TSPSC గ్రూప్-2 గెలుపు ప్రణాళిక
Contents
టీఎస్పీఎస్సీ గ్రూప్-2 ప్రకటన ద్వారా భర్తీ చేయబోయే 1032 ఉద్యోగాలపై ఆశతో లక్షల మంది శ్రద్ధగా సన్నద్ధమవుతున్నారు. ఈ పరీక్షను నవంబర్ 11, 13 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక మిగిలింది 45 రోజులు మాత్రమే. ఈ సమయమే అభ్యర్థుల విజయానికి కీలకమవుతుంది!
గ్రూప్-2 పరీక్షార్థులు రెండు రకాలుగా ఉంటారు. సిలబస్ జారీ చేసిననాటినుంచి- అంటే గత ఏడాదిగా సన్నద్ధమవుతున్నవారు; ఇటీవల అనుబంధ నోటిఫికేషన్ వచ్చాక నెల రోజులుగా తయారయ్యేవారు. ఈ రెండు రకాల అభ్యర్థులూ ఈ 45 రోజుల ప్రణాళికను తగినవిధంగా రూపొందించుకోవాలి.
ఇప్పటికే సిలబస్‌ను సమగ్రంగా చదివినవారు 4 పేపర్లలోని సబ్జెక్టుల్లో ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. సబ్జెక్టు, టాపిక్ల వారీగా ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ప్రశ్నలను తయారుచేసుకుని చదవాలి. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలను రాసుకునేటపుడు ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలను కాకుండా సివిల్స్ పరీక్షలో మాదిరిగా వాటికి మరో 4 ప్రత్యామ్నాయాలు అంటే ఎ) 1 మాత్రమే సరైనది బి) 1, 2 మాత్రమే సరైనవి సి) 1, 2, 3 మాత్రమే సరైనవి డి) 1, 2, 3, 4 సరైనవి అని రూపొందించడం వల్ల సన్నద్ధత సమగ్రంగా ఉంటుంది. ఈ పద్ధతిలో సబ్జెక్టును విస్తృతంగా కవర్ చేసుకోవచ్చు. తికమక లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయవచ్చు.
ఇటీవలి ప్రకటన తరువాత సిలబస్‌ను తెరిచినవారు ఈ పరిమిత సమయంలో సబ్జెక్టులన్నింటినీ ఒకసారి చదవాలి. తర్వాత ప్రతి సబ్జెక్టులోని ముఖ్యాంశాలు చూసుకోవాలి. ఆబ్జెక్టివ్ ప్రశ్నలను సాధన చేయాలి. మార్కుల ప్రాధాన్యక్రమంలో వివిధ సబ్జెక్టుల ముఖ్యాంశాలను చదవాల్సి ఉంటుంది. ఎక్కువ పుస్తకాలనూ, నోట్సులనూ చదవకుండా సబ్జెక్టు నిపుణులు సూచించినట్లుగా ఒకటి, రెండు ప్రామాణిక గ్రంథాలకు మాత్రమే పరిమితమవటం మంచిది.
గ్రూప్-2 పరీక్షలోని నాలుగు పేపర్లలో మార్కులపరంగా ఏ సబ్జెక్టుకు అత్యధిక ప్రాధాన్యముందో గుర్తించి ఆ అంశాలపై పట్టు సాధించాలి. ప్రామాణిక మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేసి, స్వీయమూల్యాంకనం చేసుకోవాలి. మార్కుల పరంగా, సిలబస్ పరంగా చూస్తే నాలుగు పేపర్ల ప్రాధాన్య క్రమం వరుసగా పేపర్-4, 3, 2, చివరగా పేపర్-1 ఉంటుంది.
పేపర్-4
తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ముఖ్యాంశాలన్నింటిపై పట్టు సాధించాల్సి ఉంటుంది. ఇతర పేపర్లతో పోలిస్తే సిలబస్ పరిమితంగా ఉండడమే కాకుండా ఈ పేపర్లో కొన్ని అంశాలు నాటి పరిస్థితులనూ, వివిధ రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలనూ వివరిస్తాయి.
ఈ పేపర్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలను ముందుగా గుర్తించాలి. అవి ముల్కీ సమస్యలు- నియమాలు- కోర్టుల తీర్పులు- భారతదేశంలో హైదరాబాద్ రాజ్య విలీనం- పెద్ద మనుషుల ఒప్పందం- ఫజల్ అలీ కమిషన్ సూచనలు- చిన్న రాష్ట్రాలపై అంబేడ్కర్ అభిప్రాయాలు- 1969 జై తెలంగాణ ఉద్యమం- తెలంగాణలో నక్సల్, వామపక్ష ఉద్యమాలు (ముఖ్యమైనవి మాత్రమే). ఇక మూడో విభాగంలోని అంశాలన్నీ ప్రశ్నలపరంగా ముఖ్యమైనవే.
