TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part VII
* ప్రపంచ నగరాల్లో హైదరాబాద్
* తెలంగాణ స్వరూపం
- దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ సమగ్ర సామాజిక, ఆర్థిక చిత్రమిది. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో రాష్ట్ర స్వరూపం.. ఆర్థిక, సామాజిక గణాంకాలు.. కొత్త ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ చర్యలు.. తదితర అంశాలపై సమగ్ర అవగాహనకు అందిస్తున్న అధ్యయన సమాచారం.. టీఎస్పీఎస్సీ అభ్యర్థుల కోసం..
- తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలిపే ‘సామాజిక ఆర్థిక చిత్రం-2015’ని ‘రి ఇన్వెంటింగ్ తెలంగాణ – ది ఫస్ట్ స్టెప్స్ (తెలంగాణ పునరావిష్కరణ – తొలి అడుగులు)’ పేరుతో బడ్జెట్ సందర్భంగా 2015, మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులోని ప్రధాన అంశాలివి..
స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి
* స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తినే స్థూల రాష్ట్రోత్పత్తి లేదా రాష్ట్ర ఆదాయం అని కూడా అంటారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మదింపులో స్థూల రాష్ట్రోత్పత్తి ముఖ్యమైన సూచిక.
* ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల మధ్య, నిర్ణీత కాల వ్యవధిలో ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువను ‘స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)’ అంటారు.
* ముందస్తు అంచనాల ప్రకారం స్థూల రాష్ట్రోత్పత్తి (జీఎస్డీపీ) స్థిర ధరలను (2004-05 వద్ద) 2014-15లో రూ.2,17,432 కోట్లుగా అంచనా వేశారు. ఇది 2013-14లో రూ.2,06,427 కోట్లుగా ఉంది.
* 2014-15లో స్థూల రాష్ట్రోత్పత్తిలో వృద్ధిరేటు స్థిరధరల వద్ద 5.3%గా ఉంది. 2013-14లో 4.8%గా నమోదైంది.
* వర్తమాన (ప్రస్తుత) ధరల ప్రకారం స్థూల రాష్ట్రోత్పత్తి 2014-15లో ముందస్తు అంచనాల ప్రకారం రూ. 4,30,599 కోట్లుగా అంచనా వేశారు. ఇది 2013-14లో రూ.3,91,751 కోట్లుగా ఉంది. (పట్టిక-1 చూడండి)
వ్యవసాయ రంగం
* వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలైన జంతు, అటవీ, మత్స్య సంపదలు వ్యవసాయరంగంలో కలిసి ఉంటాయి. రాష్ట్ర జనాభాలో 55.49 శాతం మందికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనోపాధికి వ్యవసాయ రంగమే ఆధారం.
* రాష్ట్రంలో మొత్తం భూవిస్తీర్ణంలో 43.20 శాతం (49.61 లక్షల హెక్టార్లు) సాగులో ఉంది. ఇది నికర సాగు విస్తీర్ణం కాగా స్థూల సాగు విస్తీర్ణం 62.88 లక్షల హెక్టార్లు.
* ‘వ్యవసాయ కమతాల గణన 2010-11’ ప్రకారం రాష్ట్రంలో మొత్తం భూకమతాల సంఖ్య 55.54 లక్షలు. సగటు భూకమత పరిమాణం 1.11 హెక్టార్లు.
* వర్షపాతం, నేలల స్వభావం, పంటల సరళి లాంటి అంశాల ఆధారంగా రాష్ట్రాన్ని నాలుగు వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించారు.
* రాష్ట్రంలో సగటు వార్షిక వర్షపాతం 906 మి.మీ.లు
* 2013-14లో రాష్ట్రంలో నికరంగా సాగునీరు అందిన విస్తీర్ణం 22.89 లక్షల హెక్టార్లు. స్థూలంగా సాగునీరు అందిన విస్తీర్ణం 31.64 లక్షల హెక్టార్లు.
* తెలంగాణలో సేద్యానికి ప్రధానమైన జలవనరులు వరుసగా బావులు, కాలువలు, చెరువులు.
* 10.86 లక్షల హెక్టార్ల భూవిస్తీర్ణం ఉద్యాన పంటల కింద ఉంది.
* సామాజిక అడవులను కలుపుకొని తెలంగాణ మొత్తం అటవీ విస్తీర్ణం 29,242 చ.కి.మీ.లు. ఇది రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 25.46 శాతం.
* అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లా ఖమ్మం (8,437 చ.కి.మీ.)
