్‌లోని బర్డ్వాన్ జిల్లా రాధానగర్‌లో జన్మించారు. 1815లో ఆత్మీయసభ అనే సంస్థను స్థాపించారు. భగవంతుడు ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమే దీని ఉద్దేశం.
- హిందూ మతంలోని అనేక దురాచారాలను రూపుమాపడానికి, సంస్కరించడానికి 1828లో రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. ఆధునిక విద్యావ్యాప్తి, స్త్రీ జనోద్ధరణ కోసం విశేషంగా కృషి చేశారు. బహు భార్యత్వం, సతీసహగమనం లాంటి దురాచారాలను ఖండించారు. ఆయన కృషి ఫలితంగానే అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1829లో రెగ్యులేషన్ XVII ద్వారా సతీ సహగమనం చట్టవిరుద్ధమని ప్రకటించాడు. బాల్య వివాహాలు, కులవ్యవస్థలోని లోపాలపై పోరాడారు. అంటరానితనాన్ని అప్రజాస్వామ్యం, అమానుషమని పేర్కొన్నారు. వితంతు పునర్వివాహాల కోసం కృషి చేశారు. స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని ఆయన గట్టిగా కోరారు.
- దేవుడికి, ప్రజలకు మధ్యవర్తులుగా ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్న పురోహితుల తరగతిని రాజా రామ్మోహన్ రాయ్ నిరసించారు. రంగు, జాతి, కులాలకు అతీతంగా మానవులందర్నీ ఏకం చేయడానికి ఆయన కృషి చేశారు. కానీ బ్రిటిష్ పాలన పట్ల మాత్రం కొంత సానుకూల వైఖరితో ఉండేవారు. బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యా సంస్థల ఏర్పాటును ప్రశంసించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం పత్రికల స్వాతంత్య్రంపై పరిమితులు విధించడాన్ని, భారతీయులను ఉన్నత పదవులకు దూరంగా ఉంచడాన్ని వ్యతిరేకించారు. కలకత్తాలో హిందూ కళాశాల స్థాపనకు ప్రయత్నించారు.
- రామ్మోహన్ రాయ్‌కు ‘రాజా’ అనే బిరుదును ఇచ్చిన మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ కోరిక మేరకు రాయ్ 1830లో ఇంగ్లండ్ రాజైన నాలుగో విలియం ఆస్థానానికి వెళ్లాడు. బ్రిటిష్‌వారు ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రామ్మోహన్ రాయ్ ద్వారా మొగలు చక్రవర్తి కోరాడు. అక్కడ మూడు సంవత్సరాలు గడిపిన రాయ్ 1833, సెప్టెంబరు 27న బ్రిస్టల్ నగరంలో మృతి చెందారు.
‘రాజా’ అనంతరం..
- మహర్షి ద్వారకనాథ్ ఠాగూర్, పండిట్ రామచంద్ర విద్యావాగిష్లు రామ్మోహన్ రాయ్ మరణానంతరం పదేళ్లపాటు బ్రహ్మ సమాజాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ద్వారకనాథ్ ఠాగూర్ పెద్ద కుమారుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మసమాజ బాధ్యతలు చేపట్టారు. దేవేంద్రనాథ్ బ్రహ్మ సమాజంలో చేరక ముందు కలకత్తా(1831)లో తత్త్వబోధిని సభను స్థాపించారు. గొప్ప రచయిత, విద్యావేత్త అయిన అక్షయ్‌కుమార్ దత్తా 1840లో తత్త్వబోధిని పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. ఇందులో సభ్యులుగా పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్ మిత్రా, తారాచంద్ చక్రవర్తి, పియరీచంద్ మిత్ర చేరారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయడానికి తత్త్వబోధిని అనే మాసపత్రికను బెంగాలీ భాషలో ప్రచురించారు. దేవేంద్రనాథ్ 80 మంది అనుచరులతో 1843 డిసెంబరు 21న బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా చేరారు. అలెగ్జాండర్ డఫ్ భారతీయ సంస్కృతిపై చేసిన దాడిని దేవేంద్రనాథ్ సమర్థంగా తిప్పికొట్టారు. దేవేంద్రనాథ్ రెండేళ్ల(1856-58) పాటు సిమ్లా వెళ్లారు. అక్కడ ఉన్న సమయంలోనే కేశవచంద్రసేన్ (1857లో) బ్రహ్మ సమాజంలో చేరి ఆయన కుడిభుజంగా మారారు. 1859లో యువకులతో కూడిన సంగత్ సభను స్థాపించాడు. దీని ప్రధాన ఉద్దేశం అప్పటి ఆధ్యాత్మిక, సామాజిక సమస్యల గురించి చర్చించడం.
