TSPSC Group 2 Paper 1 వర్తమానాంశాలు – ప్రాంతీయం | Current Affairs Regional Part XIV
- తెలంగాణ ఖ్యాతిని పెంచే అనేక విశేషాలకు హైదరాబాద్ నగరం వేదికగా నిలిచింది. అంగరంగ వైభవంగా నిర్వహించిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం అందరినీ అలరించింది. అత్యాధునిక రీతిలో పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. జీనోమ్ వ్యాలీలో కోట్లాది రూపాయల వ్యయంతో జీవ వైద్య పరిశోధన కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2015 నవంబరులో వార్తల్లో నిలిచిన ఇలాంటి అంశాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర వర్తమాన వ్యవహారాల ప్రత్యేకం
బాలల చిత్రాల పండగ
- 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని (ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) 2015, నవంబరు 14 నుంచి 20 వరకు 7 రోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహించారు.
* కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి 2015 నవంబరు 14న ఈ చిత్రోత్సవాన్ని హైదారాబాద్‌లోని ‘శిల్పకళావేదిక’లో ప్రారంభించారు.
* అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం ఇది 11వ సారి.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇదే తొలిసారి.
* 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి 80 దేశాల నుంచి మొత్తం 1204 చిత్రాలు ఎంట్రీలకు రాగా వీటి నుంచి వివిధ కేటగిరీల్లో 294 చిత్రాలను చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఇండియా (సీఎఫ్ఎస్ఐ) ఎంపిక చేసింది. వీటిలో మన దేశానికి చెందిన 124 బాలల చిత్రాలు ఉన్నాయి.
* 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి 75 దేశాల నుంచి 894 చిత్రాలు ఎంట్రీలకు వచ్చాయి.
* తెలుగు నుంచి 19 చిత్రాలు ఎంట్రీకి వెళ్లగా 6 చిత్రాలను సీఎఫ్ఎస్ఐ ఎంపిక చేసింది.
* ‘లిటిల్ డైరెక్టర్స్’ (బుల్లి దర్శకులు) చిత్రాలు 187 వరకు ఎంట్రీలు రాగా 70 చిత్రాలు ఎంపికయ్యాయి. వీటిలో భారత్ నుంచి ఎంపికైనవి 34 కాగా.. అందులో తెలంగాణ నుంచి 2 చిత్రాలున్నాయి.
* 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి లిటిల్ డైరెక్టర్స్ చిత్రాలు 123 వరకు ఎంట్రీలకు వచ్చాయి.
* చిల్డ్రన్ ఫిలిం సొసైటీ, ఇండియా ఎంపిక చేసిన 294 చిత్రాలతో కలిపి 300లకు పైగా చిత్రాలను ప్రదర్శించారు. దీనికి నగరంలోని శిల్పకళావేదిక, రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, హరిహర కళాభవన్లతోపాటు 12 థియేటర్లు వేదికయ్యాయి. మొత్తం 16 ప్రధాన వేదికల్లో ఈ బాలల చిత్రాలను ప్రదర్శించారు.
* 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రారంభ చిత్రంగా ‘హ్యాపీ మదర్స్ డే’ను ప్రదర్శించారు. దీనిని సీఎఫ్ఎస్ఐ రూపొందించింది.
* 2015, నవంబరు 20న 19వ ఐసీఎఫ్ఎఫ్ఐ ముగింపు వేడుకలు నగరంలోని శిల్పకళావేదికలో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఉత్తమ చిత్రాలకు పురస్కారాలను ప్రదానం చేశారు.
* చిత్రోత్సవంలో భాగంగా నాలుగు విభాగాల్లో పెద్దల జ్యూరీ / పిల్లల జ్యూరీ కింద వివిధ విభాగాల్లో ఎంపిక చేసిన చిత్రాలకు పురస్కారాలను ప్రదానం చేశారు.