* జీవ ఉత్పత్తుల (జీవ సంపద) పరంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో పదో స్థానంలో ఉంది. దాదాపు 29 లక్షల కుటుంబాలు జీవ ఉత్పత్తులు మీద ఆధారపడ్డాయి.
* రాష్ట్రం గొర్రెల పెంపకంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. కోళ్ల పెంపకంలో 5వ, కోడిగుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానాల్లో ఉంది.
* వ్యవసాయ రంగంలో ‘వ్యవసాయం’ తర్వాత అత్యధిక ఆదాయం జీవ ఉత్పత్తుల నుంచి లభిస్తుంది.
* మొత్తం 78 జలాశయాలు, 35,031 చెరువులు ఉన్నాయి. వీటిలో మత్స్య సంపద అభివృద్ధికి అవకాశాలు పుష్కలం.
* తెలంగాణలో 19.04 లక్షల మత్స్యకారులున్నారు. 383 మత్స్యకారిణుల సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో 868 మత్స్య మిత్ర బృందాలు (మత్స్యకారిణుల స్వయంసహాయక బృందాలు) ఉన్నాయి. ఒక్కో బృందంలో 10 నుంచి 15 మంది మహిళలు సభ్యులుగా ఉంటారు. జీఎస్డీపీలో మత్స్య సంపద వాటా 0.6 శాతం. (పట్టిక-2 చూడండి)
* 2014-15 వర్తమాన ధరల్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 17.9 శాతం. ఇది 2013-14లో 20.6 శాతంగా ఉంది. వ్యసాయ రంగం జీఎస్డీపీలో సగం (51.8 శాతం) ఆదాయం ‘వ్యవసాయం’ విభాగం నుంచి లభిస్తుంది.
పారిశ్రామిక రంగం
- పారిశ్రామిక రంగంలో గనులు – తవ్వకాలు, వస్తూత్పత్తి, విద్యుత్-గ్యాస్-నీటి సరఫరా, నిర్మాణ రంగం లాంటి విభాగాలుంటాయి. పరిశ్రమల పరంగా రాష్ట్రం దేశంలో 6వ స్థానంలో ఉండగా, పరిశ్రమలు నుంచి తోడైన స్థూల విలువ ప్రకారం 8వ స్థానంలో ఉంది.
ప్రధాన పరిశ్రమలు: బల్క్‌డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, సిమెంట్, ఖనిజాధారిత పరిశ్రమలు, వ్యవసాయ ప్రాసెసింగ్, రత్నాలు-ఆభరణాలు, బయోటెక్నాలజీ, జౌళి, తోలు, ఇనుము, ఉక్కు, రక్షణ లాంటి భారీ ఉత్పాదక పరిశ్రమలు
* దేశంలోని బల్క్ ఔషధాల్లో మూడోవంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి.
* 2015 జనవరి నాటికి రాష్ట్రంలో రూ.22,520.63 కోట్ల పెట్టుబడితో 40,894 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 5,65,496 మందికి ఉపాధి లభిస్తోంది.
* 2015 జనవరి నాటికి రూ.45,393.33 కోట్ల పెట్టుబడితో 2091 భారీ పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 6,67,499 మంది ఉపాధి పొందుతున్నారు. (పట్టిక-3 చూడండి)
* పారిశ్రామిక రంగం జీఎస్డీపీలో సుమారు సగం ఆదాయం తయారీ రంగం (వస్తూత్పత్తి) విభాగం నుంచి లభిస్తోంది.
* మొత్తం స్థూల రాష్ట్రోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 25 శాతం మాత్రమే (2013-14లో 25.2%).
* పారిశ్రామిక రంగం జీఎస్డీపీలో గనులు-తవ్వకం విభాగం రుణాత్మక వృద్ధిరేటు (-7.1)గా నమోదైంది.
సేవల రంగం
- సేవల రంగంలో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వ, కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, బీమా, రియల్ ఎస్టేట్, నివాస స్థలాల యాజమాన్యం, వ్యాపార సేవలు, ప్రజాపరిపాలన, ఇతర సేవలు లాంటి ఉపరంగాలు ఉంటాయి.
* మొత్తం సేవల రంగం జీఎస్డీపీలో 2013-14 అంచనాల ప్రకారం 26.2 శాతం వాటా హైదరాబాద్ జిల్లా నుంచి లభించింది.
* నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ మ్యాగజైన్ వార్షిక గైడ్ ‘ప్రపంచంలో అత్యుత్తమమైన – 2015’లో మీరు చూడాల్సిన 20 ప్రదేశాలు జాబితాలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో రహదారుల వ్యవస్థ
* జాతీయ రహదారులు – 2,592 కి.మీ.
