TSPSC Group 2 Paper 1 International Relations and Events అంతర్జాతీయ వ్యవహారాలు
Contents
టీఎస్పీఎస్సీ ప్రకటించిన సిలబస్‌లో వర్తమాన అంశాలకు రెండు విభాగాలను కేటాయించడం ద్వారా ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. ఇందులో రెండో అంశంగా ‘అంతర్జాతీయ వ్యవహారాలు ఇచ్చారు. దీనికి సంబంధించి అభ్యర్థులు తాజా అంతర్జాతీయ విశేషాలను తెలుసుకోవడమే కాకుండా వాటి పూర్వచరిత్రను, ప్రారంభం నుంచి వివిధ సంఘటనల క్రమాన్ని కూడా అధ్యయనం చేయాలి.
ఈ నేపథ్యంలో అభ్యర్థుల సౌలభ్యం కోసం వర్తమాన అంశాలకు సంబంధించి ముఖ్యమైన అంతర్జాతీయ వ్యవహారాలను అందిస్తున్నాం.
భారత్ – ఆస్ట్రేలియా అణుఒప్పందం
భారత్ – ఆస్ట్రేలియాల మధ్య 2014 సెప్టెంబరు 5న చారిత్రక అణు ఒప్పందం కుదిరింది. భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోనీ అబాట్, భారత ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో దిల్లీలో చరిత్రాత్మక పౌర అణు ఒప్పందంపై ఉభయ దేశాలు సంతకం చేశాయి. ఈ పౌర అణు ఒప్పందం వల్ల ఆస్ట్రేలియా నుంచి మనకు యురేనియం అందుతుంది. దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తికి యురేనియం సరఫరా కీలకం.
బీ ప్రపంచంలోని యురేనియం నిల్వల్లో మూడో వంతు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఆ దేశం ఏటా 7 వేల టన్నుల యురేనియాన్ని ఎగుమతి చేస్తోంది. భారత్‌కు ఈ ఇంధనాన్ని విక్రయించకుండా విధించిన నిషేధాన్ని 2012లో అక్కడి లేబర్ పార్టీ వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి ఆ దేశంతో ఒప్పందం చేసుకోవడానికి భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
* అణు ఇంధనాన్ని శాంతియుత అవసరాలకు వినియోగించడంలో సహకారాన్ని పెంపొందించుకోవడం తాజా ఒప్పందం లక్ష్యం. ‘భారత్‌కు దీర్ఘకాలం పాటు నమ్మకమైన రీతిలో యురేనియాన్ని సరఫరా చేయడంలో ఆస్ట్రేలియా కీలకపాత్ర పోషిస్తుంది. యురేనియం సరఫరా, రేడియో ఐపోటోపుల ఉత్పత్తి, అణు భద్రత, ఇతర రంగాల్లో సహకారం దీని ముఖ్య ఉద్దేశం అని ఒప్పందం పేర్కొంటోంది. ఆస్ట్రేలియా నుంచి మొదటి విడత యురేనియం భారత్‌కు రావడానికి రెండేళ్లు పడుతుంది.
* భారత్ – ఆస్ట్రేలియా మధ్య అణు సహకార ఒప్పందం మన దేశంలోని అణు విద్యుత్ కర్మాగారాల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడనుంది. భారత్‌లోని అణు విద్యుత్ కర్మాగారాలు సుమారుగా 4,680 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో 2,840 మెగావాట్ల విద్యుత్ స్వదేశీ యురేనియం నుంచి కాగా, 1840 మెగావాట్ల మాత్రం దిగుమతి చేసుకున్న ఇంధనం నుంచి తయారవుతుంది.
భారత్‌లో అత్యధిక శిశు మరణాలు
* ప్రపంచ వ్యాప్తంగా 2013లో సంభవించిన అయిదేళ్లలోపు శిశువుల మరణాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదికలో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2013లో భారత్‌లో 13.4 లక్షల మంది శిశువులు అయిదేళ్ల వయసులోపే మరణించారు. 1990లో ఇది 33.3 లక్షలు.
* 1990లో భారత్‌లో జన్మించిన ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 88 మంది అయిదేళ్లలోపు చనిపోగా, 2013లో ఆ సంఖ్య 41కి తగ్గింది. నవజాత శిశు మరణాల సంఖ్య 1990 నుంచి 2013 నాటికి 51 నుంచి 29కి తగ్గింది.