* ఎంపికైన ఉత్తమ చిత్రాలకు ‘బంగారు ఏనుగు’ జ్ఞాపికతోపాటు నగదు పురస్కారాన్ని, ఉత్తమ నటుడు, లిటిల్ డైరెక్టర్స్ విభాగాల్లో ఉత్తమ ద్వితీయ చిత్రాలకు ‘బంగారు ఫలకం (Golden plate)’ను ప్రదానం చేశారు.
* 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు 2017లో తిరిగి హైదరాబాద్‌లో జరగనున్నాయి.
నెహ్రూ రూపకల్పన
- అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని ‘చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఇండియా (సీఎఫ్ఎస్ఐ)’ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
* సీఎఫ్ఎస్ఐను జవహర్లాల్ నెహ్రూ 1955లో ఏర్పాటు చేశారు. ఇది భారత సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ.
* సీఎఫ్ఎస్ఐకి మొదటి ఛైర్మన్ హృదయ్నాథ్ కుంజ్రూ. ప్రస్తుత ఛైర్మన్‌గా ప్రముఖ నటుడు, శక్తిమాన్‌గా పేరుపొందిన ముఖేష్ ఖన్నా వ్యవహరిస్తున్నారు.
* జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నవంబరు 14న ప్రారంభించిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తుంటారు.
* రెండేళ్లకోసారి (ద్వైవార్షిక ఉత్సవం) ఈ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.
* అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని ‘ది గోల్డెన్ ఎలిఫెంట్’ అని కూడా పిలుస్తారు. ఉత్సవాల్లో భాగంగా బంగారు ఏనుగును ‘గజ్జూ (Gujju)’ అని పిలుస్తారు.
* ఉత్తమ చిత్రాలకు ‘బంగారు ఏనుగు’ జ్ఞాపికతోపాటు నగదు బహుమతులును అందజేస్తారు.
* సీఎఫ్ఎస్ఐ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది.
తెలంగాణ దళిత కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
- వరంగల్‌కు చెందిన డాక్టర్ పసునూరి రవీందర్ ప్రతిష్ఠాత్మక ‘కేంద్ర సాహిత్య యువ పురస్కార్-2015’ పురస్కారాన్ని అందుకున్నారు.
* 2015, నవంబరు 18న దిల్లీలో జరిగిన కేంద్ర సాహిత్య అకాడమీ కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ చేతుల మీదుగా అవార్డు, తామ్రపత్రంతోపాటు రూ.50 వేల నగదు అందుకున్నారు.
* రవీందర్ రచించిన ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ (తెలంగాణ దళిత కథలు) కథా సంకలనం (15 చిన్న కథలు) తెలుగు భాష విభాగంలో ఎంపికైంది.
* కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని ఏటా 35 సంవత్సరాల లోపు వయసున్న వారికి, కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించిన భాషల్లో రాసిన రచనలకు ప్రదానం చేస్తారు.
* రవీందర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తెలుగు విభాగంలో డాక్టరేట్ సాధించారు. ఇతర రచనలు: లడాయి, మాదిగ పొద్దు.
నడింపల్లిలో ‘ఉన్నతి’
- గ్రామీణ భారతాన్ని డిజిటలైజేషన్ చేయడంలో భాగంగా ‘ఇంటెల్ ఇండియా’ సంస్థ ‘ఏక్ కదమ్ ఉన్నతీ కీ ఓర్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నడింపల్లి గ్రామంలో తొలి ఉన్నతి కేంద్రాన్ని 2015, నవంబరు 18న ప్రారంభించింది.
* గ్రామీణులుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడం ఈ కార్యక్రమం లక్ష్యం.
అధునాతన పోలీస్ కమిషనరేట్
- హైదరాబాద్‌లో నూతన పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం ఏర్పాటులో భాగంగా బంజారాహిల్స్‌లో 24 అంతస్తులతో నిర్మించనున్న కార్యాలయానికి 2015 నవంబరు 22న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు.
* ఈ కార్యాలయాన్ని 5.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు టవర్లుగా నిర్మిస్తారు. వీటిని అనుసంధానం చేసి నాలుగు బ్లాక్‌లు నిర్మిస్తారు. బ్లాక్ ఏ – 24 అంతస్తులు, బ్లాక్ బీ – 18 అంతస్తులు, బ్లాక్ సీ – జీ+2 అంతస్తులు, బ్లాక్ డీ – జీ+1 గా విభజిస్తారు.
