TSPSC Group II Paper I జనరల్ సైన్స్ – వాహక నౌకల రంగ టెక్నాలజీలో భారత్ ప్రగతి
- సిలబస్‌లో జనరల్ సైన్స్ కింద ప్రత్యేకంగా ‘శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ విజయాలు అని పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు సైన్స్ మొత్తాన్ని మొదటి నుంచి ప్రారంభించకుండా అవసరమైన అంశాలను మాత్రమే అభ్యయనం చేయాలి.
భారతదేశ అంతరిక్ష కార్యక్రమాలు 1962లో స్థాపించిన ‘ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ (ఐఎన్‌సీవోఎస్‌పీఏఆర్)తో ప్రారంభమయ్యాయి. అదే ఏడాది తిరువనంతపురంలో ‘తుంభా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (టీఈఆర్ఎల్ఎస్) ప్రారంభమైంది. 1969లో ‘ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను స్థాపించారు. భారతదేశం 1972లో ‘స్పేస్ కమిషన్‌ను, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్‌ను (డీవోఎస్)ను ఏర్పాటు చేసింది. ఇస్రో 1972 సెప్టెంబరు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోకి వచ్చింది. దీంతో అంతరిక్ష కార్యక్రమాలు భారతదేశంలో ఊపందుకున్నాయి.
వాహక నౌకల రంగ టెక్నాలజీలో భారత్ ప్రగతి
భారతదేశ మొదటి ఉపగ్రహం ‘ఆర్యభట్టను 1975, ఏప్రిల్ 19న అమెరికా రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రెండో ఉపగ్రహం ‘భాస్కర 1 ను 1979, జూన్ 7న ప్రయోగించింది. ఈ ప్రయోగాల తర్వాత భారతదేశం తన సొంత వాహక నౌకల (లాంచింగ్ వెహికిల్స్)ను అభివృద్ధి చేసుకుంది. మనదేశం ఇప్పటి వరకు 4 రకాల వాహక నౌకలను అభివృద్ధి చేసింది.
అవి….
1) ఎస్ఎల్వీ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్
2) ఏఎస్ఎల్వీ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్
3) పీఎస్ఎల్వీ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్
4) జీఎస్ఎల్వీ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్
ప్రస్తుతం భారతదేశం ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడానికి పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీలను మాత్రమే వినియోగిస్తోంది.
గమనిక: రాకెట్లను వాహక నౌకలు అంటారు. ఇవి ఉపగ్రహాలను తీసుకువెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెడతాయి.
శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (ఎస్ఎల్వీ)
భారతదేశ మొదటి వాహక నౌక ఎస్ఎల్వీ-3. ఇది 22 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువు ఉంటుంది. ఇందులో ఘన ఇంధనాన్ని నాలుగు దశల్లో నింపుతారు. ఇది 40 కిలోల బరువు (పేలోడ్) ఉన్న ఉపగ్రహాలను భూమి దిగువ కక్ష్య (ఎల్ఈవో)లోకి ప్రవేశపెట్టగలదు.
ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (ఏఎస్ఎల్వీ)
ఈ వాహక నౌక 40 టన్నుల బరువు, 24 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో అయిదు దశలు ఉంటాయి. ఇవి అన్నీ ఘన ఇంధనాన్ని కలిగి ఉంటాయి. ఈ నౌక 150 కిలోల బరువున్న ఉపగ్రహాలను 400 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు.
పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ)
భారతదేశం ఇప్పటి వరకు జరిపిన పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో మొదటిది తప్ప అన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయి.
ఇస్రో ప్రస్తుతం మూడు రకాల పీఎస్ఎల్వీ రాకెట్లను ఉపయోగిస్తుంది. అవి..
1) పీఎస్ఎల్వీ జీ
2) పీఎస్ఎల్వీ సీఏ
3) పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్
ఇవి కక్ష్యను బట్టి 1550 కిలోల నుంచి 1700 కిలోల బరువును (ఉపగ్రహాలను) మోసుకుని వెళ్లగలవు. పీఎస్ఎల్వీ పొడవు 44 మీటర్లు. ప్రయోగ సమయంలో దీని బరువు 295 టన్నులు. దీనిలో 4 దశల్లో ఇంధనాన్ని నింపుతారు. ఇవి ఘన, ద్రవ దశలుగా ఏకాంతరంగా ఉంటాయి. మొదటి దశలో ఘన ఇంధనం ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక ఘన ఇంధనం మొదటి దశలో ఉపయోగించే రాకెట్ పీఎస్ఎల్వీనే. రెండో దశలో ద్రవ ఇంధనం ఉంటుంది. దీనిలో దేశీయంగా తయారు చేసిన వికాస్ ఇంజిన్‌ను ఉపయోగించారు. పీఎస్ఎల్వీ ద్వారా ఇప్పటి వరకు 29 సార్లు పలు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. వీటిలో 9 సార్లు పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ రకాన్ని వాడారు.
Leave a Reply