TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part V
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా మహిళలు, బాలికల సంక్షేమం దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ చెరువుల పునరుద్ధరణ చేపడుతున్న ‘మిషన్ కాకతీయ’ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం. ఈ పథకాలపై టీఎస్పీఎస్సీ అభ్యర్థులు మంచి అవగాహన సాధించాలి.
* తెలంగాణ ప్రభుత్వం సామాజిక భాగస్వామ్యంతో వికేంద్రీకరణ నమూనాలో ‘మిషన్ కాకతీయ’ పేరిట రాష్ట్రంలో ఉన్న 46,531 చెరువుల (చిన్న తరహా సాగునీటి వనరులు) పునరుద్ధరణ కోసం బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది.
* ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవ్గం, ‘సదాశివనగర్ గ్రామం’ లోని పాతచెరువులో ప్రారంభించారు.
* ఈ కార్యక్రమం కింద రానున్న అయిదేళ్లలో రూ.20,000 కోట్ల అంచనా వ్యయంతో అన్ని చెరువులను పునరుద్ధరించాలనేది లక్ష్యం.
* చెరువుల పునరుద్ధరణలో కింది అంశాలు భాగంగా ఉంటాయి.
1) పూడిక తొలగింపు – నిల్వ సామర్థ్యాన్ని పెంచడం.
2) పూడిక మట్టిని పొలాల్లో పునర్వినియోగించడం.
3) చెరువులకు సంబంధించిన పిల్ల కాలువల పునరుద్ధరణ.
4) గట్లు, తూములు, అడ్డుకట్టల మరమ్మతులు.
5) సాగునీటి కాలువల రీ-సెక్షనింగ్.
వర్తమానాంశాలు – ప్రాంతీయం
మిషన్ కాకతీయ ఆవశ్యకత:
* రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి చెరువుల వ్యవస్థ కీలకమైంది. భూసార, జలసంరక్షణ, వరదల నియంత్రణ, కరవు నివారణ, పశుగణం, గృహ వినియోగాలు, భూగర్భజలాలను పెంచడం, శీతోష్ణస్థితి, పర్యావరణ పరిరక్షణలకు చెరువుల పునరుద్ధరణ దోహదపడుతుంది.
* 2014-15 నుంచి మొదలయ్యే ఈ పథకంలో భాగంగా అయిదేళ్ల కాలంలో ఏడాదికి 20 శాతం చొప్పున మొత్తం 46,531 చెరువులను పునరుద్ధరిస్తారు.
కళ్యాణ లక్ష్మి
* తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఆర్థిక కుంగుబాటు లేకుండా చేయడానికి వివాహ సమయంలో యువతులకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది.
* ఈ పథకం కింద 18 సంవత్సరాలు నిండిన అవివాహిత యువతులకు వివాహ సమయంలో జీవితంలో ఒకసారి రూ.51,000 ఆర్థిక సాయం అందిస్తారు.
* ఈ పథకం 2014 అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ పథకం కింద లబ్ధి పొందే తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలకు మించకూడదు.
షాదీ ముబారక్
అవివాహిత మైనారిటీ కమ్యూనిటీ యువతులందరికీ వివాహ సందర్భంగా వారి కుటుంబ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ‘షాదీ ముబారక్’ పథకాన్ని ప్రవేశపెట్టింది.
* ఈ పథకం 2014 అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చింది.
* వివాహానికి కనీసం నెల ముందు దరఖాస్తు చేసుకునే ప్రతి మైనారిటీ బాలికకు ఒకసారి రూ.51,000 ఆర్థిక సాయం అందిస్తారు.
* ఈ మొత్తాన్ని పెళ్లికూతురు పేరిట అకౌంట్ పేయీ చెక్కు ద్వారా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
ఆరోగ్య లక్ష్మి
* గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ‘ఆరోగ్యలక్ష్మి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
* ఈ పథకం 2015 జనవరి 1 నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనూ అమల్లోకి వచ్చింది.
* ఈ కార్యక్రమం కింద గర్భిణులకు, బాలింతలకు ప్రతి రోజూ ఒక పూట భోజనాన్ని సమకూరుస్తారు.
* రాష్ట్రంలో 5,66,917 మంది మహిళలకు ఈ ప్రయోజనాన్ని కల్పించారు.
మహిళలకు రక్షణ
* రాష్ట్రంలోని మహిళలు, బాలికల భద్రత, రక్షణ, సంరక్షణ, సాధికారతల కోసం తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ పేరుతో ఒక సంస్థను 2014 నవంబరు 25న రిజిస్టర్ చేశారు.
షీ క్యాబ్స్
* మహిళా డ్రైవర్లను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘షీ క్యాబ్స్’ పేరుతో 2015 సెప్టెంబరు 8న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది.
* అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, ప్రతి టాక్సీకి 35 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది.
మాదిరి ప్రశ్నలు
1. గ్రామీణ ప్రాంతాల సమగ్ర, సమీకృత అభివృద్ధి కోసం ప్రజలను సంపూర్ణంగా భాగస్వాములను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది?
జ: గ్రామజ్యోతి
2. నిరుపేదల జీవనోపాధిని పెంపొందించడం కోసం, ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో ఇటీవల ప్రవేశపెట్టిన పథకం ఏది?
జ: తెలంగాణ పల్లెప్రగతి
3. ‘ఆసరా’ అనేది ఒక-
జ: సామాజిక భద్రతా పింఛన్ల కార్యక్రమం
4. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని సమకూర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది?
జ: ఆరోగ్యలక్ష్మి
5. నల్లా ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడం కోసం ప్రవేశపెట్టిన పథకం ఏది?
జ: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్ గ్రిడ్)
6. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అడవుల శాతాన్ని ఎంతకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
జ: 33%
7. మిషన్ కాకతీయ కార్యక్రమం దేనికి ఉద్దేశించింది?
జ: 46 వేలకు పైగా చెరువుల పునరుద్ధరణ
8. తెలంగాణ రాష్ట్రంలో ‘సమగ్ర కుటుంబ సర్వే’ కార్యక్రమాన్ని ఏ రోజున చేపట్టారు?
జ: 2014 ఆగస్టు 19
9. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి మహా పుష్కరాలను మొదటి సారిగా ఎప్పుడు నిర్వహించారు?
జ: 2015 జులై 14 – 25
Leave a Reply