TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part X
* రెండు పడక గదుల ఇళ్లు
* ఆదాయ పరిమితి పెంపు
* జాతీయస్థాయిలో వరంగల్ ఖ్యాతి
* అక్టోబరులో తెలంగాణ
- తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆనందం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. 2015 అక్టోబరులో తీసుకున్న నిర్ణయాలు, నిర్వహించిన కార్యక్రమాలు సామాన్య ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి. బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, వక్ఫ్‌బోర్డు ఏర్పాటు, ప్రభుత్వ పథకాలకు ఆదాయ పరిమితి పెంపు.. తదితర వర్తమాన విశేషాల సమాహారం..
వైభవంగా ‘బతుకమ్మ’
* తెలంగాణ రాష్ట్ర పండగ ‘బతుకమ్మ’ ఉత్సవాలను ప్రభుత్వం 2015, అక్టోబరు 12 నుంచి 20 వరకు 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా నిర్వహించింది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ రూ.10 కోట్లు కేటాయించింది.
* రాష్ట్రస్థాయి బతుకమ్మ వేడుకల చివరిరోజు అయిన అక్టోబరు 20న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
పండగ ముచ్చట్లు
* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రగతికి ప్రతీక బతుకమ్మ పండగ.
* ‘మహాలయ అమావాస్య’ నుంచి ‘దుర్గాష్టమి’ వరకూ 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తారు.
* గునుగు, తంగేడు, అల్లి, కట్ల, తామర, బంతి, చామంతి, గుమ్మడి, బీర, గన్నేరు, గోరింట, నిత్యమల్లె లాంటి పుష్పాల్ని ఒక క్రమ పద్ధతిలో కళాత్మకంగా గోపురం ఆకారంలో అమర్చి చివరన తమలపాకులో పసుపు గౌరమ్మను అమరుస్తారు. ఈ మొత్తం సముదాయాన్ని ‘బతుకమ్మ’గా వ్యవహరిస్తారు.
* మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ బతుకమ్మ చుట్టూ వలయాకారంలో తిరుగుతూ బతుకమ్మ, గౌరిదేవి పాటల్ని ఆలపిస్తారు.
* తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండగలో మొదటిరోజు బతుకమ్మని ‘ఎంగిలిపువ్వు బతుకమ్మ’ అని చివరిరోజు బతుకమ్మని ‘సద్దుల బతుకమ్మ’ అని.. ఇలా ఒక్కోరోజు ఒక్కోపేరుతో పిలుస్తారు.
* తొమ్మిది రోజులపాటు కొనసాగే బతుకమ్మలను బావి, చెరువు లేదా నీటి ప్రవాహాలలో నిమజ్జనం చేస్తారు.
* బతుకమ్మలో ఉపయోగించే ప్రధానమైన పుష్పాలు
– గునుగు (Celosia Argentea)
– తంగేడు (Cassia Auriculata)
- ‘బొడ్డెమ్మ’తో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు ‘సద్దుల బతుకమ్మ’తో ముగుస్తాయి. (చిన్నపిల్లలు, పెళ్లికాని అమ్మాయిలు పండగ – బొడ్డెమ్మ)
డబుల్ బెడ్రూం ఇళ్లకు శ్రీకారం
* రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘డబుల్ బెడ్రూం (రెండు పడక గదుల)’ ఇళ్ల నిర్మాణం పథకానికి 2015, అక్టోబరు 22న ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లొండ జిల్లా సూర్యాపేట, మెదక్ జిల్లా ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో శంకుస్థాపన చేశారు.
* ఈ పథకం కింద తొలిదశలో 60 వేల ఇళ్లు నిర్మించనున్నారు.
* ఈ ఏడాది ఒక్కో నియోజక వర్గంలో 400 చొప్పున ఇళ్లు నిర్మిస్తారు.
* ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల నిర్మాణ పథకం కింద 560 చదరపు అడుగుల్లో నిర్మించే ఒక్కో ఇంట్లో రెండు పడక గదులు, ఒక హాల్, కిచెన్, రెండు టాయిలెట్లు ఉంటాయి.
పథకం మార్గదర్శకాలు
* లబ్ది పొందే కుటుంబం దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి. ఇందుకుగాను యజమాని / అతడి భార్య పేరున ఆహార భద్రత కార్డు విధిగా ఉండాలి.
* లబ్ది పొందే కుటుంబాలు ప్రస్తుతం గుడిసెలు, కచ్చాఇళ్లు లేదా అద్దె ఇళ్లలో ఉండాలి.
* మొత్తం ఇళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, అల్ప సంఖ్యాక వర్గాలకు 7 శాతం, మిగిలినవి ఇతరులకు కేటాయిస్తారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం, అల్పసంఖ్యాక వర్గాల వారికి 12 శాతం, మిగిలినవి ఇతరులకు కేటాయిస్తారు.
* లబ్దిదారుల ఎంపికలో భాగంగా మొత్తం ఇళ్లలో 50 శాతం ఆయా జిల్లామంత్రి, మరో 50 శాతం సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే మంజూరు చేస్తారు, లబ్దిదారుల జాబితాను మండల తహసీల్దార్ పరిశీలిస్తారు. జీహెచ్ఎంసీలో కమిషనర్ సూచించిన అధికారి పరిశీలన చేస్తారు. దీన్ని గ్రామసభ / వార్డుసభ ముందు ఉంచుతారు.
* గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణం 125 చదరపు గజాల్లో చేపడతారు. మేజర్ పంచాయతీల్లో భూమి కొరత ఉంటే జీ+1 ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ అనుమతిస్తారు. పట్టణ ప్రాంతాల్లో జీ+ ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఎన్ని అంతస్తులు నిర్మించాలనేది జిల్లా కలెక్టర్లు / జీహెచ్ఎంసీ కమిషనర్ నిర్ణయిస్తారు.
* పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5.04 లక్షలు వెచ్చిస్తారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం, విద్యుత్తు కనెక్షన్, మెట్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు అంతా కలిపి ఇందులో ఉంటుంది.
* మౌలిక వసతుల ఖర్చు పట్టణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.75 వేలకు మించరాదు.
‘హృదయ్’ వరంగల్
* కేంద్ర ప్రభుత్వం చారిత్రక వారసత్వ నేపథ్యం ఉన్న నగరాల అభివృద్ధి కోసం ‘హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అగ్మెంటేషన్ యోజన (హెచ్ఆర్ఐడీఏవై-హృదయ్)’ కింద 2015, జనవరిలో దేశంలో 12 నగరాలు ఎంపికయ్యాయి.
* హృదయ్ పథకం కింద ఎంపిక చేసిన 12 నగరాల్లో తెలంగాణ నుంచి వరంగల్ ఎంపికైంది.
* హృదయ్ పథకం పనులను దేశంలోనే మొదటగా వరంగల్‌లో 2015, అక్టోబరు 18న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
తెలంగాణకు వక్ఫ్‌బోర్డు
* ఉమ్మడి వక్ఫ్‌బోర్డును విభజించి తెలంగాణకు కొత్త వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేస్తూ 2015, అక్టోబరు 19న మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
* వక్ఫ్‌బోర్డు ప్రాధికారిక సంస్థ నిర్వాహకుడిగా మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి ‘ఉమర్‌జలీల్’ నియమితులయ్యారు.
* తెలంగాణ వక్ఫ్‌బోర్డు సీఈవోగా మహమ్మద్ అసదుల్లా నియమితులయ్యారు.
బీసీ ల ఆదాయపరిమితి పెంపు
* రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల వారికి సంక్షేమ పథకాలు, ఉపకార వేతనాలు, వసతి గృహాల్లో ప్రవేశాలకు సంబంధించి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితులను పెంచుతూ ప్రభుత్వం 2015, అక్టోబరు 19న ఉత్తర్వులు జారీ చేసింది.
* గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.60 వేల నుంచి రూ.1.50 లక్షలకు; పట్టణాల్లో రూ.75 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచారు.
* ఈ ఆదాయ పరిమితుల పెంపు 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచే వర్తిస్తుంది. బీ ఇంతకు ముందు 1992లో ఉమ్మడి రాష్ట్రలో ఆదాయ పరిమితులను ఖరారు చేశారు.
- ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2015, అక్టోబరు 9న ఆరు రకాలకు సంబంధించిన 14 రకాల నూతన వంగడాలను విడుదల చేసింది. వీటిలో ‘జెజీఎల్-18047’ అనే వరి వంగడానికి ‘బతుకమ్మ’ వంగడం అని పేరుపెట్టారు. దీన్ని కరీంనగర్ జిల్లా పొలాస పరిశోధన కేంద్రంలో రూపొందించారు.
మాదిరి ప్రశ్నలు
1. బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజును ఏమని పిలుస్తారు?
ఎ) ఎంగిలి పూల బతుకమ్మ బి) ముద్దపప్పు బతుకమ్మ సి) వెన్నముద్దల బతుకమ్మ డి) సద్దుల బతుకమ్మ
జ: (డి)
2. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం 2015, అక్టోబరు 9న విడుదల చేసిన నూతన వరి వంగడాల్లో బతుకమ్మ వంగడంగా దేన్ని పేర్కొన్నారు?
ఎ) డబ్ల్యూజీజీ-347 బి) కేఎన్ఎం-118 సి) జేజీఎల్-18047 డి) ఆర్ఎన్ఆర్-15048
జ: (సి)
3. 2015, అక్టోబరు 22న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘డబుల్ బెడ్ రూం (రెండు పడక గదుల)’ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా ఒక్కో ఇంటిని ఎంత విస్తీర్ణం (చదరపు అడుగులు)లో నిర్మించనున్నారు?
ఎ) 360 బి) 460 సి) 560 డి) 660
జ: (సి)
4. రాష్ట్ర ప్రభుత్వ ‘డబుల్ బెడ్ రూం’ ఇళ్ల నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి పట్టణ ప్రాంతాల్లో రూ. 5.30 లక్షలు ఖర్చు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి ఎంత వ్యయం చేస్తారు?
ఎ) రూ.5.30 లక్షలు బి) రూ.5.04 లక్షలు సి) రూ.5.60 లక్షలు డి) రూ.6.04 లక్షలు
జ: (బి)
Leave a Reply