TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part XI
తెలంగాణకు సంబంధించి 2015 అక్టోబరు, నవంబరు నెలల్లో చోటు చేసుకున్న పరిణామాల వర్తమానాంశాల సమాహారమిది.. ప్రధాన కార్యక్రమాలు, పురస్కారాలు, ప్రభుత్వ నిర్ణయాలు.. తదితర అంశాలు టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసేవారి కోసం ప్రత్యేకం..
రాష్ట్ర ఉత్సవంగా వాల్మీకి జయంతి
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు.. రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి జయంతిని 2015, అక్టోబరు 27న రాష్ట్ర ఉత్సవంగా, అధికారికంగా నిర్వహించారు.
* హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
‘బోధగురు’కు అవార్డు
* హైదరాబాద్‌కు చెందిన ‘బోధగురు’ అనే సంస్థకు స్టార్టప్.. ఫేస్‌బుక్‌కు చెందిన ‘ఇంటర్నెట్.వోఆర్జీ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఇన్ ఇండియా’ అవార్డుకు స్టూడెంట్స్ విభాగంలో ఎంపికైనట్లు 2015 అక్టోబరు 21న ప్రకటించారు.
* ఫేస్‌బుక్‌కు చెందిన ‘ఇంటర్నెట్.వోఆర్జీ’ విద్యార్థులు, మహిళలు, రైతులు, శరణార్థుల విభాగాల్లో సంబంధిత అప్లికేషన్లు, సర్వీసులు, వెబ్సైట్లను స్థానిక భాషల్లో రూపొందించినవారిని ప్రోత్సహించడానికి ఈ అవార్డులు అందిస్తోంది.
* చిన్నారుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడానికి వీడియోలు, పుస్తకాలు, మొబైల్ ఆధారిత అప్లికేషన్లు రూపొందించడంపై దృష్టి పెట్టినందుకు ‘బోధగురు’ సంస్థకు స్టూడెంట్స్ విభాగంలో ఈ అవార్డు లభించింది.
* ఈ అవార్డు కింద ‘బోధగురు’కు 2,50,000 యూఎస్ డాలర్ల (సుమారు 1.62 కోట్ల రూపాయలు) నగదు బహుమతి లభిస్తుంది.
* బోధగురు రూపొందించిన ‘క్రియేటర్’ అనే అప్లికేషన్ విశేష ఆదరణ పొందింది.
3.30 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి లక్ష్యం
* 8వ జాతీయ విత్తన కాంగ్రెస్ సదస్సును 2015 అక్టోబరు 27 నుంచి 29 వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించారు.
* సదస్సును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. రైతులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు తదితరులు సదస్సులో పాల్గొన్నారు.
* ఈ ఏడాది 1,458 గ్రామాలను ఎంపిక చేసి.. 36,415 మంది రైతుల భాగస్వామ్యంతో 14,500 హెక్టార్లలో 3.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో ‘టీ-హబ్’
* హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐఐఐటీ-హెచ్ ఆవరణలో అంకుర్ (స్టార్టప్) పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కల్పించేందుకు, ఔత్సాహికులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రం ‘టీ-హబ్’ను ఏర్పాటు చేసింది.
* రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో కలసి టాటా గ్రూపు మాజీ ఛైర్మన్ రతన్ టాటా 2015, నవంబరు 5న ‘టీ-హబ్’ను ప్రారంభించారు.
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – హైదరాబాద్ (ఐఐఐటీ-హెచ్), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), నేషనల్ లా యూనివర్సిటీ (నల్సార్)ల భాగస్వామ్యంతో ‘టీ-హబ్’ ఏర్పాటైంది.
* ‘టీ-హబ్’ కేటలిస్ట్ భవనంలో 70,000 చదరపు అడుగుల విస్తీర్ణం స్టార్టప్‌ల కోసం అందుబాటులో ఉంటుంది. సుమారు 40 కోట్ల వ్యయంతో నిర్మించిన టీ-హబ్ భవనం ప్రభుత్వ భవనాల్లో తొలి గ్రీన్ బిల్డింగ్‌గా చెప్పవచ్చు. 200 స్టార్టప్‌ల ద్వారా 1000 మంది ఒకేచోట పనిచేసే అవకాశాన్ని కల్పిస్తుంది.
* నాణ్యమైన మౌలిక సదుపాయాలు.. మార్గదర్శకులు.. నిధి దాతలు.. నెట్‌వర్క్‌తో కూడిన అనుసంధానక వ్యవస్థ.. ఇవన్నీ స్టార్టప్ పరిశ్రమలకు టీ-హబ్‌తో అందుబాటులోకి వస్తాయి.
* స్టార్టప్‌లు అంకురార్పణ స్థాయి నుంచి పూర్తి పరిణితి సాధించే వరకు టీ-హబ్ సహాయ పడుతుంది.
* టీ-హబ్ వ్యవస్థాపక భాగస్వామ్యులు అయిన ఐఎస్బీ, ఐఐఐటీ-హెచ్, నల్సార్‌లు వ్యాపార, సాంకేతిక, న్యాయ నైపుణ్యాలను అందిస్తాయి.
* టీ-హబ్ ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మరో రెండు సంవత్సరాల్లో ఫేజ్-II టీ-హబ్‌ను మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాయదుర్గం వద్ద నిర్మించనున్నట్లు తెలిపారు.
మహేష్‌కు ‘భారతజ్యోతి’
* తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ ‘భారతజ్యోతి’ పురస్కారానికి ఎంపికయ్యారు.
* దిల్లీకి చెందిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ రాజకీయ, పారిశ్రామిక, విద్య, ప్రజా జీవితం, ఆర్థిక, కళలు లాంటి రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తుంది.
* ఈ పురస్కారాన్ని 2015 అక్టోబరు 26న దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ప్రదానం చేశారు.
* మహేష్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా జైలు జీవితాన్ని కూడా గడిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలివ్యక్తి.
* మహేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు.
* భారతజ్యోతి పురస్కారాన్ని గతంలో దేవానంద్, బీడీ జెట్టి, రాజేష్‌ఖన్నా, ధీరూభాయి అంబానీ, షీలాదీక్షిత్, మదర్ థెరీసా లాంటిప్రముఖులు పొందారు.
Leave a Reply