అలాగని మిగిలిన అంశాలను వదిలేయమని కాదు. అయితే ఈ అంశాలను సబ్జెక్టు కొనసాగింపు, అవగాహనలకు తప్పకుండా చదవాల్సిందే. ఈ విధంగా సన్నద్ధమైతే పేపర్-4లో గరిష్ఠంగా 80% మార్కులను సాధించగలుగుతారు.
తెలంగాణ ఉద్యమంపై పుస్తకాలు, నోట్సులు మార్కెట్లో లభ్యమవుతున్నప్పటికీ చాలావాటిలో అనవసర వివరణలకు ప్రాధాన్యం కనపడుతోంది. దోషాలు కూడా ఉంటున్నాయి. అందుకని ఒకటి రెండు ప్రామాణిక గ్రంథాలను మాత్రమే సబ్జెక్టు నిపుణుల, సీనియర్ విద్యార్థుల సూచనలతో ఎంచుకోవాలి.
పేపర్-3
మార్కులపరంగా, పరిమిత సిలబస్ పరంగా చూస్తే నాలుగో పేపర్ తరువాత ముఖ్యమైనది- భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థికవృద్ధికి సంబంధించిన మూడో పేపర్.
మొదటి విభాగం భారతదేశ ఆర్థికవ్యవస్థ సమస్యలు- సవాళ్లకు సంబంధించినది. దీనిలో ముఖ్యంగా వృద్ధి, అభివృద్ధి భావనలపై ప్రశ్నలుంటాయి. రెండో అంశం జాతీయాదాయానికీ, మూడో అంశం పేదరికం, నిరుద్యోగానికి సంబంధించినది. వీటినుంచి ప్రశ్నలు ఎక్కువగా మౌలిక భావనలు, సూత్రాలపై ఆధారపడివుంటాయి. గణాంకాలకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఆ గణాంకాలను శాతాల, నిష్పత్తుల రూపంలో అర్థం చేసుకుని జ్ఞాపకముంచుకోవాలి. అంతేకానీ అన్ని గణాంకాలనూ గుర్తుంచుకోవడం కష్టతరం. యదార్థ గణాంకాలను సబ్జెక్టు అవగాహనకు మాత్రమే చదవాల్సి ఉంటుంది.
నాలుగో అంశం పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినది. దీనిలో ఈ ప్రణాళికల లక్ష్యాలను, ప్రాధాన్యాలను లక్షిత వృద్ధి రేట్లను, సాధించిన వృద్ధి రేట్లు ముఖ్యం. ప్రణాళిక పెట్టుబడులను తులనాత్మకంగా చదవాల్సి ఉంటుంది. ప్రణాళిక వైఫల్యాలూ, ముఖ్యమైన పథకాలూ ముఖ్యమే. ఇక ప్రణాళికాసంఘ స్థానంలో ఇటీవల స్థాపించిన నీతి ఆయోగ్ మరో కీలకాంశం. దీన్నుంచి తప్పనిసరిగా 3- 4 ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
ఈ పేపర్లోని రెండో విభాగం తెలంగాణ ఆర్థికవ్యవస్థకు సంబంధించినది. మొదటి అంశం 1956- 2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. అంటే తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనం, ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి జరిగిన వివక్షకు సంబంధించి నియమించిన కమిటీలూ, వాటి సూచనలూ ప్రధానం. ఇందులో రెండో అంశమైన తెలంగాణలో భూసంస్కరణలను, చారిత్రక నేపథ్యంతో ప్రస్తుత విధానాలవరకు చదవాలి. ముఖ్యంగా వ్యవసాయ భూపరిమితి చట్టాలూ, వ్యవసాయ భూముల అన్యాక్రాంతాలకు సంబంధించిన అంశాలు. మూడో అంశం- తెలంగాణలోని వ్యవసాయం, నీటిపారుదల సౌకర్యం, మెట్టసాగు సమస్యలను వ్యవసాయ పరపతి సౌకర్యాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆరంభించిన మిషన్ కాకతీయతోపాటు ఇతర ప్రాజెక్టులు కూడా దృష్టిపెట్టాల్సినవే. వ్యవసాయ భూకమతాలను, వర్గీకరణలను భూకమతాల వివరాలను అంటే ఉపాంత, సన్నకారు రైతులు మొదలైనవాటిపై అవగాహన పెంచుకోవాలి.