- 1861లో కేశవచంద్ర సేన్ సంపాదకుడిగా ఇండియన్ మిర్రర్ అనే పక్ష పత్రికను స్థాపించారు. ఇది తర్వాతి కాలంలో భారతదేశంలో ఆంగ్లంలో ప్రచురితమైన మొదటి దినపత్రికగా పేరొందింది. క్షామం, అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో ఆయన సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బ్రహ్మ సమాజాన్ని దేశమంతా విస్తరించడానికి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయన కృషి ఫలితంగా మద్రాసులో వేద్ సమాజ్, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్‌లు ఏర్పాటయ్యాయి.
బ్రహ్మ సమాజంలో చీలికలు
- కేశవచంద్ర సేన్ చేపట్టిన కులాంతర వివాహాలు, వితంతు పునర్వివాహాలు, పరదా పద్ధతి తొలగింపు లాంటి కార్యక్రమాలు పాతతరం వారికి నచ్చలేదు. దీంతో 1866లో బ్రహ్మ సమాజంలో మొదటి చీలిక ఏర్పడింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ వర్గం ‘ఆది బ్రహ్మసమాజ్’గా, కేశవచంద్ర సేన్ వర్గం ‘బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా (నవ విధాన్)’గా విడిపోయాయి.
- 1870లో కేశవచంద్ర సేన్ ఇంగ్లండ్ వెళ్లొచ్చాక మరింత ఉత్సాహంతో సాంఘిక సంస్కరణలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. 1872లో ప్రభుత్వంతో చర్చించి బ్రహ్మ వివాహ చట్టాన్ని తీసుకురావడం ద్వారా బ్రహ్మ సమాజం నిర్వహించే వివాహాలకు చట్టబద్ధత ఏర్పడింది. ఆయన ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను స్థాపించారు. పాశ్చాత్య విద్యావ్యాప్తి; స్త్రీల అభ్యున్నతి, విద్యావ్యాప్తి; సామాజిక కార్యక్రమాలకు ఈ సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది.
- కేశవచంద్ర సేన్ 1878లో తన కుమార్తెను కూచ్ బిహార్ పాలకుడికి ఇచ్చి వివాహం చేశారు. చట్టబద్ధంగా నిర్ణయించిన కనీస వివాహ వయసు కంటే వధూవరులిద్దరి వయసు తక్కువ. అంతేకాకుండా ఈ వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఇది పూర్తిగా బ్రహ్మవివాహ చట్టానికి వ్యతిరేకం. దీంతో బ్రహ్మ సమాజంలో మరో చీలిక వచ్చింది. ఆనందమోహన్ బోస్ నాయకత్వంలో సాధారణ బ్రహ్మసమాజాన్ని స్థాపించారు.
- దక్షిణ భారతదేశంలో మన్నవ బుచ్చయ్య పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటివారు బ్రహ్మ సమాజ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.
ఆర్య సమాజం
- ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. ఆయన అసలు పేరు మూల్‌శంకర్. 1824లో గుజరాత్‌లోని మోర్వి సమీపంలోని టంకారా అనే ప్రదేశంలో జన్మించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో విరజానందుడు అనే అంధ సన్యాసి దగ్గర వేదాలు, ధర్మ శాస్త్రాలు, స్మృతులు అభ్యసించారు. దయానంద సరస్వతి 1875, ఏప్రిల్ 10న బొంబాయిలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. విరజానందుడు హిందూమతంలోని దురాచారాలను తొలగించాలని దయానందుడిని కోరారు. వేదాలకు తిరిగి వెళదాం.. మొత్తం జ్ఞానానికి వేదాలే ఆధారం.. అనేవి వీరి నినాదాలు. తర్వాతి కాలంలో పంజాబ్‌లోని లాహోర్ ఆర్య సమాజ ప్రధాన కేంద్రంగా మారింది. ఆర్య సమాజం సిద్ధాంతాలను పంజాబ్‌లో ప్రచారం చేయడంలో దయానందుడు సఫలీకృతుడయ్యాడు. అలాగే ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా కొంతవరకు ఆర్య సమాజ ప్రభావం వ్యాపించింది.
- హిందూ మతంలో విగ్రహారాధన, మూఢ విశ్వాసాలకు కారణమైన పురాణాలను దయానందుడు తిరస్కరించాడు. ఆర్యసమాజం వైదిక మతాన్ని పునరుద్ధరించి, జాతీయతా భావాన్ని పెంపొందించడానికి కృషి చేసింది. పాశ్చాత్య విద్యావిధానం వ్యాప్తికి తోడ్పడింది. బాలబాలికలకు విద్యనందించడానికి ఆర్యసమాజం దయానంద ఆంగ్లో వేదిక్ (డీఏవీ) పాఠశాలలను స్థాపించింది. చాతుర్వర్ణ విధానం జన్మ ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఉండాలని ఈ సమాజం భావించింది. సామాజిక, విద్యా రంగాల్లో స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని కోరింది. అంటరానితనం, కుల వ్యత్యాసాలు, బాల్య వివాహాలను వ్యతిరేకించింది. వితంతు పునర్వివాహాలు, కులాంతర వివాహాలను సమర్థించింది.