* ఈ కార్యాలయంలో పోలీస్ మ్యూజియంతోపాటు, మొదటి టవర్ పైభాగంలో హెలీపాడ్‌ను నిర్మించనున్నారు.
* ఈ నిర్మాణానికి సంబంధించి 2016-17 బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్‌లో జీవ వైద్య పరిశోధనా కేంద్రం
- హైదరాబాద్‌లో జీవ వైద్య పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ 2015, నవంబరు 22న ఆమోదం తెలిపింది.
* హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ‘జీవ వైద్య పరిశోధనలకు జాతీయ వనరుల వ్యవస్థ (ఎన్ఏఆర్ఎఫ్)’ పేరుతో పరిశోధన-అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
* వైద్య అవసరాలకు, వివిధ పరిశోధనలకు, విశ్వవిద్యాలయాలకు, ఔషధ కంపెనీలకు ఉపయోగపడే విధంగా జంతు వనరులను ఈ కేంద్రం సమకూరుస్తుంది.
* భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) రూ.338.58 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రం 2018-19 నాటికి కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.
భారత్‌కు 9 పురస్కారాలు
- అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో భారత్‌కు లభించిన పురస్కారాల వివరాలు..
* ఉత్తమ నటుడు
* ఉత్తమ లఘుచిత్రం (ఇంటర్నేషనల్ లైవ్ యాక్షన్ విభాగం)
* ఉత్తమ ఫీచర్ ఫిలిం
* ఉత్తమ లఘు చిత్రం (ఏసియన్ పనోరమ విభాగం)
* రెండు ఉత్తమ చిత్రాలు
* ఒక ప్రత్యేక బహుమతి (జ్యూరీ మెన్షన్ – – లిటిల్ డైరెక్టర్స్ 13-16 సంవత్సరాల వయసు విభాగం)
* రెండు ప్రత్యేక గుర్తింపు పురస్కారాలు (జ్యూరీ మెన్షన్ – లిటిల్ డైరెక్టర్స్ 6-12 సంవత్సరాల వయసు విభాగం)
మాదిరి ప్రశ్నలు
1. 2015 నవంబరు 14-20 తేదీల మధ్య వారం రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ఎన్నవది?
ఎ) 15వ బి) 17వ సి) 19వ డి) 21వ
జ: (సి)
2. వరంగల్‌కు చెందిన డాక్టర్ పసునూరి రవీందర్‌కి ‘కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్- 2015’ ఏ రచనకు లభించింది?
ఎ) లడాయి బి) మాదిగ పొద్దు సి) అవుటాఫ్ కవరేజ్ ఏరియా డి) మాదిగ దండోరా
జ: (సి)
3. ఇంటెల్ ఇండియా సంస్థ చేపట్టిన ‘ఏక్ కథమ్ ఉన్నతీ కీ ఓర్’ కార్యక్రమంలో భాగంగా దేశంలోనే తొలి ఉన్నతి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది?
ఎ) నల్గొండ జిల్లా – నేరేడుచర్ల
బి) మహబూబ్‌నగర్ జిల్లా – నడింపల్లి
సి) కరీంనగర్ జిల్లా – గొల్లపల్లి
డి) మెదక్ జిల్లా – మానూర్
జ: (బి)
4. హైదరాబాద్‌లో నూతన పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు?
ఎ) జూబ్లీహిల్స్ బి) బంజారాహిల్స్ సి) అమీర్‌పేట్ డి) కోఠి
జ: (బి)
5. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ‘జీవ వైద్య పరిశోధనలకు జాతీయ వనరుల వ్యవస్థ (ఎన్ఏఆర్ఎఫ్)’ పేరుతో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తోంది?
ఎ) హైదరాబాద్ బి) బెంగళూరు సి) చెన్నై డి) అహ్మదాబాద్
జ: (ఎ)
Leave a Reply