TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part III
* తెలంగాణ అభివృద్ధికి పథకాలు
* గోదావరికి మహాపుష్కరాలు
* ప్రజాకవికి ప్రభుత్వ నీరాజనం
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం 2015లో విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ఈదిశగా పలు ప్రగతి పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించింది. అటవీ అభివృద్ధికి పెద్దపీట వేసింది. మరోవైపు తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాలు పండగ.. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వచ్చిన గోదావరి మహాపుష్కరాలు.. వీటిని వైభవంగా నిర్వహించింది. పలువురు ప్రముఖులకు పురస్కారాలను అందించి సత్కరించింది. సినారె, డీఎస్ లాంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించింది.. ఇలాంటి ఎన్నో విశేషాల అవలోకనం టీఎస్పీఎస్సీ అభ్యర్థుల కోసం..
నియామకాలు
* తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టరు (జేఎండీ)గా సి.శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది.
* ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ (ఐఆర్ఏఎస్)కు చెందిన ఆయన గత నాలుగేళ్లుగా డిప్యూటేషన్‌పై సీపీడీసీఎల్ ఆర్థిక విభాగం డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.
* డిప్యూటేషన్ ముగిసినా మరో రెండేళ్లు కొనసాగించేందుకు కేంద్ర రైల్వేశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందింది.
* తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎఫ్సీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా షఫియుల్లా నియమితులయ్యారు.
* ఈయన ప్రస్తుతం జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. డిప్యూటేషన్ పద్ధతిలో ఏడాదిపాటు టీఎస్ఎంఎఫ్సీ ఎండీగా కొనసాగుతారు.
* మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ 2015 ఆగస్టు 21న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
* దీని ప్రకారం కేబినెట్ ర్యాంకుతో ‘అంతర్ రాష్ట్ర వ్యవహారాలు’ బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ నియామకం ఏడాదిపాటు ఉంటుంది.
* నిజామాబాద్‌కు చెందిన డి.శ్రీనివాస్ రెండు సార్లు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
* తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి (సినారె) 2015 ఆగస్టు 1న ఎంపికయ్యారు.
* సినారెకి 1988లో జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది.
* సినారె ప్రముఖ రచనలు కర్పూర వసంతరాయలు, విశ్వంభర..
హరిత హారం
* రాష్ట్రంలో అడవులను 24 నుంచి 33 శాతానికి పెంచే లక్ష్యంతో హరిత హారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రారంభించారు.
* మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యం.
గోదావరి పుష్కరాలు
* 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన గోదావరి మహా పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.
* తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి వచ్చిన పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం 2015 జులై 14-25 తేదీల మధ్య నిర్వహించింది.
* ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి వద్ద గోదావరిలో పుణ్యస్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు.
ఒప్పందాలు
ఇరాన్‌తో: * తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఇరాన్‌ల మధ్య 2015, జులై 14న రవీంద్రభారతిలో సాంస్కృతిక ఒప్పందం కుదిరింది.
* ఇందులో భాగంగా ఒకరి కళారూపాలను ఇంకొకరు గౌరవించాల్సి ఉంటుంది.
* ఇందులో భాగంగా 2015, జులై 26న ఇరాన్ కళాకారులు ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇజ్రాయిల్‌తో : * తెలంగాణ, ఇజ్రాయిల్ మధ్య నృత్యకళా ఒప్పందం జరిగింది.
* హైదరాబాద్‌లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో 2015, జులై 16న ఇజ్రాయిల్ దేశ సాంస్కృతిక ప్రతినిధి కణా అంజి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య మధ్య ఒప్పందం కుదిరింది.
* దీనిలో భాగంగా తెలంగాణ ‘పేరిణీ నృత్యం’ను ఇజ్రాయిల్‌లో ప్రదర్శించేందుకు, ఇజ్రాయిల్ ‘గాగా డాన్స్ ఫామ్’ను తెలంగాణలో ప్రదర్శించేందుకు ఒప్పందాలు కుదిరాయి.
* అక్టోబరు, నవంబరు నెలల్లో ‘గాగా డాన్స్ ఫామ్’ నృత్య ప్రదర్శనలు తెలంగాణలో ఇవ్వనున్నారు.
