TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part VI
- గ్రామీణ విద్యార్థులకు విదేశీవిద్య, తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్తు కోసం కుదిరిన ఒప్పందాలేమిటి? సింగరేణి కార్మికుల ఆర్థిక ప్రయోజనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయమేమిటి? రైతు కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అనాథ బాలల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? జాతీయస్థాయిలో కీర్తిని చాటుతూ ఒక తెలంగాణ గ్రామం సాధించిన అరుదైన ఘనత ఏమిటి?.. ఇలాంటి తెలంగాణ రాష్ట్ర వర్తమానాంశాలు పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎంతో ఉపయుక్తం. మరి వివరాల్లోకి వెళ్దామా?
షికాగో వర్సిటీతో ఒప్పందం
* నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం, అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయాల మధ్య విద్యార్థులు, అధ్యాపకుల బదిలీకి సంబంధించి 2015, సెప్టెంబరు 6న ఒప్పందం కుదిరింది.
* తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ పార్థసారధి, షికాగో వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ కానిన్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
* ఈ ఒప్పందం ప్రకారం ఇకపై ‘జీఆర్ఈ’, ‘టోఫెల్’ లేకుండానే నేరుగా షికాగో విశ్వవిద్యాలయంలో ‘ఎంఎస్’ చేయడానికి ప్రవేశం లభిస్తుంది.
* ఇప్పటికి కంప్యూటర్ సైన్స్, టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో విద్యార్థుల బదిలీకి ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది 75 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.
* ఈ ఒప్పందంతో తెలంగాణలోని గ్రామీణ విద్యార్థులకు విదేశాల్లో విద్యను అభ్యసించడం సులభమవుతుంది.
సింగరేణి కార్మికులకు లాభాలు
* సింగరేణి కాలరీస్ ఈ ఏడాది సాధించిన లాభాల్లో కార్మికులకు 21 శాతం వాటా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబరు 24న సింగరేణిపై జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. కార్మికుల నుంచి వృత్తిపన్ను కూడా వసూలు చేయకూడదన్నారు.
* తెలంగాణ ఏర్పడక ముందు సింగరేణి లాభాల్లో కార్మికులకు 18 శాతం వాటా చెల్లించేవారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది (2013-14) లాభాల్లో వాటాను 20 శాతానికి పెంచారు.
* ఈ ఏడాది (2014-15) లాభాల్లో 21 శాతం కార్మికులకు చెల్లించాలని నిర్ణయించారు.
* ఈ ఏడాది సింగరేణి రూ.491 కోట్ల లాభం ఆర్జించింది. ఇందులో 21 శాతం వాటా (రూ. 103.11 కోట్లు) కార్మికులకు అందుతుంది. దీంతో సింగరేణిలో పనిచేసే 60 వేల మంది కార్మికులకు వ్యక్తిగతంగా రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు లాభం చేకూరుతుంది.
* తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత వ్యవహరిస్తున్నారు.
చత్తీస్‌గఢ్ విద్యుత్తు
* చత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.
* 2015, సెప్టెంబరు 22న సీఎం కేసీఆర్ సమక్షంలో రెండు రాష్ట్రాల విద్యుత్తు అధికారులు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. దీనికి సంబంధించి 2014, నవంబరు 3న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్సింగ్ల సమక్షంలో రెండు రాష్ట్రాల విద్యుత్తు శాఖ కార్యదర్శులు ఎమ్ఓయూపై సంతకాలు చేశారు.
* ఈ ఒప్పందం 12 ఏళ్లపాటు అమల్లో ఉంటుంది.
రైతు కుటుంబాలకు చేయూత
* తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ. లక్షన్నర నుంచి రూ.6 లక్షలకు పెంచుతూ 2015, సెప్టెంబరు 19న జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా సెప్టెంబరు 22న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* ఈ పరిహారంలో 5 లక్షల రూపాయలు నేరుగా రైతు కుటుంబానికి అందజేస్తారు. మరో లక్షను ఆ కుటుంబానికి ఉన్న అప్పులకు ‘వన్‌టైం సెటిల్మెంట్’ కింద చెల్లిస్తారు.
* సాయంతోపాటు బాధిత కుటుంబాల్లోని పిల్లలకు గురుకులాలు, వసతిగృహాల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇళ్లను మంజూరు చేస్తారు. ఆర్థిక చేయూతలో భాగంగా ప్రభుత్వ పథకాలు, పెన్షన్లను వర్తింపజేస్తారు.
