TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part I
టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షల్లో జనరల్‌స్టడీస్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వర్తమాన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. రాష్ట్ర ఆవిర్భవం నుంచి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, బంగారు తెలంగాణ సాధన దిశగా అమలు చేస్తున్న పథకాల గురించి సమగ్రంగా తెలుసుకుంటే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు.
- కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రజల జీవన స్థితిగతులను అధ్యయనం చేస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ అభివృద్ధికి పలు కార్యక్రమాలను చేపడుతోంది. అవి..
సమగ్ర కుటుంబ సర్వే – 2014
* సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రభుత్వం 2014 ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వేని చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించి సమగ్రమైన, పటిష్టమైన గణాంక సమాచార వివరాలను సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
* అర్హులైన లబ్దిదారులను గుర్తించి, వారి వ్యక్తిగత అవసరాలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి సమగ్ర కుటుంబ సర్వే దోహదపడుతుంది.
* ఈ సర్వే ప్రకారం అత్యధికంగా 16.56 లక్షల కుటుంబాలు రంగారెడ్డి జిల్లాలోనూ, అత్యల్పంగా 6.97 లక్షల కుటుంబాలు నిజామాబాద్ జిల్లాలోనూ ఉన్నాయి.
ఆహార భద్రత
* ఆహార భద్రత కార్డులకు అర్హులైన కుటుంబాలకు 2015 జనవరి 1 నుంచి మనిషికి ఆరు కిలోల చెప్పున, రూపాయికే కిలో బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
* ఇంతకు ముందు మనిషికి 4 కిలోలు చొప్పున, కటుంబానికి 20 కిలోలకు మించి బియ్యం ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నా.. మనిషికి 6 కిలోలు వంతున బియ్యాన్ని ఇస్తున్నారు.
* అంత్యోదయ అన్న యోజన(ఏఏవై) కింద ఎంపికైన కుటుంబాలకు కిలో రూపాయి ధరకు నెలకు 35 కిలోల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
* ఇంతవరకు తెలంగాణలో ఆహార భద్రత కార్డులకు అర్హులుగా 87.57 లక్షలు కుటుంబాలను గుర్తించారు. అంత్యోదయ అన్న యోజన కార్డులకు 49 వేల మంది అర్హులను గుర్తించారు.
సన్న బియ్యం పథకం
* హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు, మధ్యాహ్న భోజనం పథకం కింద లబ్ది పొందుతున్న విద్యార్థులకు పుష్టికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం సూపర్‌ఫైన్ రకం (సన్న బియ్యం) బియ్యాన్ని సరఫరా చేస్తుంది.
హరితహారం
* హరితహారం కార్యక్రమాన్ని 2015 జులై 3న ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా ‘చిలుకూరు’లో ప్రారంభించారు.
* రాష్ట్రంలో అడవుల శాతాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచడం హరితహారం లక్ష్యం. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను పెంచడం లక్ష్యం.
సామాజిక భద్రతకు ‘ఆసరా’
* ఆసరా అనేది సామాజిక భద్రతా పింఛన్ల కార్యక్రమం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేతపనివారు, కల్లుగీత పనివారు, హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులు సామాజిక భద్రతతో రోజువారీ కనీస అవసరాలను తీర్చుకోవడానికి ఈ పథకం అండగా నిలుస్తుంది.
* ఈ పథకంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, కల్లుగీత పనివారు, నేతపనివారు, హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు గతంలో నెలకు రూ. 200 చెల్లించేవారు. ప్రస్తుతం దీన్ని వెయ్యి రూపాయలకు పెంచారు. వికలాంగులకు నెలకు రూ. 500 ఇచ్చేవారు, ప్రస్తుతం రూ. 1500 చెల్లిస్తున్నారు.
