APPSC | TSPSC Group II Paper I సామాజిక మినహాయింపు – భారత సమాజం – ప్రధాన లక్షణాలు
పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోటీ పరీక్షల సిలబస్‌ను ఇటీవల ప్రకటించింది. దాదాపు అన్ని పరీక్షల్లోనూ సామాజిక మినహాయింపు/వెలి (social exclusion) అనే అంశాన్ని చేర్చారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో ఈ విభాగం నుంచి ప్రశ్నలు వస్తాయి. గ్రూప్-2 జనరల్ స్టడీస్‌లో భాగంగా ‘సామాజిక మినహాయింపు/వెలి’ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే పేపర్-2 సెక్షన్-3 లో ‘సామాజిక నిర్మితులు – విధానాలు, పేపర్-3లో ‘అభివృద్ధి – మార్పు విభాగంలో ఈ అంశాన్ని చేర్చారు. మూడు పేపర్లలో ఈ అంశం నుంచి మొత్తం 30 ప్రశ్నలు వస్తాయి.
యూరప్, అమెరికా దేశాల్లో పేదరికం ఆధారంగా సామాజిక మినహాయింపులు లేదా నెట్టివేతలు జరిగాయి. కానీ భారతదేశంలో ఈ సామాజిక మినహాయింపునకు పేదరికంతో పాటు ఇతర సాంఘిక నిర్మితులు కూడా కారణమయ్యాయి. అవి
»కులం
»తెగ
»మతం
»లింగ భేదం
»ప్రాంత భేదం
»వైకల్యం
సోషల్ ఎక్స్‌క్లూజన్ అనే పదాన్ని మొదటగా ఫ్రాన్స్ దేశీయుడైన రీన్ లెనోయిర్ ఉపయోగించాడు
ఒక వ్యక్తి తన శక్తియుక్తులను సమర్థంగా వినియోగించుకుని సామాజికంగా అభివృద్ధి చెందేందుకు కొన్ని హక్కులను కల్పించారు. అయితే సామాజిక పరిస్థితులు లేదా సాంఘిక నిర్మితుల కారణంగా ఈ హక్కులను పొందలేని స్థితిలో ఉన్న వ్యక్తులను సమాజం మినహాయించినవారు లేదా నెట్టేసినవారుగా పేర్కొంటారు. మానవ పరిణామ క్రమంలో భాగంగా సమాజంలో అధికారం, హోదా, సంపద పంపిణీలో కొందరిపట్ల వివక్ష జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయా వ్యక్తులు లేదా వర్గాలు తీవ్రమైన వెనుకబాటుతనానికి గురయ్యారు.
- ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ ప్రపంచవ్యాప్తంగా సామాజిక మినహాయింపు రెండు రకాలుగా కనిపిస్తుందని పేర్కొన్నారు.
- 1. పూర్తి స్థాయి సామాజిక మినహాయింపు
- 2. పాక్షిక స్థాయి సామాజిక మినహాయింపు
- పూర్తిస్థాయి సామాజిక మినహాయింపులో వ్యక్తులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రాతిపదికల్లో పూర్తిగా హక్కులు, రక్షణలు, భాగస్వామ్యం లాంటి అంశాల నుంచి నెట్టివేతకు గురవుతారు. అనేక సమాజాల్లో ‘వలస వచ్చినవారికి పూర్తి స్థాయిలో పౌర, రాజకీయ హక్కులను కల్పించకపోవడం దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. పాక్షిక మినహాయింపులో ఒక వ్యక్తిని సమాజ సభ్యుడిగా పరిగణిస్తారు. అయితే కొన్ని ప్రమాణాలను అందుకోవడం ద్వారా తిరిగి సమాజంలో హక్కులు, అధికారం, రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ‘పేదరికం