* నివారించడానికి వీలున్న న్యుమోనియా, మలేరియా, అతిసార లాంటి వ్యాధులతోనే భారత్‌లో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదిక వెల్లడించింది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటన
* చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2014 సెప్టెంబరు 17, 18, 19 తేదీల్లో మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు.
* భారత్, చైనా దేశాల మధ్య చర్చల సందర్భంగా రైల్వేల నుంచి అంతరిక్షం వరకూ వివిధ అంశాలపై 12 ఒప్పందాలు కుదిరాయి. 2015ను ‘భారత్ సందర్శన ఏడాదిగా, 2016ను ‘చైనా సందర్శన ఏడాదిగా ప్రకటించారు.
* వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో రానున్న అయిదేళ్లలో చైనా రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులు భారత్‌లో పెట్టనుంది. ముంబయి, షాంఘైలను సోదర నగరాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.
బ్రిటన్‌తో ఉండేందుకే స్కాట్లాండ్ మొగ్గు
* ‘స్కాట్లాండ్ స్వతంత్య్ర దేశంగా అవతరించాలా అంటూ 2014 సెప్టెంబరులో నిర్వహించిన రెఫరెండంలో అత్యధిక స్కాట్లాండ్ ప్రజలు బ్రిటన్‌తో కలిసి ఉండేందుకే ఆసక్తి చూపించారు.
* స్కాట్లాండ్లో వేర్పాటువాదానికి స్కాట్లాండ్ నేషనల్ పార్టీ నాయకత్వం వహించింది. రెఫరెండం ఫలితాలు వెలువడిన తర్వాత ఆ పార్టీ నేత, స్కాట్లాండ్ ప్రథమ ప్రతినిధి అలెక్స్ సాల్మాండ్ పదవికి రాజీనామా చేశారు.
* ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్లను కలిపి గ్రేట్ బ్రిటన్‌గా వ్యవహరిస్తారు. 1535లో ఇంగ్లండ్, వేల్స్లు కలవగా; 1707లో స్కాట్లాండ్ కలయికతో గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. 1921లో గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్‌లు కలిసి యునైటెడ్ కింగ్డమ్ (యుకే)గా అవతరించాయి.
* గ్రేట్బ్రిటన్ చట్టసభల్లో అన్ని రకాల చర్చల్లోనూ అన్ని ప్రాంతాల భాగస్వామ్యం కోసం చానాళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. తమ శాసనాధికారాలను పెంచాలని వేల్స్, స్కాట్లాండ్ పోరాడుతున్నాయి. దీన్నే సంక్రమణ విప్లవంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత శాసనవ్యవస్థలో ఇంగ్లండ్ ఎంపీల పెత్తనం ఒకింత ఎక్కువ. విద్య, ఆరోగ్యం లాంటి మౌలిక రంగాలపై పార్లమెంటు చర్చల్లో ఇంగ్లండ్ ప్రజా ప్రతినిధులనే అనుమతిస్తారు. ఈ వివక్షను 1999 నుంచి స్కాట్లాండ్ వ్యతిరేకిస్తోంది. స్కాట్లాండ్ నేషనల్ పార్టీ ప్రధానంగా ఈ సమస్య పైనే ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా పోరాడింది. ఈ నేపథ్యంలోనే తాజా రెఫరెండం కూడా చోటు చేసుకుంది. అయినా స్కాట్లాండ్ ప్రజలు బ్రిటన్‌తో కలిసి ఉండేందుకే మొగ్గు చూపారు.
ప్రధాని అమెరికా పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 1 వరకు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని 2014 సెప్టెంబరు 27న 193 మంది సభ్యులున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రసంగించారు. సెప్టెంబరు 28న న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ప్రవాస భారతీయుల సభలో మోదీ పాల్గొన్నారు.
* సెప్టెంబరు 30న మోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న రక్షణ ఒప్పందాన్ని మరో పదేళ్లపాటు పొడిగించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. 2005లో కుదిరిన ఈ ఒప్పందం 2015తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దీన్ని మరో పదేళ్లపాటు పొడిగించాలని నిర్ణయించారు.