* 2015 నుంచి బీడీ కార్మికుల్లోని మహిళలకు కూడా ‘ఆసరా’ పథకం కింద ఆర్థిక సాయాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి కూడా రూ.1000 జీవన భృతి కల్పిస్తున్నారు.తాగునీటి సరఫరా పథకం
* తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ (టీడీడబ్ల్యూఎస్పీ) కింద హైదరాబాద్ మినహా.. 9 జిల్లాల్లోని 25,139 ఆవాసాలు, 67 మున్సిపాలిటీల పరిధిలో నివసిస్తున్న 3.19 కోట్ల జనాభాకు ప్రతిరోజూ తాగునీటిని అందిస్తారు.
* ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు. తెలంగాణ తాగునీటి సరఫరా పథకం పైలాన్‌ని 2015 జూన్ 8న నల్గొండ జిల్లా ‘చౌటుప్పల్‌లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
* ప్రాజెక్టు ముఖ్యాంశాలు: 1) ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు. 2) ప్రతి వ్యక్తికి రోజుకు గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల నీటి సరఫరా. 3) 25 వేల జనావాసాలకు పైప్‌లైన్‌తో తాగునీటిని అందించడం. 4) ప్రాజెక్టులో 10 శాతం పారిశ్రామిక అవసరాలకు కేటాయింపు. 5) నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కలిగించడం.
గ్రామజ్యోతి (తెలంగాణ గ్రామ అభివృద్ధి పథకం)
* ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని 2015 ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
* ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతారు.
* ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరా.. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన, సహజవనరుల నిర్వహణ, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం ద్వారా అధిక ప్రాధాన్యం ఇస్తారు.
* ‘గ్రామసభ’లో గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారీ – ప్రజల సమష్టి భాగస్వామ్యంతో సమ్మిళిత – సమీకృత అభివృద్ధిని సాధించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
పారదర్శకత, జవాబుదారీతనం, సాధికారత, ప్రోత్సాహకాలతో లక్ష్య సాధన.
* ‘గ్రామజ్యోతి’లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో 7 గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు. అవి.. 1) పారిశుద్ధ్యం – తాగునీరు 2) ఆరోగ్యం – పోషకాహారం 3) విద్య 4) సామాజిక భద్రత – పేదరిక నిర్మూలన 5) సహజవనరుల నిర్వహణ 6) వ్యవసాయం 7) మౌలిక వసతులు
* ప్రతి కమిటీలో అయిదుగు సభ్యులుంటారు. గ్రామసభ ఆమోదంతో రంగాల వారీగా ప్రణాళికల రూపకల్పన, వనరుల కేటాయింపు, ఫలితాలను రాబట్టడం ఈ కమిటీల ప్రధాన విధులు.
పల్లె ప్రగతి
* నిరుపేదల జీవనాభివృద్ధికి ‘తెలంగాణ పల్లెప్రగతి’ పథకాన్ని 2015 ఆగస్టు 22న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
* రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అత్యంత పేదరికంలో మగ్గుతున్న 150 మండలాల్లో అయిదేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది.
* పథకం మొత్తం వ్యయం రూ. 642 కోట్లు (ఇందులో రూ. 450 కోట్లు ప్రపంచ బ్యాంకు ఇస్తుంది).
పథకం లక్ష్యాలు: గ్రామస్థాయిలో పేదల కోసం 2.5 లక్షల ఉత్పత్తిదారుల సంఘాలు, కృషిమార్టుల ఏర్పాటు ద్వారా ఆదాయాన్ని పెంచడం.
* వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెలకువల్లో శిక్షణ, పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకలు పెంపకంతో పాటు వరి, తృణధాన్యాల ఉత్పత్తి తదితర అంశాల్లో చేయూతనందించడం.
* 2.5 లక్షల పేద కుటుంబాల్లో ఆరోగ్యం, ఆహార భద్రత కల్పించడం. 150 మండలాల్లో అందరూ మరుగుదొడ్లు వినియోగించుకునేలా చూడటం.
* 1000 గ్రామ పంచాయతీల్లో ‘పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పాటు.