TSPSC Group II Paper I పర్యావరణ అంశాలు – సునామీ
* తీవ్ర భౌగోళిక వైపరీత్యం
* తీర ప్రాంతాల్లో విధ్వంసం
సునామీ.. పేరు చెప్పగానే భయకంపితులను చేసేంత తీవ్రమైన విధ్వంసకర విపత్తు. మీటర్ల కొద్దీ ఎత్తులో.. ఒకదాని వెంబడి మరొకటిగా.. ఊహకు అందనంత వేగంగా.. దూసుకొచ్చే సముద్రపు అలలు తీర ప్రాంతాల్లో విలయాన్ని సృష్టిస్తాయి. ఒకేసారి కొన్ని దేశాలపై ప్రభావం చూపించగలిగేంత తీవ్ర శక్తిమంతమైన ఈ సునామీలు ఎలా పుడతాయి? ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? వీటిని ముందుగా గుర్తించగలమా? తీవ్రతను తగ్గించడానికి ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టాలి? ఎదుర్కోవడం ఎలా? – తెలుసుకుందాం..
అత్యంత ఎక్కువగా ఆస్తి, ప్రాణ నష్టాలను మిగిల్చి.. తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి.. పర్యావరణానికి తీవ్రహాని కలిగించే భౌగోళిక వైపరీత్యాల్లో సునామీ ఒకటి. ప్రధానంగా భూకంపాల కారణంగా ఏర్పడే సునామీలను ముందుగా ఊహించగలిగినా వాటివల్ల వచ్చే నష్టాన్ని మాత్రం పూర్తిగా తగ్గించలేకపోతున్నాం. సాధారణ భాషలో ‘రాకాసి అలలుగా వీటిని పిలుస్తుంటారు. భారీ పరిమాణంలో స్థానభ్రంశం చెందిన నీటి వల్ల ఉవ్వెత్తున ఎగిసిపడే నీటి తరంగాల వరుసను సునామీ అంటారు. మహా సముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు… చివరకు ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ల్లో కూడా సునామీలు ఏర్పడవచ్చు. 2015 ఏప్రిల్ 25న నేపాల్‌లో భూకంపం సంభవిచ్చినప్పుడు ఒక స్విమ్మింగ్‌పూల్‌లో ఏర్పడిన సునామీని మీడియా ద్వారా చూడగలిగాం.
ఒకటి కాదు.. పదికి పైగా..
బలమైన భూకంపాల వల్ల సముద్రపు అగాధాల్లో ఏర్పడిన సునామీ కెరటాలు వందల కిలోమీటర్ల పొడవునా (సుమారుగా 800 కి.మీ. వేగంతో) ప్రయాణిస్తుంటాయి. సునామీ అంటే ఒక పెద్ద తరంగం కాదు. పది లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు ఉండొచ్చు. వాటిని ‘సునామీ తరంగ రైలు అంటారు. ఒక్కో తరంగం ఒకదాని తర్వాత ఒకటి 5 నిమిషాల నుంచి 90 నిమిషాల వ్యవధిలో మరొకదాన్ని అనుసరిస్తాయి.
సునామీ మహాజల కుడ్యం (Huge wall of water) తీరానికి చేరిన తర్వాత ఒక వ్యక్తి పరుగెత్తే వేగం కంటే చాలా ఎక్కువ వేగంగా (50 కి.మీ.ల వేగంతో) ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని ‘రన్ అప్ అంటారు. ఇది తీరాన్ని బట్టి కొన్ని కిలోమీటర్లు ఉంటుంది. సునామీ ప్రారంభ ప్రాంతంలో తరంగాల ఎత్తు కొన్ని సెంటీమీటర్లుగా ఉండి, తీరానికి చేరే కొద్దీ 30 మీటర్ల ఎత్తువరకు కూడా ఉండొచ్చు. అందువల్ల సముద్రంపై ఓడలో ప్రయాణిస్తున్న వారికి సునామీ గురించి తెలియదు.
సునామీ తీరాన్ని చేరుతున్నప్పుడు వేగం తగ్గుతూ అల ఎత్తు పెరుగుతుంది. దీన్నే ‘షోలింగ్ ప్రభావం అంటారు. సునామీ ప్రారంభమైన చోట తక్కువ డోలన పరిమితితో ఉంటుంది. తీరానికి చేరే కొద్దీ డోలన పరిమితి పెరుగుతుంది. కొన్నిసార్లు తీరం వద్ద నీరు వెనక్కు తగ్గి సముద్ర తీరం భూతలం బయటకు కనిసిస్తుంది. దీన్ని సునామీ రావడానికి అవకాశం ఉన్న సహజ సిద్ధమైన హెచ్చరికగా భావించవచ్చు.