చివరి అంశం- తెలంగాణ రాష్ట్ర సేవా పారిశ్రామిక రంగాలు. ఈ పేపర్లోని మూడో అంశం- అభివృద్ధి, మార్పు (పరివర్తన)లకు సంబంధించిన సమస్యలు. ఇందులో ప్రాంతీయ అసమానతలు, వలసలు, నగరీకరణకు సంబంధించిన కారణాలు, సమస్యలు, వాటి పరిష్కారాలకు ప్రభుత్వం రూపొందిస్తున్న వివిధ పథకాలు… ఇవన్నీ పఠనీయం.
ఇటీవలి కాలంలో వివాదాస్పదమైన భూసేకరణ విధానాలు, నిర్బంధ భూసేకరణ వల్ల కలిగే సమస్యలు… ముఖ్యంగా పునరావాస చిక్కులూ, పథకాలపై పట్టు సాధించాలి. మరో ముఖ్యాంశం ఆర్థిక సంస్కరణల అమలు, వాటి పర్యవసానాలూ, సామాజిక వృద్ధి, సామాజిక మార్పులు. వీటిని గణాంకాలతోపాటు చదవాలి. చివరి అంశం- సుస్థిరాభివృద్ధికి సంబంధించిన భావనల అభివృద్ధి లక్ష్యాలు. భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థికాంశాల గణాంకాలను శాతాల రూపంలో జ్ఞాపకం పెట్టుకుని సాధన చేయాలి. నిజానికి చాలామంది మూడో పేపర్ గురించి భయపడతారు. కానీ వాస్తవానికి ఆర్థిక వ్యవస్థకు చెందిన మౌలిక అంశాలను అర్థం చేసుకుంటే ఈ సబ్జెక్టుపై పట్టు సాధించడం తేలిక.
పేపర్-2
ఇందులో మూడు విభాగాలకుగానూ నాలుగు సబ్జెక్టులుంటాయి. 1. భారతదేశ, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అంటే ఇందులో.. దేశ, రాష్ట్ర చరిత్రలను అధ్యయనం చేయాలి. 2. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ 3. భారతదేశ, తెలంగాణ సామాజిక నిర్మితి- సమస్యలు, ప్రభుత్వ విధానాలు
భారతదేశ చరిత్ర నిజానికి చాలా విస్తృతమైనది. కానీ దీనికి గ్రూప్-2 పరీక్షలో 25 మార్కులను మాత్రమే కేటాయించారు. సమయం తక్కువగా ఉన్నందువల్ల భారతదేశ సామాజిక- సాంస్కృతిక చరిత్రలోని ముఖ్యాంశాలను- అంటే ప్రాచీనకాలం నుంచి సింధు నదీలోయ నాగరికతాకాలం నుంచి దేశ స్వాతంత్య్ర సాధనర వరకు సామాజిక ఆర్థిక, సాంస్కృతిక అంశాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేయాలి.
ఈ విభాగంలోని మరో అంశం… తెలంగాణ- దాని సామాజిక సాంస్కృతిక చరిత్ర. దీని నుంచి కూడా 25 మార్కులకుగానూ 25 ప్రశ్నలు వస్తాయి. నిజానికి ఈ మార్కులకు ఈ సిలబస్ ఎక్కువే అయినప్పటికీ దేశ చరిత్ర మాదిరే తెలంగాణ చరిత్రను కూడా చదవాలి. దీనికి గత ఏపీపీఎస్సీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు సాయపడతాయి. తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించి కొంత సిలబస్ పేపర్-4లో, మరికొన్ని అంశాలు పేపర్-1లో ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకుంటే ఇందులోని 25 మార్కులతోపాటు మరో 25 మార్కుల ప్రశ్నలు తెలుస్తాయి. అంటే దాదాపు 50 ప్రశ్నలు వస్తాయని గుర్తించి ఆ ప్రాధాన్యక్రమంలో దీన్ని చదవాలి.
రెండో పేపర్లోని రెండో అంశం- భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ నుంచి 50 మార్కులకుగానూ 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్షలోని అన్ని సబ్జెక్టుల్లో ఇది ఆసక్తికరమైనది. అయితే సిలబస్ చాలా విస్తృతం. ఎక్కువ ప్రశ్నలు రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు, సంబంధిత ప్రకరణాల నుంచి వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన ముఖ్యమైన కేసులపై కూడా ప్రశ్నలుంటాయి. ముఖ్యమైన అంశం- రాజ్యాంగ సవరణలు. దీన్ని క్రమపద్ధతిలో చదివితే 90% మార్కులు అంటే 50 మార్కులకు కనీసం 45 సాధించవచ్చు. రాజ్యాంగానికి సంబంధించి అనేక ప్రామాణిక ప్రశ్నలను గత సివిల్స్, గ్రూప్స్ పరీక్షల నుంచి సేకరించి సాధన చేస్తే ఎక్కువ ప్రశ్నలు వాటి నుంచే రావొచ్చు.