అంకిరెడ్డిగూడెం ‘బెస్ట్’
* నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామంలోని వయోజన విద్యాకేంద్రం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నందుకు జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి ‘సాక్షర భారత్’ అవార్డు లభించింది.
* ‘బెస్ట్ పెర్ఫార్మింగ్’ గ్రామ పంచాయతీ విభాగంలో దేశం మొత్తం మీద ఎంపిక చేసిన 5 గ్రామ పంచాయతీల్లో తెలంగాణలోని అంకిరెడ్డిగూడెం ఎంపికైంది. (మిగిలినవి: పాలమలై(తమిళనాడు), గిరౌడ్ (చత్తీస్‌గఢ్), పూసర్లపాడు (ఆంధ్రప్రదేశ్), కాంగ్గాబోక్ పార్ట్- II (మణిపూర్)
* అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా 2015, సెప్టెంబరు 8న దిల్లీలోని విజ్ఞానభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అంకిరెడ్డిగూడెం సర్పంచి సుర్వి మల్లేష్‌గౌడ్ సాక్షార భారత్ పురస్కారాన్ని అందుకున్నారు.
* సాక్షార భారత్ మిషన్‌ను కేంద్రప్రభుత్వం దేశంలో అక్షరాస్యత రేటును 80 శాతం పెంచాలన్న లక్ష్యంతో 2009, సెప్టెంబరు 8న ప్రారంభించింది.
104 టోల్‌ఫ్రీ
* తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలకు యత్నించేవారిని కాపాడేందుకు, వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చి జీవితంపై భరోసా కల్పించేందుకు 104 టోల్‌ఫ్రీ నంబరును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి 2015, సెప్టెంబరు 10న ప్రారంభించారు.
3 ఎంఎల్సీ స్థానాల పెంపు
* ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ చేసి తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల నియోజక వర్గాల కోటాలో మరో 3 ఎంఎల్సీ స్థానాల పెంపునకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2015, సెప్టెంబరు 22న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
* ఈ మూడు ఎంఎల్సీ స్థానాలను కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు కేటాయించారు.
* తెలంగాణలోని 40 శాసనమండలి స్థానాలకు ఇంతవరకు స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలు ఉన్నాయి. కొత్తగా మూడు స్థానాలు పెంచడంతో ఆ సంఖ్య 14కు చేరింది. తాజాగా శాసనమండలి స్థానాల్లో స్థానిక సంస్థల నియోజక వర్గాల కోటా జిల్లాల వారీగా.. ఆదిలాబాద్ – 1, ఖమ్మం – 1, నిజామాబాద్ – 1, కరీంనగర్ – 2, మెదక్ – 1 రంగారెడ్డి – 2, నల్గొండ – 1, హైదరాబాద్ – 2, వరంగల్ – 1, మహబూబ్‌నగర్ – 2.
‘పౌర సరఫరాల’ టోల్‌ఫ్రీ
* తెలంగాణ పౌర సరఫరాల శాఖ వినియోగదారుల కోసం ఒక టోల్‌ఫ్రీ నంబరు (1800-4250-0333)ను ఏర్పాటు చేసింది. ఈ శాఖలో జరిగే అవినీతిని అరికట్టి, పారదర్శకత పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. మార్కెట్లో కొనుగోలు చేసిన ఏదైనా ఉత్పత్తికి సంబంధించిన ఫిర్యాదులను వినియోగదారుల నుంచి ఇది స్వీకరిస్తుంది.
* ఈ టోల్‌ఫ్రీ నంబరు అన్ని పని దినాల్లో అందుబాటులో ఉంటుంది.
అనాథ పిల్లలకు అండ
* రాష్ట్రంలోని అనాథ పిల్లలను వెనుకబడిన తరగతుల్లో చేరుస్తూ తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమశాఖ 2015, సెప్టెంబరు 29న ఉత్తర్వులు జారీ చేసింది.
* వీరిని బీసీ-ఎ గ్రూపులోని 55వ క్రమసంఖ్యలో చేర్చాలని ఉత్తర్వుల్లో సూచించారు.