వల్ల కొన్ని హక్కులు పొందలేకపోయినప్పటికీ, పేదరికం నుంచి బయటపడిన లేదా పేదరికం సవరణకు గురైనప్పుడు తిరిగి ఆయా హక్కులు, రక్షణను పొందుతారు. ‘సామాజిక మినహాయింపు కారణంగా విలువైన మానవ వనరులు పాక్షికంగా లేదా భారీ ప్రమాణాలతో కూడా తమ శక్తియుక్తుల్ని సమర్థంగా ప్రదర్శించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా దేశ అభివృద్ధి వెనుకబడుతుంది. సామాజిక మినహాయింపు వల్ల సాంఘిక అసమానతలు ఏర్పడతాయి. పక్షపాతం, దోపిడీ లాంటి లక్షణాలు సమాజంలో కనిపిస్తాయి. మినహాయింపు/నెట్టివేతకు గురైన వర్గాలు తీవ్ర అసంతృప్తికి గురవతాయి. ఫలితంగా సామాజిక అనిశ్చితి ప్రబలే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా తిరుగుబాట్లు, విప్లవాల ద్వారా పరిపాలనా వ్యవస్థకు ఆటంకం ఏర్పడుతుంది. ఆధునిక కాలంలో ‘సామాజిక మినహాయింపును వెనుకబాటుతనంగా భావించడంతో ఈ మినహాయింపును పాటిస్తున్న దేశాలు ప్రపంచ ర్యాంకింగ్‌లో అట్టడుగు స్థాయికి చేరుతున్నాయి. ఫలితంగా ఈ దేశాలు అంతర్జాతీయీకరణంలో ‘వెనుకబాటుతనం దశలో ఉంటున్నాయి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సంక్షేమ రాజ్య భావనలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మినహాయింపు వల్ల వంచనకు గురైన వర్గాలకు ఉపశమనం, రక్షణ కల్పించాల్సి వచ్చింది ఈ పరిస్థితిలో ‘మినహాయింపు అనేది ఒక సామాజిక, పరిపాలన, రాజకీయ చర్చనీయాంశంగా మారి ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చాయి.’సామాజిక మినహాయింపు ఒక్కో సమాజంలో ఒక్కో రూపంలో ఉంటుంది. ఇది బహురూపాల్లో ఉండవచ్చు. ఒక వర్గానికే పరిమితం కావచ్చు లేదా అనేక వర్గాలకూ విస్తరించవచ్చు.
రాజకీయ మినహాయింపు:
- రాజకీయ ప్రక్రియలు లేదా హక్కుల నుంచి కొంత మంది లేదా వర్గాలను నెట్టివేయడం.
ఉదా:
- చదువు, ఆస్తి, వయసు, కులం, ప్రాంతం లాంటి ప్రమాణాల్లో నెట్టివేయడం.
ఆర్థిక మినహాయింపు:
- ఆర్థిక ప్రక్రియల నుంచి నెట్టివేయడం, ఆర్థిక ప్రయోజనాలపై నియంత్రణ లేదా నిషేధం.
సామాజిక మినహాయింపు:
- సాంఘిక ప్రక్రియ, సామాజిక స్థాయుల్లో తగిన హోదా, భాగస్వామ్యం ఇవ్వకపోవడం.
సాంస్కృతిక మినహాయింపు:
- ఆచార వ్యవహారాలులాంటి సంస్కృతి సంబంధ విషయాల్లో నియంత్రణ లేదా నిషేధం. ఈ విధంగా ‘మినహాయింపు అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాల్లో కనిపిస్తుంది. విభిన్న కాలాల్లో ‘మినహాయింపు అనేక రూపాల్లో భారతదేశంలో కనిపిస్తుంది.
భారతదేశంలో సామాజిక మినహాయింపు
- భారతదేశంలోని సామాజిక నిర్మితులు సమాజ మనుగడ కోసం, శ్రమ విభజనతో ప్రారంభమయ్యాయి. కాని తర్వాతి కాలంలో సాంఘిక మినహాయింపు సమాజంలోని కొన్ని వర్గాలకే పరిమితమైంది.