* తీర ప్రాంత రక్షణ విషయంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని, ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా పథకానికి అమెరికా సహకారం అందించనుంది. తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేసి, పర్యావరణానికి నష్టం కలిగించని విధంగా ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో నడిపించడానికి భారత్‌కు అమెరికా 100 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించింది.
* ఏటా వెయ్యి మంది అమెరికా విద్యావేత్తలను భారత్‌కు ఆహ్వానించి, ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పించాలన్న భారత ప్రతిపాదనకు ఒబామా అంగీకరించారు. అమెరికా, భారత్ సంబంధాలను ‘120 వోల్ట్స్, 220 వోల్ట్స్గా మోదీ అభివర్ణించారు. భారత్‌లో 220 వోల్ట్స్ వ్యవస్థను, యూఎస్‌లో 120 వోల్ట్స్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ రెండింటి శక్తిలో తేడా ఉంది. ఆ తేడాను సరిచేసి, కలిసి పని చేసేందుకు చర్యలు చేపట్టాలంటూ ఈ సందర్భంగా మోదీ సూచించారు.
సార్క్ 18వ శిఖరాగ్ర సమావేశం
2014 నవంబరు 26, 27 తేదీల్లో నేపాల్ రాజధాని ఖాఠ్మండులో దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్ – South Asian Association for Regional Cooperation) 18 వ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని, సీమాంతర నేరాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని మోదీ పిలుపునిచ్చారు. సార్క్ దేశాలు జరిపే విదేశీ వాణిజ్యంలో కేవలం అయిదు శాతం మాత్రమే సార్క్ పరిధిలో జరుగుతోందని, దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
* 1985 డిసెంబరు 8న సార్క్ ఏర్పడింది. ప్రారంభంలో ఏడు సభ్యదేశాలు (బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక) ఉన్నాయి. 2007 ఏప్రిల్‌లో దిల్లీలో జరిగిన 14వ సార్క్ సమావేశంలో ఎనిమిదో సభ్యదేశంగా అఫ్గానిస్థాన్ చేరింది. సార్క్ కేంద్ర కార్యాలయం నేపాల్ రాజధాని ఖాఠ్మండులో ఉంది. సార్క్ మొదటి సమావేశాన్ని 1985 డిసెంబరు 8న ఢాకాలో నిర్వహించారు. సార్క్ పితామహుడిగా బంగ్లాదేశ్ అప్పటి అధ్యక్షుడు జియా ఉర్ రెహ్మాన్‌ను పేర్కొంటారు.
* ఆస్ట్రేలియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇరాన్, జపాన్, మారిషస్, మయన్మార్, దక్షిణకొరియా, అమెరికా సార్క్ పరిశీలక దేశాలుగా వ్యవహరిస్తున్నాయి.
* తాజా సార్క్ సమావేశంలో విద్యుత్ రంగంలో పరస్పర సహకారానికి ఎనిమిది దేశాలు సమ్మతించాయి. ఈ ఒప్పందం ద్వారా సార్క్ దేశాల మధ్య విద్యుత్తు కొనుగోళ్లు, అమ్మకాలు, పరస్పర సహకారం సులభమవుతాయి. మూడేళ్ల తర్వాత జరిగిన సార్క్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా ‘ఖాఠ్మండు ప్రకటనను విడుదల చేశారు.
* ఉగ్రవాదంతోపాటు అన్ని రకాల హింసాత్మక తీవ్రవాద చర్యలను ఎదుర్కోవడంలో పరస్పరం సహకరించుకోవాలని, దక్షిణాసియాను ఒక ఉమ్మడి మార్కెట్‌గా మార్చడానికి ఉద్దేశించిన ‘దక్షిణాసియా ఆర్థిక కూటమి (ఎస్‌ఏఈయూ)ని దశల వారీగా ఏర్పాటు చేయాలని, ప్రాంతీయ, ఉపప్రాంతీయ ప్రాజెక్టుల అమలుకు ఉపయోగపడే విధంగా సార్క్ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ‘ఖాఠ్మండు ప్రకటనలో పేర్కొన్నారు. తదుపరి సార్క్ సమావేశాన్ని పాకిస్థాన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
Leave a Reply