జపాన్ సునామీ విలయం
2011, మార్చి 11వ తేదీ మధ్యాహ్నం 2.46 గంటల సమయంలో జపాన్‌లోని ఈశాన్యప్రాంతంలోని తోహోకు ప్రాంతానికి 130 కి.మీ.ల దూరంలో (పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై 9 తీవ్రత కూడిన పెను భూకంపం వల్ల) సునామీ సంభవించింది. దీంతో ఫుకిషిమా దైచీలోని అణువిద్యుత్తు ప్లాంటులో విస్ఫోటం జరిగింది. కొన్ని పరిశ్రమల్లో మంటలు రేగాయి. ఇలా ఈ భూకంపం వల్ల అనేక గొలుసు కట్టు విపత్తులు సంభవించాయి.
11 దేశాలపై ప్రభావం
2004, డిసెంబరు 26న ఇండోనేషియాలోని జావా, సుమత్రా దీవుల మధ్య సుండా అగాధంలో సునామీ ఏర్పడింది. ఇది చుట్టూ ఉన్న 11 దేశాలను నష్టపరిచింది. మన దేశంలో తమిళనాడు తీరంలోని నాగపట్నం ఎక్కువగా దెబ్బతింది. దీంతోపాటు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి; కేరళ రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి.
భారత్ తీరరేఖకూ..
ఒకచోట ఏర్పడిన సునామీ కెరటాల ప్రభావం వాటి తీవ్రతను బట్టి అన్ని మహాసముద్రాల్లోనూ కనిపించవచ్చు. భారతదేశ తీరరేఖ మొత్తం సునామీ ముప్పును కలిగి ఉంది. మనదేశ భూపటల పలక (క్రస్ట్ ప్లేట్) ఆస్ట్రేలియన్ పలక నుంచి దూరంగా జరుగుతున్నందున మన దేశానికి తరచుగా సునామీలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. భారతదేశానికి దూరంగా రెండు చోట్ల ఏర్పడుతున్న భూకంపన అధికేంద్రాల వద్ద సునామీలు ఏర్పడి మనదేశ తీరాన్ని తాకుతున్నాయి.
1. అండమాన్ నికోబార్ దీవులు, సుమత్రాదీవి వంపు దగ్గర ఏర్పడిన సునామీలు భారత్‌తో సహా ప్రధాన దేశాలను చేరడానికి 3 నుంచి 5 గంటల వ్యవధి పడుతుంది.
2. అరేబియన్ మైక్రో పలక భారత్ భూపటల పలకను ఢీ కొడుతున్నందున అరేబియా సముద్రంలోని మక్రాన్ ప్రాంతంలో సునామీ ఏర్పడుతుంది. ఇది ప్రధాన భారత తీరానికి అంటే గుజరాత్ తీరాన్ని చేరడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది.
అంతర్జాతీయ హెచ్చరిక వ్యవస్థ
సునామీ ఏ తీరాన్నైనా తాకే ప్రమాదం ఉంది. అలాగే అవి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంటాయి. ఈమేరకు అంతర్జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థను హవాయి దీవుల్లోని హోనలూలు వద్ద 1946లో ఏర్పాటు చేశారు. దీన్ని పసిఫిక్ సునామీ వార్నింగ్ (Pasific Tsunamy Warning System – PTWS)సెంటర్ అంటారు. ఇది సునామీ రావడానికి గంటల ముందు సంబంధిత దేశాలను అప్రమత్తం చేస్తుంది. కొన్ని దేశాల్లో ప్రాంతీయ హెచ్చరిక కేంద్రాలు కూడా ఉన్నాయి.
భారత్‌లోనూ…
గతంలో జరిగిన భూకంపాల సమాచారం ఆధారంగా ప్రస్తుత భూకంపం వల్ల సునామీ ముప్పును అంచనా వేసేవారు. ఈ సమాచారం 15 నిమిషాల ముందు మాత్రమే హెచ్చరిక జారీ చేయడానికి పరిమితం అయ్యేది. తర్వాత సర్వే ఆఫ్ ఇండియా తీరం వెంబడి టైడ్‌గేజ్ విధానాన్ని అమలు చేసింది. ఇది కూడా చాలా ఆలస్యంగానే సమస్య తీవ్రతను తెలియజేసేది.
2004లో ఏర్పడిన సునామీని రాడార్ల సహకారంతో తెలుసుకున్నారు. ఇది భూకంపం వచ్చిన రెండు గంటల తర్వాత మాత్రమే తరంగాల ఎత్తును నమోదు చేయగలిగింది.
2007, అక్టోబరు 15న ఐఎన్‌సీవోఐఎస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్)లో సత్వర సునామీ హెచ్చరిక కేంద్రాన్ని (సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ – టీఈడబ్ల్యూసీ) ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్‌లో ఉంది.
తీవ్రతను తగ్గించాలంటే..
* తీరం వెంబడి జపాన్‌లా గోడలు నిర్మించి సునామీ తీవ్రతను తగ్గించవచ్చు. మడ అడవులను పెంచడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది.
* తీరం సమీపంలో నిర్మాణాలను దృఢంగా, ఎత్తయిన ప్రాంతాల్లో నిర్మించాలి.
