TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part II
ఆరు దశాబ్దాలకు పైగా రెండు తరాల ప్రజలు జరిపిన సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ‘బంగారు తెలంగాణ’ దిశగా అడుగులు వేస్తోంది. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రగతి యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. రాబోయే తరాలకు రతనాల తెలంగాణను అందించాలని కోటి ఆశలతో, ఆశయాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు రాష్ట్రానికి సంబంధించి ప్రతి అంశంపై, అన్ని రకాల పథకాలపై సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలి.
29వ రాష్ట్రం
* ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014’ ప్రకారం.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ‘అపాయింటెడ్ డే’ గా నోటిఫై చేసిన 2014 జూన్ 2న తెలంగాణ, దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
* తెలంగాణ ఆవిర్భావ దినం జూన్ రెండో తేదీనే తెలంగాణ నూతన ప్రభుత్వం కూడా ఏర్పా టైంది.
తెలంగాణ స్వరూపం
* తెలంగాణ రాష్ట్ర అర్థగణాంక శాఖ రూపొందించిన ‘తెలంగాణ స్టేట్ ఎట్ గ్లాన్స్-2015’ పుస్తకాన్ని 2014 డిసెంబరు 31న సచివాలయంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఆవిష్కరించారు. దీని ప్రకారం..
* భౌగోళిక వైశాల్యం – 1,14,840 చ.కి.మీ.లు
* రాష్ట్ర జనాభా – 3,51,93,978
* జిల్లాలు – 10
* రెవెన్యూ డివిజన్లు – 42
* పట్టణ స్థానిక సంస్థలు – 68
(ఇందులో మున్సిపల్ కార్పొరేషన్లు – 6, మున్సిపాలిటీలు – 37, నగరపంచాయితీలు – 25)
* జిల్లా పరిషత్తులు-9 (హైదరాబాద్‌లో జిల్లా పరిషత్ లేదు)
* మండల ప్రజా పరిషత్తులు – 438
* గ్రామ పంచాయతీలు – 8,691
* రెవెన్యూ మండలాలు – 459
ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం..
* రాష్ట్రంలో మొత్తం ఓటర్లు – 2,83,15,120
* పురుషులు – 1,44,72,054
* మహిళలు – 1,38,40,715
* మూడో వర్గం – 2,350
పర్యావరణ పరిరక్షణ జోన్
* దేశంలో కొత్తగా అభయారణ్యాల కోసం రెండు ప్రాంతాలను ‘పర్యావరణ పరిరక్షణ జోన్’లుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ఒకటి ‘దాద్రానగర్ హవేలీ’ కాగా రెండోది తెలంగాణ రాష్ట్రంలోని ‘ప్రాణహిత ప్రాంతం’.
* ప్రాణహిత చుట్టూ 5 కి.మీ.ల పరిధి వరకు పర్యావరణ పరిరక్షణ జోన్‌గా ఏర్పాటు చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ, ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ప్రధానంగా కృష్ణజింకల కోసం కేటాయిస్తున్నారు.
‘రామగుండం’ పునరుద్ధరణ
* రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు 3 ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
* కరీంగనర్ జిల్లాలో ఇదివరకు మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం స్థానంలో గ్యాస్ ఆధారిత అమ్మోనియా, యూరియా ప్లాంట్లను ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరుతో ప్రారంభించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐఎల్) లు 2015 జనవరి 14న ఒప్పందంపై సంతకాలు చేశాయి.
* ఈ ఒప్పందంపై కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి దర్మేంద్ర ప్రథాన్ సంతకాలు చేశారు.
* పునరుద్ధరణ నిర్మాణ పనులు 2016లో ప్రారంభమై, 2018 నాటికి పూర్తవుతాయని అంచనా.
* ‘రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ ఎరువుల కర్మాగారం పనులు 1971లో ప్రారంభమయ్యాయి. 1980లో వాణిజ్య కార్యకలాపాలు మొదలయ్యాయి. 1999 మార్చిలో ఉత్పత్తి నిలిచిపోయింది.
‘గ్రేటర్’గా వరంగల్
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ నగరాన్ని ‘గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)’గా మారుస్తూ 2015 జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.
* తెలంగాణ రాష్ట్రంలో రెండో గ్రేటర్ నగరంగా వరంగల్ ఏర్పాటైంది. మొదటిది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ).
‘అప్పా’ పేరు మార్పు
* ‘అప్పా’గా పేరుగాంచిన ‘రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ’ పేరును 2015 ఫిబ్రవరిలో ఆర్బీవీఆర్ఆర్ (రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి) తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ’గా తెలంగాణ ప్రభుత్వం మార్చింది.
* రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి నిజాం సంస్థానంలో మొదటి హిందూ కొత్వాల్ (కమిషనర్ ఆఫ్ పోలీస్)గా 1920-1934 మధ్య పనిచేశారు.
లక్ష కోట్ల బడ్జెట్
* 2015 మార్చి 7 – 27 తేదీల మధ్య తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరిగాయి.
* తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మార్చి 11న శాసనసభలో ప్రవేశపెట్టారు.
* 2015-16 సంవత్సరానికి మొత్తం బడ్టెట్ రూ.1,15,689 కోట్లు.
ప్రణాళికా వ్యయం – రూ.52,383 కోట్లు
ప్రణాళికేతర వ్యయం – రూ.63,306 కోట్లు
రెవెన్యూ రాబడులు – రూ.94,131.51 కోట్లు
రెవెన్యూ వ్యయం – రూ.93,600.21 కోట్లు
రెవెన్యూ మిగులు – రూ.531.30 కోట్లు
* రాష్ట్రానికి అత్యధిక పన్ను ఆదాయం అమ్మకం పన్ను (వ్యాట్) నుంచి లభిస్తోంది. ఈ ఆదాయం రూ.35,463.39 కోట్లు. రాష్ట్ర ఎక్సైజ్ పన్ను ద్వారా రూ.3,916.43 కోట్లు, స్టాంపులు, రిజర్వేషన్లు ద్వారా రూ.3,700 కోట్లు సమకూరుతోంది.
* 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాలకు వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. దీంతో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాగా రూ.12,823.25 కోట్లు వస్తాయి.
సింగరేణికి ‘గోల్డెన్ పీకాక్’
* బొగ్గు గనులు కోసం తవ్వి తీసిన మట్టిని తిరిగి వినయోగించుకోవడంలో పాటించిన విధానాలకు గాను తెలంగాణలోని సింగరేణి సంస్థకు.. ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ ప్రభుత్వానికి చెందిన ‘గోల్డెన్ పీకాక్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ సర్వీస్ అవార్డు – 2015’ లభించింది.
టీఎస్సీఏబీ ఏర్పాటు
* రాష్ట్ర విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఏపీసీవోబీ-ఆప్కాబ్) విభజన పూర్తయి, రెండు రాష్ట్రాలకు వేర్వేరు బ్యాంకులు ఏర్పడ్డాయి.
* ఆంధ్రప్రదేశ్‌కు ‘ఆప్కాబ్’ కొనసాగగా, తెలంగాణకు ‘తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీఎస్సీఏబీ)’ కొత్తగా ఏర్పాటైంది.
* తొలి ఎండీగా మురళీధర్ నియమితులయ్యారు.
* తొలిఛైర్మన్గా 2015 మేలో కె.రవీందర్రావు ఎంపికయ్యారు.
‘సిట్’ ఏర్పాటు
* వరంగల్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న వికారుద్దీన్ ముఠా(అయిదుగురు)ను 2015 ఏప్రిల్ 7న విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా నల్గొండ జిల్లా ఆలేరు సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది.
* ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ఐజీ ‘సందీప్ శాండిల్య’ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సౌర విద్యుత్తు విధానం
* తెలంగాణ ప్రభుత్వం సౌర విద్యుత్తు విధానాన్ని 2015 మే 18న ప్రకటించింది.
ముఖ్యాంశాలు
సింగిల్ విండో విధానంలో అనుమతులు.
ప్రాజెక్టులకు భూగరిష్ఠ పరిమితి చట్టం నుంచి మినహాయింపు.
ఒక మెగా వాట్‌కు 5 ఎకరాల వరకు సేకరించే వీలు ప్రాజెక్టుకు భూముల కొనుగోళ్లపై 100 శాతం స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు.
అయిదేళ్ల వరకూ ప్రభుత్వం వ్యాట్, జీఎస్టీ పన్నులను తిరిగి చెల్లిస్తుంది.
నివాస, వ్యాపార, పారిశ్రామిక భవనాలపై ఏర్పాటుకు చేసుకునే దరఖాస్తులకు 21 రోజుల్లో అనుమతులు.
‘స్వచ్ఛ’ కార్యక్రమాలు
* స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలను 2015 మే 16న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గవర్నరుతో కలిసి హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో ప్రారంభించారు.
* బహిరంగ మల మూత్ర విసర్జన లేకుండా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కలిసి 12 గ్రామాల్లో ‘స్వచ్ఛ విలేజ్’ పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది.
దాశరథి రంగాచార్య మరణం
* ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత అయిన దాశరథి రంగాచార్య 2015 జూన్ 8న హైదరాబాద్‌లో మరణించారు.
* నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ రచయిత దాశరథి కృష్ణమాచార్యులకు తమ్ముడు. ఇతడు కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు.