* వీరికి విద్య, ఉద్యోగాల్లో అన్ని రిజర్వేషన్లు; బీసీలకు అమలయ్యే సంక్షేమ పథకాలు.. ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* దేశంలో అనాథ పిల్లలను బీసీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ. (మొదటి రాష్ట్రం – తమిళనాడు)
కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంత్యుత్సవాలు
* స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమనేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సెప్టెంబరు 28న రాష్ట్రప్రభుత్వం నిర్వ హించింది. ఈ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.(హైదరాబాద్‌లో సెప్టెంబరు 27న గణపతి నిమజ్జనం ఉండటంతో ఈ కార్యక్రమాన్ని 28న నిర్వహించారు.)
జీవిత విశేషాలు
* ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో ఒక చేనేత కుటుంబంలో 1915 సెప్టెంబరు 27న కొండా లక్ష్మణ్ జన్మించారు.
* 1930లో నిజాం సంస్థానం నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ రహస్యమార్గం ద్వారా తొలిసారి గాంధీజీ సభకు హాజరయ్యారు. గాంధీజీ ప్రేరణతో ఆయన టోపీ ధరించినందుకు నిజాం సైన్యం లక్ష్మణ్‌ను నిర్బంధంలోకి తీసుకుంది.
* 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీపై జెండాను ఎగురవేశారు.
* తెలంగాణ ప్రజలపై నిజాం ఆకృత్యాలను చూసి విమోచన ఉద్యమంలో పోరాడారు.
* 1947 డిసెంబరు 4న నిజాం నవాబు మీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా కూడా నిందితుడిగా ఉన్నారు.
* 1952 నాటి నాన్‌ముల్కీ ఉద్యమం, 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు.
* 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ నియోజక వర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. (1957లో ఈ నియోజక వర్గాన్ని గిరిజనులకు రిజర్వ్ చేశారు)
* 1957లో నల్గొండలోని చిన్న కొండూర్ (తర్వాత దీని పేరుని ‘బోంగీర్ / భువనగిరి’గా మార్చారు) నియోజక వర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు.
* 1957-60 మధ్య రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్‌గా పనిచేశారు.
* 1962లో జరిగిన ఎన్నికల్లో మునుగోడు నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు.
* 1967లో భువనగిరి నుంచి పోటీచేసి గెలుపొందారు. మంత్రిగా ప్రత్యేక తెలంగాణను ఆకాంక్షించారు.
* 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
* 2011 నవంబరులో ఢిల్లీలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
* తెలంగాణ గాంధీగా పిలుచుకునే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 2012, సెప్టెంబరు 21న హైదరాబాద్‌లో మరణించారు.
* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 డిసెంబరులో ఆయన గుర్తుగా ‘శ్రీ కొండా లక్ష్మణ్’ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ)ను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీచేశారు.
మాదిరి ప్రశ్నలు
1. 2015, సెప్టెంబరు 28న ఎవరి శత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది?
జ: ఆచార్య కొండాలక్ష్మణ్ బాపూజీ
2. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అందజేసే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది?
జ: రూ.6,00,000
3. విద్యార్థులు, అధ్యాపకుల బదిలీకి సంబంధించి 2015, సెప్టెంబరు 6న తెలంగాణ విశ్వవిద్యాలయం కింది ఏ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది?
ఎ) హార్వర్డ్ బి) కొలంబియా సి) స్టాన్ఫోర్డ్ డి) చికాగో
జ: డి(చికాగో)
4. వెయ్యి మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి 2015 సెప్టెంబరులో తెలంగాణ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది?
జ: ఛత్తీస్‌గఢ్
5. సింగరేణి కాలరీస్ ఈ ఏడాది లాభాల్లో ఎంతశాతం వాటాను ఆ సంస్థ కార్మికులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది?
జ: 21%
6. 2015 సంవత్సరానికి తెలంగాణ లోని ఏ గ్రామానికి ‘సాక్షర భారత్ అవార్డు’ లభించింది?
జ: అంకిరెడ్డి గూడెం
7. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
జ: సెప్టెంబరు 8
8. తెలంగాణ రాష్ట్రంలోని శాసనమండలిలో స్థానిక సంస్థల నియోజక వర్గాల కోటాలో ఎన్ని స్థానాలను పెంచుతూ 2015, సెప్టెంబరు 22న కేంద్ర హోం మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
జ: 3
9. రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలను వెనుకబడిన తరగతుల్లోని ఏ గ్రూప్‌లో చేరుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది?
జ: బీసీ-ఎ
10. పౌర సరఫరాల శాఖలో పారదర్శకత పెంచడం, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం కోసం 2015 సెప్టెంబరులో ఆ శాఖ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరు ఏది?
జ: 1800 – 4250 – 0333