* రాష్ట్ర రహదారులు – 3,152 కి.మీ.
* ప్రధాన జిల్లా రహదారులు – 12,079 కి.మీ.
* గ్రామీణ రోడ్లు – 9,014 కి.మీ.
- మొత్తం రోడ్లు – 26,837 కి.మీ.
- మొత్తం రాష్ట్ర రోడ్లు – 24,245 కి.మీ. (జాతీయ రహదారులు కాకుండా) (పట్టిక-4 చూడండి)
* 2014-15 ముందస్తు అంచనాల ప్రకారం వర్తమాన ధరల్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో సేవల రంగం వాటా 57.1 శాతం. ఇది 2013-14లో 54.2 శాతంగా ఉంది.
* రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వాటాలు క్రమంగా తగ్గుతుండగా, సేవల రంగం వాటా పెరుగుతోంది.
* 2013-14లో అత్యధిక స్థూల జిల్లా దేశీయోత్పత్తి ఉన్న జిల్లా హైదరాబాద్, అత్యల్ప స్థూల జిల్లా దేశీయోత్పత్తి ఉన్న జిల్లా నిజామాబాద్.
తలసరి ఆదాయం
* 2014-15లో ముందస్తు అంచనాల ప్రకారం, వర్తమాన ధరల వద్ద రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,03,889గా ఉంది. ఇది 2013-14లో రూ.95,361గా ఉంది. స్థిర ధరల వద్ద రాష్ట్ర తలసరి ఆదాయం 2014-15లో రూ.51,017, 2013-14లో రూ.48,881గా ఉంది.
* రాష్ట్ర తలసరి ఆదాయం, దేశ తలసరి ఆదాయం కంటే అధికంగా ఉంది. (పట్టిక-5 చూడండి)
సామాజిక అంశాలు
* తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 1,14,840 చ.కి.మీ.లు. (ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్లోని 327 గ్రామాలను ఏపీలో కలిపిన తర్వాత తెలంగాణ భూవిస్తీర్ణం 1,12,077 చ.కి.మీ.లు.)
* 3,51,93,978 జనాభాతో దేశంలో 12వ స్థానంలో (విస్తీర్ణం పరంగా కూడా) ఉంది.
* రాష్ట్ర సగటు జనసాంద్రత 307. అత్యధిక జనసాంద్రత హైదరాబాద్ (18,172) జిల్లాలో, అత్యల్ప జనసాంద్రత ఆదిలాబాద్ జిల్లా (170)లో ఉంది. (ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో నివసించే జనాభాను జనసాంద్రత అంటారు)
* అక్షరాస్యత రేటు రాష్ట్రంలో 66.46 శాతంగా ఉంది. దేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్న రెండో రాష్ట్రం.
* అత్యధిక అక్షరాస్యత ఉన్న జిల్లా హైదరాబాద్ (83.25 శాతం), అత్యల్ప అక్షరాస్యత ఉన్న జిల్లా మహబూబ్‌నగర్ (55.04).
* సగటు లింగ నిష్పత్తి 988. అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న జిల్లా నిజామాబాద్ (1,040) కాగా అత్యల్ప లింగ నిష్పత్తి ఉన్న జిల్లా హైదరాబాద్ (954).
* రాష్ట్రంలో నాలుగు (నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం) జిల్లాల్లో పురుషులు కంటే స్త్రీలు అధికంగా ఉన్నారు.
* రాష్ట్రం మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభా 15.44%, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జనాభా 9.34%.
* 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలోని మొత్తం కుటుంబాలు 83.58 లక్షలు కాగా, 2014 ఆగస్టు 19న రాష్ట్రమంతటా నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలిన కుటుంబాలు సంఖ్య 101.83 లక్షలుగా ఉంది.
తెలంగాణ ప్రభుత్వం – సంక్షేమ చర్యలు
* అర్హులైన లబ్దిదారులను గుర్తించి, వారి వ్యక్తిగత అవసరాలు లక్ష్యంగా సమర్థమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి వీలుగా 2014, ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా ‘సమగ్ర కుటుంబ సర్వే’ పేరుతో ఇంటింటా సర్వేను నిర్వహించారు.
* వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, హెచ్ఐవీ రోగులకు నెలకు రూ.1000; వికలాంగులకు నెలకు రూ.1500 ‘ఆసరా’ ద్వారా అందజేస్తున్నారు. (2015 మార్చి నుంచి బీడీ కార్మికులకు ఈ పథకంలో భాగంగా రూ.1,000 జీవనభృతిగా ఇస్తున్నారు.)