- ఆర్య సమాజం చేపట్టిన కొన్ని కార్యక్రమాలు వివాదాస్పదమయ్యాయి. వీటిలో మొదటిది – 1882లో దయానందుడు ప్రారంభించిన గోరక్ష ఉద్యమం. గోరక్షణ కోసం నిధులు సేకరించి, గోవులను వధించకుండా అడ్డుకోవడం లాంటి కార్యకలాపాలను చేపట్టారు. ఇది హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది.
- రెండోది – ఇతర మతాల్లోకి చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి దయానందుడు శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. క్రైస్తవ మిషనరీలు ఎక్కువ సంఖ్యలో హిందువులను, ముఖ్యంగా అణగారిన వర్గాలవారిని క్రైస్తవ మతంలోకి మార్చాయి. వీరిని తిరిగి హిందువులుగా మార్చడానికి చేసిందే శుద్ధి ఉద్యమం.
రామకృష్ణ మిషన్, మఠం
- వివేకానందుడు 1897లో పశ్చిమ బెంగాల్‌లోని బేలూరు కేంద్రంగా రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం సమాజసేవ చేయడం. దీనిద్వారా అనేక పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, అనాథ శరణాలయాలను స్థాపించి, పేద ప్రజలకు సహాయం చేశారు. ఆయన 1887లో పశ్చిమబెంగాల్లోని బారానగర్‌లో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దీనిద్వారా తన గురువైన రామకృష్ణ పరమహంస బోధనలను ప్రచారం చేశారు. 1898 నుంచి రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలకు బేలూరు ప్రధాన కేంద్రం అయ్యింది.
- రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ. ఆయన 1836లో పశ్చిమబెంగాల్, హుగ్లీ జిల్లాలోని కామర్పుకుర్ అనే గ్రామంలో జన్మించారు. మానవ సేవే మాధవ సేవ అనేది రామకృష్ణుడి నినాదం. వేదాంత, ఉపనిషత్తుల నుంచి ఆయన స్ఫూర్తి పొందారు. రామకృష్ణుడికి సూఫీ మత గురువు ఇస్లాం మతదీక్షను అనుగ్రహించారు. కాళీమాత, కృష్ణుడు, బుద్ధుడు, సిక్కు గురువులను ఆయన పూజించేవారు. బైబిల్ పఠనాన్ని వినేవారు.
- వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన కలకత్తాలో 1863లో జన్మించారు. మొదటిసారి 1881లో రామకృష్ణ పరమహంసను కలిశారు. భారతదేశం మొత్తం కాలినడకన ప్రయాణించి, ప్రజల వాస్తవ స్థితిగతులను తెలుకున్నారు.
- వివేకానందుడు మానవులందరిలో దైవత్వం ఉందని, ప్రతి వ్యక్తిలోనూ శక్తి సామర్థ్యాలున్నాయని, ఎవరినీ తక్కువగా చూడరాదని బోధించారు. అనారోగ్యం కారణంగా అతి చిన్న వయసులోనే (1902) ఆయన మృతి చెందారు.
దివ్యజ్ఞాన సమాజం
- రష్యాకు చెందిన హెచ్.పి.బ్లావట్స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ 1875లో న్యూయార్క్‌లో దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. వీరు 1879లో భారతదేశానికి వచ్చి, 1882లో మద్రాసు సమీపంలోని అడయార్ వద్ద దివ్యజ్ఞాన సమాజం ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు.
- ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ లండన్‌లోని దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలిగా చేరారు. ఆమె 1893లో మనదేశానికి వచ్చి, 1907లో ఆల్కాట్ మరణం తర్వాత దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు. విశ్వమానవులందరిలో సోదర భావాన్ని పెంపొందించడం, ప్రాచీన మతాల అధ్యయనాన్ని ప్రోత్సహించడం ఈ సమాజం ప్రధాన లక్ష్యాలు.
- హిందూ మతసూత్రాలను బోధించడానికి అనిబిసెంట్ 1898లో వారణాసిలో సెంట్రల్ హిందూ స్కూల్‌ను ప్రారంభించారు. తర్వాతి కాలంలో మదన్మోహన్ మాలవీయ కృషి ఫలితంగా ఇది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా (1916) అభివృద్ధి చెందింది.