చివరి అంశం- భారతదేశ, తెలంగాణ సామాజిక నిర్మిత సమస్యలు, విధానాలకు సంబంధించినది. ఈ సబ్జెక్టును మొదటిసారిగా సిలబస్‌లో చేర్చారు. సమాజ సమస్యలపై, వాటి పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించి అమలుచేస్తున్న వివిధ విధానాల పథకాలపై వస్తాయి. సామాజిక ఉద్యమాలపైనా ప్రశ్నలు ఉంటాయి. సామాజిక అంశాలు కూడా ముఖ్యమే. చివరి అంశం- సమాజంలోని వివిధ వర్గాల వారి పురోభివృద్ధికి సంబంధించిన వివిధ సంక్షేమ పథకాలు. వీటిలో కొన్ని మూడో పేపర్ అంటే ఎకానమీ సబ్జెక్టులోనూ ఉన్నాయి. ఈ సబ్జెక్టుకు సంబంధించి ఎక్కువగా సమస్యల కారణాలు, వాటి పరిష్కారాలు, ప్రభుత్వాల విధానాలు, పథకాలను చదివితే 50కి 40 మార్కులను సాధించవచ్చు.
పేపర్-1
మొత్తం 150 మార్కులకు 11 సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. మార్కుల ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ పేపర్లో సిలబస్ ఎక్కువ, మార్కులు తక్కువ. అంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. అలాగని దీనిలోని అంశాలను నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. విజయం సాధించడానికి ప్రతి ఒక్క మార్కూ ముఖ్యమే కదా! అందుకే పరిమిత సమయంలో మొదటి పేపర్లో కూడా గరిష్ఠ మార్కులను సాధించాలంటే క్రమపద్ధతిలో ప్రాధాన్యక్రమంలో చదవటం ప్రధానం.
మొదటి పేపర్లో మొత్తం 11 సబ్జెక్టులున్నప్పటికీ వీటిలో నాలుగు సబ్జెక్టులు రెండో పేపర్లో, కొన్ని మూడో పేపర్లో చాలావరకు ఉన్నవే. కాబట్టి ఈ నాలుగు అంశాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకాంశాలను మాత్రమే ఇక్కడ పట్టించుకుంటే సరిపోతుంది. ఈ పేపర్లోని మొదటి రెండు అంశాలు వర్తమాన విషయాలకూ, అంతర్జాతీయ సంబంధాలకూ సంబంధించినవి. వీటికి ఏదైనా జాతీయస్థాయిలో ప్రచురించే ఇంగ్లిష్ పత్రిక, రాష్ట్ర వర్తమాన విషయాలకు ప్రామాణిక తెలుగు పత్రికను అనుసరించాలి. వర్తమాన విషయాల కోసం ప్రామాణిక ఆబ్జెక్టివ్ ప్రశ్నలను సాధన చేయాలి. 2016 జనవరి నుంచి చదివితే సరిపోతుంది.
మొదటిపేపర్లో సాధారణ శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత ప్రగతికి సంబంధించి శాస్త్ర సాంకేతిక అంశాలు ముఖ్యం. ఈ సబ్జెక్టులోని పాఠ్యాంశాలు అపరిమితం. ముఖ్యమైనవాటిపై అవగాహన చాలు.
పర్యావరణ సమస్యలు- విపత్తు నిర్వహణకు సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలపై దృష్టి సారించాలి. భౌతిక భౌగోళిక, ప్రపంచ భౌగోళిక, భారతదేశ, తెలంగాణ భౌగోళిక అంశాలపై ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర భౌగోళికాంశాలపై శ్రద్ధవహించాలి. మరో ముఖ్యమైన అంశం- లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్. వీటి ప్రాథమిక భావనలపై ప్రామాణిక ప్రశ్నలను సాధన చేయాలి. చివరి అంశం- జనరల్ ఇంగ్లిష్. తెలుగు మాధ్యమం అభ్యర్థులు ప్రాథమిక వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు, రీడింగ్ కాంప్రహెన్షన్‌కు సంబంధించిన కొన్ని అంశాలను అభ్యాసం చేయాలి. ఈ విధంగా అన్ని సబ్జెక్టులపై పరీక్షాపద్ధతిలో అవగాహన పెంచుకోవటం ముఖ్యం. ఆపై ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని పరీక్షలకు సంసిద్ధమైతే విజయపథంలో ఉన్నట్లే!
Leave a Reply