కులం:
- భారతదేశంలో స్పష్టంగా కనిపించే సాంఘిక నిర్మితి అయిన కులం సామాజిక అంతరాలకు ఒక కారణం. ఆ అంతరాలే కొన్ని కులాలకు అధికారం, హోదా, హక్కులను కల్పిస్తే, మరికొన్ని కులాలకు ఆ అవకాశం లేకుండా చేశాయి.ప్రస్తుతం దళితులుగా గుర్తింపు పొందిన వర్గాలకు వేల సంవత్సరాలుగా రాజకీయ, సాంఘిక, ఆర్థిక హక్కులు లేకుండా నియంత్రణ లేదా నిషేధం విధించడం వెనుక ఉన్న సాంఘిక నిర్మితి కూడా కులమే. వీరిని భారత సమాజం పూర్తి స్థాయిలో సామాజిక ప్రక్రియల నుంచి నెట్టివేయడమే కాకుండా తీవ్ర దోపిడీకి గురి చేసింది. సామాజికంగా వెనుకబడిన కులాలుగా గుర్తింపు పొందినవారు కూడా పరిమిత స్థాయిలోనే రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులు పొందారు. వీరి నుంచి సమాజం కావాల్సిన సౌకర్యాలు, ఉత్పత్తులు పొందుతూనే వారికి అవసరమైనవి నియంత్రించింది. దాంతో ఆయా వర్గాలు కూడా సంపూర్ణంగా సమాజ భాగస్వామ్యం పొందలేకపోయాయి.కులం ప్రాతిపదికనే బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలు పూర్తి స్థాయి ‘ధనాత్మక మినహాయింపులు పొందారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక శక్తులుగా కేంద్రీకృతం అయ్యారు. మిగతా కులస్తులను రుణాత్మక ‘మినహాయింపుతో వివక్షకు గురిచేశారు.
తెగ:
- ‘తెగలు మిగతా భారత సమాజానికి భిన్నంగా తమ జీవన శైలిని సాగిస్తున్నాయి. అలాగే భౌగోళికంగా సమాజానికి దూరంగా జీవించడం వల్ల ఈ వర్గాలు సామాజిక ఎడబాటుకు గురవుతున్నాయి. తొలి దశల్లో తెగలు సమాజం నుంచి ఏమీ ఆశించకపోవడంతో దోపిడీ, వివక్ష కొంతవరకు తక్కువగానే ఉండేది. అయితే సమాజానికి భిన్నంగా ఉండటం, సరైన జీవన ప్రమాణాలు అందుకోలేకపోవడం, విద్య, ఉపాధి, ఉత్పత్తి రంగాల్లో తగిన భాగస్వామ్యం లేకపోవడం లాంటి మినహాయింపులకు వీరు గురయ్యారు.
మతం:
- మైనార్టీ అనే పదానికి రాజ్యాంగబద్ధంగా నిర్దిష్టమైన నిర్వచనం లేదు. కానీ, వివిధ సందర్భాల్లో అనేక ప్రాతిపదికల్లో మెజార్టీ ప్రజలు మైనార్టీలను మినహాయింపునకు గురి చేస్తున్నారు. మెజార్టీలు జాతి, మత, భాష విషయాల్లో మైనార్టీలను కొన్ని సామాజిక అంశాల నుంచి దూరం చేశారు.
లింగభేదం:
- కుల, తెగ లాంటి పరిమితులకు అతీతంగా లింగభేదం వల్ల సమాజంలో సగభాగమైన మహిళలు మినహాయింపునకు గురయ్యారు. ఆచారాలు, సంప్రదాయాలు, మత నియమాలు, సాంఘిక పరిస్థితుల పేరుతో రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థల్లో మహిళలకు భాగస్వామ్యం లేకుండా చేశారు. సామాజికంగా కూడా సొంత ఉనికిని కోల్పోయిన పరిస్థితుల్లో మహిళలు నియంత్రణకు గురయ్యారు. కుటుంబ స్థాయి నిర్ణయీకరణంలో కూడా భాగస్వామ్యం లోపించడంతో సామాజిక హోదా, భాగస్వామ్యంలో స్త్రీ వెనుకబడింది.
ప్రాంతీయత:
- భౌగోళికతను ఆధారంగా చేసుకుని కొన్ని వర్గాలకు ప్రత్యేక హక్కులను కల్పించని పరిస్థితే భారతదేశంలో కనిపించే ప్రాంతీయ మినహాయింపు. ధనాత్మక వివక్ష ఈ మినహాయింపులో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలకు అధికారం, హక్కులు, రక్షణలు బలహీనంగా లేదా అసలు అందకపోయే పరిస్థితి ఉంది.