అలీగఢ్ ఉద్యమం
- ఉత్తర ప్రదేశ్‌లోని బరేలికి చెందిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. హేతువాదం ప్రాతిపదికగా ఇస్లాం మతాన్ని సమర్థిస్తూనే, ముస్లిం సమాజంలోని బహు భార్యత్వాన్ని, బానిస వ్యవస్థను విమర్శించారు. ముస్లింలకు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలనే లక్ష్యంతో 1875లో అలీగఢ్‌లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. అది 1920లో అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందింది.
ముఖ్యాంశాలు
* రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మ సమాజాన్ని 1828లో స్థాపించాడు.
* మొగల్ చక్రవర్తి రెండో అక్బర్ రామ్మోహన్ రాయ్‌కు ‘రాజా’ అనే బిరుదు ఇచ్చాడు.
* స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఆయన అసలు పేరు మూల్‌శంకర్.
* వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన 1863లో జన్మించారు. 1881లో రామకృష్ణ పరమహంసను తొలిసారి కలిశారు.
* వివేకానందుడి గురువైన రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధర చటోపాధ్యాయ ఆయన 1836లో జన్మించారు.
* వివేకానందుడు రామకృష్ణ మఠం (1887), రామకృష్ణ మిషన్ (1897)లను స్థాపించాడు.
* 1875లో దివ్యజ్ఞాన సమాజాన్ని రష్యాకు చెందిన హెచ్.పి. బ్లావట్స్కీ, అమెరికాకు చెందిన కల్నల్ హెచ్.ఎస్.ఆల్కాట్ స్థాపించారు.
* ఐర్లండ్‌కు చెందిన అనిబిసెంట్ 1893లో భారతదేశానికి వచ్చారు. 1907లో దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యారు.
మాదిరి ప్రశ్నలు
1. క్రైస్తవ మత ప్రచారకుడైన అలెగ్జాండర్ డఫ్ చేసిన హిందూ మత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థంగా తిప్పి కొట్టిందెవరు?
ఎ) దేవేంద్రనాథ్ ఠాగూర్ బి) కేశవచంద్ర సేన్ సి) దయానందుడు డి) రామ్మోహన్ రాయ్
జ: (ఎ)
2. ‘వేదాంత సూత్రాలు’ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వ్యక్తి ఎవరు?
ఎ) వివేకానందుడు బి) వీరేశలింగం సి) దేవేంద్రనాథ్ ఠాగూర్ డి) రాధాకాంత్ దేవ్
జ: (ఎ)
3. కామన్వెల్త్ పత్రికను స్థాపించింది ఎవరు?
ఎ) తిలక్ బి) బిపిన్‌చంద్రపాల్ సి) అనిబిసెంట్ డి) గాంధీజీ
జ: (సి)
4. శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఎ) రామ్మోహన్ రాయ్ బి) వివేకానందుడు సి) దయానందుడు డి) కేశవచంద్ర సేన్
జ: (సి)
5. ఆర్య సమాజ ప్రభావం ఏ రాష్ట్రంపై ఎక్కువ?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) మహారాష్ట్ర సి) పంజాబ్ డి) గుజరాత్
జ: (సి)
6. రామకృష్ణ పరమహంస భార్య పేరేమిటి?
ఎ) శారదాప్రియ బి) శారదామణి సి) శ్రీలత డి) హర్షిత
జ: (బి)
7. కింది వారిలో పశ్చిమ భారతదేశంలో పునరుజ్జీవన పితగా పేరుగాంచిన వ్యక్తి ఎవరు?
ఎ) ఎం.జి. రనడే బి) బి.ఎం. మలబారి సి) ఆర్.జి. భండార్కర్ డి) కె.టి. తెలాంగ్
జ: (ఎ)
8. ఉత్తర భారతదేశ హిందూ లూథర్‌గా ప్రసిద్ధిచెందిన వ్యక్తి ఎవరు?
ఎ) ఈశ్వరచంద్ర విద్యాసాగర్ బి) దయానందుడు సి) రాధాకాంత్ దేవ్ డి) కేశవచంద్ర సేన్
జ: (బి)
9. శ్రద్ధానందుడు గురుకుల విద్యాల యాలను ఎక్కడ ప్రారంభించాడు?
ఎ) లాహోర్ బి) బొంబాయి సి) హరిద్వార్ డి) కలకత్తా
జ: (సి)
10. ఇండియన్ రిఫార్మ్ అసోసియేషన్‌ను ఎవరు స్థాపించారు?
ఎ) దయానందుడు బి) వివేకానందుడు సి) కేశవచంద్ర సేన్ డి) రామ్మోహన్ రాయ్
జ: (సి)