పురస్కారాలు
* తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రదానం చేస్తున్న దాశరథి కృష్ణమార్యులు అవార్డును ప్రముఖ సాహితీవేత్త ‘తిరుమల శ్రీనివాసాచార్యులు’కు దాశరథి జయంతి అయిన జులై 22న అందజేశారు.
* ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురం భీమ్ మనుమడు సోనేరావుకు కొమురం భీమ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
* ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పేరిట ఏర్పాటు చేసిన ‘ఆచార్య దేవోభవ’ పురస్కారాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అందుకున్నారు. ఆగస్టు 17న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన జయశంకర్ జయంతి ఉత్సవాల్లో కోదండరామ్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
‘గివ్ ఇట్ అప్’లో తెలంగాణ
* ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని, వారికి మరిన్ని రాయితీ సిలిండర్లు అందించేందుకు వీలుగా కేంద్రం ప్రారంభించిన ‘గివ్ ఇట్ అప్’ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారు.
* కేంద్ర పెట్రోలియం శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.
* ‘గివ్ ఇట్ అప్’లో దేశంలో తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది.
* ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.
‘బోవెరా’ పురస్కారం
* ప్రముఖ కవి, జానపద గాయకుడు అయిన గోరేటి వెంకన్నకు ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, గాంధేయవాది అయిన బోయినపల్లి వెంకట రామారావు పేరిట ఏర్పాటు చేసిన ‘బోవెరా కవితా పురస్కారం’ లభించింది.
* బోవెరా జయంతి సందర్భంగా కరింనగర్లోని బోవెరాభవన్లో 2015 సెప్టెంబరు 2న పురస్కారం ప్రదానం చేశారు.
గ్రామాల అభివృద్ధి
* గ్రామాల సమ్మిళిత-సమీకృత అభివృద్ధి సాధన లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని 2015, ఆగస్టు 17న వరంగల్ జిల్లా, గంగదేవిపల్లిలో ప్రారంభించారు.
* రానున్న అయిదేళ్లలో ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం 25 వేల కోట్లు ఖర్చు చేయనుంది.
* ఈ కార్యక్రమం కింద జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి 2 నుంచి 6 కోట్ల రూపాయలు అందిస్తారు.
లక్ష్యాలు
* గ్రామాల్లో సమ్మిళిత-సమీకృత అభివృద్ధి సాధించడం.
* పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం.
* గ్రామ పంచాయతీలను క్రియాశీలకంగా మార్చడం.
* గ్రామస్థాయిలోనే ‘గ్రామసభ’ల ఆమోదంతో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలు..
తెలంగాణ పల్లెప్రగతి
* తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల జీవనోపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లెప్రగతి’ కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు 2015, ఆగస్టు 22న మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రారంభించారు.
* ఈ కార్యక్రమం మొత్తం వ్యయం రూ. 642 కోట్లు.. (ఇందులో ప్రపంచ బ్యాంకు రూ. 450 కోట్ల ఆర్థికసాయం అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.192 కోట్లు వెచ్చిస్తుంది.)
* తెలంగాణలో 37.5 లక్షల మంది పేద గ్రామీణులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
* ఎంపిక చేసిన 150 మండలాల్లో అయిదేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది.
ముఖ్యాంశాలు: గ్రామస్థాయిలో 2.5 లక్షల పేదల ఉత్పత్తిదారుల సంఘాలు, కృషి మార్ట్ల ఏర్పాటు ద్వారా ఆదాయం పెంపు.
* వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెలవకులపై శిక్షణ. గొర్రెలు, మేకల పెంపకంతోపాటు వరి, తృణ ధాన్యాల ఉత్పత్తి తదితర అంశాల్లో వారికి చేయూత..
* 2.5 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యం, ఆహార భద్రత కల్పించడం.
* 1,000 గ్రామ పంచాయతీల్లో పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పాటు.
* తెలంగాణ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ‘తెలంగాణ రూరల్ ఇన్‌క్లూ జివ్ గ్రోత్ ప్రాజెక్ట్ (టీఆర్ఐజీపీ)’ అని కూడా అంటారు.