* ఆహారభద్రతలో భాగంగా ఆహారభద్రత కార్డులకు అర్హులైన అన్ని కుటుంబాలకు 2015, జనవరి 1 నుంచి ప్రతి ఒక్కరికి రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యం ఇస్తున్నారు.
* వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు, మధ్యాహ్న భోజనం పథకం కింద లబ్ది పొందుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో సన్నబియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
* మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మీ, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, షీ టీమ్స్, షీ క్యాబ్స్, 24 గంటలు అందుబాటులో ఉండే 181 హెల్ప్‌లైన్ లాంటి కార్యక్రమాలను చేపట్టింది.
* దళిత సంక్షేమంలో భాగంగా నిరుపేద దళిత వ్యవసాయాధారిత కుటుంబాలను ‘మూడు ఎకరాల ఆసాములు’గా చేయడం కోసం ప్రభుత్వం 2014, ఆగస్టు 15న ‘భూమి కొనుగోలు పథకం’ను ప్రారంభించింది.
* గ్రామీణాభివృద్ధిలో భాగంగా ‘మన ఊరు – మన ప్రణాళిక’ను 2014 జులైలో ప్రారంభించారు. దీనికి అనుబంధంగా ఇటీవల 2015 ఆగస్టులో ‘గ్రామజ్యోతి’, ‘తెలంగాణ పల్లెప్రగతి’ కార్యక్రమాలను ప్రారంభించారు.
* పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఇటీవల (2015, జులై 3) ‘హరితహారం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 24% నుంచి 33%కి పెంచడమే లక్ష్యం.
మాదిరి ప్రశ్నలు
1. 100 శాతం సబ్సిడీతో నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలను ‘మూడు ఎకరాల ఆసాములు’గా చేయడం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఏది?
ఎ) భూభారతి బి) భూలక్ష్మీ సి) భూదాన్ డి) భూమి కొనుగోలు పథకం
జ: (డి)
2. భౌగోళిక విస్తీర్ణం, జనాభా పరంగా దేశంలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత?
ఎ) 5 బి) 7 సి) 12 డి) 13
జ: (సి)
3. ముందస్తు అంచనాల ప్రకారం స్థిర ధరల్లో 2014-15లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో వృద్ధిరేటు (గత సంవత్సరంతో పోలిస్తే వచ్చిన మార్పు) శాతం ఎంత?
ఎ) 5.3 బి) 4.8 సి) 5.8 డి) 6.9
జ: (ఎ)
4. తెలంగాణను ఎన్ని ‘వ్యవసాయ వాతావరణ మండలాలు’గా విభజించారు?
ఎ) 3 బి) 4 సి) 6 డి) 8
జ: (బి)
5. 2014-15 ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రంలో నికర సాగు విస్తీర్ణం ఎంత (లక్షల హెక్టార్లలో)?
ఎ) 43.20 బి) 49.61 సి) 62.88 డి) 31.64
జ: (బి)
6. 2014-15 ముందస్తు అంచనాల ప్రకారం వర్తమాన ధరల్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో వ్యవసాయ రంగం వాటా ఎంత?
ఎ) 17.9% బి) 25% సి) 57.1% డి) 12.8%
జ: (ఎ)
7. 2014-15 ముందస్తు అంచనాల ప్రకారం వర్తమాన ధరల్లో పారిశ్రామిక రంగం జీఎస్డీపీలో రుణాత్మక వృద్ధిరేటును నమోదు చేసిన ఉప రంగం ఏది?
ఎ) వస్తూత్పత్తి బి) నిర్మాణ రంగం సి) గనులు – తవ్వకం డి) విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా
జ: (సి)
8. రాష్ట్రంలోని మొత్తం జాతీయ రహదారుల పొడవు ఎంత?
ఎ) 2,592 కి.మీ. బి) 3,152 కి.మీ. సి) 12,079 కి.మీ. డి) 9,014 కి.మీ.
జ: (ఎ)
9. 2014-15 ముందస్తు అంచనాల ప్రకారం వర్తమాన ధరల్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో సేవల రంగం వాటా ఎంత?
ఎ) 57.1% బి) 58.2% సి) 62.3% డి) 67%
జ: (ఎ)
10. 2014-15 ముందస్తు అంచనాల ప్రకారం వర్తమాన ధరల వద్ద రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత?
ఎ) రూ.95,361 బి) రూ.80,388 సి) రూ.1,03,889 డి) రూ.88,533
జ: (సి)
11. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో సగటు లింగ నిష్పత్తి ఎంత?
ఎ) 943 బి) 988 సి) 1,040 డి) 954
జ: (బి)