* విపత్తు సమయంలో సహాయ కేంద్రాలుగా పనిచేసే కమ్యూనిటీ హాల్స్‌ను ఎత్తయిన ప్రాంతంలో నిర్మించాలి.
* సరైన వరద నివారణ చర్యలు ముందుగానే కలిగి ఉండాలి.
* సరైన భూ వినియోగ ప్రణాళిక అవసరం.
సునామీలెలా ఏర్పడతాయి?
జలాశయాల్లో ఆకస్మిక చలనం వల్ల సునామీ తరంగాలు ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా సముద్ర తీరాల వద్ద ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. సునామీల వల్ల వాటిల్లే నష్టం, అవి ఏర్పడే స్థానం, ప్రయాణం చేసే దూరం, తాకే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అవి ఏర్పడే ప్రాంతం నుంచి 30 నిమిషాల్లో తీరాన్ని తాకే సునామీలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి.
* సముద్రం దగ్గర లేదా లోపల బలమైన భూకంపాలు వచ్చినప్పుడు ఏర్పడిన భ్రంశ చలనాల వల్ల సునామీలు సర్వసాధారణంగా సంభవిస్తాయి. పెద్దఎత్తున ఏర్పడిన సునామీ తరంగాలు మహాసముద్రాలను కూడా దాటే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 1960 చిలీలో రిక్టర్ స్కేలుపై 9.5 గా నమోదైన భూకంపం వల్ల ఏర్పడిన సునామీ తరంగాలు జెట్ వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రం అవతల ఉన్న జపాన్ తీరంలోని మత్స్య పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించాయి. సాధారణంగా సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు దాని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 7.5 గా నమోదైనప్పుడు సునామీలు సంభవిస్తాయి.
* సముద్రం కింద లేదా సముద్రానికి దగ్గరలో భూపాతం (ల్చ్థ్టి ళ్ద్ట్ఠీౖ) జరిగి కొండచరియలు నీటిలో పడినప్పుడు సునామీ ఏర్పడవచ్చు. 1958లో అలస్కాలోని లిటుయా బేలో సంభవించిన భూపాతం వల్ల 50-150 మీటర్లు ఎత్తున సముద్ర కెరటాలు తీరాన్ని తాకాయి.
* సముద్రాల్లో అగ్నిపర్వతాల విస్ఫోటం జరిగినప్పుడు కూడా సునామీలు ఏర్పడవచ్చు. 1883లో ఇండోనేషియాలోని కాక్రటోవా అగ్నిపర్వతం విస్ఫోటం చెందినప్పుడు జావా, సుమత్రా దీవుల్లో 40 మీటర్ల ఎత్తున సునామీ ఏర్పడింది.
సునామీ (Tsunami) అనేది జపాన్ పదం. జపాన్ భాషలో గ్బ్యి అంటే హార్బర్ (ఓడరేవు), nami అంటే వేవ్ (కెరటం) అని అర్థం. ఈ రెండు పదాల కలయికే సునామీ. తమిళంలో సునామీని ఆఝి పెరలై (Aazhi peraial) అని కూడా అంటారు.
మాదిరి ప్రశ్నలు
1. ప్రపంచ విపత్తుల్లో భూకంపాలు, సునామీల శాతం ఎంత?
జ: 8%
2. భారతదేశంలో సునామీలు ఎక్కడ వస్తున్నాయి?
జ: రెండింటిలోనూ
3. ఇటీవల బంగాళాఖాతంలో సునామీ ఎప్పుడు ఏర్పడింది?
జ: 2004, డిసెంబరు 26
4. సునామీ అంటే …?
జ: తీరాన్ని ముంచేసిన పెద్ద అలలు
5. సునామీ అనేది ఎలాంటి విపత్తు?
జ: భౌగోళిక
6. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఎక్కడ ఉంది?
జ: హోనలూలు
7. సునామీలు ఎక్కడ ఏర్పడతాయి?
ఎ) పసిఫిక్ మహాసముద్రం బి) అంట్లాటిక్ మహాసముద్రం
సి) హిందూ మహాసముద్రం డి) పైవన్నీ
జ: డి
8. సునామీలు ఏర్పడటానికి ప్రధాన కారణం?
జ: సముద్రాల్లో భూకంపాలు సంభవించడం
9. సునామీలు అధికంగా ఏర్పడే సముద్రం ఏది?
జ: పసిఫిక్ మహాసముద్రం
10. సునామీలు ఎలా ఏర్పడతాయంటే…?
ఎ) సముద్రాల్లో భూకంపాలు బి) సముద్రాల్లో అగ్నిపర్వత విస్ఫోటం
సి) సముద్రాల్లో భూపాతం డి) పైవన్నీ
జ: డి
11. సునామీ ఎప్పుడు సంభవిస్తుంది?
జ: రాత్రి, పగలు సమయాల్లో
Leave a Reply