* రంగాచార్య ప్రఖ్యాత రచనలు: చిల్లర దేవుళ్లు, మోదుగుపూలు, జీవన యానం(ఆత్మకథ). ఆయన తనరచనల్లో తెలంగాణ జీవన చరిత్రను కళ్లకు కట్టినట్లు వివరించారు.
జెనీవా సదస్సుకు నాయిని
* 2015 జూన్ 11-13 మధ్య జెనీవాలో జరిగిన 104వ అంతర్జాతీయ కార్మిక సదస్సుకు తెలంగాణ రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు.
* అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
మండల కేంద్రంగా భద్రాచలం
* పోలవరం ముంపు ప్రాంతంలోని కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించడంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని రెండు మండలాల స్వరూపం మారింది.
* ముంపు గ్రామాల విలీనంతో భద్రాచలం, భూర్గంపాడు మండలాలను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో భద్రాచలం మండలంగా మారింది.
పాలమూరు ఎత్తిపోతల పథకం
* భారీ నీటి పారుదల ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జూన్ 11న శంకుస్థాపన చేశారు.
* కృష్ణానదిపై నిర్మించే ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యం. (మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షలు, నల్గొండ జిల్లాలో 30 వేల ఎకరాలు)
* ప్రాజెక్టు మొత్తం నీటి పరిమాణం 90 టీఎంసీలు. ఇందులో 70 టీఎంసీలు సాగుకు, 20 టీఎంసీలు హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు వినియోగిస్తారు.
* ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 35,200 కోట్లు.
‘స్థానిక’ ప్రతినిధుల వేతనాలు పెంపు
* స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 మార్చి 13న శాసనసభలో ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
తెలంగాణ ‘ఐపాస్’
* తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ ఐపాస్ – తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్, ప్రాజెక్టు అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్)ను 2015 జూన్ 12న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
ముఖ్యాంశాలు
భూమి, నీరు, విద్యుత్తు, రహదారులు లాంటి మౌలిక సదుపాయాలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన 150 పారిశ్రామిక వాడలు, 28 సెజ్‌లు.
పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా లక్షా 60 వేల ఎకరాల భూమి.
కోరుకున్న చోట, కావల్సినంత భూమి.
అన్ని పరిశ్రమలుకు 24/7 విధానంలో విద్యుత్తు సరఫరా.
వాటర్ గ్రిడ్ పైప్లైన్ల ద్వారా ప్రాజెక్టుల నుంచి పుష్కలంగా నీరు.
ఆన్లైన్లోనే దరఖాస్తులు, రెండు వారాల్లోపు అనుమతులు.
ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఛేజింగ్ సెల్.
పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి.
0 శాతం అవినీతి.. 100 శాతం పారదర్శకత
సెల్ఫ్ సర్టిఫికేషన్‌కు ప్రాధాన్యం.. పారిశ్రామికవేత్తలపై విశ్వాసం.
ప్రతి జిల్లాకేంద్రానికి హైదరాబాద్ నుంచి నాలుగు లైన్ల రోడ్లు, హైదరాబాద్ చుట్టూ రింగ్‌రోడ్డు.
* నూతన పారిశ్రామిక విధానం-2015 ప్రకారం పరిశ్రమలను 5 కేటగిరీలుగా విభజించారు. అవి..
1. మెగాప్రాజెక్టులు: రూ. 200 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు, 100 కంటే ఎక్కువ మందికి ఉపాధి.
2. భారీ పరిశ్రమలు: రూ. 10 కోట్ల నుంచి 200 కోట్ల వరకు పెట్టబడులు.
3. మధ్య తరహా: రూ. 5 కోట్ల నుంచి 10 కోట్ల పెట్టుబడులు.
4. చిన్న తరహా: రూ. 25 లక్షలు నుంచి 5 కోట్ల వరకు పెట్టుబడులు.
5. సూక్ష్మతరహా: రూ. 25 లక్షలు కంటే తక్కువ స్థాయి.
ఉత్తమ విశ్వవిద్యాలయం హెచ్‌సీయూ
* హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ‘ఉత్తమ విశ్వవిద్యాలయం’ విభాగంలో విజిటర్స్ అవార్డుకు ఎంపికైనట్లు 2015 జనవరి 29న రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.
* కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సందర్శకుడిగా వ్యవహరించే రాష్ట్రపతి ఉత్తమ యూనివర్సిటీ, నవీకరణ, పరిశోధన విభాగాల్లో వాటికి ‘విజిటర్స్ అవార్డులు’ అందజేస్తారు.
* 2015 ఏప్రిల్‌లో హెచ్‌సీయూకి కులపతిగా ఆర్బీఐ మాజీ గవర్నరు డాక్టర్ సి.రంగరాజన్ నియమితులయ్యారు.
Leave a Reply