బోనాలు
* తెలంగాణ రాష్ట్ర పండగ అయిన బోనాలను 2015, ఆగస్టు 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సికింద్రాబాద్ మహంకాళీ అమ్మవారికి బోనం సమర్పించి ప్రారంభించారు.
* తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతిబింబమైన బోనాల కోసం రూ. 10 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ భాషాదినోత్సవంగా కాళోజీ జయంతి
కాళోజీ స్మారక పురస్కారం : * ప్రజాకవి కాళోజీ నారాయణరావు విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజును (సెప్టెంబరు 9) తెలంగాణ భాషా దినోత్సవంగా గుర్తిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు కాళోజీ 101వ జయంతిని రాష్ట్రస్థాయిలో అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో 2015 సెప్టెంబరు 9న తెలంగాణ భాషాదినోత్సవాన్ని నిర్వహించారు.
* రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాల్లో.. కాళోజీ జీవితం, సాహిత్యం, కవిత్వంపై చర్చలు, ఉపన్యాసాలు, కవి సమ్మేళనాలు, నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ జయంత్యుత్సవాలతో పాటు, కాళోజీ స్మారక పురస్కారం-2015 ప్రదాననోత్సవం కూడా సెప్టెంబరు 9న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించారు.
* మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ కవి, విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్‌కు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు
* కాళోజీ నారాయణరావు కుటుంబం కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చి మడికొండ గ్రామంలో స్థిరపడింది.
* కాళోజీ 1914, సెప్టెంబరు 9న జన్మించారు.
* కాళోజీ తల్లిదండ్రులు రంగారావు, రమాబాయమ్మ.
* ప్రాథమిక విద్య అనంతరం పాతబస్తీలోని ‘చౌమొహల్లా’ పాఠశాలలో కొంత కాలం కాళోజీ చదివారు. ఆ తర్వాత సిటీకాలేజీలోనూ చదివారు.
* 1939లో హైదరాబాద్‌లోని హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.
* స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర మరువలేనిది.
* రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలిన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా పాలకులపై అక్షరాస్త్రాలు సంధించారు. ఈ గ్రంథం అత్యంత ప్రజాదరణ పొందింది.
* విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు.
* వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకే ఆయనకు నగర బహిష్కరణ శిక్ష విధించారు.
* ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు.
* విశాలాంధ్ర కావాలని ఆశించిన కాళోజీ, విశాలాంధ్ర వల్ల ఎదురయ్యే సమస్యలను గుర్తించి 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
* కాళోజీ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1992లో పద్మ విభూషణ్ పురస్కారంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ప్రజాకవి’ బిరుదుతో సత్కరించాయి.
* కాకతీయ యూనివర్సిటీ 1992లో కాళోజీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
* కాళోజీ తన దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు, నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ (కెఎంసీ) పేరును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంగా ప్రభుత్వం మార్చింది.
* కాళోజీ నారాయణరావుని ‘కాళోజీ, కళన్న, ప్రజాకవి(బిరుదు)’ అని పిలుస్తారు.
* కాళోజీ 2002, నవంబరు 13న మరణించారు.
రచనలు :
* అణాకథలు – 1941, పార్థివ వ్యయం – 1946, కాళోజీ కథలు – 1943, జీవనగీత – 1968 (అనువాద గ్రంథం), నాగొడవ – 1953, నా భారతదేశ యాత్ర – 1941 (అనువాదం), తెలంగాణ ఉద్యమ కవితలు – 1969-70.
* కాళోజీ గ్రంథం ‘నాగొడవ’ తొలిసారిగా 1953 జనవరి 12న ముద్రితమైంది. తర్వాత చాలాసార్లు పునర్ముద్రించారు.
* కాళోజీ ఆత్మకథ పేరు – ఇది నాగొడవ (1995)
కాళోజీకి స్ఫూర్తినిచ్చే సూక్తులు.. 1.’ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’, 2. ‘పుటక నీది – చావు నీది – బతుకంతా దేశానిది’. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజీ అన్న మాటలు.
Leave a Reply